
పేరుకు తగ్గట్టే ఆమె గొంతు హార్డ్. పాటతోపాటు ఆమె శారీరక కదలికలూ హార్డ్. మత్తెక్కించే గొంతుతో, మైమరిపించే శారీరక విన్యాసంతో అచేతన సంగీత హృదయాలను సైతం చైతన్యపర్చగలనన్న ఆమె నమ్మకమే ఎంతో హార్డ్. పుట్టింది భారతగడ్డమీదే అయినా, కుటుంబ పరిస్థితుల కారణంగా యుకె తరలిపోయిన హార్డ్ కౌర్ అసలు పేరు తరణ్ కౌర్ థిల్లాన్. విచిత్రమైన గొంతుతో అటు బాలీవుడ్‌లోనూ సంచలనాలను సృష్టించిన కౌర్‌ను పాటలు వెతుక్కుంటూ వస్తున్నాయి. మరోపక్క ఆల్బమ్స్‌ను డిజైన్ చేస్తూనే బిజీగావున్న కౌర్ కొద్దికాలంగా స్టేజ్ షోలుతోనూ మరింత బిజీ అయిపోయింది. కొద్దిరోజుల క్రితం తుబోర్గ్ స్ట్రాంగ్ ఫన్‌గామా నైట్స్ కార్యక్రమంతో అమృత్‌సర్‌ను ఊపేసిన హార్డ్ కౌర్ గురించి కాస్త తెలుసుకుంటే..
ఉత్తర్రపదేశ్‌లోని మీరట్‌లో పుట్టింది తరణ్ కౌర్ థిల్లాన్. తరణ్ తల్లి నడిపే చిన్న బ్యూటీపార్లరే వాళ్లకు జీవనాధారం. 1984లో తలెత్తిన సిక్కు వ్యతిరేక ఘర్షణల్లో తండ్రి సజీవంగా దహనమయ్యాడు. తండ్రిని కోల్పోయిన బాధ నుంచి తేరుకోకముందే తల్లి నడుపుతున్న బ్యూటీ పార్లర్ సైతం అగ్నికీలల్లో దగ్ధమైంది. కుటుంబం మొత్తం రోడ్డున పడటంతో తరణ్ కుటుంబం వలసపోక తప్పలేదు. లూథియానాకు తరలిపోయి అమ్మమ్మ ఇంట ఆశ్రయం పొందిన తరణ్ కుటుంబం, మూడేళ్లు తిరగకముందే మరో మార్పు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్‌ఆర్‌ఐతో ప్రేమలో పడిన తల్లి అతన్ని పెళ్లి చేసుకోవడంతో మాతృభూమి భారత్‌ను వదిలి పెట్టాల్సి వచ్చింది. లండన్‌లోని బర్మింగ్టన్‌కు తరలిపోవడంతో తరణ్ బాల్యం అంతా అక్కడే సాగిపోయింది. బర్మింగ్టన్‌లో తల్లి నిర్వహించిన బ్యూటీ సెలూన్‌లోనే ఉంటూ, హిప్-హాప్ శైలి సంగీతానికి ఆకర్షితురాలైన తరణ్ ర్యాప్ సంగీతం వైపు తన కెరీర్ మలుచుకోవాలని ఆశించింది.
ర్యాప్ సంగీతాన్ని వంటబట్టించుకున్న తరణ్ మొట్టమొదట పాడిన పాట ఏక్ గ్లాసీ. తొలి అడుగే బలంగా వేసిన థిల్లాన్, సింగిల్ ఆల్బమ్ విడుదల తరువాత వెనక్కి తిరిగి చూడలేదు. ఫిమేల్ ర్యాప్ సింగర్‌గా అనూహ్యమైన పేరు ప్రతిష్టలు వచ్చేయడంతో, తరువాత తన గొంతును బాలీవుడ్ మీదకు సంధించింది. 2007లో శ్రీరాం రాఘవన్ చిత్రం జానీ గదార్‌లో పైసా ఫెక్ పాటతో ఉర్రూతలూగించడంతో బాలీవుడ్ ఆమె కాల్షీట్ల కోసం క్యూ కట్టింది. అగ్లి ఔర్ పగ్లి, సింగ్ ఈజ్ కింగ్, కిస్మత్ కనెక్షన్, బచ్‌న ఏ హసీనో, రామ్‌గోపాల్ వర్మ చిత్రం ఆగ్, ఆజాబ్ ప్రేమ్ కి గజాబ్ కహానీ, ప్రిన్స్ (2010) చిత్రాల్లో -తరణ్ కౌర్ గొంతు థిల్లాన్‌లే పలికించింది. 2008లో ఆమె ప్రదర్శన లైవ్ ఎర్త్ ఇండియా, అంతకు ఏడాది ముందు విడుదలైన సోలో ఆల్బమ్ సుపావుమన్ సూపర్‌హిట్టు కొట్టడంతో తరణ్ ఊపునకు తిరుగులేకుండా పోయింది.
2008లో యుకె ఆసియన్ మ్యూజిక్ అవార్డుల కోసం రెండు విభాగాల్లో నామినేట్ అయ్యింది తరణ్ కౌర్ థిల్లాన్. బెస్ట్ అర్బన్ యాక్ట్ కింద ఒకటి, బెస్ట్ ఫిమేల్ యాక్ట్ విభాగాల్లో నామినేషన్ పొందిన కౌర్, రెండో విభాగంలో విజయం సాధించి తనేంటో నిరూపించుకుంది.యాడ్ ప్రాజెక్టుల్లో సూపర్ సెన్సేషన్ సృష్టించిన వొడా ఫోన్ థీమ్ సాంగుకు కంపోజర్ తరణ్ థిల్లానే.ఎమినెమ్ బృందం డి12తో కలిసి హార్డ్ కౌర్ మరో ఆల్బమ్‌కు ప్రణాళిక సిద్ధం చేసింది. జలక్ ధిక్కాలాజా లాంటి టెలివిజన్ రియాల్టీ షోలలో సైతం తన విచిత్ర శారీరక విన్యాసాల్ని ప్రదర్శించి తనేంటో నిరూపించుకుంది తరణ్..
మూలం : సూర్య దినపత్రిక