
పుట్టి, పెరిగింది నల్గొండలో
నేను పుట్టింది నల్గొండ జిల్లాలో దేవరకొండ మండలంలోని ఓ గిరిజన తండాలో. చిన్నప్పటి నుంచి చదువంటే అమితమైన ఆసక్తి ఉండేది. కానీ మా తండాల్లో స్కూళ్లు ఉండేవి కావు. దాదాపు 15కిలోమీటర్ల దూరంలో ఉండే స్కూల్లోనే 5వ తరగతి వరకూ చదువుకున్నాను. ఆడపిల్ల అందులో మా తండాలో ఆడపిల్లలు చదువుకు ఆమడదూరంలో ఉండాల్సిందే. సమీపంలో స్కూళ్లు లేకపోవడం, ఒకటిరెండు ఉన్నా 'ఆడపిల్లకెందుకు చదువు' అనే భావంతో ఇంటిపనులు, కూలిపనులకు పంపడం తప్పని జీవనపోరాటం మాది. మాకు భాష ప్రధాన సమస్య. స్కూలుకు వెళ్లాలంటే తప్పనిసరిగా తెలుగు నేర్చుకోవాల్సిందే. తెలుగు అక్షరాలు నేర్చుకోవాలి. ఇదంతా మాకు పెద్దకష్టంగా అనిపించేది. దీంతో చదువుపట్ల ఆసక్తి చూపించేవారు కాదు. పైగా ఆడపిల్లకు పదకొండు, పన్నెండేళ్లు రాగానే పెళ్లి చేస్తారు. నాకు కూడా మా తల్లిదండ్రులు అలాంటి ప్రయత్నమే చేశారు. నేను ఆసక్తిగా చదవడం గమనించి మా అమ్మ ఆ దిశగా నన్ను ప్రోత్సహించారు. నా చదువు కోసం ఆమె మా తండా వారితో ఎన్నో మాటల్ని భరించాల్సి వచ్చింది. ఆడపిల్లను అలా బయటికి పంపితే ఇంకేమన్నా ఉందా అని ఈసడింపులూ భరించింది. వారి మాటల్ని పట్టించుకోకుండా నన్ను చదువుకోమని చెప్పేది. ఇదే సమయంలో మా గ్రామానికి ఒక క్రైస్తవ మిషనరీ జంట వచ్చింది. మాచేత వారు అక్షరాలు దిద్దించేవారు. నేను చాలా ఇష్టంగా భాషను నేర్చుకున్నాను. ప్రాథమిక విద్యను చదివిన నాకు హైస్కూలు మా ఊర్లో లేకపోవడం వల్ల మిర్యాలగూడ ఎస్సీ హాస్టల్లో చేరి హైస్కూల్ విద్యను పూర్తిచేశాను. ఇంటర్లో చేర్పించేసరికి ఇక మా ఊరిపెద్దలు నాకు పెళ్లి చేసేయ్యొచ్చుకదా! అని పోరుపెట్టారు. వారి పోరును భరించలేక మాఅమ్మ నాపెళ్లి చేసింది. అయితే పెళ్లికి ముందే కాబోయే అల్లుడితో నన్ను చదివించాలనే ఒక షరతును విధించింది. మా తండాల్లో ఇలాంటి షరతులు ఎవరూ పెట్టేవారు కాదు. ఏమీ చదువుకోని అమ్మ మాత్రం నా జీవితంలో అక్షర వెలుగులు నింపే దిశగా ఆలోచించింది. మా అమ్మకు మాట ఇచ్చిన మావారు ఇంటర్ చదివించారు.
ఉన్నత విద్య
ఇంటర్ పూర్తి చేశాక, ఓపెన్‌వర్సిటీ ద్వారా డిగ్రీ చదివాను. ఆంధ్రమహిళాసభలో బిఇడి చదివాను. వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ వస్తే, నాన్‌లోకల్ ఎస్టీ పోస్టులో టీచర్‌గా సెలక్ట్ అయ్యాను. ఉన్నత చదువు చదవాలన్న కోరికతో సెలవుపై ఎంఎ, ఎంఫిల్ చదివాను. సదాశివపేటలో డిగ్రీకాలేజీలో లెక్చరర్‌గా ఎంపిక కావడంతో అక్కడ చేరాను. అంతకు ముందే ఉస్మానియావర్సిటీలో జరిగిన ఇంటర్వ్యూకు వెళ్లాను. దీంతో ఉస్మానియావర్సిటీలో 1999లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరాను. 'నల్గొండ జిల్లా బంజారా సాహిత్యం, జీవనచిత్రణ' అనే అంశంపై పిహెచ్డి చేశాను. 2007లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా ప్రమోషన్ వచ్చింది.
సేవా కార్యక్రమాలు
మా తండాకి వెళ్లాలంటే సుమారు రెండు కిలోమీటర్లు నడవాల్సిందే. బస్సు సౌకర్యం లేదు. తండాకి వెళ్లేందుకు దిగే చోట కనీసం ఒక బస్టాప్ లేదు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ నిలబడే దుర్భర పరిస్థితి నుంచి తప్పించాలని, మా అమ్మపేరుతో ఒక బస్టాప్‌ను నిర్మించారు. 2004లో అమ్మపేరుతోనే ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాను. మా తండాలో పెద్ద చదువు చదివింది నేనే. నా స్థితిని చూసిన మా తండావారిలో మార్పు వచ్చింది. వారి పిల్లల్ని ఆడపిల్లలు అని కూడా చూడకుండా దూరప్రాంతాలకు, హాస్టల్లో ఉంచి చదివించేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో డిగ్రీ, పిజీ చదువుతున్న అమ్మాయిల శాతం పెరుగుతున్నది. వీరిని ప్రోత్సహించేందుకు నేను వారికి పుస్తకాలు, సైకిళ్లు కొనిస్తూ, ఫీజు చెల్లించుకోలేని వారికి ఆర్థికంగా నాకు చేతనైనంతవరకు సాయం చేస్తున్నాను. మా యూనివర్సిటీలో 'ట్రైబ్స్ డిపార్ట్మెంట్'ను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. దీనిద్వారా గిరిజనులకు విద్య, ఉపాధి సౌకర్యాల మెరుగుకు కృషి చేయాలని ఉంది. ఎందుకంటే మా వర్సిటీలో మొదటి గిరిజన ప్రొఫెసర్ని కావడం నాకెంతో ఆనందాన్ని ఇస్తున్న విషయం.
భర్త సహకారం
నా ఈస్థితికి కారణం నా భర్త ధనుంజయ్ దే. మా తండా సంప్రదాయాన్ని గౌరవించి, చిన్నవయసులోనే పెళ్లి చేసుకున్నా, ఆగిపోయిన చదువును తిరిగి కంటిన్యూ చేసేందుకు నా భర్త ఎంతో ప్రోత్సహించారు. ధనుంజయ్ ప్రస్తుతం జియలాజికల్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. నాకు ముగ్గురు పిల్లలు. ఒకవైపు పిల్లలు, ఇంటిబాధ్యతలు మరొకవైపు చదువుకోవడం అంటే ఎవరికైనా కష్టమే. కానీ మా వారు నన్ను ప్రోత్సహించడం వల్ల ఆటంకాలు, అభ్యంతరాలు ఏవైనా వాటన్నింటిని జయించగల్గాను.
ఆడబిడ్డలకు ఏమైనా చేయాలి
మొదటిసారి, రెండవసారి ఆడబిడ్డ పుడితే పర్వాలేదు. ఆ తర్వాత మళ్లీమళ్లీ ఆడపిల్లలే పుడితే వారికి జీవించే హక్కును కాలరాయడం తండాల్లో సాధారణంగా జరుగుతున్న ఘోరాలు. కొడుకు కోసం ఎంతమంది ఆడపిల్లల్ని కనేందుకైనా వెనుతిరుగరు. అలాగని పుట్టినవారందరిని పోషించే స్థోమత ఉండదు. దీంతో పురిట్లోనే చంపే ప్రయత్నాలు చేస్తుంటారు. వీటిని రూపుమాపాలంటే చదువు ఒక్కటే అందుకు దోహదం చేస్తుంది. చదువు మానవీయదృక్పధంతో జీవించే విధానాన్ని నేర్పిస్తుందని నా అభిప్రాయం. ఇది వాస్తవం కూడా.
పుస్తకాలు
నేను చేసిన పిహెచ్డి థీసెస్సే బంజారా నానీలయ్యాయి. ముద్రితం కాని నాలుగు పుస్తకాలు ఉన్నాయి. నా ఆశ, ఆశయం అంతా ఒక్కటే గిరిజనుల బతుకుల్లో వెలుగును నింపాలి. వారిలో పాతుకునిపోయిన మూఢాచారాల నుంచి బయటికి తీసుకొచ్చి, నాణ్యమైన జీవితాన్ని అనుభవించేలా చేయాలని ఉంది.
మూలం : వార్త దినపత్రిక