పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న మ్యాజిక్ రంగంలో మనేకా సర్కార్ సాధించిన కీర్తి సామాన్యమైనదేమీ కాదు. ఆ ధోరణిని కొనసాగిస్తూ మరింత మంది మహిళలు మ్యాజిక్ వైపు రాకపోవడం మాత్రం ఆశ్చర్యకరమే! అయితే, ''పురుషాధిక్యత ఎక్కువగా ఉండే మన దేశంలో ఇంద్రజాల విద్యలోనూ అదే ధోరణి కనిపించడంలో ఆశ్చర్యం లేదు'' అని తేలిగ్గా నవ్వేశారు ఆమె. ''ఇంద్రజాలం చేసేవాళ్ళం సాధారణంగా దుర్గాదేవికి మరో పేరు అయిన మహా మాయను ఆరాధిస్తాం. పేరులోనే ఉన్నట్లుగా ఆమె ఈ మాయా కళకు దేవత. అలాగే, భోజ రాజు కుమార్తె అయిన భానుమతికి కూడా ఈ మాయాజాలం వచ్చని ఐతిహ్యం. ఇలాంటి కథలు, గాథలు భారతదేశంలో, విదేశాల్లో ఎన్నో ఉన్నాయి. కానీ, తీరా వాస్తవ ప్రపంచానికి వచ్చే సరికి మాత్రం మహిళా ఐంద్రజాలికుల సంఖ్య చాలా తక్కువ'' అని మనేకా సర్కార్ వివరించారు. మన దేశంలో ప్రబలంగా ఉన్న పితృస్వామ్య వ్యవస్థే అందుకు కారణమని ఆమె అభిప్రాయపడ్డారు. చివరకు మ్యాజిక్ రంగంలోనూ అదే వ్యవహారం జొరబడిందంటారామె.
దీనికి ఆమె చెప్పిన వివరణ, చేసిన విశ్లేషణ కూడా ఆసక్తికరమే. ''ఏదైనా కథలోనో, సినిమాలోనో ఎవరైనా మహిళకు మాయాజాల విద్యలు ఉన్నాయని చెప్పాల్సి వస్తే, ఆమెను నెగటివ్ కోణంలో చూపెడతారు. మన కథల్లో వచ్చే 'బ్యాట్‌మన్', 'సూపర్‌మ్యాన్', 'స్పైడర్ మ్యాన్' - ఇలా అందరూ పురుషులే! శక్తిమంతమైన మహిళల్ని చూపెట్టడమే అరుదు. ఒకవేళ చూపెట్టినా, వాళ్ళందరినీ దుర్మార్గులుగానే చిత్రిస్తారు'' అని ఆమె వివరించారు.
నిజానికి, రంగస్థలం మీద ఓ మహిళ మ్యాజిక్‌ను ప్రదర్శించడమంటే, సైన్స్‌నూ, ప్రయోగాత్మకతనూ మిళితం చేసి, ఆమె మెజీషియన్ పాత్రను అభినయించడమే! చక్కటి ఐంద్రజాలికురాలని అనిపించేలా ఆమె ఎంతగా నప్పితే, ఆమె మ్యాజిక్ కూడా అంత బాగుంటుంది. కానీ, మహిళల మీద ఉన్న ప్రతికూల అభిప్రాయాల మూలంగా ఆడవారెవరూ మెజీషియన్లుగా కనిపించడం లేదు. చివరకు అది మ్యాజిక్‌కు పేరుబడ్డ తమ సర్కార్ కుటుంబంలోకి కూడా చొచ్చుకువచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు. దాదాపు తొమ్మిది తరాల తరువాత వచ్చిన ఏకైక మహిళా మెజీషియన్ తానేనని మనేకా సర్కార్ తెలిపారు. కుటుంబంలోని మహిళల్లో ప్రతిభకు కొదవ లేకపోయినప్పటికీ, సామాజికంగా బహిష్కరణకు గురవుతామనే భయం, అంతరాంతరాళాల్లో గూడు కట్టుకున్న మూఢవిశ్వాసాల ఫలితంగా మెజీషియన్లుగా మహిళలకు అవకాశాలు లేకుండా పోయాయని ఆమె అంటారు.
కానీ, సాహసోపేతంగా ముందుకు వచ్చి, మహిళా మెజీషియన్‌గా మనేక సాధించిన పురోగతి ఎంతోమందికి ప్రేరణ నిచ్చింది. ప్రేక్షకులు ఆమెను ఓ ఇంద్రజాల కళాకారిణిగా ఆశ్చర్యానందాలతో చూస్తున్నారు. ''చాలామంది తల్లితండ్రులు వాళ్ళ కుమార్తెలతో నా దగ్గరకు తరచూ వస్తుంటారు. నన్ను చూశాక వారెంతో ప్రేరణ పొందుతున్నట్లు చెబుతున్నారు. ఏ పని చేయడానికైనా స్త్రీ పురుషులనే తేడా అడ్డంకి కాదని యువతులు చెబుతూ ఉంటారు'' అని మనేక ఆనందంగా అన్నారు. ఇంకా చెప్పాలంటే, రంగస్థలంపై మనేక చేసే అద్భుత ఇంద్రజాల విన్యాసాన్ని చూసి, తమకు ఎసరు వచ్చిందని అనుకోని పురుష మెజీషియన్లు లేరంటే అతిశయోక్తి కాదు.
ఇవాళ శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ, ఇంద్రజాలమంటే ఆసక్తి పెరుగుతుందే తప్ప, తరగడం లేదని ఆమె అన్నారు. మనలో ప్రతి ఒక్కరిలో ఓ మెజీషియన్ ఉన్నారన్నది ఆమె నిశ్చితాభిప్రాయం. అందుకే, మనం కలలు గనే అంశాలు ఎంత అవాస్తవమైనా సరే, అవన్నీ నిజమైతే బాగుండునని కోరుకుంటూ ఉంటామని మనేక విశ్లేషించారు. ''కళ్ళెదురుగా కనపడే వాస్తవికత పెరుగుతున్న కొద్దీ అవాస్తవికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. అందుకే, వాస్తవికతను మరుగుపరుస్తూ, కనికట్టుతో అందరినీ ముగ్ధుల్ని చేస్తాం. పైపెచ్చు, శాస్త్ర సాంకేతిక విజ్ఞానాలు ఎంతగా వృద్ధి చెందినా, వాటికన్నా పది అడుగులు ముందే ఉండడం వల్ల అవి ఏవీ మ్యాజిక్‌కు అడ్డంకి కాబోవు. పైగా, ఇవాళ మ్యాజిక్ అని అనుకున్నవి రేపటికి సైన్స్‌గా మారతాయి'' అని మనేక పేర్కొన్నారు.
మూలం : ప్రజాశక్తి దినపత్రిక