స్త్రీ మనసును ఒక స్త్రీ లోతుగా అధ్యయనం చేసి, నగ్నచిత్రాలను సైతం ధైర్యంగా, నిర్భయంగా చిత్రాల ద్వారా బాహ్యప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నంలో ఆమెకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. 'స్త్రీకి మనసు ఉంది, స్వచ్ఛమైన ప్రేమ కోసం ఆ మనసు తపిస్తుంది, స్పందించే ప్రాణికోసం ఆరాటపడుతుంది, ఈ ప్రయత్నంలో ఎదుటివారి ప్రేమను ఆశించడంలో తప్పేంటి? ప్రశ్నించే క్లారా చిత్రాలు ఓ సంచలనం.
అమెరికాలో పెరిగారు
క్లారా ఆస్ట్రియాలోని లింబర్గ్‌లో జన్మించినా, చిన్నవయసులోనే లండన్‌కు చదువు నిమిత్తం పయనమయ్యారు. లండన్‌లోని 'స్లైడ్ స్కూల్ ఆఫ్ ఫైన్ఆర్ట్స్'లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌ను నేర్చుకున్నారు. 1920లో ఒక రచయితను వివాహం చేసుకున్నారు. చిన్నతనంలోనే తన చుట్టూ బాలికలకు, మహిళలకు జరుగుతున్న అన్యాయాలను గమనించిన క్లారా వారి సమస్యలను, మనోవిశ్లేషణపై చిత్రాలను గీయడం ఆరంభించారు.
దిగంబర చిత్రాలకు వెనుతిరగలేదు
క్లారా చిత్రాలు ఎక్కువగా దిగంబరంగా కనిపిస్తాయి. కారణం మహిళఅంతర్గతంలో మెదిలే భావాలను కచ్చితంగా చిత్రించడంలో ఆమె దిట్ట. ఆమె చిత్రాల్లో ఒక ప్రేయసి, ఒక తల్లి, ఒక చెల్లి, అన్నింటికి మించి ఒక ఆరాధనభావంతో నిండినవి ఉంటాయి. అలాగని సంప్రదాయాలు, ఆచారాలను గాలికి వదిలేసినవిగా ఉండవు. 1919లో లండన్‌లో ఆమె చిత్రాలు ప్రదర్శనకు నోచుకున్నప్పుడు ఒక సంచలనవార్తగా అయ్యింది. ఒక బాలిక బాల్యం నుంచే ఎదుర్కొనే వివక్ష ఆ ఫలితంగా ఆమెలో చెలరేగే మానసిక ఘర్షణకు నిదర్శనం తన చిత్రాలని అంటారు క్లారా.
నేటితరం మహిళా చిత్రాలు
1925లో 'ఉమెన్ ఆఫ్ టుడే లో క్లారా గురించి రాస్తూ, చిత్రలేఖనంలో క్లారా రాత్రికిరాత్రే కళాకారిణిగా మారలేదు. ఆరు సంవత్సరాల లేతప్రాయంలోనే చిన్నివేళ్లతో బ్రెష్‌ను పట్టుకుని, కుంచెగీయడం ఆరంభించారు. పరిణతి చెందిన ఇంగ్లీషు చిత్రకారిణిగా పేరుపొందారు. కేవలం 19సంవత్స రాల టీనేజ్లోనే క్లారా తన చిత్రాలు ప్రదర్శనకు నోచుకున్నా యంటే అర్థం చేసుకోవచ్చు ఆ కళపట్ల ఆమెకున్న ఆసక్తి, అంకితభావం.
పేదరికంలోనూ మసకబారని కళ
క్లారా క్లింగ్హోఫర్ తన 14వసంవత్సరంలో అద్భుత చిత్రాలు వేయడం గమనించిన ఆమె తల్లిదండ్రులు ఆ దిశగా ఆమెను ప్రోత్సహించడం ఆరంభించారు. పేదరికానికి చెందిన క్లారా తల్లిదండ్రులు తమ కూతుర్ని ఏవిధంగా ప్రోత్సహించాలో అర్థం కాలేదు. తమ కూతురిలో ఉన్న కళాభిరుచిని తెలిసిన వారికి చెప్పి, కొంత ఫండ్‌ను సేకరించడం మొదలుపెట్టారు. ఫైనాన్స్ స్కూల్లో చేర్పించారు. అక్కడే ప్రముఖ చిత్రకారుడు బెర్నార్డ్ మినిస్క్ఫై క్లారా చిత్రాలను వేసే విధానాన్ని గమనించి, లియెనార్డో డావిన్సీ చిత్రలేఖన లక్షణాలు క్లారాలో ఉన్నాయని చెప్పి ఆమెను ప్రోత్సహించారు. ఒక సభకు వచ్చి, చిత్రలేఖన ప్రదర్శనపై బోధించమని ఆహ్వానించినప్పుడు అక్కడికి వెళ్లిన క్లారా తనకు వచ్చిన కళ గురించి మాట్లాడలేకపోయారు. అయినప్పటికి ఆమె అధైర్యపడలేదు. రెండేళ్లు కష్టపడి, తన సత్తాను చాటుకున్నారు. ఇంగ్లండ్, యూరప్ వంటి దేశాల్లో క్లారా పెయింటింగ్ ఎగ్జిబిషన్లకు నోచుకున్నాయి.
నాజీల దాడుల్లో చెదరని విశ్వాసం
క్లారా 1929లో భర్త, తన పిల్లలతో కలిసి హాలెండ్‌కు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ నాజీలు క్లారా చిత్రాలను చూసి, ఆమెను వేధింపులకు గురిచేశారు. ఇదే సమయంలో భర్తలో చెలరేగే అసూయ కారణంగా క్లారా మరిన్ని కష్టాల మధ్య తనకున్న కళను ముందుకు సాగించడంలో కష్టతరమైంది. ఒక మహిళ అందులో స్త్రీ సమస్యలపై ఆమె వేస్తున్న చిత్రాలు హాలెండ్లోని పురుషసమాజంలో హర్షించేందుకు బదులు, అపార్థం చేసుకుని, క్లారాపై దాడులకు పూనుకున్నారు. వీటిని భరించలేక క్లారా తన కుటుంబాన్ని తీసుకుని, తిరిగి అమెరికాకు వచ్చారు. ఇక్కడే తన కళకు, తనకు శ్రేయస్సు అని భావించి, అమెరికాలోనే స్థిరపడ్డారు. తన కళ కోసం, భర్తను వదిలేందుకు ఆమె వెనుకంజ వేయలేదు. ఒకానొక పరిస్థితుల్లో క్లారా భర్త తన భార్య చిత్రాలను వేసేందుకు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఆమె భర్తకు దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నారు. కళపట్ల ఆమెకున్న అంకితభావాన్ని గమనించి, అర్థం చేసుకుని, చివరికి భార్యాబిడ్డలతో కలిసి జీవించేందుకు నిర్ణయించుకున్నారు. ఇంటగెల్చి, రచ్చగెల్చిన క్లారా చిత్రాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. క్లారా వేసిన పెయింటింగ్స్ దాదాపు 90శాతం మహిళలపైనే వేయడం విశేషం. 20వ శతాబ్దంలో సైతం మహిళను ఒక వస్తువుగా భావిస్తూ లైంగిక, మానసిక దాడులకు దిగుతున్నవారిని విమర్శిస్తూ, స్త్రీలను ప్రోత్సహించడమే తన చిత్రకళాధ్యేయమని చెబుతారు క్లారా. అందుకే నేటికి ఆమె చిత్రాలు టాప్‌టెన్‌లో స్థానాన్ని పదిలపరచుకున్నాయి. కళ ఏదైనా సమాజాభివృద్ధికి, మానవవికాసానికి దోహదం చేసినప్పుడే ఆ కళ పదికాలాలపాటు నిలుస్తుందని క్లారా తన చిత్రాల ద్వారా నిరూపించుకున్నారు. అందుకు ఆమె కళ అభినందనీయం.