"నేను ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చదువుకున్నా. నాకు చిన్నపిల్లలంటే ఇష్టం, పాఠాలు చెప్పడమంటే ప్రాణం. దాంతో నా చదువు పూర్తికాగానే వేరే ఏమీ ఆలోచించకుండా బోధన రంగంలోకి దూకేశాను. పద్నాలుగేళ్ల పాటు ఢిల్లీలోని నేవీ చ్రిల్డన్ స్కూల్, గుజరాత్‌లోని ఆనందాలయ వంటి పెద్దపెద్ద పాఠశాలల్లో గణిత ఉపాధ్యాయురాలిగా పనిచేశాను. నా తరగతి గదిలో ఉన్న 30- 40మంది పిల్లలకు చక్కగా పాఠాలు చెబితే చాలా? ఇంకా ఎంతోమంది పిల్లలు లెక్కలంటే భయపడుతుంటారు, దానివల్ల మొత్తం స్కూలంటేనే ఇష్టపడకుండా అయిపోతారు. ఫలితంగా వారి జీవితమంతా పాడయిపోతుంది. అలాగవకుండా నేనేమీ చెయ్యలేనా అనిపించింది.
స్వస్తి చెప్పేశా
పాఠశాల విద్యలో సంస్కరణలు తీసుకురావాలన్నదే నా లక్ష్యం. లెక్కలే కాదు, ఏ సబ్జెక్టయినా నేర్చుకోవడం సులువుగా ఉండాలి. పిల్లలకు అమితమైన ఆసక్తి, ఆనందమూ కలగాలి. అంతేగాని చదువంటే తలనొప్పి వ్యవహారమని వాళ్లు అనుకోకూడదు. ఇది ఎలా చెయ్యాలని బాగా ఆలోచించి ఒక ప్రణాళిక వేసుకున్నా. ముందు మ్యాథ్స్ అంటే పిల్లలు ఇష్టపడేలా, వారిలో ఆసక్తి రేకెత్తేలా - కొన్ని పాఠాలు తయారుచేసుకున్నాను. సరిగ్గా అప్పుడే అహ్మదాబాద్ కేంద్రంగా 'ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్' అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభమయింది. దానిలో చేరితే నా ఆలోచనలను అమల్లోకి పెట్టే అవకాశం ఉంటుందనిపించింది. రెండేళ్ల పాటు గ్రామీణ, పట్టణాల పాఠశాలలు, పిల్లలు, చదువులు - అన్నిటినీ పరిశీలించాక 'ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్'లో కొత్త ఉద్యోగంలో చేరాను.
ఎన్నెన్ని ప్రశ్నలో...
అసలు మన విద్యావిధానంలో లోపం ఎక్కడుంది? ప్రాథమికమైన ఈ ప్రశ్నతో మేం పరిశోధన మొదలెట్టాం. అర్థమయిందేమంటే, టీచర్లు మార్కుల కోసమే పాఠాలు చెబుతారు. పిల్లలు మార్కుల కోసమే చదువుతుంటారు. సబ్జెక్టు పట్ల అవగాహన పెంచుదామని అటు ఉపాధ్యాయులు అనుకోవడం లేదు, ఇటు విద్యార్థులకూ అంత తెలియదు. ఉదాహరణకు ఒక బడికి వెళ్లి ఐదో క్లాసు పిల్లలను త్రికోణం గురించి అడిగితే ఒక స్టాండర్డ్ ఆకారంలోనే గీశారు తప్ప, అంతకన్న చిన్నదో పెద్దదో, వ్యతిరేక దిశలోనో గీస్తే దాన్ని కూడా త్రికోణమనే అంటారని వాళ్లు ఆత్మవిశ్వాసంతో చెప్పలేకపోయారు. 'మాకు మా టీచర్ ఇలానే చెప్పారు' అంటారు తప్ప, కొత్తవి తెలుసుకుందామన్న ఆసక్తిని కూడా చూపించ లేదు. ఎంత రొడ్డకొట్టుడు పద్ధతిలో మన చదువులు నడుస్తున్నాయో చూడండి. ఎందుకు మనం కొత్తగా ఆలోచించడం లేదు? మన సృజనాత్మకత ఎక్కడ సమాధయిపోతోంది? వీటికి సమాధానాలు అన్వేషించింది 'ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్'.
సరదాగా ఉండాలి
విద్యార్థులకు సబ్జెక్టు పట్ల లోతైన అవగాహన కల్పించడమే మొదటి లక్ష్యంగా పెట్టుకున్నాం. దానికోసం 'ఎస్సెట్' అనే పరీక్షను తయారుచేశాం. దానిద్వారా విద్యార్థుల్లో లోపమేమిటో స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం దీనిద్వారా ఏడాదికి సుమారు నాలుగు లక్షల మంది విద్యార్థులను పరీక్షిస్తున్నారు. కొత్త విషయాలను నేర్చుకోవడాన్ని పిల్లలు ఎంజాయ్ చెయ్యాలి. ఇది మా రెండో లక్ష్యం. దీనికోసం వెబ్ ఆధారిత బోధన మొదలెట్టాం. క్లాస్‌రూమ్‌లో టీచర్ కన్నా సమర్థవంతంగా విద్యార్థికి చదువుచెబుతూ, ఎంతవరకూ అర్థమయిందో పర్యవేక్షించే లెర్నింగ్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశాం. ఇది మన దేశంలో మొట్టమొదటి ఇంటెలిజెంట్ ట్యూటరింగ్ సిస్టమ్ (ఐటీఎస్) అని సగర్వంగా చెప్పగలను. దీనినుపయోగించి విద్యార్థులు తమంతట తాముగా చదువుకోవచ్చు. స్కూళ్లు కూడా దీన్ని తమ క్లాసురూముల్లో ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం దీన్ని ఎనభైవేల మంది విద్యార్థులు వాడుతున్నారు. ఢిల్లీ, ముంబైల్లోని మురికివాడల పిల్లలక్కూడా ఇది అందుబాటులో ఉంచాం. వాళ్లు కేవలం నెలకు అరవై రూపాయలు కట్టి సొంతంగా ఎన్నో విషయాలు నేర్చుకునే సౌకర్యం ఉంది దీనిలో. ఢిల్లీలోని ఒక పన్నెండేళ్ల అమ్మాయికి మూగ, చెవుడు. ఆమెను స్కూల్లో ఒకటో తరగతిలో చేర్చుకున్నారు. మా సెంటర్‌కు వచ్చి కంప్యూటర్ మీద ఆమె విషయాలను నేర్చుకునే తీరు చూస్తే ఆశ్చర్యమనిపించింది. ఆరు నెలల్లోనే ఆమె ఐదో తరగతి విషయాలన్నీ నేర్చుకుని ఆ తరగతిలో చేరింది. ఇలాంటి సంఘటనలు నాకెంతో సంతోషాన్నిస్తాయి.
కొంచెం కొంచెం వచ్చు...
మావారు సుదర్శన్ శ్రీనివాస్ నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డులో పనిచేస్తారు. ఆయన ఉద్యోగరీత్యా మేం విజయవాడలో ఐదేళ్లున్నాం. తర్వాత హైదరాబాద్‌కు మారాం. నేను ఢిల్లీలో పుట్టిపెరిగిన బెంగాలీని. ఆయన సిమ్లాలో పెరిగిన తమిళుడు. అందువల్ల మాకిద్దరికీ తెలుగు కొద్దికొద్దిగా అర్థమవుతుంది తప్ప ధారాళంగా మాట్లాడలేం. మా పిల్లలు అమర్త్య గౌతమ్, అనన్య మాధుర్ - ఇద్దరికీ తెలుగు కొంచెం వచ్చు.
ఇప్పుడు ఆలోచిస్తున్నారు
ఎస్సెట్ పరీక్షను కొన్ని పాఠశాలల్లో ప్రయోగించి చూస్తున్నప్పుడు ఒక ప్రధానోపాధ్యాయిని ఏమన్నారంటే 'మీరు రక్తపరీక్ష చేసి వ్యాధి ఏదో చెబుతున్నారు. కాని డాక్టర్లు సరిగా లేనప్పుడు జబ్బుకు మందెవరు వేస్తారు?' అని ప్రశ్నించారు. దాంతో మేం ఉపాధ్యాయులకు కూడా శిక్షణనివ్వాలని నిర్ణయించుకున్నాం. పిల్లలకు ఒక సబ్జెక్టు పట్ల ఇష్టమో, వైముఖ్యమో కలగడంలో టీచర్లు ప్రధాన పాత్ర పోషిస్తారు. ఆసక్తికరంగా చెప్పాలన్న స్ఫూర్తి ఉపాధ్యాయుడిలో లేకపోతే చాలా ఇబ్బంది. చెప్పాలన్న తపన ఉండి, నైపుణ్యం లేకపోయినా ఇబ్బందే. ఈ రెండు తరహా లోపాలనూ సరిదిద్దడానికి కార్యక్రమాలు రూపొందిస్తుంటాను. తమిళనాడులోని మదురైలో ఇలాంటి ఒక శిక్షణ కార్యక్రమం నిర్వహించాక, ఒక టీచర్ లేచి నిలబడి 'ఇన్నాళ్లూ పాఠ్యపుస్తకాల్లో ఉన్నవి పిల్లలకు చెప్పేస్తే చాలనుకున్నాను. ఈనాటి నుంచి ఆలోచించడం మొదలుపెట్టాను' అన్నారు. ఆమాట నాలో ఎంత ఉత్సాహాన్ని నింపిందో మాటల్లో చెప్పలేను. 2012 నుంచి విద్యారంగంలో కన్సల్టెంటుగా పనిచేస్తున్నాను. అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ, ఋషివ్యాలీ స్కూల్ మొదలైనవాటికి పనిచేసి ప్రస్తుతం పేద విద్యార్థుల కోసం యూనిసెఫ్ తలపెట్టిన కార్యక్రమాలను నిర్వహించడంలో తలమునకలుగా ఉన్నా. ''