
చేరదీసి నీరు పోసి చిగురించేలా చేస్తాం కదా?
సరిగ్గా ఆ పనే చేస్తున్నారు ముంబైకి చెందిన ఆరుగురు యువతుల బృందం ఉత్తరాఖండ్‌లో.
కొన్ని నెలల క్రితం అక్కడ ముంచెత్తిన జలవిలయంలో అయినవాళ్లందరినీ కోల్పోయి షాక్‌కు గురైన ఆడవారు మానసికంగా మరింత కుంగిపోకుండా ఆదుకుంటున్న ఈ అమ్మాయిల కృషి అందరి ప్రశంసలకూ పాత్రమవుతోంది.
ముంబైకి చెందిన గరిమాశర్మ, నీతిక, గాయత్రి, వినిల్లా, గుంజన్, నమితా - ఈ ఆరుగురూ 'ఆర్ట్ ఆఫ్ లివింగ్'లో సభ్యులు. ఎవరి వృత్తివ్యాపకాలు వారికున్నాయి. అయినా ఉత్తరాఖండ్ జలవిలయం వారిని కదిలించింది. సహాయ, పునరావాస కార్యక్రమాలు ఎందరో చేస్తున్నప్పటికీ మానసికంగా షాక్ తిన్నవారు, మరీ ముఖ్యంగా ఆడవాళ్ల పరిస్థితిలో మార్పు తీసుకురావాలని వీళ్లు నడుంబిగించారు.
ఈ అమ్మాయిలకు పర్వత ప్రాంతాలతో ఇదివరకేమీ పరిచయం లేదు.
జారిపోతున్న కొండ చరియల్లోంచి నడుచుకుంటూ, శిఖరాలను దాటుకుంటూ, బురదలోంచి అడుగుతీసి అడుగు వెయ్యడమే కష్టమవుతున్నా సరే, భుజాన పెద్దపెద్ద బ్యాగులు వేసుకుని ఊళ్లు తిరుగుతున్నారు. అలా వెళ్లడంలో వీళ్లకూ ప్రమాదాలు ఎదురయ్యాయి. 'క్షణకాలంలో తప్పించుకున్నామనేది గుర్తొస్తేనే వణికిపోతున్నాం. అయినా మేం మా కృషిని కొనసాగించాలనే నిర్ణయించుకున్నాం' అంటున్నారు గుంజన్ వాధ్వా, నమితా నైనాని. 'నిర్వాసితులకు వస్తువులు, రేషన్ పంచుతున్నప్పుడు స్త్రీలను చూస్తే చాలా జాలేసింది. పూర్తిగా భర్తల మీదే ఆధారపడినవాళ్ల పరిస్థితి మరీ ఘోరం. సకాలంలో వాళ్లను ఆ షాక్ నుంచి బైటికి తీసుకురాకపోతే తర్వాత వాళ్ల మానసిక పరిస్థితి మరీ దిగజారిపోతుంది..' అన్నారు గరిమ.
అయితే ఈ పని అనుకున్నంత సులువేమీ కాలేదు వాళ్లకు. బాధిత మహిళలతో మాట కలపడమే కష్టమయింది మొదట్లో. ఎందుకంటే ఆ స్త్రీలు మళ్లీ మరొక జలవిలయం రావాలని, ఈసారి తాము కూడా కొట్టుకుపోవాలని నిశ్శబ్దంగా ప్రార్థనలు చేస్తున్నవాళ్లు. ఇంకొందరు దేవుడంటే నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టుకున్నారు. రుద్రపూర్ గ్రామానికి చెందిన యాభయ్యేళ్ల రుక్మిణీదేవి అయితే కళ్లు తెరవడానికి సైతం ఇష్టపడలేదు. ఆమె కుటుంబమంతా నాశనమైపోయింది.
అప్పట్నుంచీ ఆమె మంచానికి అతుక్కుపోయింది, కళ్ల మీద తడి తువ్వాలు కప్పుకుని అసలు ఎవ్వరినీ చూడటానిక్కూడా ఇష్టపడకుండా ఉంది. ఈ బృందంలోని నీతిక, గాయత్రి ఎలాగోలా తంటాలు పడి ఆమెను మాట్లాడించారు. 'మేం ఆమెతో మాట్లాడుతూనే ఉన్నాం, ఆమె చేతులు పట్టుకొని, దగ్గరగా కూర్చొని, హత్తుకుని స్పర్శ ద్వారా ఆమెకు భద్రతా భావనను కలిగించాం. ఒక గంట తర్వాత ఆమెలో బాధ బద్దలయి విపరీతంగా ఏడ్చింది. ఆవేదన తగ్గిన తర్వాత ఓ పావుగంటసేపు ధ్యానంలో కూర్చోబెడితే ఆమె స్థిమితపడింది. ఇప్పుడామె లేచి బైట తిరుగుతోంది, ధ్యానం ద్వారా కొంత ఉపశమనం పొందుతోంది.'
'వాస్తవాన్ని అంగీకరించడానికి తగిన బలం ఇప్పుడిప్పుడే వస్తోంది' అన్నది యామిని అనే బాధితురాలు. ఆమె జూన్ 16న కేదార్‌నాథ్‌లో తన ఇద్దరు కొడుకులనూ పోగొట్టుకుంది. 'మా అబ్బాయిల ఆత్మకు శాంతి చేకూరాలంటే నేను బతక్క తప్పదు' అనే స్థితికి వచ్చిందిప్పుడు. ఆమెలాగా అయినవాళ్లను పోగొట్టుకుని తప్పదన్నట్టుగా బతుకీడుస్తున్నవాళ్లు ఎందరో. ఎక్కువమంది తమ కుటుంబాలనూ, జీవనాధారాన్నీ పోగొట్టుకుని దిక్కుతెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నవాళ్లే. ఇప్పుడిప్పుడే వాళ్లు జరిగినదాన్నుంచి బయటపడుతున్నారు. ఇళ్ల నుంచి అడుగు బైటకేస్తున్నారు. తమను కలవడానికి వచ్చినవాళ్లతో కొద్దికొద్దిగా మనసు విప్పి మాట్లాడుతున్నారు.
ఈ అమ్మాయిల బృందం చేస్తున్న కృషి వల్ల గుప్తకాశి, బడసు, కాళీమఠ్, తోషి, త్రియుగినారాయణ్, రుద్రపూర్, పటా వంటి చోట్ల కనీసం 250 మంది మహిళలు స్వస్థత పొందారు. స్ట్రెస్‌ను పారద్రోలేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు వీరు. 'ఆ విలయం తర్వాత కనీసం ఏడవటాన్ని కూడా మర్చిపోయి శిలల్లా ఘనీభవించిపోయిన ఆడవాళ్లు చాలామందే ఉన్నారు. మా కార్యక్రమాల తర్వాత వాళ్లు తమ గోడును వెళ్లబోసుకుని కొంత ఉపశమనం పొందుతున్నారు. ఇప్పుడిప్పుడే మనుషుల్లో పడుతున్నారు' అంటున్నారీ అమ్మాయిలు. వాళ్లు చేస్తున్నది చిన్న పనేం కాదు.