
సాగరతీరం విశాఖపట్నంలోని మువ్వలవాని పాలెం సీబీఐ ఆఫీసు దగ్గర కేవలం మహిళలే ఉద్యోగులతోనే నడిచే పోస్టాఫీసు ప్రారంభమైంది. ఇది రాష్ర్టంలోనే తొలి ‘ఆల్ ఉమెన్ పోస్టాఫీస్’. దేశంలో నాల్గవది. తొలి మహిళా తపాలా కార్యాలయాన్ని ఈ ఏడాది జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి8న ఢిల్లీలో ప్రారంభించారు. తాజాగా ఢిల్లీలో మరో శాఖతో పాటు ముంబయిలోనూ ఈ తరహా కార్యాలయాన్ని మొదలుపెట్టారు. హైదరాబాద్ నగర పరిధిలో నాలుగు మహిళా పోస్టాఫీసుల్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అసలీ ఆలోచనకు కారణం ఏమిటంటే.. స్త్రీలు ఓర్పు, సహనానికి మారుపేరు. వచ్చిన వినియోగదారులకు ఓపిగ్గా సమాధానం చెప్పి, సకాలంలో, కచ్చితంగా సరైన సేవలందించే నేర్పు వారికుంటుంది. కొరియర్ వ్యవస్థ ధాటికి మసకబారుతున్న పోస్టల్ కీర్తి ప్రతిష్టలకు పూర్వ వైభవం తిరిగి తెచ్చే యత్నాలలో భాగంగా తపాలా శాఖ దేశంలో అనేక ప్రాంతాలలో ఈ విధమైన బ్రాంచిలను ప్రారంభిస్తోంది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విశాఖలో కొత్తగా ఏర్పాటయిన ఈ పోస్టాఫీసులో ఐదుగురు మహిళా సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. ఒక సబ్ పోస్టుమాస్టర్, ఇద్దరు పోస్టల్ అటెండెంట్స్, గ్రామీణ డాట్ సేవలకు ఒకరు, గ్రామీణ డాట్ సేవల స్టాంపు వెండరు ఒకరు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తమ సేవలందిస్తారు. కేంద్ర సమాచార, సాంకేతిక సహకార మంత్రి కిల్లి కృపారాణి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ తపాలా రంగం బ్యాంకింగ్ సేవలు కూడా అందించే యత్నంలో భాగంగా త్వరలో ఏటీఎంలు ప్రారంభిస్తామని వెల్లడించారు. భారీవ్యయంతో విశాఖలో ఆటోమేటిక్ మెయిన్ ప్రాసెసింగ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు.
ఈ ఆధునిక తపాలా సేవలన్నిటిలోనూ తరుణీమణుల అమూల్య సేవలను తపాలా శాఖ అందుకుంటుంది. ప్రస్తుతం విశాఖ పోస్టుమాస్టర్ జనరల్ శారదా సంపత్ విశాఖలో మహిళా పోస్టాఫీసు ఏర్పాటు కావాలనే ఉద్దేశం నెరవేరేందుకు విశేష కృషి చేశారు. ఈ పోస్టాఫీసు సబ్ పోస్టు మాస్టర్గా అరుణ్ జ్యోతి నాయకత్వంలో మహిళా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రమదలు వెలిగిస్తున్న ఈ పోస్టల్ ప్రమిద ఉత్తరోత్తరా మరింత అభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాసంతో పోస్టల్ సిబ్బంది ఉన్నారు.
మూలం : సాక్షి దినపత్రిక