
"పదిహేనేళ్ల వయసులో ఓ ఇద్దరు మగవాళ్లు నా పై యాసిడ్ దాడికి పాల్పడ్డారు. కారణం వాళ్లలో ఒకరిని పెళ్లి చేసుకునేందుకు నేను ఒప్పుకోకపోవడమే. దాడి జరిగి ఎనిమిదేళ్లు అవుతోంది. కాని పరిస్థితుల్లో మాత్రం ఎటువంటి మార్పూ రాలేదు. మన దేశంలో గత మూడు నెలల్లో మహిళలపై 60కి పైగా యాసిడ్ దాడులు జరిగాయనేది ఒక నివేదిక. నాలాగా మరే మహిళా యాసిడ్ దాడికి గురికాకూడదనే ఉద్దేశంతో యాసిడ్‌కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాను. అందుకని న్యాయం కోరుతూ భారతదేశంలో యాసిడ్ అమ్మకాలపై నియంత్రణ విధించాలని సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశాను. సుప్రీంకోర్టు భారత ప్రభుత్వానికి వారం రోజుల గడువు ఇచ్చి అందుకు తగ్గట్టుగా పాలసీని తయారుచేయమని చెప్పింది. దానికి మద్దతుగా నేను ఈ పిటిషన్‌ను ప్రారంభించాను. దీనిద్వారా కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే గారికి రిటెయిల్‌గా జరిగే యాసిడ్ అమ్మకాలను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
యాసిడ్ అమ్మకాలను క్రమబద్దీకరించడంలో ఆలస్యం జరుగుతున్న ప్రతి ఒక్క రోజుకీ ఎందరో మహిళలు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తున్నది. అందుకని కేంద్ర హోం మంత్రిపై ఒత్తిడి తేవాలి. ఈ విషయంలో దేశం మొత్తం ఎదురుచూస్తుందనే విషయం ప్రభుత్వానికి అర్థం కావాలి. ఇది తెలియచేసేందుకు వారం రోజుల సమయం కూడా మన దగ్గర లేదు. అందుకని మీరూ నాతో చేతులు కలిపి హోం మంత్రి యాసిడ్ అమ్మకాలను నియంత్రించే చర్యలు తీసుకునేలా చూడండి. ఈ పిటిషన్ మీద సంతకం చేయండి. దీన్ని మీ స్నేహితులకి, కుటుంబ సభ్యులకి కూడా పంపండి. భారదేశంలోని ఎందరో ఆడవాళ్ల జీవితాలను కాపాడండి. సంతకం చేయబోతున్న వాళ్లందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.
లక్ష్మి
పిటిషన్‌పై సంతకం చేయడం కోసం ఈ వెబ్ లింక్ చూడండి.
http://www.change.org/stopacidattacks