telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

తల్లులు విటమిన్ డి తీసుకొంటే.. పిల్లలు బాడీ బిల్డర్‌లే!

1/27/2014

0 Comments

 
Picture
                   తమకు పుట్టబోయే పుత్రరత్నాలు సిక్స్‌ప్యాక్ బాడీని పెంచాలనుకొనే తల్లులకు ఒక సూచన... ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు తల్లులు విటమిన్ డి పుష్కలంగా తీసుకొంటే పుట్టబోయే పిల్లల కండరాలు శక్తిమంతంగా ఉంటాయట. వారి మజిల్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయని, నాలుగేళ్ల వయసు నుంచే వారి పట్టులో బిగువు ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ పరిశోధకులు తేల్చారు.
 
                        ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఆరు పలకల దేహాల కు క్రేజ్ ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ పరిశోధన ఆసక్తికరంగా మారింది. అబ్బాయిల సిక్స్‌ప్యాక్‌ను తీర్చిదిద్దే శక్తి తల్లులకే ఉందని ఈ పరిశోధన తేల్చింది. కేవలం బాడీబిల్డింగ్ కే కాదు, కాబోయే అమ్మలు విటమిన్ డి ఎక్కువగా తీసుకొంటే పిల్లల్లో శారీరక సత్తా పెరిగే అవకాశం ఉంటుందని పరిశోధకులు వివరించారు. చర్మానికి సూర్యకాంతి తగిలినప్పుడు శరీరంలో విటమిన్ డి జనిస్తుంది. చేపలను తినడం ద్వారా కూడా ప్రెగ్నెంట్ లేడీస్ విటమిన్ డి ని వృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

0 Comments

పెళ్లిళ్లెందుకు పెటాకులు..?

1/7/2014

1 Comment

 
Picture
                  పెళ్లంటే నూరేళ్లపంట! నిజమే.. పెళ్లి అనే పదం వధూవరుల హృదయాలను మీటే స్వరజతి. అయితే- పెళ్లి వీరిరువురి మధ్యనే కాక, రెండు కుటుంబాల నడుమ ఏర్పరచే బంధం కూడా ఎన్నతగినదే. కోటి కోరికల నేపథ్యంలో తమ కాపురం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లాలని వధూవరులు కోరుకుంటారు. మాంగల్యంతో ముడిబడ్డ తమ బంధం కడదాకా నిలవాలని ఆకాంక్షిస్తారు. అదే- దాంపత్య ధర్మం.

               
కొద్ది రోజులకు పెళ్లిసందడి తగ్గి, లో హడావుడి మొదలవుతుంది. సంసారంలో అనుకున్నవన్నీ జరగకపోవచ్చు. కోరుకున్నవి జరగనప్పుడు- సంసారం ప్రేమ సుధాసారం కాస్త సారం లేని సంసారం అనుకోవడం మొదలవుతుంది. దంపతులు ఆ సమయంలో సంయమనం కోల్పోకుండా ప్రవర్తిస్తే సంసార రథానికి బ్రేకులు పడకుండా సాగిపోతుంది. కోరికలు తీరాలంటే కావలసినది ఆర్థిక వెసులుబాటు ఉండాలి. ఒక్కోసారి డబ్బు ఉన్నా ఖర్చు చేయాలంటే కుదరని ఏకాభిప్రాయం. ఒకరు అవసరమనుకున్నది మరొకరికి అనవసరమనిపిస్తుంది. అపార్థాలకు తెర లేచేది ఇక్కడే. అలాంటప్పుడు సంయమనంతో నిర్ణయాలు తీసుకుంటే ఇల్లే స్వర్గమవుతుంది.


డబ్బు:            ప్రతి విషయం డబ్బుతో మొదలై డబ్బుతోనే ముగిస్తే ఆ డబ్బే దంపతుల నడుమ అడ్డుగోడై నిలబడుతుంది. అప్పుడిక కలలుగన్న పంచరంగుల స్వప్నాలన్నీ కరిగిపోయినట్లు అనిపిస్తుంది. దానికి కారణం- నువ్వంటే నువ్వని వాదనలు లేదా ఇరువురు ఒకరి తల్లిదండ్రులను మరొకరు విమర్శించుకోవడం. ఒకరి ఆచార వ్యవహారాలు మరొకరికి నచ్చకపోవడం. కట్నం చాలలేదని అబ్బాయి, అత్తింటివారు ఆస్తిపరులు కాదని, భర్తది అనుకున్నంత పెద్ద ఉద్యోగం కాదని అమ్మాయి దెప్పిపొడుస్తుంటే వారి మనసులు దూరమవుతాయి. పొరబడటం సహజమే. అపోహపడి వేసే అపవాదులే దాంపత్య బంధాన్ని పుటుక్కున తెంపేస్తాయ. అడిగినంత కట్నం ఇవ్వలేదనో, కోరికలు తీర్చలేదనో అబ్బాయి కినుక వహిస్తూ, అబ్బాయికి ఆస్తి లేదనో, సంపాదన తక్కువనో అమ్మాయి బాధపడటం లాంటివి పెళ్లయ్యాక లోపాలుగా కనబడటం ఆశ్చర్యమనిపిస్తుంది. అమ్మాయి చదువుకుని ఉద్యోగం చేస్తున్నా, ఆస్తి వెంట తెచ్చినా అది తమ చేతిలో పడనంతవరకూ అబ్బాయ కుటుంబంలో అసంతృప్తే.

నమ్మకం: దాంపత్యం బలిష్టమైనది కావాలంటే నమ్మకమే గట్టి పునాది. ఈ పునాదిని అనుమానం పట్టి వూపిందా .. కాపురం కుప్పకూలటానికి గొయ్యి పడ్డట్టే! భర్త డబ్బు విషయంలో లెక్క ప్రకారం చెప్పడం లేదనో, ఎవరికైనా ఇస్తున్నాడేమోనని భార్య, తనకు తెలియకుండా భార్య ఏవేవో కొంటుందనో లేదా పుట్టింటివారికి అంతో ఇంతో చేరవేస్తుందని భర్తకు భ్రమ. ఈ అర్థంలేని అపనమ్మకాలు, అనుమానాలు దాంపత్యానికి అగాథమవుతాయి.

ఇతరుల జోక్యం :   ఇదొక విచిత్రమైన విషయం. భార్యాభర్తలిరువురూ తమ సమమ్యను తాము చర్చించుకుని పరిష్కరించుకోక వారి కుటుంబాల లేదా బంధువుల జోక్యాన్ని ఆశిస్తే వారు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ, వారి సర్దుబాటు ఇరువురిలో ఏ ఒకరికి సమ్మతం కానపుడు సమస్య చినికి చినికి గాలివానై అందులో.. సంసార బoధం కొట్టుకుపోతుంది.

అభిప్రాయ భేదాలు: ఇవి అనుబంధాన్ని కుదిపే వడగళ్లలాంటివి. పెళ్లి అనే ముడి పడినంత మాత్రాన ఇద్దరిది ఏకాభిప్రాయమే అని నిర్ణయించలేం. ఆలోచనా విధానంలో తేడాలుంటాయి. అభిప్రాయాలలో వైవిధ్యం తప్పదు. నాదే ఒప్పు, నీది తప్పు- అని భీష్మించుకుంటే మాత్రం అది అనుబంధం కాదు, అంపశయ్యవుతుంది.

అనురాగ లోపం: భర్తకు భార్యపై, భార్యకు భర్తపై అనురాగం పల్లవించాలి. ప్రేమాభిమానాలను అంగడిలో కొనలేం. మనసులోని అభిమానాన్ని మాటలతో ప్రకటించి ఒకరి ఇష్టాలను మరొకరు తెలసుకుని మనగలగాలి. చిన్న చిన్న బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం మంచిదే. అంతకుమించి ప్రేమపూర్వక సంభాషణలు ఉన్నచోట అనురాగం మొలకలేసి దాంపత్యం విరితోటవుతుంది.

అవగాహన: ఒకరిమాట ఇంకొకరు వినేందుకు శ్రద్ధ చూపకపోతే మనసులు అర్థం కావు. అర్థం కాకపోవడానికి కారణం ఏదీ వినపడనట్లు ప్రవర్తించడం. వినిపించుకోకపోవడం నిర్లక్ష్యధోరణిని ప్రస్ఫుటిస్తుంది. ఎప్పుడూ ఉండేవే అని తాత్సారం చేస్తే మాట్లాడేవారి అభిమానం, దెబ్బతినే అవకాశం ఉంటుంది. నిజంగా వినవలసిన, ప్రాముఖ్యత ఉన్న విషయాన్ని వినకపోతే చాలా కోల్పోవలసి వస్తుంది.

సర్దుబాటు : నువ్వెంత అంటే.. నువ్వెంత అనుకుంటుంటే అది కాపురం కాదు, కష్టాల కడలవుతుంది. ఆ కడలిలోని అలల తాకిడిని ఢీకొనలేక కాపురం కుదేలవుతుంది. ఒకరితో ఒకరికి సయోధ్య లేకపోతే సంసార రథం గాడి తప్పుతుంది.
సంతాన లేమి: పిల్లలు కలగడం, కలకగపోవడం అనేక కారణాలపై ఆధారపడి ఉంటుంది. నెపం ఇల్లాలిపై వేయడం ఎంత అమానుషమో కేవలం పురుషుడినే వేలెత్తి చూపడమూ అవాంఛనీయమే. పిల్లలు పుట్టకపోయినా లేదా ఆడపిల్లలే పుట్టినా తరచి చూడాల్సిన శాస్ర్తియ విషయాలను పక్కకకు పెట్టి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోతే దాంపత్యంలో ప్రతి సంఘటన విడాకులకు బాట వేస్తుంది.


అహం: నువ్వా.. నేనా.. అని తారతమ్యాలు లెక్కిస్తే అది దాంపత్య భాగస్వామ్యం కాదు. వ్యాపార భాగస్వామ్యం అవుతుంది. కలిసిచేసే వ్యాపారంలో సైతం సర్దుకుపోయే తత్వముంటేనే ఆ వ్యాపార బంధం నిలబడేది. సంసార నౌక మునిగిపోరాదని అనుకుంటే ఎక్కువ, తక్కువలకు కాదు.. మనం అనే మాటకు విలువనివ్వాలి. నీ దారి నీదే, నా దారి నాదే -అనుకుంటే కుటుంబం తెగిన గాలిపటమవుతుంది.

అసంతృప్తి: పెళ్లయిన చాలా రోజుల తర్వాత అందచందాలపై విమర్శలు ప్రారంభిస్తే మనసు మలినమవుతుంది. కళ్లు తెరచుకుని చూస్తూ చేసుకున్న పెళ్లిలో కనబడని లోపాలు ఆ తరువాతి కాలంలో కనబడ్డాయంటే అది హాస్యాస్పదమే. ఇవన్నీ పెళ్లి విఫలమయేందుకు దోహదపడే విషగుళికల్లాంటివి. ఆలుమగల అనుబంధం కలకాలం నిలవాలంటే ఓర్పు, నేర్పు కలగలసిన సర్దుబాటుతనం, తరగని ప్రేమాభిమానం సమతూకమై నిలవాలి. అప్పుడిక సంసార రథం సాఫీగా సాగి, దాంపత్యం అనుబంధాలకు లోగిలవుతుంది.

1 Comment

కాబోయే తల్లులూ... మందుల విషయంలో జర భద్రం!

1/3/2014

0 Comments

 
Picture
                      మాతృత్వం ఒక వరం. కానీ వరం లాంటి ఆ పరిస్థితి తనకూ, పుట్టబోయే బిడ్డకూ శాపంగా పరిణమించకూడదు కదా. అమ్మ త్యాగానికి మారు పేరు కాబట్టి ఆ త్యాగానికీ సిద్ధపడుతుంది. కాబోయే అమ్మ... ఏయే పరిస్థితుల్లో ఎలాంటి మందులు వాడకూడదో తెలుసుకోవడం వాళ్లకు ఎంతో మేలు చేస్తుంది. కాబోయే మాతృమూర్తి ఏవైనా మందులు వాడితే కడుపులోని బిడ్డకు ఎలాంటి పరిణామాలు వస్తాయో వివరించేదే ఈ కథనం.
 
                       కాబోయే అమ్మ గర్భం ధరించాక ఎలాంటి మందులూ వాకపోవడమే మంచిది. మందు అన్నది ఏదైనా అస్వస్థతను నయం చేసేందుకు బయటి నుంచి ఇచ్చే కొన్ని రసాయనాల మిశ్రమం. అందుకే తప్పనిసరిగా వాడాల్సిన పరిస్థితి వస్తే తప్ప మందులను వాడకపోవడమే మంచిది. ఒకవేళ వాడాల్సి వస్తే మాత్రం తప్పక డాక్టర్ సలహా తీసుకోండి. కాబోయే తల్లి వాడకూడని మందుల విషయంలో  తెలుసుకోవాల్సిన కొన్ని సంగతులివి...
 
 యాంటీకన్వల్‌సెంట్స్: ఫిట్స్ కోసం వాడే మందులను యాంటీకన్వల్సెంట్స్ అంటారు. ఫిట్స్ వచ్చినవారు గర్భధారణకు పనికిరారన్న అపోహ చాలామందిలో ఉంది. అది వాస్తవం కాదు. గతంలో ఫిట్స్ వచ్చి తగ్గినవారు లేదా ఇప్పుడు ఫిట్స్‌కు మందులు వాడుతున్నవారు సైతం గర్భధారణకు ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఫిట్స్ కోసం ఇప్పటికే ఒకటి కంటే ఎక్కువగా మందులు వాడుతున్న వారు ఆ సంఖ్యను వీలైనంత తక్కువకు తగ్గించి (అంటే ఆ సంఖ్యను ఒకటికి తగ్గించి), ఫిట్స్‌ను పూర్తిగా నియంత్రణలోకి తెచ్చుకుని అప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ ఫిట్స్ వచ్చి మందులు వాడుతున్నవారు... ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటే ముందుగా డాక్టర్‌ను సంప్రదించి, నిరపాయకరమైన ఫిట్స్ మందులను తీసుకోవాలి తప్ప... ప్రెగ్నెన్సీ సమయంలో ఫిట్స్ మందులు వాడటం ఆపేయకూడదు. అలాగే ఫోలిక్ యాసిడ్ మాత్రలనూ అదనంగా తీసుకోవాలి.
 
                  ఫిట్స్‌కు వాడే కొన్ని యాంటీకన్వల్సెంట్స్ వల్ల బిడ్డలో వెన్నెముక పూర్తిగా అభివృద్ధి చెందని స్పైనా బైఫిడా అనే కండిషన్ లేదా గ్రహణం మొర్రిగా పేర్కొనే క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ పాలెట్ అనే కండిషన్ లేదా పుట్టుకతో వచ్చే గుండెజబ్బులు అని పేర్కొనే కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ రావడం సాధారణం. అందుకే ఫిట్స్ మందులను తల్లికి ప్రయోజనకరంగానూ, బిడ్డకూ హానికరం కాకుండా ఉండేంతగా మోతాదు తగ్గించిన తర్వాతనే గర్భధారణ ప్లాన్ చేయాలి. ఫిట్స్ వ్యాధి ఉన్నవారు కార్బమాజిపైన్, సోడియం వాల్‌ప్రోయిక్ యాసిడ్, ఫెనీటోయిన్ వంటి అన్ని యాంటీకన్వల్సెంట్ మందులు  వాడటం వల్ల చెవికి, ముఖానికి సంబంధించిన ఎముకల ఆకృతిలో మార్పులు రావడం, న్యూరల్ ట్యూబ్ లోపాలు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని గుర్తుంచుకోండి. ఒకవేళ ఫిట్స్‌కు మందులు వాడుతూ ఉండగా ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, మందుల్లో తగిన మార్పులు చేసుకోవాలి.
 
 యాంటీ మైగ్రేన్ మందుల వల్ల: నిత్యం తలనొప్పి వస్తూ... అది మైగ్రేన్ అని మీ డాక్టర్ నిర్ధారణ చేసినవారు కొన్ని మందులు వాడకూడదు. ఎర్గోటమైన్, మెథజరిజడ్ వంటి యాంటీ మైగ్రేన్ మందులను తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే వీటివల్ల... పూర్తిగా నెలలు నిండకుండానే ప్రసవం జరిగే ప్రమాదం ఉంది.
 
 యాంటీకోయాగ్యులెంట్స్: రక్తాన్ని పలచబార్చే మందులివి. ఏవైనా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు రక్తనాళాల్లో ప్రవహించే రక్తం గడ్డకట్టి అది ప్రవాహానికి అవరోధంగా మారకుండా ఉండేందుకు ఈ తరహా మందులు వాడతారు. అయితే కాబోయే తల్లి యాంటీకోయాగ్యులెంట్స్ వాడితే బిడ్డలో కొన్ని లోపాలు వృద్ధి చెందవచ్చు. ఉదాహరణకు వార్‌ఫేరిన్ డైఫినాడైయాన్ గ్రూపునకు చెందిన మందుల్ని తల్లి వాడితే బిడ్డలో ముక్కు రంధ్రం పూర్తిగా తయారుకాకపోవడం, గర్భవతికి రక్తస్రావం కావ డం, బిడ్డలో కొన్ని అంగవైకల్యాలు, కంటికి సంబంధించిన సమస్యలు ఏర్పడటం, తల పూర్తిగా పెరగకుండా ఉండటం, పుట్టబోయే బిడ్డకు బుద్ధిమాంద్యం ఏర్పడటం వంటి సమస్యలకు అవకాశం ఉంది. అందుకే యాంటీకోయాగ్యులెంట్స్ వాడుతుండేవారు తప్పనిసరిగా తమ డాక్టర్ సలహా తీసుకోవాలి. అప్పుడు వారు కొన్నాళ్లు వార్‌ఫేరిన్‌ను ఆపి, దానికి బదులుగా హిపారిన్ ఇస్తారు. ప్రమాదకరమైన దశ దాటిన తర్వాత మళ్లీ వార్‌ఫెరిన్‌ను కొనసాగిస్తారు.
 
 యాంటీడయాబెటిక్ ఔషధాలు: డయాబెటిస్ ఉన్నవారు తమ చికిత్సలో భాగంగా వాడే మందులను యాంటీడయాబెటిక్ మందులు అంటారు. వీటిల్లో క్లోరోప్రోమైడ్ వంటి మందులు తీసుకోవడం వల్ల శిశువు పుట్టిన నెలలోపే వాళ్లకు హైపోగ్లైసీమియా ఏర్పడవచ్చు. అంటే వాళ్ల రక్తంలో గ్లూకోజ్ శాతం తీవ్రంగా పడిపోయి ప్రమాదకరం కావచ్చు. అందుకే షుగర్ వ్యాధి ఉన్నవారు గర్భధారణకు ముందుగా తమ డాక్టర్‌ను సంప్రదించాలి. అప్పుడు డాక్టర్లు నోటి ద్వారా తీసుకునే మందులకు బదులు బిడ్డకు అపాయకరం కాని ఇన్సులిన్‌ను ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు.
 
 డయాగ్నస్టిక్ రేడియోలజీ: 
గర్భం దాల్చిన తొలి రోజుల్లో ఎలాంటి ఎక్స్-రే పరీక్షలూ చేయించుకోకపోవడం మంచిది. ఎందుకంటే అప్పుడు ఎక్స్-రే తీయించుకోవడం వల్ల, పుట్టినబిడ్డ లుకేమియా వంటి క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువ. ఒకవేళ ఎక్స్-రే తీయించక తప్పని పరిస్థితి ఉంటే ఈ విషయంలో తప్పనిసరిగా డాక్టర్ సలహా పాటించాలి.
 
                      కొంతమంది గర్భధారణ తర్వాత ఎలాంటి మందులూ వాడకూడదని అనుకుంటారు. అది పూర్తిగా వాస్తవం కాదు. కొన్ని మందులు గర్భధారణ సమయంలోనూ తీసుకోదగినంత సురక్షితంగా ఉంటాయి. అందుకే గర్భం దాల్చిన తర్వాత లేదా గర్భం కోసం ఎదురుచూస్తున్న సమయంలో డాక్టర్ సలహా మేరకే మందులు వాడాలి.
 
 యాంటీబయాటిక్స్ వల్ల :
                   మనకు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వెంటనే యాంటీబయాటిక్స్ వాడతాం. నిజానికి మనకు జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించగానే డాక్టర్‌ను సంప్రదించకుండానే యాంటీబయాటిక్స్ (ఆన్‌కౌంటర్ మెడిసిన్) వాడే అలవాటు మన సమాజంలో చాలా ఎక్కువ. అది మామూలు వాళ్లకే ఎంతో కీడు చేస్తుంది. అలాంటిది గర్భవతులు డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడటం అంటే అది ఎన్నో ఉపద్రవాలు తేవచ్చేమోనని జాగ్రత్తగా ఉండండి. ఉదాహరణకు... కాబోయే అమ్మ టెట్రాసైక్లిన్స్ వాడితే బిడ్డ దంతాలకు రావాల్సిన సహజమైన రంగు పోవచ్చు, తమ సహజమైన మెరుపును కోల్పోవచ్చు. కొన్ని యాంటీబయాటిక్స్ బిడ్డ ఎముకల ఎదుగుదలకు అడ్డుపడవచ్చు. అప్పుడు బిడ్డ అవయవ నిర్మాణంలోనే లోపాలు రావచ్చు. ఇక సల్ఫోనమైడ్స్ అనే యాంటీబయాటిక్స్ కారణంగా బిడ్డ పుట్టిన నెలలోపే వారికి కామెర్లు రావచ్చు. తల్లి స్ట్రెప్టోమైసిన్ వాడటం వల్ల బిడ్డకు చెవుడు వచ్చే అవకాశాలున్నాయి. కొన్ని సురక్షితమైన యాంటీబయాటిక్స్ ప్రెగ్నెన్సీలో సైతం తీసుకోదగినవి అందుబాటులో ఉన్నాయి. వాటిని డాక్టర్ సలహా మేరకే వాడాలి.

డాక్టర్ వి. శాంతి రెడ్డి,
సీనియర్ గైనకాలజిస్ట్, లాపరోస్కోపిక్ సర్జన్,
అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్


0 Comments

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం.

    Archives

    May 2014
    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    July 2013
    June 2013

    Categories

    All
    'నోబెల్' ఇంట్లో ఆమెకు గుర్తింపేదీ?
    టెన్ కమాండ్‌మెంట్స్
    మామిడి వనం.. మహిళకు వరం!
    అస్త్ర తంత్ర : కాన్ఫిడెన్సే మీ బాడీగార్డ్
    నెలసరి నొప్పి తగ్గేదెలా?
    కాబోయే తల్లులూ... మందుల విషయంలో జర భద్రం!
    పోషకాహార లోపం.. పడతులకు శాపం
    కోర్కెలు శూన్యం.. బతుకంతా దైన్యం
    మొదలైందా నెలసరి...ఈ ఆహారం సరి..!
    అల్లుకునే బంధాలకు బతుకమ్మ
    ఆడశిశువుకు ఆహ్వాన గీతిక..!
    పెనవేసుకొనే పేగు బంధం
    అత్తారింట్లో నవవధువు అలవాటుపడేదెలా?
    పోషకాహారంతోనే శిశువు ఆరోగ్యం
    పెళ్లిళ్లెందుకు పెటాకులు..?
    పెళ్లిళ్లెందుకు పెటాకులు..?
    తల్లులు విటమిన్ డి తీసుకొంటే.. పిల్లలు బాడ
    ఆసక్తి ఉంటే అతివకు ‘షేర్ మార్కెట్’ సులభమĺ

    RSS Feed


Powered by Create your own unique website with customizable templates.