telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

ఆసక్తి ఉంటే అతివకు ‘షేర్ మార్కెట్’ సులభమే..!

7/12/2013

2 Comments

 
Picture
                   దేశం ఎంతగా ప్రగతి సాధిస్తున్నా షేర్ మార్కెట్‌లో మహిళల భాగస్వామ్యం ఇప్పటికీ నామమాత్రంగానే ఉంది. పురుషులకు దీటుగా షేర్‌మార్కెట్‌లో లావాదేవీలు నిర్వహించగల సత్తా మహిళల్లో ఉన్నప్పటికీ వారు ముందుకురావటానికి జంకుతున్నారు. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఈ రంగంలో వారు విజయవంతంగా దూసుకుపోవచ్చు. లాభనష్టాలు, ట్రేడింగ్ గొడవలు మనకెందుకులే..!-అని అనుకుంటే మహిళలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. షేర్ మార్కెట్ గురించి కాస్త అవగాహన ఉంటే చాలు ఇందులో కాస్తోకూస్తో లాభాలు సంపాదించటం తేలికే. అయతే, షేర్ మార్కెట్ మాయాజాలాన్ని ఓ జూదంలా భావించి కుటుంబ యజమానులు పెట్టుబడులు పెడతామన్నా మహిళలు పెట్టనీయరు. ఓర్పుతో మార్కెట్‌ను అధ్యయనం చేసే ఆసక్తిని పెంచుకుంటే అతి తక్కువ పెట్టుబడితో చిన్న షేర్ మార్కెట్ వ్యాపారం ప్రారంభించవచ్చు. స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన పుస్తకాలను, కథనాలను చదివి మహిళలు అవగాహన పెంచుకోవాలి.

                      స్టాక్ మార్కెట్‌లో నిత్యం వాడే పదాలు, వాటి అర్థాలు, అవి ఎందుకు ఉపయోగపడతాయని విశే్లషణ చేయటానికి కొంత సమయం కేటాయించాలి. డబ్బును సరైన వడ్డీరాని బ్యాంకులలో మురగబెట్టే బదులు స్టాక్ మార్కెట్‌లో పెట్టి లాభాలు పొందవచ్చు. తగినంత సమయాన్ని వెచ్చించలేమనుకుంటే, ఇదంతా మనవల్ల కాదనుకుంటే మంచి స్టాక్ బ్రోకరుని ముఖ్యంగా ప్రాచుర్యంలో ఉన్న ట్రేడింగ్ సంస్థను ఎంచుకుని, వారి ద్వారా లావాదేవీలు జరపాలి. ఆ సంస్థ మీ తరఫున అమ్మకాలు, కొనుగోళ్ల ప్రక్రియ చేపడుతోంది. దానికి కొంచెం రుసుం చెల్లిస్తే సరిపోతుంది. మహిళలు ఈ రంగంలోకి అడుగుపెట్టాలంటే ఆన్‌లైన్ ట్రేడింగ్ ఎంచుకుంటే మంచిది. ఇది వారికి ఎంతో సులభంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. వౌస్ క్లిక్‌లతో పని సాఫీగా జరిగిపోతుంది. ముందుగా ఒక డెమో అకౌంట్‌ను ఓపెన్ చేసి అందులో మనం బాగా ఆరితేరిన తరువాత, ట్రేడింగ్‌ని అర్థం చేసుకున్న తరువాత ఒరిజినల్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. నష్టాలను నివారించుకోవటంతో పాటు తక్కువ ట్రేడింగ్ రుసుంతో మన కళ్ల ముందే మార్కెట్ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఆరంభంలో ఒకే స్టాక్‌పై దృష్టిపెట్టి కొన్ని షేర్లు మాత్రమే కొనుగోలు చేయాలి. అపుడు మనకు ట్రేడింగ్ పద్ధతులు, ఉపాయాలు బాగా అర్థం అవుతాయి. మనకు మార్కెట్ తీరుతెన్నులు అర్థం అయ్యాక మెల్లమెల్లగా స్టాక్ పెంచుకోవచ్చు. మార్కెట్ టెక్నిక్ లను ఆకళింపు చేసుకోవాలి. మార్కెట్ ఎలాంటి స్పందనలకు గురవుతుందో ఊహించే నేర్పు సంపాదించాలి. ఇది కొద్ది రోజులలో వచ్చేది కాదు, మరీ అంత సులువు కాదు. క్రమశిక్షణతో రోజూ మార్కెట్‌ను పరిశీలిస్తూ, సందర్భాలను బేరీజు వేసుకుంటూ చాకచక్యంగా ముందుకు సాగాలి. ఒక్కసారి ఇలాంటి మెళకువలు మీ సొంతం అయితే క్రమక్రమంగా ఒకే సంస్థలో కాకుండా వివిధ సంస్థలలో విభిన్న రంగాలలో పెట్టుబడులను విస్తరించుకోవాలి. ఇది చాలా మెరుగైన, సురక్షితమైన పద్ధతి. మనకు లాభాలు ఆర్జించే స్టాక్‌ను లేదా సంస్థను ప్రేమించాలి. నష్టపోతామని ఏ మాత్రం సందేహం కలిగినా పెట్టుబడులు పెట్టకుండా వదలివేయటం అలవర్చుకోవాలి. మార్కెట్ ట్రెండ్ మాత్రమే మనకు ప్రధానం. భావావేశాలకు అసలు చోటులేదు. సెంటిమెంట్లకు తావులేదు. నిర్లక్ష్యం అసలు పనికిరాదు. ఎందులో పోగొట్టుకున్నామో అందులోనే సంపాదించాలనే సూత్రం ఇక్కడ పనిచేయదు. అవసరమైతే నిపుణుల సలహాకి వెనుకాడవద్దు. నిజం చెప్పాలంటే స్టాక్ ట్రేడింగ్ మహిళలకు మంచి లాభసాటి వ్యాపకంగా చెప్పుకోవచ్చు. ఇంట్లో ఒక సిస్టమ్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. భర్త, పిల్లలు బయటికి వెళ్లిపోగానే ట్రేడింగ్ చేసుకోవచ్చు. వారు వచ్చేలోపలే ముగించుకోవచ్చు. ఖాళీగా ఇంట్లో ఉన్నామన్న దిగులు దరిచేరదు. మంచి సంపాదన కూడా వస్తుంది. తొందరపాటుతనం లేకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మార్కెట్‌లో నిలదొక్కుకోవటం సులభం. అయితే దీర్ఘకాలిక ప్రణాళిక ఉంటేనే బాగుంటుంది. అన్నీ కాకున్నా కొన్ని స్టాక్స్ మాత్రం రెండు నుంచి ఐదు సంవత్సరాల కాలవ్యవధిలో పెట్టుబడి పెట్టుకుంటే మంచిదని నిపుణులు చెపుతుంటారు. ఇలాంటి తలనొప్పి వద్దనుకుంటే మ్యూచివల్ ఫండ్స్‌లో పెట్టుకుంటే సరిపోతుంది.
స్టాక్‌మార్కెట్‌లో మాహిళల సామర్థ్యాన్ని ఎన్నో సర్వేలు వేనోళ్లుగా ప్రశంసిస్తున్నా ఇండియన్ ఈక్విటీ ఇనె్వస్ట్మెంట్ సర్వే-2010 ప్రకారం అమెరికాలో 20శాతం మంది మహిళలు ముందుకు వస్తుంటే మనదేశంలో 7 శాతం మహిళలే రంగప్రవేశం చేస్తున్నారు. అదీకూడా ఉన్నత చదువులు చదువుకున్నవారే కావడం గమనార్హం. పెట్టుబడులు తక్కువ కాబట్టి గృహిణులు రావాలని ఆర్థిక విశ్లేషకులు
 అభిలషిస్తున్నారు.

                         యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా నిర్వహించిన అధ్యయనంలో మహిళల పోర్ట్ఫోలియో విలువ మగవారికన్నా సంవత్సరానికి 1.4 శాతం పెరుగుతున్నదని తేలింది. పైగా ఒంటరి ఆడవారు స్టాక్ మార్కెట్‌లోగొప్పగా రాణిస్తున్నారని ఆ సర్వే తేల్చిచెప్పింది. నిపుణుల నివేదిక ప్రకారం స్టాక్ మార్కెట్‌లో ఒంటరి మహిళల సంపాదన ఒంటరి మగవారి కన్నా 2.3 శాతం ఎక్కువని నిరూపించబడింది. ఆర్థికంగా ప్రగతిపథంలో వెళుతున్న జపాన్‌లో ‘‘మయుమితొరి’’ అనే గృహిణి ఆసియాలోని ఇనె్వస్టర్లలో అందరికీ ఆదర్శం అని ఆ సర్వే ఉదహరించింది. ఆమె ట్రేడింగ్ మొదలు పెట్టినపుడు భర్తకు తెలియకుండానే పెట్టుబడులు పెట్టేవారట. నేడు నూటా యాభై వేల అమెరికన్ డాలర్లను సొంతం చేసుకుంది. ఆమెఇనె్వస్ట్మెంట్ స్ట్రాటజీస్ అనే పుస్తకం కూడా రాశారు. మహిళా ఇనె్వస్టర్ల కోసం నలభై మంది సభ్యులతో ఒక క్లబ్బును కూడా ఏర్పాటు చేసి దానికి ‘‘ఎఫ్ ఎ బ్యూటీస్’’ అని నామకరణ చేశారు. ఇప్పటికీ చాలామంది ఆమె బాటలో నడుస్తూ భర్తకు చెప్పకుండా వారి పార్ట్‌టైమ్ సంపాదనను ట్రేడింగ్‌లో పెట్టేస్తున్నారట. మనం అంత రిస్కు తీసుకోకుండా ఇంట్లో చెప్పే చేసుకోవచ్చు. ఈ రోజుల్లో మహిళలను ముందుకెళ్లమని ప్రోత్సహించే భర్తలు ఎక్కువే కాబట్టి ట్రేడింగ్‌లో అవగాహన పెంచుకుని ముందుకు దూసుకేళ్లొచ్చు. అయితే, ఇందులోకి దిగిముందే మానసికంగా నష్టాలలొచ్చినా అందుకు సంసిద్ధంగా ఉండాలి. కొంతకాలం లాభాలు రాకున్నా నెట్టుకురాగలమనే నమ్మకం, ధైర్యం ఉండాలి. అలాంటి సౌలభ్యం లేకపోతే స్టాక్‌ట్రేడింగ్‌లోకి మహిళలు దిగకపోవడమే మంచిది.

మూలం : ఆంధ్రభూమి దినపత్రిక 

2 Comments

ఆడశిశువుకు ఆహ్వాన గీతిక..!

7/10/2013

0 Comments

 
Picture
* గంగానగర్‌లో ఆడశిశువులకు జన్మనిచ్చిన 50 మంది దంపతులను ప్రముఖ విద్యా సంస్థలు సత్కరించి, ప్రతి కుటుంబంలో ఒక బాలికకు ఉచితంగా విద్యను అందిస్తామని ప్రకటించాయి.
* ఆడశిశువు జన్మించిన ఇంట్లో వేడుకలు జరిపేందుకు గ్రామీణ మహిళలంతా ఐక్యతతో ముందుకు వస్తున్నారు.
* ఆడశిశువును ఆదరించిన దంపతులను గ్రామ పంచాయతీ పెద్దలు సన్మానిస్తూ ప్రశంసాపత్రాలు అందజేస్తున్నారు.
* చాంబర్ ఆఫ్ కామర్స్, గురుద్వారా కమిటీలు, ఇతర సంస్థలు ఆడశిశువులకు ఉచిత విద్య అందించేలా ఆర్థిక సాయం చేస్తున్నాయి.

                    ‘ఆడశిశువును కనాలా? వద్దా? అన్నది తల్లిదండ్రుల హక్కు.. లింగ నిర్థారణ పరీక్షలు చేయించుకునే స్వేచ్ఛ వారికి ఉంది.. ఆడశిశువును వద్దనుకుంటే- గర్భస్రావానికి అనుమతించేలా గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు చేయాలి.. మగశిశువు పుట్టకుంటే ఆ కుటుంబానికి భవిష్యత్తే లేదు...


                        - ఈ తరహా వాదనలను విస్తృతంగా ప్రచారం చేస్తూ రాజస్థాన్‌లోని మోహన్‌పుర గ్రామంలో ‘అంగన్‌వాడీ’ నాయకురాలు చిందేరీపాల్ కౌర్ విధులు నిర్వహించేది. ఇదంతా 2011 నాటి మాట. ఆ తర్వాత ఎనిమిది నెలలకు ఆమె ప్రవర్తనలో అనూహ్య మార్పును గమనించి గ్రామస్థులు సైతం ఆశ్చర్యపోయారు. చట్ట వ్యతిరేక గర్భస్రావాలను, లింగ నిర్థారణ పరీక్షలను తాను ఎంతమాత్రం ప్రోత్సహించేది లేదని గ్రామస్థుల సమక్షంలో కౌర్ ప్రతిజ్ఞ చేసింది. ఆడశిశువు పట్ల కౌర్‌తో పాటు గ్రామస్థుల్లో ఇంత మార్పుకు కారణమేమిటన్నది అధికారులకు కూడా ఒకింత అర్థం కాలేదు. ‘ప్లాన్ ఇండియా’, ‘ఉర్ముల్ సేతు’ అనే స్వచ్ఛంద సంస్థలు ‘ఆడశిశువులను జన్మించనివ్వండం’టూ ఓ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడంతో రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాలో ఆశాజనకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆడశిశువులు వద్దంటూ ఒకప్పుడు ప్రచారం చేసిన కౌర్ లాంటి మహిళలు నేడు తమ వైఖరిని పూర్తిగా మార్చుకున్నారు.


                        ‘ప్లాన్ ఇండియా’, ‘ఉర్ముల్ సేతు’ సంస్థలు గంగానగర్ జిల్లాలోని అన్ని పంచాయతీల్లో సమన్వయకర్తలను నియమించాయి. వీరు అంగన్‌వాడీ, ‘ఆశ’ కార్యకర్తలతో కలిసి పనిచేయడం ప్రారంభించారు. లింగ నిర్థారణ పరీక్షలు, చట్ట వ్యతిరేక గర్భస్రావాలు జరగకుండా వీరు గ్రామాల్లో నిఘా పెట్టారు. దీంతో మగశిశువు కోసం ఎదురుచూస్తూ పదే పదే గర్భధారణకు సిద్ధమయ్యే మహిళల సంఖ్య క్రమంగా తగ్గింది. నలుగురు, అయిదుగురు ఆడపిల్లలను కన్న తల్లులు ఇక తమకు మగశిశువు అక్కర్లేదని కుటుంబ నియంత్రణ పద్ధతులను స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. ఆడపిల్ల పుడుతుందని తెలుసుకుని గర్భస్రావాలు చేయించుకునే వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఆడశిశువు జన్మించినా చాలా మంది దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆడశిశువు పుట్టినపుడు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు.


                     గర్భస్రావాలను ప్రోత్సహించేవారికి చట్టపరంగా శిక్షలు పడతాయని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గ్రామాల్లో చేస్తున్న ప్రచారం ఫలించింది. తాము చేసిన ప్రచారం ఫలితంగా కౌర్ లాంటి అంగన్‌వాడీ కార్యకర్తల్లో మార్పు వచ్చిందని స్వచ్ఛంద సంస్థ తరఫున సమన్వయకర్తలుగా పనిచేస్తున్న దంపతులు నిషా, విక్రమ్ సింగ్ చెబుతున్నారు. కౌర్ కుమార్తె రూబీ ఇటీవలే కవలలైన ఆడశిశువులకు జన్మనిచ్చిందని, ఆమెకు ఇదివరకే ఒక కుమార్తె ఉందని వారు తెలిపారు. ముగ్గురు ఆడపిల్లలను పెంచడం రూబీకి ఆర్థిక భారం కావడంతో- కవల పిల్లల్లో ఒకరిని దత్తత ఇచ్చేందుకు కౌర్ అంగీకరించినట్లు వారు వివరించారు. ఒకప్పుడు ఆడశిశువు అంటేనే వ్యతిరేకత చూపిన కౌర్‌లో ఈ మార్పు రావడం అందరినీ విస్మయపరచింది. వివాహం జరిగి పదహారేళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో నిషా,విక్రమ్ సింగ్ దంపతులు రూబీ కుమార్తెను దత్తత తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు.


                  ఇదే స్ఫూర్తితో గ్రామానికి చెందిన అయిదుగురు దంపతులు పేద కుటుంబాలకు చెందిన ఆడశిశువులను దత్తత తీసుకున్నారు. గర్భస్రావాలకు పాల్పడమని, ఆడశిశువు పుట్టినా ఆదరిస్తామని చాలా గ్రామాల్లో మహిళలు బహిరంగంగా ప్రతిజ్ఞలు చేస్తున్నారు.


                        ఆడశిశువుల సంరక్షణకు యువత కూడా కృషి చేస్తున్న సంఘటనలు నేడు రాజస్థాన్‌లో కనిపిస్తున్నాయి. రోటవాలికి చెందిన గురుతేజ్ సింగ్ (17) తన తాతగారి ఊరైన తలివాలా (పంజాబ్)కు వెళ్లినపుడు ఓ ఆడశిశువును దత్తత తీసుకున్నాడు. ఒకే కాన్పులో ఇద్దరు ఆడశిశువులకు జన్మనిచ్చిన ఓ మాతృమూర్తి ప్రసవం తర్వాత కన్నుమూసింది. ఆ ఇద్దరు ఆడపిల్లలను అనాథాశ్రమానికి అప్పగించి ఆమె భర్త రెండోపెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న గురుతేజ్ సింగ్ ఓ ఆడశిశువును తన వెంట తీసుకువెళ్లాడు. ఆ శిశువును ప్రేమతో పెంచుకునేందుకు గురుతేజ్ సింగ్ తల్లిదండ్రులు నిండుమనసుతో ముందుకు వచ్చారు. తల్లి లేని మరో ఆడశిశువును గ్రామంలోని ఓ దంపతులు చేరదీశారు.


                 గురుతేజ్ సింగ్‌ను స్ఫూర్తిగా తీసుకుని రోటవాలితో పాటు అనేక గ్రామాల్లో ఎంతోమంది దంపతులు ఆడశిశువులను దత్తత తీసుకున్నారు. ఆర్థిక స్థోమత లేని కుటుంబాల్లో ఆడపిల్లలు అధికంగా ఉంటే దత్తత ఇప్పించేలా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఒప్పిస్తున్నారు. పట్టణ ప్రాంతాల నుంచి కూడా అనేక మంది దంపతులు ఆడశిశువులను దత్తత తీసుకుంటామని గ్రామాలకు వస్తున్నారు.


                    మగశిశువు పుడితే ఒకప్పుడు గ్రామాల్లో ఇత్తడి పళ్లాలపై శబ్దాలు చేస్తూ సంబంధిత కుటుంబాల వారు కోలాహలం సృష్టించేవారు. అయితే, ఇ లాంటి ఆనందకర దృశ్యాలు ఆడపిల్లలు పుట్టిన ఆస్పత్రుల్లో నేడు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులు, బంధుమిత్రులే కాదు ఆస్పత్రి సిబ్బంది, నర్సులు కూడా ఆడశిశువులు పుట్టినపుడు వేడుకల్లో ఉత్సాహవంతంగా పాల్గొంటున్నారు.


మూలం : ఆంధ్రభూమి దినపత్రిక 

0 Comments

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం.

    Archives

    May 2014
    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    July 2013
    June 2013

    Categories

    All
    'నోబెల్' ఇంట్లో ఆమెకు గుర్తింపేదీ?
    టెన్ కమాండ్‌మెంట్స్
    మామిడి వనం.. మహిళకు వరం!
    అస్త్ర తంత్ర : కాన్ఫిడెన్సే మీ బాడీగార్డ్
    నెలసరి నొప్పి తగ్గేదెలా?
    కాబోయే తల్లులూ... మందుల విషయంలో జర భద్రం!
    పోషకాహార లోపం.. పడతులకు శాపం
    కోర్కెలు శూన్యం.. బతుకంతా దైన్యం
    మొదలైందా నెలసరి...ఈ ఆహారం సరి..!
    అల్లుకునే బంధాలకు బతుకమ్మ
    ఆడశిశువుకు ఆహ్వాన గీతిక..!
    పెనవేసుకొనే పేగు బంధం
    అత్తారింట్లో నవవధువు అలవాటుపడేదెలా?
    పోషకాహారంతోనే శిశువు ఆరోగ్యం
    పెళ్లిళ్లెందుకు పెటాకులు..?
    పెళ్లిళ్లెందుకు పెటాకులు..?
    తల్లులు విటమిన్ డి తీసుకొంటే.. పిల్లలు బాడ
    ఆసక్తి ఉంటే అతివకు ‘షేర్ మార్కెట్’ సులభమĺ

    RSS Feed


Powered by Create your own unique website with customizable templates.