కాబోయే అమ్మ గర్భం ధరించాక ఎలాంటి మందులూ వాకపోవడమే మంచిది. మందు అన్నది ఏదైనా అస్వస్థతను నయం చేసేందుకు బయటి నుంచి ఇచ్చే కొన్ని రసాయనాల మిశ్రమం. అందుకే తప్పనిసరిగా వాడాల్సిన పరిస్థితి వస్తే తప్ప మందులను వాడకపోవడమే మంచిది. ఒకవేళ వాడాల్సి వస్తే మాత్రం తప్పక డాక్టర్ సలహా తీసుకోండి. కాబోయే తల్లి వాడకూడని మందుల విషయంలో తెలుసుకోవాల్సిన కొన్ని సంగతులివి...
యాంటీకన్వల్‌సెంట్స్: ఫిట్స్ కోసం వాడే మందులను యాంటీకన్వల్సెంట్స్ అంటారు. ఫిట్స్ వచ్చినవారు గర్భధారణకు పనికిరారన్న అపోహ చాలామందిలో ఉంది. అది వాస్తవం కాదు. గతంలో ఫిట్స్ వచ్చి తగ్గినవారు లేదా ఇప్పుడు ఫిట్స్‌కు మందులు వాడుతున్నవారు సైతం గర్భధారణకు ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఫిట్స్ కోసం ఇప్పటికే ఒకటి కంటే ఎక్కువగా మందులు వాడుతున్న వారు ఆ సంఖ్యను వీలైనంత తక్కువకు తగ్గించి (అంటే ఆ సంఖ్యను ఒకటికి తగ్గించి), ఫిట్స్‌ను పూర్తిగా నియంత్రణలోకి తెచ్చుకుని అప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ ఫిట్స్ వచ్చి మందులు వాడుతున్నవారు... ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటే ముందుగా డాక్టర్‌ను సంప్రదించి, నిరపాయకరమైన ఫిట్స్ మందులను తీసుకోవాలి తప్ప... ప్రెగ్నెన్సీ సమయంలో ఫిట్స్ మందులు వాడటం ఆపేయకూడదు. అలాగే ఫోలిక్ యాసిడ్ మాత్రలనూ అదనంగా తీసుకోవాలి.
ఫిట్స్‌కు వాడే కొన్ని యాంటీకన్వల్సెంట్స్ వల్ల బిడ్డలో వెన్నెముక పూర్తిగా అభివృద్ధి చెందని స్పైనా బైఫిడా అనే కండిషన్ లేదా గ్రహణం మొర్రిగా పేర్కొనే క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ పాలెట్ అనే కండిషన్ లేదా పుట్టుకతో వచ్చే గుండెజబ్బులు అని పేర్కొనే కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ రావడం సాధారణం. అందుకే ఫిట్స్ మందులను తల్లికి ప్రయోజనకరంగానూ, బిడ్డకూ హానికరం కాకుండా ఉండేంతగా మోతాదు తగ్గించిన తర్వాతనే గర్భధారణ ప్లాన్ చేయాలి. ఫిట్స్ వ్యాధి ఉన్నవారు కార్బమాజిపైన్, సోడియం వాల్‌ప్రోయిక్ యాసిడ్, ఫెనీటోయిన్ వంటి అన్ని యాంటీకన్వల్సెంట్ మందులు వాడటం వల్ల చెవికి, ముఖానికి సంబంధించిన ఎముకల ఆకృతిలో మార్పులు రావడం, న్యూరల్ ట్యూబ్ లోపాలు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని గుర్తుంచుకోండి. ఒకవేళ ఫిట్స్‌కు మందులు వాడుతూ ఉండగా ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, మందుల్లో తగిన మార్పులు చేసుకోవాలి.
యాంటీ మైగ్రేన్ మందుల వల్ల: నిత్యం తలనొప్పి వస్తూ... అది మైగ్రేన్ అని మీ డాక్టర్ నిర్ధారణ చేసినవారు కొన్ని మందులు వాడకూడదు. ఎర్గోటమైన్, మెథజరిజడ్ వంటి యాంటీ మైగ్రేన్ మందులను తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే వీటివల్ల... పూర్తిగా నెలలు నిండకుండానే ప్రసవం జరిగే ప్రమాదం ఉంది.
యాంటీకోయాగ్యులెంట్స్: రక్తాన్ని పలచబార్చే మందులివి. ఏవైనా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు రక్తనాళాల్లో ప్రవహించే రక్తం గడ్డకట్టి అది ప్రవాహానికి అవరోధంగా మారకుండా ఉండేందుకు ఈ తరహా మందులు వాడతారు. అయితే కాబోయే తల్లి యాంటీకోయాగ్యులెంట్స్ వాడితే బిడ్డలో కొన్ని లోపాలు వృద్ధి చెందవచ్చు. ఉదాహరణకు వార్‌ఫేరిన్ డైఫినాడైయాన్ గ్రూపునకు చెందిన మందుల్ని తల్లి వాడితే బిడ్డలో ముక్కు రంధ్రం పూర్తిగా తయారుకాకపోవడం, గర్భవతికి రక్తస్రావం కావ డం, బిడ్డలో కొన్ని అంగవైకల్యాలు, కంటికి సంబంధించిన సమస్యలు ఏర్పడటం, తల పూర్తిగా పెరగకుండా ఉండటం, పుట్టబోయే బిడ్డకు బుద్ధిమాంద్యం ఏర్పడటం వంటి సమస్యలకు అవకాశం ఉంది. అందుకే యాంటీకోయాగ్యులెంట్స్ వాడుతుండేవారు తప్పనిసరిగా తమ డాక్టర్ సలహా తీసుకోవాలి. అప్పుడు వారు కొన్నాళ్లు వార్‌ఫేరిన్‌ను ఆపి, దానికి బదులుగా హిపారిన్ ఇస్తారు. ప్రమాదకరమైన దశ దాటిన తర్వాత మళ్లీ వార్‌ఫెరిన్‌ను కొనసాగిస్తారు.
యాంటీడయాబెటిక్ ఔషధాలు: డయాబెటిస్ ఉన్నవారు తమ చికిత్సలో భాగంగా వాడే మందులను యాంటీడయాబెటిక్ మందులు అంటారు. వీటిల్లో క్లోరోప్రోమైడ్ వంటి మందులు తీసుకోవడం వల్ల శిశువు పుట్టిన నెలలోపే వాళ్లకు హైపోగ్లైసీమియా ఏర్పడవచ్చు. అంటే వాళ్ల రక్తంలో గ్లూకోజ్ శాతం తీవ్రంగా పడిపోయి ప్రమాదకరం కావచ్చు. అందుకే షుగర్ వ్యాధి ఉన్నవారు గర్భధారణకు ముందుగా తమ డాక్టర్‌ను సంప్రదించాలి. అప్పుడు డాక్టర్లు నోటి ద్వారా తీసుకునే మందులకు బదులు బిడ్డకు అపాయకరం కాని ఇన్సులిన్‌ను ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు.
డయాగ్నస్టిక్ రేడియోలజీ: గర్భం దాల్చిన తొలి రోజుల్లో ఎలాంటి ఎక్స్-రే పరీక్షలూ చేయించుకోకపోవడం మంచిది. ఎందుకంటే అప్పుడు ఎక్స్-రే తీయించుకోవడం వల్ల, పుట్టినబిడ్డ లుకేమియా వంటి క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువ. ఒకవేళ ఎక్స్-రే తీయించక తప్పని పరిస్థితి ఉంటే ఈ విషయంలో తప్పనిసరిగా డాక్టర్ సలహా పాటించాలి.
కొంతమంది గర్భధారణ తర్వాత ఎలాంటి మందులూ వాడకూడదని అనుకుంటారు. అది పూర్తిగా వాస్తవం కాదు. కొన్ని మందులు గర్భధారణ సమయంలోనూ తీసుకోదగినంత సురక్షితంగా ఉంటాయి. అందుకే గర్భం దాల్చిన తర్వాత లేదా గర్భం కోసం ఎదురుచూస్తున్న సమయంలో డాక్టర్ సలహా మేరకే మందులు వాడాలి.
యాంటీబయాటిక్స్ వల్ల :
మనకు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వెంటనే యాంటీబయాటిక్స్ వాడతాం. నిజానికి మనకు జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించగానే డాక్టర్‌ను సంప్రదించకుండానే యాంటీబయాటిక్స్ (ఆన్‌కౌంటర్ మెడిసిన్) వాడే అలవాటు మన సమాజంలో చాలా ఎక్కువ. అది మామూలు వాళ్లకే ఎంతో కీడు చేస్తుంది. అలాంటిది గర్భవతులు డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడటం అంటే అది ఎన్నో ఉపద్రవాలు తేవచ్చేమోనని జాగ్రత్తగా ఉండండి. ఉదాహరణకు... కాబోయే అమ్మ టెట్రాసైక్లిన్స్ వాడితే బిడ్డ దంతాలకు రావాల్సిన సహజమైన రంగు పోవచ్చు, తమ సహజమైన మెరుపును కోల్పోవచ్చు. కొన్ని యాంటీబయాటిక్స్ బిడ్డ ఎముకల ఎదుగుదలకు అడ్డుపడవచ్చు. అప్పుడు బిడ్డ అవయవ నిర్మాణంలోనే లోపాలు రావచ్చు. ఇక సల్ఫోనమైడ్స్ అనే యాంటీబయాటిక్స్ కారణంగా బిడ్డ పుట్టిన నెలలోపే వారికి కామెర్లు రావచ్చు. తల్లి స్ట్రెప్టోమైసిన్ వాడటం వల్ల బిడ్డకు చెవుడు వచ్చే అవకాశాలున్నాయి. కొన్ని సురక్షితమైన యాంటీబయాటిక్స్ ప్రెగ్నెన్సీలో సైతం తీసుకోదగినవి అందుబాటులో ఉన్నాయి. వాటిని డాక్టర్ సలహా మేరకే వాడాలి.
డాక్టర్ వి. శాంతి రెడ్డి,
సీనియర్ గైనకాలజిస్ట్, లాపరోస్కోపిక్ సర్జన్,
అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్