వీధి, గ్రామం, వూరిలోని మహిళలందర్నీ సంఘటిత పరిచే వేడుక. తొమ్మిది రోజుల పాటు సందడిగా సాగే బతుకమ్మ ప్రకృతిని ప్రేమించాలనీ, పూజించాలనీ చెబుతుంది. అప్పుడే ఆనందం, ఆరోగ్యం అని తెలియజేస్తుంది. మహిళలు వంటింటికే పరిమితం కాకూడదు... అక్కాచెల్లెళ్లూ, ఆడబిడ్డలూ, అత్తలూ, వదినలూ, స్నేహితురాళ్లూ, ఇరుగుపొరుగూ, ఆత్మీయులతో కలిసి ఆటలాడి, ఆనందం పొందాలి. భవిష్యత్తు ఆలోచనలను పంచుకుని ముందుకు సాగాలి. ప్రతి ఏటా ఈ మాటల్ని గుర్తు చేసే సంబరంగా బతుకమ్మ పేరు పొందింది. పెళ్లయి అత్తారింటికి వెళ్లిన ఆడబిడ్డల్ని పుట్టింటికి పిలిచి, వడిబియ్యం పోసి, కొత్త బట్టలు పెట్టి ఆదరించడమనే సంప్రదాయం ఈ పండగప్పుడు తెలంగాణలో కనిపిస్తుంది. ఈ ఆధునిక కాలంలో ఎవర్నయినా కదిలిస్తే 'నేనూ... నా వాళ్లూ' అనే చెబుతుంటారు. కానీ బతుకమ్మ తల్లి... వూరి బాగు కోసం, ప్రజలందరి సంతోషం కోసం కలిసి కట్టుగా ముడుపు కట్టాలని చెబుతుంది. అందుకే చెరువునీ, ప్రకృతినీ, గ్రామాన్నీ, ప్రతి ఇంట్లో అందరినీ చల్లగా చూడమని గౌరమ్మను మనం పూలతో పూజిస్తాం.
ప్రతి పువ్వూ విలువైనదే...మనకు చాలా పండగలున్నాయి. ప్రతి పండగప్పుడూ దేవుళ్లని మల్లెలూ, గులాబీలూ, చామంతులూ, కనకాంబరాలతో పూజిస్తాం. కానీ సిబ్బి (వెదురు అల్లిక)లో, ఇత్తడి తాంబూలంలో బతుకమ్మని పేర్చడంలో ఖరీదయిన పూలని వాడం. పసుపు ఆరబోసినట్లు పెరిగే తంగేడూ, బంతిపూలూ... చేను చెలకలో ఉండే గునుగు పూలూ, పట్టుకుచ్చులూ... ముళ్ల కంచెలపై కనిపించే కట్లపూలూ... పెరట్లో పెరిగే మందారాలూ, గన్నేరు వంటివి వాడతాం. ప్రకృతిలో ప్రతి ఒక్కటీ విలువైందని చెప్పడమే ఈ పండగ ప్రత్యేకత. చిత్రం ఏంటంటే, ఇవన్నీ ఎరువులు వాడకుండా పెరిగే సహజమైన పూలు. స్వచ్ఛమైన ఈ పూలతో బతుకమ్మను పేర్చి, తమలపాకుల్లో పసుపు గౌరమ్మను ఉంచి, పూజించడం ఆరోగ్యానికెంతో మంచిది.
తంగేడు పూలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. బతుకమ్మ నిమజ్జనంతో చెరువులు బాగుపడతాయి. తంగేడూ, గునుగూ, పసుపు ముద్ద, తమలపాకులు చెరువుల్లో పేరుకున్న నాచునీ, కాలుష్యాలనీ తగ్గించి నీటిని శుద్ధి చేస్తాయి.సంప్రదాయాల్లో సమభావం...పెళ్లి కానివారు మంచి భర్తను కోరుకుంటూ, పెళ్లయిన వారు భర్తా, కుటుంబ క్షేమాన్ని కోరుకుంటూ ఈ పండగ జరుపుకొంటారు. కొత్త కోడళ్లకు ఇది మరీ ముఖ్యమైన పండగ. ప్రత్యేకంగా జరుపుకుంటారు. కాలం మారింది. ఆధునికత ఎక్కువైంది. అయినా ఏటికేడాది బతుకమ్మ ఆడే మహిళల సంఖ్య పెరుగుతూనే ఉంది. కారణం ఏమంటే... బతుకమ్మ ఆచార సంప్రదాయాల్లో ఆటలున్నాయి. పాటలున్నాయి. సృజనాత్మక పోటీలున్నాయి. జీవితానికి ఉపయోగపడే పాఠాలున్నాయి. రంగురంగుల బతుకమ్మను ఒక్కరే పేర్చరు. ఇంట్లో వాళ్లూ, ఇరుగుపొరుగూ కలిసి అందంగా తీర్చిదిద్దుతారు. ఒకే దాన్ని కాకుండా, తల్లి బతుకమ్మకు తోడుగా పిల్ల బతుకమ్మనూ సిద్ధం చేస్తారు. తల్లి పక్కన పిల్ల ఉండాలనే మాతృమూర్తి మనసు తెలపడమే అది.
చెరువూ, కాలువల వద్దకెళ్లి ... బతుకమ్మలను మధ్యలో ఉంచి 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో' అని ఆడి పాడటంలో సంపన్నులూ, సామాన్యులూ అన్న తేడా ఉండదు. ఇంటి నుంచి తీసుకెళ్లిన రుచికరమైన పదార్థాలను అందరూ కలిసి కూర్చుని తినడం, పసుపు వాయనాలు ఇచ్చుకోవడం సమభావాన్ని పెంచేవే. గత కొన్నేళ్ల పండగ తీరుని గమనిస్తే, పెద్ద సంఖ్యలో అమ్మాయిలు బతుకమ్మ ఆడటానికి వస్తున్నారు. పాటలు నేర్చుకుని ఉత్సాహంగా పాడుతున్నారు. సీతమ్మని అత్తారింటికి పంపే పాట కావచ్చు, అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని తెలిపే పాట కావచ్చు... వాటిల్లో తమను తాము తరచి చూసుకుని, సహానుభూతి పొందగలగడమే అందుకు కారణం. మేమూ, ఆధునిక జీవన శైలిని అనుసరిస్తున్నా విలువైన మన సంస్కృతీ సంప్రదాయాల మూలాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆడపిల్లలకు చెబుతున్నాం.
బతుకమ్మ కథలు...బతుకమ్మ జరుపుకోవడం అంటే లక్ష్మీ పార్వతులను పూజించడంగా భక్తులు భావిస్తారు. భయాలు పోతాయనీ, భాగ్యాలు కలుగుతాయనీ నమ్ముతారు. ఇంత బలమైన విశ్వాసం ఏర్పడటానికి ప్రచారంలో ఉన్న బతుకమ్మ గాథలే కారణమని చెప్పొచ్చు. మహిషాసురుడితో యుద్ధం చేసి దుర్గమ్మ అలసి సొమ్మసిల్లింది. అప్పుడు జగన్మాత సేదతీరేందుకు స్త్రీలు సేవలు చేశారు. మానసికోల్లాసం కలిగేలా పాటలు పాడారు. అమ్మకు అలసట తీరింది. మహిషాసురుణ్ని వధించి, ప్రజలకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ప్రజలకు బతుకునిచ్చిన అమ్మ కాబట్టి ఆ రోజు నుంచి దుర్గమ్మ, బతుకమ్మ అయింది.
చోళ రాజు ధర్మాంగదుడుకి వందమంది కొడుకులు. అంతా యుద్ధంలో మరణించారు. మనోవేదనకు గురైన ఆ రాజు, పిల్లల కోసం తపస్సు చేయగా లక్ష్మీదేవి కూతురిగా పుట్టింది. ఈ జన్మ వృత్తాంతం తెలిసిన రుషులు ఆ పాపకు 'బతుకమ్మ' అని పేరు పెట్టారు. చక్రాంకుడనే పేరుతో జన్మించిన విష్ణువే ఆమెను పెళ్లాడాడు. వీళ్లిద్దరూ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటూ పాలించారు. అందుకే బతుకమ్మను దేవతగా కొలుస్తూ ఏటా పండగ జరుపుకునే సంప్రదాయం నెలకొంది.
చిన్న పదాలు... సరళమైన భాష... లోతయిన భావం... 'ఉయ్యాలో', 'కోల్', 'గౌరమ్మా' అనే ఆవృతాలతో వచ్చే బతుకమ్మ పాటల్లో... ఉయ్యాల పాటలున్నాయి. అనుబంధాల ప్రాధాన్యాన్ని చెప్పే, అత్తారింట్లో ఎలా మెలగాలో వివరించే గీతాలున్నాయి. చిన్ని కృష్ణుని చిలిపి పనులూ, గౌరీదేవి స్తుతులూ, రాముని కథలూ... మనసుకు ఉల్లాసాన్నిస్తాయి. వివిధ వృత్తుల ప్రత్యేకతలూ, వరకట్నం వంటి సమస్యలను ఎదుర్కొనే తీరుతెన్నుల్ని వలయాకారంలో తిరుగుతూ, చప్పట్లతో పాడితే ఉత్సాహం ఉరకలెత్తుతుంది.