ఆ గ్రామంలో ఆడపిల్లలు సురక్షితంగా ఉండటానికి ప్రత్యేకించి పదునైన చట్టాలేమీ లేవు. అక్కడి మామిడి చెట్లే మహిళలను కాపాడుతున్నాయి. కట్టుబాట్లు, నియంతృత్వ భావాలకు నిలయమైన బీహార్‌లో దీన్ని మూఢ నమ్మకంగా కొట్టిపారెయ్యలేం. మామిడిచెట్టుకి-మగువకు మధ్య ఉన్న అవినాభావ సంబంధంపై వచ్చిన ‘మ్యాంగో మహిళలు’ డాక్యుమెంటరీ చిత్రం చూస్తే మాత్రం ‘ఔరా..!’- అంటూ ముక్కున వేలేసుకుంటాం. ప్రముఖ బాలీవుడ్ నటి కత్రీనా కైఫ్ ఈ గ్రామాన్ని సందర్శించి ‘మ్యాంగో మహిళల’తో ముచ్చటించి వెళ్లింది. బీహర్‌లోని భాగల్పూర్ జిల్లాలో కునాల్ శర్మ అనే పట్టు వ్యాపారికి ఆ మధ్య ఓ ఈ-మెయిల్ వచ్చింది. ఓ పత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని మెయల్‌లో ఆయన ఆసక్తిగా చదివాడు
‘ధర్హార’ గ్రామంలో ఆడపిల్ల పుడితే పది మామిడి మొక్కలు నాటుతారు. ఆ చెట్ల ఫలసాయాన్ని ఆడపిల్ల చదువుకు, కట్నకానుకలకు వినియోగిస్తుంటారని ఆయన తెలుసుకున్నాడు. ఆ గ్రామం ఎక్కడ ఉందోనని ఇంటర్నెట్‌లో అన్వేషించి, చివరకు అది తన రాష్టమ్రైన బీహార్‌లోనే ఉన్నట్లు తెలుసుకున్నాడు. మహిళలపై వేధింపులలో 65 శాతం, అపహరణ కేసుల్లో 71 శాతం నేరాలతో దేశంలోనే నేరమయ రాష్ట్రంగా పేరొందిన బీహార్‌లో ఇలాంటి ఊరు ఉందని తెలిసి ఆయన విస్మయం చెందాడు. ప్రాంతీయ అభిమానంతో ఆయన సినిమా డైరెక్టర్ అవతారమెత్తి అమెరికాకు చెందిన తన మిత్రుడు రాబర్ట్‌తో ‘మ్యాంగో మహిళలు’ పేరిట డాక్యుమెంటరీ తీశాడు. ఈ డాక్యుమెంటరీ అందరినీ ఆలోచింపజేసేలా సాగటంతో ధర్హార మహిళల గురించి బాహ్య ప్రపంచానికి తెలిసింది.
ప్రస్తుతం ఆ గ్రామంలో దాదాపు మిలియన్ మామిడి చెట్లను 200 ఎకరాల్లో పెంచుతున్నారు. ఆడపిల్ల పుడితే చాలు పది మామిడి మొక్కలు నాటాల్సిందే. ఆడశిశువులతో పాటు వాటిని కూడా ప్రేమగా, శ్రద్ధగా పెంచుతారు. వాటిపై వచ్చే ఫలసాయాన్ని బ్యాంక్‌లో జమచేస్తారు. ఒక్కో ఆడపిల్లకు పెళ్లీడు వచ్చేసరికి 2 లక్షల రూపాయలకు పైగానే జమవుతోంది. ఈ డబ్బును ఆ అమ్మాయి చదువుకు, పెళ్లికి ఖర్చుచేస్తారు. పెళ్లి చేసేముందు వధువుకు తొలుత మామిడిచెట్టుతో వివాహం జరిపిస్తారు. ఇలా చేస్తే వరుడికి ఎలాంటి ఆపదా సంభవించదని గ్రామస్థుల నమ్మకం. నమ్మకాల సంగతెలా ఉన్నా, దాని వెనుక దాగిన మహత్తర సందేశం ఆచరణయోగ్యమైనదే. అందుకే ఈ గ్రామంలో ఆడపిల్ల పుడితే తల్లిదండ్రులు కుంపటిగా భావించరు. భారంగా భావించి చంపేయరు. ఆ ఊరి ఆడపిల్లలంతా చదువుకుంటూ మామిడిచెట్ల మధ్యనే ఆడుకుంటూ ఆనందంగా కాలం వెళ్లదీస్తున్నారు.
దీనిపై మాజీ పోలీసు అధికారిణి కిరణ్‌బేడీ మాట్లాడుతూ, ‘భ్రూణ హత్యలను ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నాయి. ఆడపిల్ల పుట్టిన వెంటనే డబ్బు జమచేస్తామని ఆచరణ సాధ్యం కాని పథకాలు ప్రవేశపెట్టకుండా ఇలా చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తే బాగుంటుంది’- అని అభిప్రాయపడ్డారు. ఓ వైపు పర్యావరణాన్ని ప్రోత్సహిస్తూ, మరో వైపు ఆడపిల్లలకు అండగా నిలుస్తున్న మామిడిచెట్ల పెంపకం ఆలోచన సామాజిక మార్పుకు దోహదం చేస్తుందని ఈ డాక్యుమెంటరీ నిర్మాత రాబర్ట్ అంటున్నారు. లింగనిష్పత్తిలో చూస్తే నేడు ధర్హారలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 918 మంది మహిళలున్నారు. సంక్షేమ పథకాల ముసుగులో ఆర్భాటంగా ప్రచారం చేసుకునే ప్రభుత్వాలు ధర్హార గ్రామస్థులు చూపిన మార్గంలో పయనిస్తే పచ్చటి ప్రకృతి నీడలో మహిళలు ఒదిగిపోతారు.
మూలం : ఆంధ్రభూమి దినపత్రిక