కొద్ది రోజులకు పెళ్లిసందడి తగ్గి, లో హడావుడి మొదలవుతుంది. సంసారంలో అనుకున్నవన్నీ జరగకపోవచ్చు. కోరుకున్నవి జరగనప్పుడు- సంసారం ప్రేమ సుధాసారం కాస్త సారం లేని సంసారం అనుకోవడం మొదలవుతుంది. దంపతులు ఆ సమయంలో సంయమనం కోల్పోకుండా ప్రవర్తిస్తే సంసార రథానికి బ్రేకులు పడకుండా సాగిపోతుంది. కోరికలు తీరాలంటే కావలసినది ఆర్థిక వెసులుబాటు ఉండాలి. ఒక్కోసారి డబ్బు ఉన్నా ఖర్చు చేయాలంటే కుదరని ఏకాభిప్రాయం. ఒకరు అవసరమనుకున్నది మరొకరికి అనవసరమనిపిస్తుంది. అపార్థాలకు తెర లేచేది ఇక్కడే. అలాంటప్పుడు సంయమనంతో నిర్ణయాలు తీసుకుంటే ఇల్లే స్వర్గమవుతుంది.
డబ్బు: ప్రతి విషయం డబ్బుతో మొదలై డబ్బుతోనే ముగిస్తే ఆ డబ్బే దంపతుల నడుమ అడ్డుగోడై నిలబడుతుంది. అప్పుడిక కలలుగన్న పంచరంగుల స్వప్నాలన్నీ కరిగిపోయినట్లు అనిపిస్తుంది. దానికి కారణం- నువ్వంటే నువ్వని వాదనలు లేదా ఇరువురు ఒకరి తల్లిదండ్రులను మరొకరు విమర్శించుకోవడం. ఒకరి ఆచార వ్యవహారాలు మరొకరికి నచ్చకపోవడం. కట్నం చాలలేదని అబ్బాయి, అత్తింటివారు ఆస్తిపరులు కాదని, భర్తది అనుకున్నంత పెద్ద ఉద్యోగం కాదని అమ్మాయి దెప్పిపొడుస్తుంటే వారి మనసులు దూరమవుతాయి. పొరబడటం సహజమే. అపోహపడి వేసే అపవాదులే దాంపత్య బంధాన్ని పుటుక్కున తెంపేస్తాయ. అడిగినంత కట్నం ఇవ్వలేదనో, కోరికలు తీర్చలేదనో అబ్బాయి కినుక వహిస్తూ, అబ్బాయికి ఆస్తి లేదనో, సంపాదన తక్కువనో అమ్మాయి బాధపడటం లాంటివి పెళ్లయ్యాక లోపాలుగా కనబడటం ఆశ్చర్యమనిపిస్తుంది. అమ్మాయి చదువుకుని ఉద్యోగం చేస్తున్నా, ఆస్తి వెంట తెచ్చినా అది తమ చేతిలో పడనంతవరకూ అబ్బాయ కుటుంబంలో అసంతృప్తే.
నమ్మకం: దాంపత్యం బలిష్టమైనది కావాలంటే నమ్మకమే గట్టి పునాది. ఈ పునాదిని అనుమానం పట్టి వూపిందా .. కాపురం కుప్పకూలటానికి గొయ్యి పడ్డట్టే! భర్త డబ్బు విషయంలో లెక్క ప్రకారం చెప్పడం లేదనో, ఎవరికైనా ఇస్తున్నాడేమోనని భార్య, తనకు తెలియకుండా భార్య ఏవేవో కొంటుందనో లేదా పుట్టింటివారికి అంతో ఇంతో చేరవేస్తుందని భర్తకు భ్రమ. ఈ అర్థంలేని అపనమ్మకాలు, అనుమానాలు దాంపత్యానికి అగాథమవుతాయి.
ఇతరుల జోక్యం : ఇదొక విచిత్రమైన విషయం. భార్యాభర్తలిరువురూ తమ సమమ్యను తాము చర్చించుకుని పరిష్కరించుకోక వారి కుటుంబాల లేదా బంధువుల జోక్యాన్ని ఆశిస్తే వారు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ, వారి సర్దుబాటు ఇరువురిలో ఏ ఒకరికి సమ్మతం కానపుడు సమస్య చినికి చినికి గాలివానై అందులో.. సంసార బoధం కొట్టుకుపోతుంది.
అభిప్రాయ భేదాలు: ఇవి అనుబంధాన్ని కుదిపే వడగళ్లలాంటివి. పెళ్లి అనే ముడి పడినంత మాత్రాన ఇద్దరిది ఏకాభిప్రాయమే అని నిర్ణయించలేం. ఆలోచనా విధానంలో తేడాలుంటాయి. అభిప్రాయాలలో వైవిధ్యం తప్పదు. నాదే ఒప్పు, నీది తప్పు- అని భీష్మించుకుంటే మాత్రం అది అనుబంధం కాదు, అంపశయ్యవుతుంది.
అనురాగ లోపం: భర్తకు భార్యపై, భార్యకు భర్తపై అనురాగం పల్లవించాలి. ప్రేమాభిమానాలను అంగడిలో కొనలేం. మనసులోని అభిమానాన్ని మాటలతో ప్రకటించి ఒకరి ఇష్టాలను మరొకరు తెలసుకుని మనగలగాలి. చిన్న చిన్న బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం మంచిదే. అంతకుమించి ప్రేమపూర్వక సంభాషణలు ఉన్నచోట అనురాగం మొలకలేసి దాంపత్యం విరితోటవుతుంది.
అవగాహన: ఒకరిమాట ఇంకొకరు వినేందుకు శ్రద్ధ చూపకపోతే మనసులు అర్థం కావు. అర్థం కాకపోవడానికి కారణం ఏదీ వినపడనట్లు ప్రవర్తించడం. వినిపించుకోకపోవడం నిర్లక్ష్యధోరణిని ప్రస్ఫుటిస్తుంది. ఎప్పుడూ ఉండేవే అని తాత్సారం చేస్తే మాట్లాడేవారి అభిమానం, దెబ్బతినే అవకాశం ఉంటుంది. నిజంగా వినవలసిన, ప్రాముఖ్యత ఉన్న విషయాన్ని వినకపోతే చాలా కోల్పోవలసి వస్తుంది.
సర్దుబాటు : నువ్వెంత అంటే.. నువ్వెంత అనుకుంటుంటే అది కాపురం కాదు, కష్టాల కడలవుతుంది. ఆ కడలిలోని అలల తాకిడిని ఢీకొనలేక కాపురం కుదేలవుతుంది. ఒకరితో ఒకరికి సయోధ్య లేకపోతే సంసార రథం గాడి తప్పుతుంది.
సంతాన లేమి: పిల్లలు కలగడం, కలకగపోవడం అనేక కారణాలపై ఆధారపడి ఉంటుంది. నెపం ఇల్లాలిపై వేయడం ఎంత అమానుషమో కేవలం పురుషుడినే వేలెత్తి చూపడమూ అవాంఛనీయమే. పిల్లలు పుట్టకపోయినా లేదా ఆడపిల్లలే పుట్టినా తరచి చూడాల్సిన శాస్ర్తియ విషయాలను పక్కకకు పెట్టి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోతే దాంపత్యంలో ప్రతి సంఘటన విడాకులకు బాట వేస్తుంది.
అహం: నువ్వా.. నేనా.. అని తారతమ్యాలు లెక్కిస్తే అది దాంపత్య భాగస్వామ్యం కాదు. వ్యాపార భాగస్వామ్యం అవుతుంది. కలిసిచేసే వ్యాపారంలో సైతం సర్దుకుపోయే తత్వముంటేనే ఆ వ్యాపార బంధం నిలబడేది. సంసార నౌక మునిగిపోరాదని అనుకుంటే ఎక్కువ, తక్కువలకు కాదు.. మనం అనే మాటకు విలువనివ్వాలి. నీ దారి నీదే, నా దారి నాదే -అనుకుంటే కుటుంబం తెగిన గాలిపటమవుతుంది.
అసంతృప్తి: పెళ్లయిన చాలా రోజుల తర్వాత అందచందాలపై విమర్శలు ప్రారంభిస్తే మనసు మలినమవుతుంది. కళ్లు తెరచుకుని చూస్తూ చేసుకున్న పెళ్లిలో కనబడని లోపాలు ఆ తరువాతి కాలంలో కనబడ్డాయంటే అది హాస్యాస్పదమే. ఇవన్నీ పెళ్లి విఫలమయేందుకు దోహదపడే విషగుళికల్లాంటివి. ఆలుమగల అనుబంధం కలకాలం నిలవాలంటే ఓర్పు, నేర్పు కలగలసిన సర్దుబాటుతనం, తరగని ప్రేమాభిమానం సమతూకమై నిలవాలి. అప్పుడిక సంసార రథం సాఫీగా సాగి, దాంపత్యం అనుబంధాలకు లోగిలవుతుంది.