* ఆడశిశువు జన్మించిన ఇంట్లో వేడుకలు జరిపేందుకు గ్రామీణ మహిళలంతా ఐక్యతతో ముందుకు వస్తున్నారు.
* ఆడశిశువును ఆదరించిన దంపతులను గ్రామ పంచాయతీ పెద్దలు సన్మానిస్తూ ప్రశంసాపత్రాలు అందజేస్తున్నారు.
* చాంబర్ ఆఫ్ కామర్స్, గురుద్వారా కమిటీలు, ఇతర సంస్థలు ఆడశిశువులకు ఉచిత విద్య అందించేలా ఆర్థిక సాయం చేస్తున్నాయి.
‘ఆడశిశువును కనాలా? వద్దా? అన్నది తల్లిదండ్రుల హక్కు.. లింగ నిర్థారణ పరీక్షలు చేయించుకునే స్వేచ్ఛ వారికి ఉంది.. ఆడశిశువును వద్దనుకుంటే- గర్భస్రావానికి అనుమతించేలా గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు చేయాలి.. మగశిశువు పుట్టకుంటే ఆ కుటుంబానికి భవిష్యత్తే లేదు...
- ఈ తరహా వాదనలను విస్తృతంగా ప్రచారం చేస్తూ రాజస్థాన్‌లోని మోహన్‌పుర గ్రామంలో ‘అంగన్‌వాడీ’ నాయకురాలు చిందేరీపాల్ కౌర్ విధులు నిర్వహించేది. ఇదంతా 2011 నాటి మాట. ఆ తర్వాత ఎనిమిది నెలలకు ఆమె ప్రవర్తనలో అనూహ్య మార్పును గమనించి గ్రామస్థులు సైతం ఆశ్చర్యపోయారు. చట్ట వ్యతిరేక గర్భస్రావాలను, లింగ నిర్థారణ పరీక్షలను తాను ఎంతమాత్రం ప్రోత్సహించేది లేదని గ్రామస్థుల సమక్షంలో కౌర్ ప్రతిజ్ఞ చేసింది. ఆడశిశువు పట్ల కౌర్‌తో పాటు గ్రామస్థుల్లో ఇంత మార్పుకు కారణమేమిటన్నది అధికారులకు కూడా ఒకింత అర్థం కాలేదు. ‘ప్లాన్ ఇండియా’, ‘ఉర్ముల్ సేతు’ అనే స్వచ్ఛంద సంస్థలు ‘ఆడశిశువులను జన్మించనివ్వండం’టూ ఓ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడంతో రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాలో ఆశాజనకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆడశిశువులు వద్దంటూ ఒకప్పుడు ప్రచారం చేసిన కౌర్ లాంటి మహిళలు నేడు తమ వైఖరిని పూర్తిగా మార్చుకున్నారు.
‘ప్లాన్ ఇండియా’, ‘ఉర్ముల్ సేతు’ సంస్థలు గంగానగర్ జిల్లాలోని అన్ని పంచాయతీల్లో సమన్వయకర్తలను నియమించాయి. వీరు అంగన్‌వాడీ, ‘ఆశ’ కార్యకర్తలతో కలిసి పనిచేయడం ప్రారంభించారు. లింగ నిర్థారణ పరీక్షలు, చట్ట వ్యతిరేక గర్భస్రావాలు జరగకుండా వీరు గ్రామాల్లో నిఘా పెట్టారు. దీంతో మగశిశువు కోసం ఎదురుచూస్తూ పదే పదే గర్భధారణకు సిద్ధమయ్యే మహిళల సంఖ్య క్రమంగా తగ్గింది. నలుగురు, అయిదుగురు ఆడపిల్లలను కన్న తల్లులు ఇక తమకు మగశిశువు అక్కర్లేదని కుటుంబ నియంత్రణ పద్ధతులను స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. ఆడపిల్ల పుడుతుందని తెలుసుకుని గర్భస్రావాలు చేయించుకునే వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఆడశిశువు జన్మించినా చాలా మంది దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆడశిశువు పుట్టినపుడు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు.
గర్భస్రావాలను ప్రోత్సహించేవారికి చట్టపరంగా శిక్షలు పడతాయని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గ్రామాల్లో చేస్తున్న ప్రచారం ఫలించింది. తాము చేసిన ప్రచారం ఫలితంగా కౌర్ లాంటి అంగన్‌వాడీ కార్యకర్తల్లో మార్పు వచ్చిందని స్వచ్ఛంద సంస్థ తరఫున సమన్వయకర్తలుగా పనిచేస్తున్న దంపతులు నిషా, విక్రమ్ సింగ్ చెబుతున్నారు. కౌర్ కుమార్తె రూబీ ఇటీవలే కవలలైన ఆడశిశువులకు జన్మనిచ్చిందని, ఆమెకు ఇదివరకే ఒక కుమార్తె ఉందని వారు తెలిపారు. ముగ్గురు ఆడపిల్లలను పెంచడం రూబీకి ఆర్థిక భారం కావడంతో- కవల పిల్లల్లో ఒకరిని దత్తత ఇచ్చేందుకు కౌర్ అంగీకరించినట్లు వారు వివరించారు. ఒకప్పుడు ఆడశిశువు అంటేనే వ్యతిరేకత చూపిన కౌర్‌లో ఈ మార్పు రావడం అందరినీ విస్మయపరచింది. వివాహం జరిగి పదహారేళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో నిషా,విక్రమ్ సింగ్ దంపతులు రూబీ కుమార్తెను దత్తత తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు.
ఇదే స్ఫూర్తితో గ్రామానికి చెందిన అయిదుగురు దంపతులు పేద కుటుంబాలకు చెందిన ఆడశిశువులను దత్తత తీసుకున్నారు. గర్భస్రావాలకు పాల్పడమని, ఆడశిశువు పుట్టినా ఆదరిస్తామని చాలా గ్రామాల్లో మహిళలు బహిరంగంగా ప్రతిజ్ఞలు చేస్తున్నారు.
ఆడశిశువుల సంరక్షణకు యువత కూడా కృషి చేస్తున్న సంఘటనలు నేడు రాజస్థాన్‌లో కనిపిస్తున్నాయి. రోటవాలికి చెందిన గురుతేజ్ సింగ్ (17) తన తాతగారి ఊరైన తలివాలా (పంజాబ్)కు వెళ్లినపుడు ఓ ఆడశిశువును దత్తత తీసుకున్నాడు. ఒకే కాన్పులో ఇద్దరు ఆడశిశువులకు జన్మనిచ్చిన ఓ మాతృమూర్తి ప్రసవం తర్వాత కన్నుమూసింది. ఆ ఇద్దరు ఆడపిల్లలను అనాథాశ్రమానికి అప్పగించి ఆమె భర్త రెండోపెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న గురుతేజ్ సింగ్ ఓ ఆడశిశువును తన వెంట తీసుకువెళ్లాడు. ఆ శిశువును ప్రేమతో పెంచుకునేందుకు గురుతేజ్ సింగ్ తల్లిదండ్రులు నిండుమనసుతో ముందుకు వచ్చారు. తల్లి లేని మరో ఆడశిశువును గ్రామంలోని ఓ దంపతులు చేరదీశారు.
గురుతేజ్ సింగ్‌ను స్ఫూర్తిగా తీసుకుని రోటవాలితో పాటు అనేక గ్రామాల్లో ఎంతోమంది దంపతులు ఆడశిశువులను దత్తత తీసుకున్నారు. ఆర్థిక స్థోమత లేని కుటుంబాల్లో ఆడపిల్లలు అధికంగా ఉంటే దత్తత ఇప్పించేలా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఒప్పిస్తున్నారు. పట్టణ ప్రాంతాల నుంచి కూడా అనేక మంది దంపతులు ఆడశిశువులను దత్తత తీసుకుంటామని గ్రామాలకు వస్తున్నారు.
మగశిశువు పుడితే ఒకప్పుడు గ్రామాల్లో ఇత్తడి పళ్లాలపై శబ్దాలు చేస్తూ సంబంధిత కుటుంబాల వారు కోలాహలం సృష్టించేవారు. అయితే, ఇ లాంటి ఆనందకర దృశ్యాలు ఆడపిల్లలు పుట్టిన ఆస్పత్రుల్లో నేడు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులు, బంధుమిత్రులే కాదు ఆస్పత్రి సిబ్బంది, నర్సులు కూడా ఆడశిశువులు పుట్టినపుడు వేడుకల్లో ఉత్సాహవంతంగా పాల్గొంటున్నారు.
మూలం : ఆంధ్రభూమి దినపత్రిక