స్టాక్ మార్కెట్‌లో నిత్యం వాడే పదాలు, వాటి అర్థాలు, అవి ఎందుకు ఉపయోగపడతాయని విశే్లషణ చేయటానికి కొంత సమయం కేటాయించాలి. డబ్బును సరైన వడ్డీరాని బ్యాంకులలో మురగబెట్టే బదులు స్టాక్ మార్కెట్‌లో పెట్టి లాభాలు పొందవచ్చు. తగినంత సమయాన్ని వెచ్చించలేమనుకుంటే, ఇదంతా మనవల్ల కాదనుకుంటే మంచి స్టాక్ బ్రోకరుని ముఖ్యంగా ప్రాచుర్యంలో ఉన్న ట్రేడింగ్ సంస్థను ఎంచుకుని, వారి ద్వారా లావాదేవీలు జరపాలి. ఆ సంస్థ మీ తరఫున అమ్మకాలు, కొనుగోళ్ల ప్రక్రియ చేపడుతోంది. దానికి కొంచెం రుసుం చెల్లిస్తే సరిపోతుంది. మహిళలు ఈ రంగంలోకి అడుగుపెట్టాలంటే ఆన్‌లైన్ ట్రేడింగ్ ఎంచుకుంటే మంచిది. ఇది వారికి ఎంతో సులభంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. వౌస్ క్లిక్‌లతో పని సాఫీగా జరిగిపోతుంది. ముందుగా ఒక డెమో అకౌంట్‌ను ఓపెన్ చేసి అందులో మనం బాగా ఆరితేరిన తరువాత, ట్రేడింగ్‌ని అర్థం చేసుకున్న తరువాత ఒరిజినల్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. నష్టాలను నివారించుకోవటంతో పాటు తక్కువ ట్రేడింగ్ రుసుంతో మన కళ్ల ముందే మార్కెట్ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఆరంభంలో ఒకే స్టాక్‌పై దృష్టిపెట్టి కొన్ని షేర్లు మాత్రమే కొనుగోలు చేయాలి. అపుడు మనకు ట్రేడింగ్ పద్ధతులు, ఉపాయాలు బాగా అర్థం అవుతాయి. మనకు మార్కెట్ తీరుతెన్నులు అర్థం అయ్యాక మెల్లమెల్లగా స్టాక్ పెంచుకోవచ్చు. మార్కెట్ టెక్నిక్ లను ఆకళింపు చేసుకోవాలి. మార్కెట్ ఎలాంటి స్పందనలకు గురవుతుందో ఊహించే నేర్పు సంపాదించాలి. ఇది కొద్ది రోజులలో వచ్చేది కాదు, మరీ అంత సులువు కాదు. క్రమశిక్షణతో రోజూ మార్కెట్‌ను పరిశీలిస్తూ, సందర్భాలను బేరీజు వేసుకుంటూ చాకచక్యంగా ముందుకు సాగాలి. ఒక్కసారి ఇలాంటి మెళకువలు మీ సొంతం అయితే క్రమక్రమంగా ఒకే సంస్థలో కాకుండా వివిధ సంస్థలలో విభిన్న రంగాలలో పెట్టుబడులను విస్తరించుకోవాలి. ఇది చాలా మెరుగైన, సురక్షితమైన పద్ధతి. మనకు లాభాలు ఆర్జించే స్టాక్‌ను లేదా సంస్థను ప్రేమించాలి. నష్టపోతామని ఏ మాత్రం సందేహం కలిగినా పెట్టుబడులు పెట్టకుండా వదలివేయటం అలవర్చుకోవాలి. మార్కెట్ ట్రెండ్ మాత్రమే మనకు ప్రధానం. భావావేశాలకు అసలు చోటులేదు. సెంటిమెంట్లకు తావులేదు. నిర్లక్ష్యం అసలు పనికిరాదు. ఎందులో పోగొట్టుకున్నామో అందులోనే సంపాదించాలనే సూత్రం ఇక్కడ పనిచేయదు. అవసరమైతే నిపుణుల సలహాకి వెనుకాడవద్దు. నిజం చెప్పాలంటే స్టాక్ ట్రేడింగ్ మహిళలకు మంచి లాభసాటి వ్యాపకంగా చెప్పుకోవచ్చు. ఇంట్లో ఒక సిస్టమ్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. భర్త, పిల్లలు బయటికి వెళ్లిపోగానే ట్రేడింగ్ చేసుకోవచ్చు. వారు వచ్చేలోపలే ముగించుకోవచ్చు. ఖాళీగా ఇంట్లో ఉన్నామన్న దిగులు దరిచేరదు. మంచి సంపాదన కూడా వస్తుంది. తొందరపాటుతనం లేకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మార్కెట్‌లో నిలదొక్కుకోవటం సులభం. అయితే దీర్ఘకాలిక ప్రణాళిక ఉంటేనే బాగుంటుంది. అన్నీ కాకున్నా కొన్ని స్టాక్స్ మాత్రం రెండు నుంచి ఐదు సంవత్సరాల కాలవ్యవధిలో పెట్టుబడి పెట్టుకుంటే మంచిదని నిపుణులు చెపుతుంటారు. ఇలాంటి తలనొప్పి వద్దనుకుంటే మ్యూచివల్ ఫండ్స్‌లో పెట్టుకుంటే సరిపోతుంది.
స్టాక్‌మార్కెట్‌లో మాహిళల సామర్థ్యాన్ని ఎన్నో సర్వేలు వేనోళ్లుగా ప్రశంసిస్తున్నా ఇండియన్ ఈక్విటీ ఇనె్వస్ట్మెంట్ సర్వే-2010 ప్రకారం అమెరికాలో 20శాతం మంది మహిళలు ముందుకు వస్తుంటే మనదేశంలో 7 శాతం మహిళలే రంగప్రవేశం చేస్తున్నారు. అదీకూడా ఉన్నత చదువులు చదువుకున్నవారే కావడం గమనార్హం. పెట్టుబడులు తక్కువ కాబట్టి గృహిణులు రావాలని ఆర్థిక విశ్లేషకులు అభిలషిస్తున్నారు.
యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా నిర్వహించిన అధ్యయనంలో మహిళల పోర్ట్ఫోలియో విలువ మగవారికన్నా సంవత్సరానికి 1.4 శాతం పెరుగుతున్నదని తేలింది. పైగా ఒంటరి ఆడవారు స్టాక్ మార్కెట్‌లోగొప్పగా రాణిస్తున్నారని ఆ సర్వే తేల్చిచెప్పింది. నిపుణుల నివేదిక ప్రకారం స్టాక్ మార్కెట్‌లో ఒంటరి మహిళల సంపాదన ఒంటరి మగవారి కన్నా 2.3 శాతం ఎక్కువని నిరూపించబడింది. ఆర్థికంగా ప్రగతిపథంలో వెళుతున్న జపాన్‌లో ‘‘మయుమితొరి’’ అనే గృహిణి ఆసియాలోని ఇనె్వస్టర్లలో అందరికీ ఆదర్శం అని ఆ సర్వే ఉదహరించింది. ఆమె ట్రేడింగ్ మొదలు పెట్టినపుడు భర్తకు తెలియకుండానే పెట్టుబడులు పెట్టేవారట. నేడు నూటా యాభై వేల అమెరికన్ డాలర్లను సొంతం చేసుకుంది. ఆమెఇనె్వస్ట్మెంట్ స్ట్రాటజీస్ అనే పుస్తకం కూడా రాశారు. మహిళా ఇనె్వస్టర్ల కోసం నలభై మంది సభ్యులతో ఒక క్లబ్బును కూడా ఏర్పాటు చేసి దానికి ‘‘ఎఫ్ ఎ బ్యూటీస్’’ అని నామకరణ చేశారు. ఇప్పటికీ చాలామంది ఆమె బాటలో నడుస్తూ భర్తకు చెప్పకుండా వారి పార్ట్‌టైమ్ సంపాదనను ట్రేడింగ్‌లో పెట్టేస్తున్నారట. మనం అంత రిస్కు తీసుకోకుండా ఇంట్లో చెప్పే చేసుకోవచ్చు. ఈ రోజుల్లో మహిళలను ముందుకెళ్లమని ప్రోత్సహించే భర్తలు ఎక్కువే కాబట్టి ట్రేడింగ్‌లో అవగాహన పెంచుకుని ముందుకు దూసుకేళ్లొచ్చు. అయితే, ఇందులోకి దిగిముందే మానసికంగా నష్టాలలొచ్చినా అందుకు సంసిద్ధంగా ఉండాలి. కొంతకాలం లాభాలు రాకున్నా నెట్టుకురాగలమనే నమ్మకం, ధైర్యం ఉండాలి. అలాంటి సౌలభ్యం లేకపోతే స్టాక్‌ట్రేడింగ్‌లోకి మహిళలు దిగకపోవడమే మంచిది.
మూలం : ఆంధ్రభూమి దినపత్రిక