సర్దుకుపోతే సరి
పెళ్ళికి ముందు గడిపిన జీవన శైలిని వదలి అత్తవారింటిలోని నూతన వాతావరణానికి అలవాటు కావడం కష్టమైన పనే. కొందరి ఇళ్ళలో ఉదయం నిద్ర లేవగానే కుటుంబ సభ్యులందరూ ఒకరికి ఒకరు గుడ్మార్నింగ్ చెప్పుకోవడంతో పాటు, పడుకునే ముందు గుడ్నైట్తో రోజును ముగిస్తారు.
కొందరి ఇళ్ళలో ఆడవాళ్ళు చీర కొంగును తలపై కప్పుకోవాలి. ప్రతిరోజూ ఇంటిలోని పెద్దలకు పాదనమస్కారం చేయాలి. భారతీయ సంప్రదాయానికి అద్దం పట్టే ఇటువంటి పద్దతులకు అలవాటు పడితే సర్దుకుపోవడం తేలికే.
సమస్యలతో సహవాసం
అత్తవారింట మీ సహజీవనం నల్లేరుపై నడకలా సాగుతుందని భావించవద్దు. ఇది చాలా సున్నితమైన వ్యవహారమని, తలెత్తే సంఘటనలు ఎక్కడ మొదలై ఎక్కడ అంతమవుతాయనే దానిని సైతం ఎవ్వరూ ఊహించలేని పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు. ఏదేమైనా తొలి ఆరు మాసాల కాలంలోనే సమస్యలన్నీ సర్దుకుపోతాయని మానసిక శాస్త్ర నిపుణులు చెపుతున్నారు. కొత్తగా పెళ్ళైన దంపతులు నీ తల్లిదండ్రులు-నా తల్లిదండ్రులు అనే భావనకు చోటివ్వకుండా ఉంటే ఎలాంటి సమస్యలు రావని వారు స్పష్టం చేస్తున్నారు.
చిన్నవిషయాలు...తస్మాత్ జాగ్రత్త
చిన్నవని అనిపించినప్పటికీ మీరు చేసే పనులు మీ అత్తవారింటిలోని వారిపై పెద్ద ప్రభావాన్ని చూపించవచ్చు. మీ నుంచి రుచికరమైన వంటకాలను ఆశించనప్పటికీ, గదిని వదలి వెళ్తున్నప్పుడు లైట్ స్విచ్ ఆఫ్ చేయకుండా వెళ్ళినట్లయితే మిమ్మల్ని తప్పుగా భావించే అవకాశం ఉంది.
ఒక స్నేహం చేసే మేలు
అత్తవారింట అడుగుపెట్టగానే ఒక్కసారిగా అందరితోటి కలిసిపోవాలని ప్రయత్నించకండి. ముందుగా అందుకు అవసరమైన దారిని నిర్మించుకునేందుకు ఇంట్లోని మీ అత్తగారు లేదా మామగారు లేకపోతే ఆడపడుచు ఇలా ఎవరో ఒకరితో స్నేహం పెంచుకోండి.వారి ద్వారా ఇంట్లోని మిగిలిన సభ్యుల ఇష్టాయిష్టాలు, అలవాట్లు మరియు అభిరుచులను తెలుసుకోండి. తదను గుణంగా మీరు మెలగడం మొదలు పెడితే ఇంటిల్లి పాదికి మీరు అత్యంత ప్రీతి పాత్రమైన వారు అవుతారు.