"మా అత్తయ్య లలిత కిందటి వారం చనిపోయారు. బతికుంటే ఆమె ఈ ఏడు తన 103వ పుట్టినరోజును చేసుకునేవారు. ఆవిడ చాలా గొప్పది, కాని ఆమె గురించి రాసేదెవరు? జీవితమల్లా గృహిణిగానే బతికిన ఆమె ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఎస్. చంద్రశేఖర్ ఇల్లాలు. చరిత్ర ఆయనను గుర్తించినట్టు ఆమెను గుర్తించదు కదా.
చంద్రశేఖర్ చనిపోయాక మా అత్తయ్య ఒక్కతే చికాగోలో బతికింది ఇన్నాళ్లూ. తనకు తొంభయ్యేళ్లు దాటాక కూడా 'భోజనానికి ఇంటికి రారా నాయనా, నీకోసం చక్కగా వంట చేసి పెడతాను..' అని ఆప్యాయంగా పిలిచిందావిడ. నేను కాదనలేకపోయాను. స్పెషల్స్ ఏమీ చేయలేకపోయినా, మామూలు వంటకాల్నే ఎంతో అందంగా పొందికగా వడ్డించిందావిడ. భోంచేస్తున్నప్పుడు తాను అమెరికా వచ్చిన తొలినాళ్ల గురించి, చుట్టుపక్కల ఎక్కువమంది భారతీయులు లేకపోవడం వల్ల తమకు ఎంత ఒంటరితనంగా అనిపించేదో అదంతా చెప్పింది. చంద్రశేఖర్ తన చుట్టూ ఉన్న దేన్నీ పట్టించుకోకుండా నిర్విరామంగా పనిచేస్తూ పోతే మా అత్తయ్యే ఆయనకు అన్నిటి గురించీ చెబుతూ ఉండేదట. విశ్వవిద్యాలయంలోని రాజకీయాల గురించి, నల్ల వాళ్ల పట్ల ఉన్న వివక్ష గురించి - అన్నీ ఆవిడే ఆయనకు చెప్పేది. వాళ్లిద్దరిలో ఆవిడే ఎక్కువ రాడికల్. మన దేశంలోని ప్రజాస్వామ్యం, స్వచ్ఛంద సంస్థలు, పౌరసమాజం - ఇలా అన్నిటి గురించీ ఆరోజు చర్చించుకున్నాం మేమిద్దరం.
ఆవిడ గురించి ఆలోచిస్తుంటే నాకు మా కుటుంబంలోని ఎందరో ఆడవాళ్లు గుర్తొచ్చారు. మగవాళ్లు తమ తెలివితేటలతో చరిత్రను సృష్టించారుగాని, దానికి సాయపడిన ఆడవారి గురించి మాట్లాడినవారు తక్కువమంది. గొప్ప భర్త - అనామకమైన భార్య : చాలాసార్లు పరిస్థితి ఇలానే ఉంటుంది. మహిళల విజయాలు, వారు చెప్పే విషయాలు ఎప్పుడూ వెలుగులోకి రావు.
మరో నోబోల్ గ్రహీత సీవీరామన్ గురించి మాట్లాడేవాళ్లలో ఎంతమందికి ఆయన భార్య గురించి తెలుసు? ఆమె పేరు లోకసుందరి. గొప్ప వాక్చాతుర్యమున్న స్త్రీ. కుటుంబంలో ఆమెను 'చిన్నమ్మ' అనేవారు. రామన్‌కు తన పట్ల తనకు ఎంత నమ్మకమంటే - ఆ ఏడు తన పరిశోధనలకు నోబెల్ వస్తుందని ఊహించి ముందుగానే ఆ ఊరికి రానూపోనూ టికెట్లు బుక్ చేయించుకున్నారు! రామన్ చివరిరోజుల్లో పువ్వుల మీద పరిశోధనలు చేశారు. తనకు రెండోసారి నోబెల్ వస్తుందనుకున్నారు.
ఆ విషయం బైటికి చెబితే చిన్నమ్మ ఏమన్నదో తెలుసా? "ఒకసారి నోబెల్ బహుమతి వచ్చినందుకే మిమ్మల్ని పట్టలేకపోతున్నాం. ఇక రెండోసారి కూడా వస్తే మరిక మిమ్మల్ని భరించలేం బాబూ...' అని! ఇటువంటి స్త్రీలు తమ భర్తలను బాగా అర్థం చేసుకున్నారు, కానీ తమకంటూ తాము అందమైన ప్రపంచాన్ని నిర్మించుకున్నారు. 'వయసు పెరుగుతున్నకొద్దీ మగవాళ్లు వృత్తిపరమైన విజయాలు సాధిస్తారేమోగానీ, ఆడవాళ్లు మాత్రం అద్భుతమైన లోకాన్ని సృష్టించుకుంటార్రా' అనేవారు మా నాన్నగారు. మా కుటుంబాల్లోని ఆడవాళ్లను తలచుకుంటే చాలు - ఎన్నో కథలకు సరిపడా ముడిసరుకు దొరుకుతుంది.
'మా అక్కయ్యలు వాళ్ల ఉత్సాహాన్ని, సృజనను, ప్రేమను - అంతటినీ తమ వంటలోనూ, సంగీతంలోనూ చూపిస్తార'ని మా నాన్న తరచూ అనేవారు. దాని అంతరార్థం చాలా లోతైనది. పితృస్వామ్య వ్యవస్థలో ఉంటూ కూడా స్త్రీలు తమ స్వేచ్ఛను మానసికంగా మాత్రం సంపూర్ణంగా కాపాడుకున్నారనిపిస్తుంది. సమాజం వాళ్లకు అవకాశాలివ్వకపోయినా వాళ్లు తమ సృజనాత్మకతను తమకు నచ్చిన రంగాల్లో కేంద్రీకరించారు. మా నాన్నమ్మ హెన్రిక్ ఇబ్సెన్ రాసిన 'ఎ డాల్స్ హౌస్'ను తమిళంలోకి అనువదించింది. మా కుటుంబానికే చెందిన ఆరెస్ సుబ్బులక్ష్మి బాలవితంతువులు తిరిగి పెళ్లి చేసుకునేలా ఉద్యమించింది.
రామన్ బృందంలో స్పెక్ట్రోస్కోపీ పరిశోధనలు చేసిన వారి ఇళ్లలోని ఆడవాళ్ల వజ్రపు ముక్కుపుడకలతో ఆ ప్రయోగాలు చేశారని ఎంతమందికి గుర్తుందో! ఇటువంటి కుటుంబాల్లో పుట్టడం ఒక అదృష్టం అనుకుంటాను. ఆ కుటుంబాలను అలా తీర్చిదిద్దింది ఆడవాళ్లే. వాళ్లకు నేను అర్పించే నివాళి ఈ వ్యాసం.''