telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

నెలసరి నొప్పి తగ్గేదెలా?

10/21/2013

0 Comments

 
Picture
ఈ రోజుల్లో చాలా మంది స్త్రీలలో బహిష్టు సమయంలో పొత్తి కడుపునొప్పి బాధిస్తుంది. ఇటువంటి నొప్పినే వైద్య పరిభాషలో డిస్మెనోరియా (పెయిన్‌ఫుల్‌ మెన్సెస్‌) అంటారు. బహిష్టు కనబడిన తర్వాత మొదటి, రెండు మూడు సంవత్సరముల వరకూ బహిష్టు సమయంలో పొత్తికడుపునొప్పి రావడం సాధారణంగా జరుగదు.  సుమారు 50శాతం మంది స్త్రీలు బహిష్టు సమయంలో పొత్తి కడుపు నొప్పితో బాధపడుతుంటారు. యుక్తవయస్సు అంటే 18సంవత్సర ముల నుండి 24సంవత్సరముల వరకూ ఉన్న స్త్రీలలో బహిష్టు సమయంలో కడుపునొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ వివాహ అనంతరం నొప్పి తీవ్రత తగ్గుతుంది. 

                  డిస్మెనోరియాలను ప్రధానంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిది ప్రైమరీ డిస్మెనోరియా, రెండవది సెకండరీ డిస్మెనోరియా. ప్రైమరీ డిస్మెనోరియా యుక్తవయస్సులోని స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. వీరికి బహిష్టు సమయంలో పొత్తికడుపునొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీనికి ముఖ్యంగా హార్మోనుల అసమతుల్యతే కారణం. సెకండరీ డిస్మెనోరియా వయస్సు మీరిన స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి గర్భాశయ కణుతులు, పెల్విక్‌ ఇన్‌ఫెక్షన్స్‌ ఉండటం కారణం. అలాగే బహిష్టు సమయంలో కండరాల సంకోచాల వల్ల గర్భకోశ ముఖ ద్వారం వంగి ఉండటం వలన, ఓవేరియన్‌ సిస్టుల వల్ల కూడా బహిష్టు సమయంలో కడుపునొప్పి ఎక్కువగా వస్తుంటుంది.  మానసిక ఒత్తిడి, హార్మోనుల అసమతుల్యత, గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్‌, జన్యులోపాలే వాటికి కారణం. బహిష్టు సమయంలో పొత్తి కడుపులో నొప్పితో రక్తస్రావం ఎక్కువ కావడం. గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్‌ ఉన్నప్పుడు బహిష్టు సమయంలో కాకుండా మధ్యమధ్యలో కడుపునొప్పితో రక్తస్రావం ఎక్కువ కావడం. పొత్తికడుపులో నొప్పి తీవ్రంగా ఉండును. పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవటం జరుగుతుంది. బరువు పెరుగుట, మానసికంగా చికాకుగా కోపంగా ఉండటం వీటి లక్షణాలు.

జాగ్రత్తలు
- హార్మోనుల సమతుల్యతను కాపాడటానికి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. మొలకెత్తిన విత్తనాలు, పాలు, గ్రుడ్లు, పండ్లు, కాయగూరలు మొదలైనవి ఎక్కువగా తీసుకోవాలి.


- అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గటానికి ప్రయత్నించాలి.

- నిత్యం, యోగా ప్రాణాయామం చేయాలి. మానసిక ఒత్తిడిని నివారించటానికి ధ్యానం చేయాలి.

నొప్పి తీవ్రత, రక్తస్రావం ఎక్కువగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి సలహా తీసుకోవాలి.

చికిత్స
               హోమియో వైద్యంలో బహిష్టు సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పికి మంచి చికిత్స కలదు. వ్యాధి లక్షణాలను, వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను, పరిగణనలోకి తీసుకుని మందులను ఎన్నుకుని వైద్యం చేసిన బహిష్టు సమయంలో వచ్చే నొప్పి నుండి విముక్తి పొందవచ్చును.


మందులు
                       మెగ్నీషియం ఫాస్‌, లేకసిస్‌, బెల్లడోనా, సెపియా, నైట్రోమోర్‌, కామామిల్లా, కాల్మియా, సెబైనా, ఎకోనైట్‌. కోలోసింత్‌, కాల్కేరియాకార్బ్‌ వంటి మందులను లక్షణాలను బట్టి ఎన్నుకుని వైద్యం చేసిన నెలసరి నొప్పి నుండి విముక్తి పొందవచ్చును.

0 Comments

అల్లుకునే బంధాలకు బతుకమ్మ

10/4/2013

0 Comments

 
Picture
                  'ఒక్కేసి పువ్వేసి చందమామా.. ఒక్క జామాయే చందమామా'... బతుకమ్మ పండగ వచ్చేసింది. ఇక తొమ్మిది రోజులూ పూల సంబరాలే. సాయంత్రం అయ్యిందంటే చాలు... వీధులన్నీ పాటల జలపాతాలే. అతివల మనసుల నిండా ఆనందాల చప్పట్లే. రాశులు పోసుకునే పల్లె సౌందర్యం... పాటలల్లుకునే జీవితానుభవ సాహిత్యం... అనుబంధాలను పేర్చే సాన్నిహిత్యం... సాహసం, సామాజిక తత్వం... అన్నీ కలబోసుకునే ప్రకృతి పండగే ఇది అంటూ బతుకమ్మ విశేషాలని చెబుతున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.తుకమ్మ... కఠిన నియమాలతో జరుపుకునే పండగ కాదు. కష్ట సుఖాలను పంచుకుంటూ ఇష్టంగా చేసుకునే పర్వదినం.

                     వీధి, గ్రామం, వూరిలోని మహిళలందర్నీ సంఘటిత పరిచే వేడుక. తొమ్మిది రోజుల పాటు సందడిగా సాగే బతుకమ్మ ప్రకృతిని ప్రేమించాలనీ, పూజించాలనీ చెబుతుంది. అప్పుడే ఆనందం, ఆరోగ్యం అని తెలియజేస్తుంది. మహిళలు వంటింటికే పరిమితం కాకూడదు... అక్కాచెల్లెళ్లూ, ఆడబిడ్డలూ, అత్తలూ, వదినలూ, స్నేహితురాళ్లూ, ఇరుగుపొరుగూ, ఆత్మీయులతో కలిసి ఆటలాడి, ఆనందం పొందాలి. భవిష్యత్తు ఆలోచనలను పంచుకుని ముందుకు సాగాలి. ప్రతి ఏటా ఈ మాటల్ని గుర్తు చేసే సంబరంగా బతుకమ్మ పేరు పొందింది. పెళ్లయి అత్తారింటికి వెళ్లిన ఆడబిడ్డల్ని పుట్టింటికి పిలిచి, వడిబియ్యం పోసి, కొత్త బట్టలు పెట్టి ఆదరించడమనే సంప్రదాయం ఈ పండగప్పుడు తెలంగాణలో కనిపిస్తుంది. ఈ ఆధునిక కాలంలో ఎవర్నయినా కదిలిస్తే 'నేనూ... నా వాళ్లూ' అనే చెబుతుంటారు. కానీ బతుకమ్మ తల్లి... వూరి బాగు కోసం, ప్రజలందరి సంతోషం కోసం కలిసి కట్టుగా ముడుపు కట్టాలని చెబుతుంది. అందుకే చెరువునీ, ప్రకృతినీ, గ్రామాన్నీ, ప్రతి ఇంట్లో అందరినీ చల్లగా చూడమని గౌరమ్మను మనం పూలతో పూజిస్తాం.

            ప్రతి పువ్వూ విలువైనదే...మనకు చాలా పండగలున్నాయి. ప్రతి పండగప్పుడూ దేవుళ్లని మల్లెలూ, గులాబీలూ, చామంతులూ, కనకాంబరాలతో పూజిస్తాం. కానీ సిబ్బి (వెదురు అల్లిక)లో, ఇత్తడి తాంబూలంలో బతుకమ్మని పేర్చడంలో ఖరీదయిన పూలని వాడం. పసుపు ఆరబోసినట్లు పెరిగే తంగేడూ, బంతిపూలూ... చేను చెలకలో ఉండే గునుగు పూలూ, పట్టుకుచ్చులూ... ముళ్ల కంచెలపై కనిపించే కట్లపూలూ... పెరట్లో పెరిగే మందారాలూ, గన్నేరు వంటివి వాడతాం. ప్రకృతిలో ప్రతి ఒక్కటీ విలువైందని చెప్పడమే ఈ పండగ ప్రత్యేకత. చిత్రం ఏంటంటే, ఇవన్నీ ఎరువులు వాడకుండా పెరిగే సహజమైన పూలు. స్వచ్ఛమైన ఈ పూలతో బతుకమ్మను పేర్చి, తమలపాకుల్లో పసుపు గౌరమ్మను ఉంచి, పూజించడం ఆరోగ్యానికెంతో మంచిది.

                    తంగేడు పూలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. బతుకమ్మ నిమజ్జనంతో చెరువులు బాగుపడతాయి. తంగేడూ, గునుగూ, పసుపు ముద్ద, తమలపాకులు చెరువుల్లో పేరుకున్న నాచునీ, కాలుష్యాలనీ తగ్గించి నీటిని శుద్ధి చేస్తాయి.సంప్రదాయాల్లో సమభావం...పెళ్లి కానివారు మంచి భర్తను కోరుకుంటూ, పెళ్లయిన వారు భర్తా, కుటుంబ క్షేమాన్ని కోరుకుంటూ ఈ పండగ జరుపుకొంటారు. కొత్త కోడళ్లకు ఇది మరీ ముఖ్యమైన పండగ. ప్రత్యేకంగా జరుపుకుంటారు. కాలం మారింది. ఆధునికత ఎక్కువైంది. అయినా ఏటికేడాది బతుకమ్మ ఆడే మహిళల సంఖ్య పెరుగుతూనే ఉంది. కారణం ఏమంటే... బతుకమ్మ ఆచార సంప్రదాయాల్లో ఆటలున్నాయి. పాటలున్నాయి. సృజనాత్మక పోటీలున్నాయి. జీవితానికి ఉపయోగపడే పాఠాలున్నాయి. రంగురంగుల బతుకమ్మను ఒక్కరే పేర్చరు. ఇంట్లో వాళ్లూ, ఇరుగుపొరుగూ కలిసి అందంగా తీర్చిదిద్దుతారు. ఒకే దాన్ని కాకుండా, తల్లి బతుకమ్మకు తోడుగా పిల్ల బతుకమ్మనూ సిద్ధం చేస్తారు. తల్లి పక్కన పిల్ల ఉండాలనే మాతృమూర్తి మనసు తెలపడమే అది.

                   చెరువూ, కాలువల వద్దకెళ్లి ... బతుకమ్మలను మధ్యలో ఉంచి 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో' అని ఆడి పాడటంలో సంపన్నులూ, సామాన్యులూ అన్న తేడా ఉండదు. ఇంటి నుంచి తీసుకెళ్లిన రుచికరమైన పదార్థాలను అందరూ కలిసి కూర్చుని తినడం, పసుపు వాయనాలు ఇచ్చుకోవడం సమభావాన్ని పెంచేవే. గత కొన్నేళ్ల పండగ తీరుని గమనిస్తే, పెద్ద సంఖ్యలో అమ్మాయిలు బతుకమ్మ ఆడటానికి వస్తున్నారు. పాటలు నేర్చుకుని ఉత్సాహంగా పాడుతున్నారు. సీతమ్మని అత్తారింటికి పంపే పాట కావచ్చు, అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని తెలిపే పాట కావచ్చు... వాటిల్లో తమను తాము తరచి చూసుకుని, సహానుభూతి పొందగలగడమే అందుకు కారణం. మేమూ, ఆధునిక జీవన శైలిని అనుసరిస్తున్నా విలువైన మన సంస్కృతీ సంప్రదాయాల మూలాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆడపిల్లలకు చెబుతున్నాం.

                 బతుకమ్మ కథలు...బతుకమ్మ జరుపుకోవడం అంటే లక్ష్మీ పార్వతులను పూజించడంగా భక్తులు భావిస్తారు. భయాలు పోతాయనీ, భాగ్యాలు కలుగుతాయనీ నమ్ముతారు. ఇంత బలమైన విశ్వాసం ఏర్పడటానికి ప్రచారంలో ఉన్న బతుకమ్మ గాథలే కారణమని చెప్పొచ్చు. మహిషాసురుడితో యుద్ధం చేసి దుర్గమ్మ అలసి సొమ్మసిల్లింది. అప్పుడు జగన్మాత సేదతీరేందుకు స్త్రీలు సేవలు చేశారు. మానసికోల్లాసం కలిగేలా పాటలు పాడారు. అమ్మకు అలసట తీరింది. మహిషాసురుణ్ని వధించి, ప్రజలకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ప్రజలకు బతుకునిచ్చిన అమ్మ కాబట్టి ఆ రోజు నుంచి దుర్గమ్మ, బతుకమ్మ అయింది.

                  చోళ రాజు ధర్మాంగదుడుకి వందమంది కొడుకులు. అంతా యుద్ధంలో మరణించారు. మనోవేదనకు గురైన ఆ రాజు, పిల్లల కోసం తపస్సు చేయగా లక్ష్మీదేవి కూతురిగా పుట్టింది. ఈ జన్మ వృత్తాంతం తెలిసిన రుషులు ఆ పాపకు 'బతుకమ్మ' అని పేరు పెట్టారు. చక్రాంకుడనే పేరుతో జన్మించిన విష్ణువే ఆమెను పెళ్లాడాడు. వీళ్లిద్దరూ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటూ పాలించారు. అందుకే బతుకమ్మను దేవతగా కొలుస్తూ ఏటా పండగ జరుపుకునే సంప్రదాయం నెలకొంది.

                  చిన్న పదాలు... సరళమైన భాష... లోతయిన భావం... 'ఉయ్యాలో', 'కోల్‌', 'గౌరమ్మా' అనే ఆవృతాలతో వచ్చే బతుకమ్మ పాటల్లో... ఉయ్యాల పాటలున్నాయి. అనుబంధాల ప్రాధాన్యాన్ని చెప్పే, అత్తారింట్లో ఎలా మెలగాలో వివరించే గీతాలున్నాయి. చిన్ని కృష్ణుని చిలిపి పనులూ, గౌరీదేవి స్తుతులూ, రాముని కథలూ... మనసుకు ఉల్లాసాన్నిస్తాయి. వివిధ వృత్తుల ప్రత్యేకతలూ, వరకట్నం వంటి సమస్యలను ఎదుర్కొనే తీరుతెన్నుల్ని వలయాకారంలో తిరుగుతూ, చప్పట్లతో పాడితే ఉత్సాహం ఉరకలెత్తుతుంది.

0 Comments

పోషకాహార లోపం.. పడతులకు శాపం

9/30/2013

0 Comments

 
Picture
                          ఆదివారం సెలవు రోజు. కాస్త ఆలస్యంగా నిద్రలేచినా ఫర్వాలేదనుకునే సగటు ఇల్లాలికి ఆ రోజే ఎక్కువ పనిభారం అనివార్యమవుతుంది. సెలవు కావడంతో ఇంట్లో భర్త, పిల్లలు ఉంటారు. తినడానికి వారు కోరుకున్నవి చేసిపెట్టాలి. చేపలు తెస్తే ఒకరు పులుసు పెట్టమంటారు, మరొకరు ఫ్రై చేయమంటారు. నాకు నాన్‌వెజ్ వద్దు, కాయగూరలతో కర్రీ వండమని మరొకరు అంటారు. వీరందరూ కోరుకున్నవి చేసి, భోజనాలు అయ్యేసరికి మధ్యాహ్నం రెండవుతుంది. నాలుగు మెతుకులు నోట్లో వేసుకొని, కాస్త నడుం వాల్చుదామనే సమయమే ఆ ఇల్లాలికి దక్కడం లేదు. నిత్యం ఇంటి పని మొత్తం చేసుకునే మహిళలకు కడుపునిండా తినేందుకు కూడా తీరిక ఉండదు. ఈ చేప ముక్క ఉంటే తర్వాత ఎవరో ఒకరు తింటారులే..! అని దాన్ని దాచిపెట్టి మరీ పిల్లల చేత తినిపించే తల్లులకు కొదవలేదు. అందుకే అమ్మ త్యాగానికి ప్రతీక అయింది.

                       ఓ వైపు సామాజికంగా అసమానతలకు గురయ్యే మహిళలు పోషకాహార విషయంలోనూ వివక్షకు గురవుతున్నారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలలో నెలకొనే సామాజిక జీవన ప్రమాణాలే ఇందుకు నిదర్శనం. ఆదాయం కుటుంబపోషణకు సరిపోక ఉన్నదాంట్లోనే సర్దుకుపోవాలని సగటు మహిళ భా విస్తుంది. ఇంట్లో అందరూ భోంచేసిన తరువాతే తాను తింటుంది. ఫలితంగా చాలామంది మహిళలు పోషకాహార లేమితో బాధపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో పిల్లల్లో ఎదుగుదల లోపం, మహిళలు పోషకాహారలేమితో బాధపడుతన్నట్లు, ఈ సమస్య ముఖ్యంగా ఆసియా దేశాల్లో అధికంగా కనిపిస్తున్నట్లు ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంత ఉమ్మడి కుటుంబాలలో మగపిల్లలు, ఆడపిల్లల ఎదుగుదలలో తీవ్రమైన వ్యత్యాసం ఉన్నట్లు, పోషకాహారం అందించే విషయంలో ఆడపిల్లల పట్ల వివక్ష కొనసాగుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఇళ్లలో ముందుగా మగపిల్లలకు భోజనం పెట్టిన తరువాతే ఆడపిల్లలకు పెట్టే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఫలితంగా మన దేశంలో మహిళలు, బాలికలు పోషకాహార లేమితో బాధపడుతున్నట్లు వెల్లడైంది. వేళకు తినకపోవటం వల్ల, సరైన పోషకాలు అందక వీరు పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎత్తు, బరువు తదితర విషయాల్లో సమతుల్యత లోపిస్తున్నట్లు కొలంబియా యూనివర్శిటీ ఆర్థిక శాస్తవ్రేత్త అరవింద్ పన్‌గారియా అంటున్నారు.

                      గ్రామీణ ప్రాంతాల్లో అత్తారింటికి వచ్చే కొత్తకోడళ్లు, వారి పిల్లలు పొట్టిగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ప్రపంచం మొత్తమీద రక్తహీనతతో బాధపడే మహిళలు మనదేశంలోనే అధికంగా ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంత మహిళలు, బాలికల్లో 60 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. అయితే, రక్తంలో ఇనుము తదితరాల కోసం ఐరన్ మాత్రలు తీసుకునే బదులు ఇనుము ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడమే మంచిది. కానీ, ఇలాంటి నాణ్యమైన పోషకాహారమే వారికి లభించడం లేదు. ప్రముఖ ఆర్థివేత్త డాక్టర్ అమర్త్య సేన్ అన్నట్లు సగటు భారతీయుడికి సమతుల్య ఆహారం దొరకటం నేడు గగనమవుతోంది. ప్రభుత్వాలు ఆహారభద్రత చట్టం లాంటివి ఎన్ని తెచ్చినా ప్రయోజనం అంతంత మాత్రమే. పోషకాలు ఉండే ఆహార పదార్థాలన్నీ కాస్త ఖరీదు ఎక్కువగానే ఉంటున్నాయి. అందుకే ధర తక్కువగా ఉండే చిరుధాన్యాలు తదితర ఆహార పదార్థాలను తీసుకుంటే ఎంతో మంచిది.

                     సుమారు యాభై ఏళ్ల క్రితం గ్రామీణ ప్రాంతాలలో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలలో చిన్నా, పెద్ద మొదలు అందరూ జొన్న,సజ్జలు,రాగులు లాంటి తృణధాన్యాలను ఆ హారంగా తీసుకునేవారు. వీరు శారీరక శ్రమ అధికంగా చేసేవారు కాబట్టి ధృడంగా, ఆరోగ్యంగా ఉండేవారు. రానురానూ జీవనశైలిలో వచ్చిన మార్పుతో పాటు ఆర్థికలేమి వారిని చౌకగా లభించే పోషకాహారం నుంచి దూరం చే స్తోంది. ఒకే కుటుంబంలో ఉండే ఆడ, మగపిల్లల శారీరక ఎదుగుదలను గనుక పరిశీలిస్తే ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. ఎత్తు, లావు, చురుకుదనం తదితర విషయాల్లో విపరీతమైన తేడా ఉంటోంది. అలాగే, పిల్లల్లో శారీరక సామర్థ్యం కూడా చాలా తక్కువ ఉన్నట్లు వెల్లడైంది. టీవీలకు, ఇంటర్నెట్ గేమ్స్‌కు అతుక్కుపోతూ చిన్నారులు శారీరక శ్రమను నిర్లక్ష్యం చేస్తున్నారు. కనీసం గంటసేపు కూడా పరుగెత్తలేని పరిస్థితిలో గ్రామీణ ప్రాంత పిల్లలు ఉన్నారు.

                        చిన్నతనంలో ఆటల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. క్రీడలతో శారీరక, మానసిక ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. ఆటల వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. ఫలితంగా పిల్లల్లో ఎదుగుదల ఉంటుంది. కానీ, దురదృష్టవశాత్తూ పేదరికం పిల్లలకు పెను శాపంగా మారి వారి ఎదుగుదలను కుంగదీస్తోంది. వాస్తవానికి మగపిల్లల్లో ఎదుగుదల జీవితంలో మూడుసార్లు జరుగుతుంది. ఆ సమయంలో సరైన పోషకాహారం తీసుకుంటే వారు ఎత్తు పెరుగుతారని ప్రిన్స్ యూనివర్శిటీ ప్రొఫెసర్ అంగ్స్ డీటన్ అంటున్నారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న పోషకాహార సమస్యపై సమరభేరి మోగించకుంటే- రాబోయే కాలంలో మన పిల్లల భవిష్యత్తును చేజేతులారా మనమే నాశనం చేసుకున్నవారమవుతాం. ‘మొక్కై వంగనిది మానై వంగుతుందా?’- అన్నట్లు బిడ్డ కడుపులో పడగానే తగు జాగ్రత్తలు తీసుకుంటే అటు తల్లులకు, ఇటు పిల్లలకు ఎంతో మంచిది. తద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని వృద్ధిచేసుకున్నవారమవుతాం.

0 Comments

'నోబెల్' ఇంట్లో ఆమెకు గుర్తింపేదీ?

9/19/2013

1 Comment

 
Picture
                   గొప్ప విజయాలు సాధించిన సైంటిస్టుల గురించి అందరికీ తెలుస్తుంది. కాని నిరంతరం వారికి వెన్నుదన్నుగా నిలబడే వాళ్ల భార్యల గురించి ఎంతమందికి తెలుస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెబుతున్నారు ప్రొఫెసర్ శివ విశ్వనాథన్. నోబెల్ బహుమతిని పొందిన ఇద్దరు భారతీయ సైంటిస్టులు సర్ సీవీరామన్, ఎస్. చంద్రశేఖర్‌ల కుటుంబానికి చెందిన ఆయన ఆ కుటుంబాల్లో మహిళలు నిర్వహించిన పాత్ర గురించి మాట్లాడుతున్నప్పుడు మన ఇళ్లలో కూడా అలాంటి గొప్ప జీవితాలను గడిపిన ఎందరో స్త్రీలు గుర్తు రాక మానరు.

                      "మా అత్తయ్య లలిత కిందటి వారం చనిపోయారు. బతికుంటే ఆమె ఈ ఏడు తన 103వ పుట్టినరోజును చేసుకునేవారు. ఆవిడ చాలా గొప్పది, కాని ఆమె గురించి రాసేదెవరు? జీవితమల్లా గృహిణిగానే బతికిన ఆమె ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఎస్. చంద్రశేఖర్ ఇల్లాలు. చరిత్ర ఆయనను గుర్తించినట్టు ఆమెను గుర్తించదు కదా.

                       చంద్రశేఖర్ చనిపోయాక మా అత్తయ్య ఒక్కతే చికాగోలో బతికింది ఇన్నాళ్లూ. తనకు తొంభయ్యేళ్లు దాటాక కూడా 'భోజనానికి ఇంటికి రారా నాయనా, నీకోసం చక్కగా వంట చేసి పెడతాను..' అని ఆప్యాయంగా పిలిచిందావిడ. నేను కాదనలేకపోయాను. స్పెషల్స్ ఏమీ చేయలేకపోయినా, మామూలు వంటకాల్నే ఎంతో అందంగా పొందికగా వడ్డించిందావిడ. భోంచేస్తున్నప్పుడు తాను అమెరికా వచ్చిన తొలినాళ్ల గురించి, చుట్టుపక్కల ఎక్కువమంది భారతీయులు లేకపోవడం వల్ల తమకు ఎంత ఒంటరితనంగా అనిపించేదో అదంతా చెప్పింది. చంద్రశేఖర్ తన చుట్టూ ఉన్న దేన్నీ పట్టించుకోకుండా నిర్విరామంగా పనిచేస్తూ పోతే మా అత్తయ్యే ఆయనకు అన్నిటి గురించీ చెబుతూ ఉండేదట. విశ్వవిద్యాలయంలోని రాజకీయాల గురించి, నల్ల వాళ్ల పట్ల ఉన్న వివక్ష గురించి - అన్నీ ఆవిడే ఆయనకు చెప్పేది. వాళ్లిద్దరిలో ఆవిడే ఎక్కువ రాడికల్. మన దేశంలోని ప్రజాస్వామ్యం, స్వచ్ఛంద సంస్థలు, పౌరసమాజం - ఇలా అన్నిటి గురించీ ఆరోజు చర్చించుకున్నాం మేమిద్దరం.


                   ఆవిడ గురించి ఆలోచిస్తుంటే నాకు మా కుటుంబంలోని ఎందరో ఆడవాళ్లు గుర్తొచ్చారు. మగవాళ్లు తమ తెలివితేటలతో చరిత్రను సృష్టించారుగాని, దానికి సాయపడిన ఆడవారి గురించి మాట్లాడినవారు తక్కువమంది. గొప్ప భర్త - అనామకమైన భార్య : చాలాసార్లు పరిస్థితి ఇలానే ఉంటుంది. మహిళల విజయాలు, వారు చెప్పే విషయాలు ఎప్పుడూ వెలుగులోకి రావు.

                      మరో నోబోల్ గ్రహీత సీవీరామన్ గురించి మాట్లాడేవాళ్లలో ఎంతమందికి ఆయన భార్య గురించి తెలుసు? ఆమె పేరు లోకసుందరి. గొప్ప వాక్చాతుర్యమున్న స్త్రీ. కుటుంబంలో ఆమెను 'చిన్నమ్మ' అనేవారు. రామన్‌కు తన పట్ల తనకు ఎంత నమ్మకమంటే - ఆ ఏడు తన పరిశోధనలకు నోబెల్ వస్తుందని ఊహించి ముందుగానే ఆ ఊరికి రానూపోనూ టికెట్లు బుక్ చేయించుకున్నారు! రామన్ చివరిరోజుల్లో పువ్వుల మీద పరిశోధనలు చేశారు. తనకు రెండోసారి నోబెల్ వస్తుందనుకున్నారు.

                     ఆ విషయం బైటికి చెబితే చిన్నమ్మ ఏమన్నదో తెలుసా? "ఒకసారి నోబెల్ బహుమతి వచ్చినందుకే మిమ్మల్ని పట్టలేకపోతున్నాం. ఇక రెండోసారి కూడా వస్తే మరిక మిమ్మల్ని భరించలేం బాబూ...' అని! ఇటువంటి స్త్రీలు తమ భర్తలను బాగా అర్థం చేసుకున్నారు, కానీ తమకంటూ తాము అందమైన ప్రపంచాన్ని నిర్మించుకున్నారు. 'వయసు పెరుగుతున్నకొద్దీ మగవాళ్లు వృత్తిపరమైన విజయాలు సాధిస్తారేమోగానీ, ఆడవాళ్లు మాత్రం అద్భుతమైన లోకాన్ని సృష్టించుకుంటార్రా' అనేవారు మా నాన్నగారు. మా కుటుంబాల్లోని ఆడవాళ్లను తలచుకుంటే చాలు - ఎన్నో కథలకు సరిపడా ముడిసరుకు దొరుకుతుంది.

                    'మా అక్కయ్యలు వాళ్ల ఉత్సాహాన్ని, సృజనను, ప్రేమను - అంతటినీ తమ వంటలోనూ, సంగీతంలోనూ చూపిస్తార'ని మా నాన్న తరచూ అనేవారు. దాని అంతరార్థం చాలా లోతైనది. పితృస్వామ్య వ్యవస్థలో ఉంటూ కూడా స్త్రీలు తమ స్వేచ్ఛను మానసికంగా మాత్రం సంపూర్ణంగా కాపాడుకున్నారనిపిస్తుంది. సమాజం వాళ్లకు అవకాశాలివ్వకపోయినా వాళ్లు తమ సృజనాత్మకతను తమకు నచ్చిన రంగాల్లో కేంద్రీకరించారు. మా నాన్నమ్మ హెన్రిక్ ఇబ్సెన్ రాసిన 'ఎ డాల్స్ హౌస్'ను తమిళంలోకి అనువదించింది. మా కుటుంబానికే చెందిన ఆరెస్ సుబ్బులక్ష్మి బాలవితంతువులు తిరిగి పెళ్లి చేసుకునేలా ఉద్యమించింది.

                    రామన్ బృందంలో స్పెక్ట్రోస్కోపీ పరిశోధనలు చేసిన వారి ఇళ్లలోని ఆడవాళ్ల వజ్రపు ముక్కుపుడకలతో ఆ ప్రయోగాలు చేశారని ఎంతమందికి గుర్తుందో! ఇటువంటి కుటుంబాల్లో పుట్టడం ఒక అదృష్టం అనుకుంటాను. ఆ కుటుంబాలను అలా తీర్చిదిద్దింది ఆడవాళ్లే. వాళ్లకు నేను అర్పించే నివాళి ఈ వ్యాసం.''


1 Comment

ఆసక్తి ఉంటే అతివకు ‘షేర్ మార్కెట్’ సులభమే..!

7/12/2013

2 Comments

 
Picture
                   దేశం ఎంతగా ప్రగతి సాధిస్తున్నా షేర్ మార్కెట్‌లో మహిళల భాగస్వామ్యం ఇప్పటికీ నామమాత్రంగానే ఉంది. పురుషులకు దీటుగా షేర్‌మార్కెట్‌లో లావాదేవీలు నిర్వహించగల సత్తా మహిళల్లో ఉన్నప్పటికీ వారు ముందుకురావటానికి జంకుతున్నారు. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఈ రంగంలో వారు విజయవంతంగా దూసుకుపోవచ్చు. లాభనష్టాలు, ట్రేడింగ్ గొడవలు మనకెందుకులే..!-అని అనుకుంటే మహిళలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. షేర్ మార్కెట్ గురించి కాస్త అవగాహన ఉంటే చాలు ఇందులో కాస్తోకూస్తో లాభాలు సంపాదించటం తేలికే. అయతే, షేర్ మార్కెట్ మాయాజాలాన్ని ఓ జూదంలా భావించి కుటుంబ యజమానులు పెట్టుబడులు పెడతామన్నా మహిళలు పెట్టనీయరు. ఓర్పుతో మార్కెట్‌ను అధ్యయనం చేసే ఆసక్తిని పెంచుకుంటే అతి తక్కువ పెట్టుబడితో చిన్న షేర్ మార్కెట్ వ్యాపారం ప్రారంభించవచ్చు. స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన పుస్తకాలను, కథనాలను చదివి మహిళలు అవగాహన పెంచుకోవాలి.

                      స్టాక్ మార్కెట్‌లో నిత్యం వాడే పదాలు, వాటి అర్థాలు, అవి ఎందుకు ఉపయోగపడతాయని విశే్లషణ చేయటానికి కొంత సమయం కేటాయించాలి. డబ్బును సరైన వడ్డీరాని బ్యాంకులలో మురగబెట్టే బదులు స్టాక్ మార్కెట్‌లో పెట్టి లాభాలు పొందవచ్చు. తగినంత సమయాన్ని వెచ్చించలేమనుకుంటే, ఇదంతా మనవల్ల కాదనుకుంటే మంచి స్టాక్ బ్రోకరుని ముఖ్యంగా ప్రాచుర్యంలో ఉన్న ట్రేడింగ్ సంస్థను ఎంచుకుని, వారి ద్వారా లావాదేవీలు జరపాలి. ఆ సంస్థ మీ తరఫున అమ్మకాలు, కొనుగోళ్ల ప్రక్రియ చేపడుతోంది. దానికి కొంచెం రుసుం చెల్లిస్తే సరిపోతుంది. మహిళలు ఈ రంగంలోకి అడుగుపెట్టాలంటే ఆన్‌లైన్ ట్రేడింగ్ ఎంచుకుంటే మంచిది. ఇది వారికి ఎంతో సులభంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. వౌస్ క్లిక్‌లతో పని సాఫీగా జరిగిపోతుంది. ముందుగా ఒక డెమో అకౌంట్‌ను ఓపెన్ చేసి అందులో మనం బాగా ఆరితేరిన తరువాత, ట్రేడింగ్‌ని అర్థం చేసుకున్న తరువాత ఒరిజినల్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. నష్టాలను నివారించుకోవటంతో పాటు తక్కువ ట్రేడింగ్ రుసుంతో మన కళ్ల ముందే మార్కెట్ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఆరంభంలో ఒకే స్టాక్‌పై దృష్టిపెట్టి కొన్ని షేర్లు మాత్రమే కొనుగోలు చేయాలి. అపుడు మనకు ట్రేడింగ్ పద్ధతులు, ఉపాయాలు బాగా అర్థం అవుతాయి. మనకు మార్కెట్ తీరుతెన్నులు అర్థం అయ్యాక మెల్లమెల్లగా స్టాక్ పెంచుకోవచ్చు. మార్కెట్ టెక్నిక్ లను ఆకళింపు చేసుకోవాలి. మార్కెట్ ఎలాంటి స్పందనలకు గురవుతుందో ఊహించే నేర్పు సంపాదించాలి. ఇది కొద్ది రోజులలో వచ్చేది కాదు, మరీ అంత సులువు కాదు. క్రమశిక్షణతో రోజూ మార్కెట్‌ను పరిశీలిస్తూ, సందర్భాలను బేరీజు వేసుకుంటూ చాకచక్యంగా ముందుకు సాగాలి. ఒక్కసారి ఇలాంటి మెళకువలు మీ సొంతం అయితే క్రమక్రమంగా ఒకే సంస్థలో కాకుండా వివిధ సంస్థలలో విభిన్న రంగాలలో పెట్టుబడులను విస్తరించుకోవాలి. ఇది చాలా మెరుగైన, సురక్షితమైన పద్ధతి. మనకు లాభాలు ఆర్జించే స్టాక్‌ను లేదా సంస్థను ప్రేమించాలి. నష్టపోతామని ఏ మాత్రం సందేహం కలిగినా పెట్టుబడులు పెట్టకుండా వదలివేయటం అలవర్చుకోవాలి. మార్కెట్ ట్రెండ్ మాత్రమే మనకు ప్రధానం. భావావేశాలకు అసలు చోటులేదు. సెంటిమెంట్లకు తావులేదు. నిర్లక్ష్యం అసలు పనికిరాదు. ఎందులో పోగొట్టుకున్నామో అందులోనే సంపాదించాలనే సూత్రం ఇక్కడ పనిచేయదు. అవసరమైతే నిపుణుల సలహాకి వెనుకాడవద్దు. నిజం చెప్పాలంటే స్టాక్ ట్రేడింగ్ మహిళలకు మంచి లాభసాటి వ్యాపకంగా చెప్పుకోవచ్చు. ఇంట్లో ఒక సిస్టమ్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. భర్త, పిల్లలు బయటికి వెళ్లిపోగానే ట్రేడింగ్ చేసుకోవచ్చు. వారు వచ్చేలోపలే ముగించుకోవచ్చు. ఖాళీగా ఇంట్లో ఉన్నామన్న దిగులు దరిచేరదు. మంచి సంపాదన కూడా వస్తుంది. తొందరపాటుతనం లేకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మార్కెట్‌లో నిలదొక్కుకోవటం సులభం. అయితే దీర్ఘకాలిక ప్రణాళిక ఉంటేనే బాగుంటుంది. అన్నీ కాకున్నా కొన్ని స్టాక్స్ మాత్రం రెండు నుంచి ఐదు సంవత్సరాల కాలవ్యవధిలో పెట్టుబడి పెట్టుకుంటే మంచిదని నిపుణులు చెపుతుంటారు. ఇలాంటి తలనొప్పి వద్దనుకుంటే మ్యూచివల్ ఫండ్స్‌లో పెట్టుకుంటే సరిపోతుంది.
స్టాక్‌మార్కెట్‌లో మాహిళల సామర్థ్యాన్ని ఎన్నో సర్వేలు వేనోళ్లుగా ప్రశంసిస్తున్నా ఇండియన్ ఈక్విటీ ఇనె్వస్ట్మెంట్ సర్వే-2010 ప్రకారం అమెరికాలో 20శాతం మంది మహిళలు ముందుకు వస్తుంటే మనదేశంలో 7 శాతం మహిళలే రంగప్రవేశం చేస్తున్నారు. అదీకూడా ఉన్నత చదువులు చదువుకున్నవారే కావడం గమనార్హం. పెట్టుబడులు తక్కువ కాబట్టి గృహిణులు రావాలని ఆర్థిక విశ్లేషకులు
 అభిలషిస్తున్నారు.

                         యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా నిర్వహించిన అధ్యయనంలో మహిళల పోర్ట్ఫోలియో విలువ మగవారికన్నా సంవత్సరానికి 1.4 శాతం పెరుగుతున్నదని తేలింది. పైగా ఒంటరి ఆడవారు స్టాక్ మార్కెట్‌లోగొప్పగా రాణిస్తున్నారని ఆ సర్వే తేల్చిచెప్పింది. నిపుణుల నివేదిక ప్రకారం స్టాక్ మార్కెట్‌లో ఒంటరి మహిళల సంపాదన ఒంటరి మగవారి కన్నా 2.3 శాతం ఎక్కువని నిరూపించబడింది. ఆర్థికంగా ప్రగతిపథంలో వెళుతున్న జపాన్‌లో ‘‘మయుమితొరి’’ అనే గృహిణి ఆసియాలోని ఇనె్వస్టర్లలో అందరికీ ఆదర్శం అని ఆ సర్వే ఉదహరించింది. ఆమె ట్రేడింగ్ మొదలు పెట్టినపుడు భర్తకు తెలియకుండానే పెట్టుబడులు పెట్టేవారట. నేడు నూటా యాభై వేల అమెరికన్ డాలర్లను సొంతం చేసుకుంది. ఆమెఇనె్వస్ట్మెంట్ స్ట్రాటజీస్ అనే పుస్తకం కూడా రాశారు. మహిళా ఇనె్వస్టర్ల కోసం నలభై మంది సభ్యులతో ఒక క్లబ్బును కూడా ఏర్పాటు చేసి దానికి ‘‘ఎఫ్ ఎ బ్యూటీస్’’ అని నామకరణ చేశారు. ఇప్పటికీ చాలామంది ఆమె బాటలో నడుస్తూ భర్తకు చెప్పకుండా వారి పార్ట్‌టైమ్ సంపాదనను ట్రేడింగ్‌లో పెట్టేస్తున్నారట. మనం అంత రిస్కు తీసుకోకుండా ఇంట్లో చెప్పే చేసుకోవచ్చు. ఈ రోజుల్లో మహిళలను ముందుకెళ్లమని ప్రోత్సహించే భర్తలు ఎక్కువే కాబట్టి ట్రేడింగ్‌లో అవగాహన పెంచుకుని ముందుకు దూసుకేళ్లొచ్చు. అయితే, ఇందులోకి దిగిముందే మానసికంగా నష్టాలలొచ్చినా అందుకు సంసిద్ధంగా ఉండాలి. కొంతకాలం లాభాలు రాకున్నా నెట్టుకురాగలమనే నమ్మకం, ధైర్యం ఉండాలి. అలాంటి సౌలభ్యం లేకపోతే స్టాక్‌ట్రేడింగ్‌లోకి మహిళలు దిగకపోవడమే మంచిది.

మూలం : ఆంధ్రభూమి దినపత్రిక 

2 Comments

ఆడశిశువుకు ఆహ్వాన గీతిక..!

7/10/2013

0 Comments

 
Picture
* గంగానగర్‌లో ఆడశిశువులకు జన్మనిచ్చిన 50 మంది దంపతులను ప్రముఖ విద్యా సంస్థలు సత్కరించి, ప్రతి కుటుంబంలో ఒక బాలికకు ఉచితంగా విద్యను అందిస్తామని ప్రకటించాయి.
* ఆడశిశువు జన్మించిన ఇంట్లో వేడుకలు జరిపేందుకు గ్రామీణ మహిళలంతా ఐక్యతతో ముందుకు వస్తున్నారు.
* ఆడశిశువును ఆదరించిన దంపతులను గ్రామ పంచాయతీ పెద్దలు సన్మానిస్తూ ప్రశంసాపత్రాలు అందజేస్తున్నారు.
* చాంబర్ ఆఫ్ కామర్స్, గురుద్వారా కమిటీలు, ఇతర సంస్థలు ఆడశిశువులకు ఉచిత విద్య అందించేలా ఆర్థిక సాయం చేస్తున్నాయి.

                    ‘ఆడశిశువును కనాలా? వద్దా? అన్నది తల్లిదండ్రుల హక్కు.. లింగ నిర్థారణ పరీక్షలు చేయించుకునే స్వేచ్ఛ వారికి ఉంది.. ఆడశిశువును వద్దనుకుంటే- గర్భస్రావానికి అనుమతించేలా గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు చేయాలి.. మగశిశువు పుట్టకుంటే ఆ కుటుంబానికి భవిష్యత్తే లేదు...


                        - ఈ తరహా వాదనలను విస్తృతంగా ప్రచారం చేస్తూ రాజస్థాన్‌లోని మోహన్‌పుర గ్రామంలో ‘అంగన్‌వాడీ’ నాయకురాలు చిందేరీపాల్ కౌర్ విధులు నిర్వహించేది. ఇదంతా 2011 నాటి మాట. ఆ తర్వాత ఎనిమిది నెలలకు ఆమె ప్రవర్తనలో అనూహ్య మార్పును గమనించి గ్రామస్థులు సైతం ఆశ్చర్యపోయారు. చట్ట వ్యతిరేక గర్భస్రావాలను, లింగ నిర్థారణ పరీక్షలను తాను ఎంతమాత్రం ప్రోత్సహించేది లేదని గ్రామస్థుల సమక్షంలో కౌర్ ప్రతిజ్ఞ చేసింది. ఆడశిశువు పట్ల కౌర్‌తో పాటు గ్రామస్థుల్లో ఇంత మార్పుకు కారణమేమిటన్నది అధికారులకు కూడా ఒకింత అర్థం కాలేదు. ‘ప్లాన్ ఇండియా’, ‘ఉర్ముల్ సేతు’ అనే స్వచ్ఛంద సంస్థలు ‘ఆడశిశువులను జన్మించనివ్వండం’టూ ఓ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడంతో రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాలో ఆశాజనకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆడశిశువులు వద్దంటూ ఒకప్పుడు ప్రచారం చేసిన కౌర్ లాంటి మహిళలు నేడు తమ వైఖరిని పూర్తిగా మార్చుకున్నారు.


                        ‘ప్లాన్ ఇండియా’, ‘ఉర్ముల్ సేతు’ సంస్థలు గంగానగర్ జిల్లాలోని అన్ని పంచాయతీల్లో సమన్వయకర్తలను నియమించాయి. వీరు అంగన్‌వాడీ, ‘ఆశ’ కార్యకర్తలతో కలిసి పనిచేయడం ప్రారంభించారు. లింగ నిర్థారణ పరీక్షలు, చట్ట వ్యతిరేక గర్భస్రావాలు జరగకుండా వీరు గ్రామాల్లో నిఘా పెట్టారు. దీంతో మగశిశువు కోసం ఎదురుచూస్తూ పదే పదే గర్భధారణకు సిద్ధమయ్యే మహిళల సంఖ్య క్రమంగా తగ్గింది. నలుగురు, అయిదుగురు ఆడపిల్లలను కన్న తల్లులు ఇక తమకు మగశిశువు అక్కర్లేదని కుటుంబ నియంత్రణ పద్ధతులను స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. ఆడపిల్ల పుడుతుందని తెలుసుకుని గర్భస్రావాలు చేయించుకునే వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఆడశిశువు జన్మించినా చాలా మంది దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆడశిశువు పుట్టినపుడు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు.


                     గర్భస్రావాలను ప్రోత్సహించేవారికి చట్టపరంగా శిక్షలు పడతాయని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గ్రామాల్లో చేస్తున్న ప్రచారం ఫలించింది. తాము చేసిన ప్రచారం ఫలితంగా కౌర్ లాంటి అంగన్‌వాడీ కార్యకర్తల్లో మార్పు వచ్చిందని స్వచ్ఛంద సంస్థ తరఫున సమన్వయకర్తలుగా పనిచేస్తున్న దంపతులు నిషా, విక్రమ్ సింగ్ చెబుతున్నారు. కౌర్ కుమార్తె రూబీ ఇటీవలే కవలలైన ఆడశిశువులకు జన్మనిచ్చిందని, ఆమెకు ఇదివరకే ఒక కుమార్తె ఉందని వారు తెలిపారు. ముగ్గురు ఆడపిల్లలను పెంచడం రూబీకి ఆర్థిక భారం కావడంతో- కవల పిల్లల్లో ఒకరిని దత్తత ఇచ్చేందుకు కౌర్ అంగీకరించినట్లు వారు వివరించారు. ఒకప్పుడు ఆడశిశువు అంటేనే వ్యతిరేకత చూపిన కౌర్‌లో ఈ మార్పు రావడం అందరినీ విస్మయపరచింది. వివాహం జరిగి పదహారేళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో నిషా,విక్రమ్ సింగ్ దంపతులు రూబీ కుమార్తెను దత్తత తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు.


                  ఇదే స్ఫూర్తితో గ్రామానికి చెందిన అయిదుగురు దంపతులు పేద కుటుంబాలకు చెందిన ఆడశిశువులను దత్తత తీసుకున్నారు. గర్భస్రావాలకు పాల్పడమని, ఆడశిశువు పుట్టినా ఆదరిస్తామని చాలా గ్రామాల్లో మహిళలు బహిరంగంగా ప్రతిజ్ఞలు చేస్తున్నారు.


                        ఆడశిశువుల సంరక్షణకు యువత కూడా కృషి చేస్తున్న సంఘటనలు నేడు రాజస్థాన్‌లో కనిపిస్తున్నాయి. రోటవాలికి చెందిన గురుతేజ్ సింగ్ (17) తన తాతగారి ఊరైన తలివాలా (పంజాబ్)కు వెళ్లినపుడు ఓ ఆడశిశువును దత్తత తీసుకున్నాడు. ఒకే కాన్పులో ఇద్దరు ఆడశిశువులకు జన్మనిచ్చిన ఓ మాతృమూర్తి ప్రసవం తర్వాత కన్నుమూసింది. ఆ ఇద్దరు ఆడపిల్లలను అనాథాశ్రమానికి అప్పగించి ఆమె భర్త రెండోపెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న గురుతేజ్ సింగ్ ఓ ఆడశిశువును తన వెంట తీసుకువెళ్లాడు. ఆ శిశువును ప్రేమతో పెంచుకునేందుకు గురుతేజ్ సింగ్ తల్లిదండ్రులు నిండుమనసుతో ముందుకు వచ్చారు. తల్లి లేని మరో ఆడశిశువును గ్రామంలోని ఓ దంపతులు చేరదీశారు.


                 గురుతేజ్ సింగ్‌ను స్ఫూర్తిగా తీసుకుని రోటవాలితో పాటు అనేక గ్రామాల్లో ఎంతోమంది దంపతులు ఆడశిశువులను దత్తత తీసుకున్నారు. ఆర్థిక స్థోమత లేని కుటుంబాల్లో ఆడపిల్లలు అధికంగా ఉంటే దత్తత ఇప్పించేలా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఒప్పిస్తున్నారు. పట్టణ ప్రాంతాల నుంచి కూడా అనేక మంది దంపతులు ఆడశిశువులను దత్తత తీసుకుంటామని గ్రామాలకు వస్తున్నారు.


                    మగశిశువు పుడితే ఒకప్పుడు గ్రామాల్లో ఇత్తడి పళ్లాలపై శబ్దాలు చేస్తూ సంబంధిత కుటుంబాల వారు కోలాహలం సృష్టించేవారు. అయితే, ఇ లాంటి ఆనందకర దృశ్యాలు ఆడపిల్లలు పుట్టిన ఆస్పత్రుల్లో నేడు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులు, బంధుమిత్రులే కాదు ఆస్పత్రి సిబ్బంది, నర్సులు కూడా ఆడశిశువులు పుట్టినపుడు వేడుకల్లో ఉత్సాహవంతంగా పాల్గొంటున్నారు.


మూలం : ఆంధ్రభూమి దినపత్రిక 

0 Comments

మామిడి వనం.. మహిళకు వరం!

6/25/2013

0 Comments

 
Picture
             కట్నం వేధింపులు, ఆడశిశువులపై నిరాదరణ లేని గ్రామం ఏదైనా ఉందంటే కొంచెం సేపు మనం తటపటాయించక తప్పదు. గత పదేళ్లలో మూడు మిలియన్ల ఆడపిల్లల ప్రాణాలు పురిట్లోనే తీసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయతే, బీహర్‌లోని కుగ్రామమైన ‘ధర్హార’లో వరకట్న హత్యలు, శిశు హత్యలు జరగడం లేదంటే నమ్మలేం. ఈ వాస్తవం ఉక్కు మహిళ కిరణ్‌బేడీనే కాదు, సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను సైతం ఆశ్చర్యపరచింది.


                     ఆ గ్రామంలో ఆడపిల్లలు సురక్షితంగా ఉండటానికి ప్రత్యేకించి పదునైన చట్టాలేమీ లేవు. అక్కడి మామిడి చెట్లే మహిళలను కాపాడుతున్నాయి. కట్టుబాట్లు, నియంతృత్వ భావాలకు నిలయమైన బీహార్‌లో దీన్ని మూఢ నమ్మకంగా కొట్టిపారెయ్యలేం. మామిడిచెట్టుకి-మగువకు మధ్య ఉన్న అవినాభావ సంబంధంపై వచ్చిన ‘మ్యాంగో మహిళలు’ డాక్యుమెంటరీ చిత్రం చూస్తే మాత్రం ‘ఔరా..!’- అంటూ ముక్కున వేలేసుకుంటాం. ప్రముఖ బాలీవుడ్ నటి కత్రీనా కైఫ్ ఈ గ్రామాన్ని సందర్శించి ‘మ్యాంగో మహిళల’తో ముచ్చటించి వెళ్లింది. బీహర్‌లోని భాగల్పూర్ జిల్లాలో కునాల్ శర్మ అనే పట్టు వ్యాపారికి ఆ మధ్య ఓ ఈ-మెయిల్ వచ్చింది. ఓ పత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని మెయల్‌లో ఆయన ఆసక్తిగా చదివాడు


                  ‘ధర్హార’ గ్రామంలో ఆడపిల్ల పుడితే పది మామిడి మొక్కలు నాటుతారు. ఆ చెట్ల ఫలసాయాన్ని ఆడపిల్ల చదువుకు, కట్నకానుకలకు వినియోగిస్తుంటారని ఆయన తెలుసుకున్నాడు. ఆ గ్రామం ఎక్కడ ఉందోనని ఇంటర్నెట్‌లో అన్వేషించి, చివరకు అది తన రాష్టమ్రైన బీహార్‌లోనే ఉన్నట్లు తెలుసుకున్నాడు. మహిళలపై వేధింపులలో 65 శాతం, అపహరణ కేసుల్లో 71 శాతం నేరాలతో దేశంలోనే నేరమయ రాష్ట్రంగా పేరొందిన బీహార్‌లో ఇలాంటి ఊరు ఉందని తెలిసి ఆయన విస్మయం చెందాడు. ప్రాంతీయ అభిమానంతో ఆయన సినిమా డైరెక్టర్ అవతారమెత్తి అమెరికాకు చెందిన తన మిత్రుడు రాబర్ట్‌తో ‘మ్యాంగో మహిళలు’ పేరిట డాక్యుమెంటరీ తీశాడు. ఈ డాక్యుమెంటరీ అందరినీ ఆలోచింపజేసేలా సాగటంతో ధర్హార మహిళల గురించి బాహ్య ప్రపంచానికి తెలిసింది. 


              ప్రస్తుతం ఆ గ్రామంలో దాదాపు మిలియన్ మామిడి చెట్లను 200 ఎకరాల్లో పెంచుతున్నారు. ఆడపిల్ల పుడితే చాలు పది మామిడి మొక్కలు నాటాల్సిందే. ఆడశిశువులతో పాటు వాటిని కూడా ప్రేమగా, శ్రద్ధగా పెంచుతారు. వాటిపై వచ్చే ఫలసాయాన్ని బ్యాంక్‌లో జమచేస్తారు. ఒక్కో ఆడపిల్లకు పెళ్లీడు వచ్చేసరికి 2 లక్షల రూపాయలకు పైగానే జమవుతోంది. ఈ డబ్బును ఆ అమ్మాయి చదువుకు, పెళ్లికి ఖర్చుచేస్తారు. పెళ్లి చేసేముందు వధువుకు తొలుత మామిడిచెట్టుతో వివాహం జరిపిస్తారు. ఇలా చేస్తే వరుడికి ఎలాంటి ఆపదా సంభవించదని గ్రామస్థుల నమ్మకం. నమ్మకాల సంగతెలా ఉన్నా, దాని వెనుక దాగిన మహత్తర సందేశం ఆచరణయోగ్యమైనదే. అందుకే ఈ గ్రామంలో ఆడపిల్ల పుడితే తల్లిదండ్రులు కుంపటిగా భావించరు. భారంగా భావించి చంపేయరు. ఆ ఊరి ఆడపిల్లలంతా చదువుకుంటూ మామిడిచెట్ల మధ్యనే ఆడుకుంటూ ఆనందంగా కాలం వెళ్లదీస్తున్నారు. 


                   దీనిపై మాజీ పోలీసు అధికారిణి కిరణ్‌బేడీ మాట్లాడుతూ, ‘భ్రూణ హత్యలను ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నాయి. ఆడపిల్ల పుట్టిన వెంటనే డబ్బు జమచేస్తామని ఆచరణ సాధ్యం కాని పథకాలు ప్రవేశపెట్టకుండా ఇలా చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తే బాగుంటుంది’- అని అభిప్రాయపడ్డారు. ఓ వైపు పర్యావరణాన్ని ప్రోత్సహిస్తూ, మరో వైపు ఆడపిల్లలకు అండగా నిలుస్తున్న మామిడిచెట్ల పెంపకం ఆలోచన సామాజిక మార్పుకు దోహదం చేస్తుందని ఈ డాక్యుమెంటరీ నిర్మాత రాబర్ట్ అంటున్నారు. లింగనిష్పత్తిలో చూస్తే నేడు ధర్హారలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 918 మంది మహిళలున్నారు. సంక్షేమ పథకాల ముసుగులో ఆర్భాటంగా ప్రచారం చేసుకునే ప్రభుత్వాలు ధర్హార గ్రామస్థులు చూపిన మార్గంలో పయనిస్తే పచ్చటి ప్రకృతి నీడలో మహిళలు ఒదిగిపోతారు. 

మూలం : ఆంధ్రభూమి దినపత్రిక 

0 Comments

కోర్కెలు శూన్యం.. బతుకంతా దైన్యం

6/19/2013

0 Comments

 
Picture
             యవ్వనం తొలి ప్రాయంలోకి అడుగుపెట్టే ఓ 14 ఏళ్ల బాలిక నోటివెంట ‘నాకేం కోరికలు లేవు’ అనే మాటలు వస్తే ఎలా ఉంటుంది? ఎన్నో ఆశలు. ఆకాంక్షలతో, చెంగుచెంగున సీతాకోకచిలుకల్లా ఎగరాల్సిన ఆ వయసులో ఏ కోరికలూ లేవంటే చిన్న వయసులోనే ఇంతటి నిర్వేదమా? అని ఆశ్చర్యపోతాం. కానీ, ‘‘ది డే మై గాడ్ డైడ్’’ అనే డాక్యుమెంటరీ చిత్రం చూస్తే మనకు ఆశ్చర్యం కాదు- ఆక్రోశం, ఆవేదన ఉప్పెనలా వస్తుంది.

                 దేశ ఆర్థిక రాజధానిగా ప్రసిద్ధిచెందిన ముంబై వేశ్యావాటికల్లో మగ్గుతున్న అభం శుభం తెలియని ఆడపిల్లల జీవితాలకు నిలువుటద్దంగా నిలిచే ఈ డాక్యుమెంటరీకి ఆండ్రూ లెనిన్ దర్శకత్వం వహించారు. ఇందులో 14 ఏళ్ల బాలిక అనుభవించిన నరకం ఎంత దారుణంగా ఉందో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఏడేళ్ల వయసులో బిస్కెట్ ఇస్తామని ఆశ చూపించి తీసుకెళ్లి వేశ్యావాటికలో అమ్మేసి, చీకటి గదుల్లో బంధించి విచక్షణ లేకుండా ఇనుపరాడ్లతో కొట్టి విటులకు ఆమెను అప్పగిస్తారు. ఫలితంగా గర్భం వస్తే అబార్షన్ చేయించి, రక్తం స్రావం తగ్గకుండానే మళ్లీ వృత్తిలోకి తోసేసి వారి వికృత కామానికి బలిచేస్తూ ఉంటే, ఇంకేం కోరికలు ఉంటాయి? ఇది ఒక అమ్మాయి కథ కాదు. ఇలాంటివి, ఇంతకంటే దారుణమైన కథల్ని వేశ్యావాటికల్లో అమ్మాయిలు వినిపిస్తారు.

               ఆడపిల్ల ఇంటికి దీపం అంటాం. లక్ష్మీదేవికి ప్రతిరూపం అని అపురూపంగా చూసుకుంటాం. తల్లిదండ్రులు, తోబుట్టువుల ప్రేమలో సంతోషంగా పెరగాల్సిన కొంతమంది అమ్మాయల జీవితాలు చిందరవందర అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అమ్మాయిలు అదృశ్యమవుతున్నారు. వాళ్ల శరీరాలకు పాతిక నుంచి యాభైవేలకు వెలకట్టి వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు. నేపాల్‌తో పాటు మన దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పదిహేనేళ్లలోపు ఆడపిల్లలను మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ముంబైలోని కామాటిపురా వేశ్యావాటికల్లో అమ్మేస్తున్నారు. మన రాష్ట్రంలోని అనంతపురం లాంటి కరవు ప్రాంతాల నుంచి కూడా బాలికలను ఈ వేశ్యావాటికలకు తరలిస్తున్నారు.

                వ్యభిచారం ఓ వ్యాపారం మాదిరి రష్యా, ఆసియా, యూరప్, ఆఫ్రికా, అమెరికాలోనూ జరుగుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు యాభైవేల మంది అమ్మాయిలను అమెరికాకు తరలిస్తున్నారని ఓ అధ్యయనంలో తేలింది. ఒకసారి ఈ మురికి కూపాల్లో చేరినవాళ్లకు విముక్తి అనేది ఉండదు. వేశ్యావాటికల్లో మైనర్ బాలికలకు అబార్షన్లు చేయించడం సర్వసాధారణం. అది కూడా నకిలీ డాక్టర్లే చేస్తారు. ఆ తర్వాత వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నా విశ్రాంతి కూడా ఇవ్వకుండా వ్యాపారాన్ని కొనసాగిస్తారు. వీళ్లకు రోజుకు ఒక్కపూట ఆహారం, వారానికోసారి మాత్రమే స్నానం చేసే వీలుంటుంది. శుభ్రతలేని పరిసరాలు, తగిన తిండి లేక అమ్మాయిల ఆరోగ్యాలు పాడవుతుంటాయి. రకరకాల ఇనె్ఫక్షన్లు, ఎయిడ్స్‌లాంటి రోగాలు కమ్ముకున్నా వైద్యం చేయించే నాథుడే ఉండడు. రక్షించే పోలీసులు కూడా భక్షించేవారే. మైనర్ బాలికలను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళతారు. విముక్తి లభిస్తుందని సంబరపడినంత సమయం కూడా ఉండదు. వ్యభిచార గృహ నిర్వాహకులు జరిమానా కట్టి వాళ్లను విడిపించుకుని వెళ్లాక మళ్లీ అవే కష్టాలు. ఖర్మకాలి పిల్లలు పుడితే వాళ్లు కూడా అక్కడే ఉండక తప్పదు. వేశ్యావాటికల్లో మగ్గే మహిళలు తమ జీవితాలు నాశనమైనా, తమ పిల్లలైనా మంచి జీవితం గడపాలని, చదువుకోవాలని కోరుకుంటున్నారు. తమ శత్రువులకు కూడా ఇలాంటి దుస్థితి రాకూడదని కోరుకుంటున్నారు. ఈ డాక్యుమెంటరీలో బాధిత అమ్మాయిలే స్వయంగా చెప్పినవి వింటుంటే ఎవరికైనా కోపం, ఆవేదన కలుగుతుంది. కాగా, తమ దేశం నుంచి అపహరించుకు పోయన ఆడపిల్లల కోసం అనురాధా కొయిరాలా నేపాల్‌లో ‘‘మైత్రీ’’ అనే శరణాలయాన్ని స్థాపించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. వేశ్యావాటికల నుండి తప్పించుకున్న ఆడపిల్లలకు వసతి కల్పించి వారికి ఓ దారిని చూపిస్తున్నారు. అలా బయటకొచ్చిన కొందరు అమ్మాయిలు తమ కుటుంబాలను తిరిగి కలుసుకున్నారు. కొందరు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఆ మురికికూపం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించి బందీలైన మరికొంతమంది అమ్మాయిలను పోలీసుల సాయంతో బయటకు తీసుకొచ్చారు. ఈ సామాజిక దురవస్థను సమూలంగా అంతం చేయడానికి, శాశ్వత పరిష్కారం కోసం ‘మైత్రీ’ శరణాలయం నిర్వాహకులు యథాశక్తిన ప్రయత్నిస్తున్నారు.

మూలం : ఆంధ్రభూమి



0 Comments
Forward>>

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం.

    Archives

    May 2014
    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    July 2013
    June 2013

    Categories

    All
    'నోబెల్' ఇంట్లో ఆమెకు గుర్తింపేదీ?
    టెన్ కమాండ్‌మెంట్స్
    మామిడి వనం.. మహిళకు వరం!
    అస్త్ర తంత్ర : కాన్ఫిడెన్సే మీ బాడీగార్డ్
    నెలసరి నొప్పి తగ్గేదెలా?
    కాబోయే తల్లులూ... మందుల విషయంలో జర భద్రం!
    పోషకాహార లోపం.. పడతులకు శాపం
    కోర్కెలు శూన్యం.. బతుకంతా దైన్యం
    మొదలైందా నెలసరి...ఈ ఆహారం సరి..!
    అల్లుకునే బంధాలకు బతుకమ్మ
    ఆడశిశువుకు ఆహ్వాన గీతిక..!
    పెనవేసుకొనే పేగు బంధం
    అత్తారింట్లో నవవధువు అలవాటుపడేదెలా?
    పోషకాహారంతోనే శిశువు ఆరోగ్యం
    పెళ్లిళ్లెందుకు పెటాకులు..?
    పెళ్లిళ్లెందుకు పెటాకులు..?
    తల్లులు విటమిన్ డి తీసుకొంటే.. పిల్లలు బాడ
    ఆసక్తి ఉంటే అతివకు ‘షేర్ మార్కెట్’ సులభమĺ

    RSS Feed


Powered by Create your own unique website with customizable templates.