వారానికి మూడుసార్లు మాత్రమే!
షాంపూలో సహజసిద్ధమైన గుణాలు ఉన్నవి ఎంచుకోవాలి. రసాయనాలు ఎక్కువగా ఉన్నవి, ఎక్కువసార్లు షాంపూ వాడటం వంటివి చేస్తే వెంట్రుకలు త్వరగా పొడిబారుతాయి. వారానికి మూడుసార్లకన్నా ఎక్కువగా షాంపూను ఉపయోగించకూడదు. రోజు విడిచి రోజు తలస్నానం చేసినా పర్వాలేదు. అయితే వేడినీటిని తలస్నానానికి ఉపయోగించకపోవడం మేలు.
సహజసిద్ధంగానే పొడిగా!
జుట్టుకు వేడి ప్రధానమైన శత్రువు. అందుకే తడిగా ఉన్న జుట్టును ఆరబెట్టడానికి హెయిర్ డ్రయ్యర్లు, ప్లాట్ ఐరన్స్ వాడకూడదు. కనీసం వాటిని ఎక్కువసార్లు ఉపయోగించకుండా ఉండటానికి ప్రయత్నించాలి. వేడిని భరించగలిగే హీట్ సిరమ్‌ను ముందుగా జుట్టుకు రాసి, తర్వాత డ్రయ్యర్, స్ట్రెయిటనింగ్ మిషన్స్ వాడాలి. తడి జుట్టును త్వరగా వేడి చేయకుండా చూస్తే వెంట్రుకలు త్వరగా దెబ్బతినడాన్ని నివారించవచ్చు.
ట్రిమ్మింగ్!
వెంట్రుకలు చిట్లడాన్ని అరికట్టడానికి మంచి పరిష్కారం ట్రిమ్ చేయడం. 6-8 వారాలకు ఒకసారి వెంట్రుకల చివరలను ట్రిమ్ చేయించుకోవాలి.
ఇంటి చికిత్స:
నూనెతో మర్దన: జుట్టు తేమను అందించాలంటే నూనెతో మసాజ్ చేయడం సరైన పద్ధతి. కొబ్బరి నూనె, ఆలివ్ నూనె లేదా బాదం నూనెలను కలిపి మాడుకు పట్టించి, మర్దనా చేయాలి. అరగంట వదిలేసి ఆ తర్వాత ప్రకృతి సిద్ధ గుణాలు ఎక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి.
గుడ్డుతో: మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, టేబుల్‌స్పూన్ తేనె గుడ్డు సొనలో కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.
బొప్పాయితో: ప్రొటీన్లు ఎక్కువగా గల బొప్పాయి పండును గుజ్జులా చేయాలి. ఈ గుజ్జులో పెరుగు కలిపి తలకు పట్టించాలి. 30 ని.ల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే తేమ కోల్పోయిన వెంట్రుకలకు తిరిగి జీవం లభిస్తుంది.
తేనెతో: తలస్నానం చేసిన తర్వాత చాలామంది కండిషనర్ వాడుతుంటారు. దానికి బదులుగా వెంట్రుకలకు కండిషనర్‌లా ఉపయోగపడే కప్పు తేనెలో రెండు టేబుల్ స్పూన్ల గోరువెచ్చని నీటిని కలిపి తలకు పట్టించాలి. 15 ని.ల తర్వాత నీటితో కడిగేయాలి.