- బంగాళాదుంపల్ని మెత్తగా చేసి రసం తీసిపెట్టుకోవాలి. దాంతో తరచూ ముఖం కడుక్కుంటే కళతప్పి, నిర్జీవంగా మారిన చర్మం మెరిసిపోతుంది. వీలైతే ప్రతిరోజూ చేసినా మంచిదే! చర్మం కమిలిపోయిన చోట రాస్తే త్వరగా ఫలితం కనిపిస్తుంది.
- రెండు చెంచాల బంగాళాదుంప రసంలో చెంచా నిమ్మరసం కలిపి కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. బయటకు తీశాక దూదితో ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని, పది నిమిషాలయ్యాక కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం శుభ్రపడుతుంది. ఛాయ మెరుగుపడుతుంది. మొటిమలూ, మచ్చలు ఏర్పడటం వంటి సమస్యలు దూరమవుతాయి.
- ముల్తానీ మట్టిలో చెంచా బంగాళాదుంప గుజ్జూ, నాలుగు చుక్కల రోజ్‌వాటర్ కలిపి ముఖానికి పూతలా రాసుకోవాలి. పావుగంటయ్యాక గోరువెచ్చటి నీళ్లతో శుభ్రపరచుకోవాలి. తరవాత చన్నీళ్లలో తడిపిన వస్త్రంతో ముఖం తుడుచుకోవాలి. మర్నాటికి చర్మం తాజాగా తయారవుతుంది.
- బంగాళాదుంపను ఉడికించి మెత్తగా చేసుకోవాలి. అందులో కొంచెం పాలపొడి, బాదం నూనె చేర్చి ముఖానికి మర్దన చేసుకోవాలి. తరచూ ఇలా చేయడం వల్ల పొడిబారిన చర్మానికి తేమ అందుతుంది.
- కళ్ల కింద నల్లమచ్చలు ఇబ్బంది పెడుతుంటే బంగాళాదుంపను ముక్కల్లా తరిగి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. తరవాత తీసి కళ్ల కింద రుద్దుకోవాలి. కొన్ని నిమిషాల పాటు కళ్ల మీద పెట్టుకోవాలి. ప్రతి రోజూ ఇలా చేస్తుంటే క్రమంగా నల్లమచ్చలు తగ్గుముఖం పడతాయి.
- నారింజ తొక్కల్ని అయిదు నిమిషాలపాటు ఉడకబెట్టి చల్లార్చాలి. చల్లారినవాటితో మెడపైన, ముఖం మీద సుతిమెత్తగా రుద్ది అయిదు నిమిషాల తరవాత కడిగేయాలి. ఇలా వారంలో ఒక్కసారయినా చేస్తే చర్మం తాజాగా ఉంటుంది.
- టీస్పూన్ తేనెలో కొద్దిగా కుంకుమపువ్వు కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరచుకోవాలి. రోజూ ఇలా చేస్తుంటే నల్ల మచ్చలు తగ్గి, ముఖ కాంతి పెరుగుతుంది.
- రెండు చెంచాల పాలల్లో, బాదం పొడి, కలబంద గుజ్జు, తేనె కలిపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ మీద ఆప్లై చేసి అరగంటయ్యాక కడిగేసుకోవాలి. ఇలా చేస్తే ఈ కాలంలో వచ్చే చర్మ సమస్యలు దూరమవుతాయి. చర్మం పొడిబారకుండా కూడా ఉంటుంది.