
- జుట్టు తెల్లబడినప్పుడు రంగు వేసుకోకుండా, గోరింటాకు (హెన్నా) వాడడం ఎంతో మంచిదంటారు. మరి, ఇంతకీ హెన్నాతో ప్రయోజనాలు ఏమిటంటారా? చాలానే ఉన్నాయంటున్నారు శిరోజాల నిపుణులు.
- హెన్నా వల్ల జుట్టు బలం పుంజుకుంటుంది. జట్టు ఒత్తుగా పెరగడానికి కూడా హెన్నా దోహదం చేస్తుంది. అలాగే, శిరోజాలు మృదువుగా, నిగనిగలాడేలా చేస్తుంది. నిజానికి, భారతదేశంలోనే కాక, ఉష్ణమండల దేశాలన్నిటిలో వాడే ప్రసిద్ధమైన సౌందర్య మూలికల్లో 'హెన్నా' ఒకటి.
- కంటికీ, ఒంటికీ చలవ చేయడానికి హెన్నా ఉపయోగపడుతుందని చెబుతారు. అందుకే, జుట్టు నిగనిగలాడడానికీ, ఆరోగ్యంగా, కంటికి ఇంపుగా ఉండడానికీ హెన్నా వాడడమనేది ఎన్నో ఏళ్ళుగా అలవాటులో ఉంది.
- చేతులను అందంగా అలంకరించుకొనేందుకు గోరింటాకు వాడడం అందరికీ తెలిసిందే. అయితే, జుట్టు కుదుళ్ళు గట్టిబడడానికి కూడా అది అంతేలా ఉపకరిస్తుంది.
హెయిర్ కండిషనర్‌గా...
జుట్టుకు కండిషనర్ లాగా పని చేస్తుంది హెన్నా. ప్రతి వెంట్రుక కుదురునూ తాకి, జట్టు మొదళ్ళు పాడైపోకుండా, ఓ రక్షణ కవచంలా వ్యవహరిస్తుంది. హెన్నాను క్రమం తప్పకుండా వాడినట్లయితే, జుట్టు ఒత్తుగా వస్తుంది. జుట్టులో తగినంత తేమను కల్పించి, పటిష్ఠంగా మారుస్తుంది. ఈ హెర్బల్ హెయిర్ ప్యాక్ వల్ల జుట్టుకు సహజమైన నిగారింపు వస్తుంది. మామూలు కన్నా రెట్టింపు బలంగా జుట్టు తయారవుతుంది.
చుండ్రుకు నివారణగా...
చుండ్రు బాధ నుంచి విముక్తి కల్పించడానికి కూడా హెన్నా సమర్థంగా ఉపయోగపడుతుంది. దీనికి ఓ చిట్కా చెబుతారు.
ఓ రెండు టీ స్పూన్ల మెంతి గింజలు తీసుకోండి. వాటిని రాత్రి అంతా నీళ్ళలో నానబెట్టండి. ఉదయాన్నే వాటిని మెత్తగా రుబ్బండి. అలాగే, కొద్దిగా ఆముదం తీసుకొని, వేడి చేయండి. దానికి కొద్దిగా గోరింట ఆకులు కలపండి. తరువాత ఆ నూనెను చల్లారబెట్టాలి.దానికి, ఇందాకటి మెంతుల మిశ్రమాన్ని చేర్చండి. దాన్ని జుట్టుకు బాగా పట్టించాలి. తల స్నానం చేయడానికి ఓ గంట ముందు ఈ పని చేయాలి. ఆ తరువాత తలార స్నానం చేస్తే, ఇక చుండ్రు మటుమాయం.
నెరిసిన జుట్టుకు విరుగుడుగా...
జుట్టు ఆరోగ్యంగా ఉంటూనే, అందంగా, నిగనిగలాడుతూ ఉండాలనుకుంటున్నారా? అయితే, నెరిసిన జుట్టుకు అనవసరంగా రసాయనాలతో కూడిన రంగులు వేయకండి. హాయిగా తలకు గోరింట పెట్టుకోండి. జుట్టులోని తేమను తొలగించే ఎమినో యాసిడ్ కానీ, ఇతర రసాయనాలు కానీ హెన్నాలో లేవు. దాని వల్ల హెన్నాను వాడితే, జుట్టు దెబ్బతినదు. నిస్తేజంగా మారదు.
ఎండబెట్టిన ఉసిరికాయ ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు తీసుకోండి. వాటిని నీళ్ళలో వేసి, మరగబెట్టండి. అలాగే, అందుకు ఒక టీ స్పూన్ బ్లాక్ టీ వేయండి. రెండు లవంగాలు కూడా వేయండి. వాటన్నిటితో మరిగిన నీటిలో, హెన్నా వేసి, పేస్ట్ లాగా చేయండి. ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. అలా రాత్రి అంతా ఉంచుకోవాలి. లేదంటే కనీసం ఓ రెండు గంటల పాటైనా ఉంచాలి. అంతే! నెరిసిన జుట్టు స్థానంలో నిగారింపుతో కూడిన జుట్టు ప్రత్యక్షం.
ఆరోగ్యవంతమైన శిరోజాలకు...
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే, నెలకు రెండు సార్లు హెన్నా పెట్టుకోండి. దీని వల్ల జుట్టు మునుపటి ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది.
జుట్టులోని సహజమైన సమతూకాన్ని చెడగొట్టకుండానే, మాడు మీద యాసిడ్ - ఆల్కలైన్ సమతూకాన్ని హెన్నా తిరిగి రాబడుతుంది. ఉసిరికాయ ముక్కలు వేసిన నీళ్ళలో, హెన్నా కూడా వేసి, దాదాపు రెండు గంటలు మరగబెట్టండి. ఆ మిశ్రమాన్ని తల మీద మాడుతో సహా జుట్టుకు పట్టిస్తే, మంచి ఫలితాలు ఉంటాయి.