
కావలసిన పదార్థాలు :
గోధుమ పిండి - 2 కప్పులు
పచ్చికొబ్బరి తురుము - 1/2 కప్పు
ఉప్పు - తగినంత
పంచదార - 2 టీ.స్పూ.
నీళ్లు - తగినన్ని
తయారుచేసే పద్ధతి :
ఒక వెడల్పాటి గినె్నలో జల్లించిన గోధుమ పిండి, ఉప్పు, పంచదార వేసి బాగా వేసి కలపాలి. ఇందులో తగినన్ని నీళ్లు చల్లుకుంటూ చేతులతో కలపాలి. ఇది పలుచగా ఉండకూడదు. కాస్త తడిగా అయ్యి పొడి పొడిగానూ ఉండాలి.
ఇప్పుడు పుట్టు చేయడానికి కిందనున్న పాత్రలో సగం వరకు నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టి వేడి చేయాలి. పొడవాటి గొట్టంలో అడుగున చిల్లులున్న ప్లేట్లు వేయాలి. దీనిపైన ముందుగా పచ్చికొబ్బరి తురుము, దానిపైన పుట్టు మిశ్రమం, ఆపైన కొబ్బరి తురుము, మళ్లీ దానిపైన పుట్టు మిశ్రమం.. ఇలా వరుసగా పేర్చుకుంటూ చివరిలో కొబ్బరి తురుము వచ్చేలా చూసుకోవాలి. దానిపైన మూత పెట్టాలి. ఇపుడు ఈ గొట్టాన్ని మరుగుతున్న నీళ్లతో ఉన్న గినె్నపైన పెట్టి ఐదారు నిమిషాలు ఉడికించాలి. తర్వాత తీసి మెల్లిగా తట్టి గరిటతో తోస్తే ఉడికిన పుట్టు బయటకొస్తుంది. దీనిపైన కాస్త పంచదార చల్లి అరటిపండుతో వెంటనే సర్వ్చేయాలి. ఒకవేళ పుట్టు చేసే పాత్ర లేకుంటే ఒక గినె్నలో నీళ్లు పోసి దానిపైన జల్లెడ పెట్టాలి. ఇందులో పల్చటి బట్టపరిచి అందులో కలుపుకున్న పుట్టు మిశ్రమం పచ్చి కొబ్బరి తురుము వేసి మూత పెట్టి ఆవిరిమీద ఉడికించాలి. చూడడానికి ఆకారం వేరుగా ఉన్నా రుచి మాత్రం మారదు.