బజ్జీ మిరపకాయలు : 8 నుంచి 10, పనీర్ తురుము : 1/2 కప్పు, క్యారట్ తురుము : 4 స్పూన్లు, బీన్స్ తురుము : 5 స్పూన్లు, ఉప్పు : తగినంత, మైదా : 100 గ్రాములు, డాల్డా : 2 స్పూన్లు, మిరియాల పొడి : 1/4 స్పూన్లు, అజినొమొటొ : చిటికెడు, కొత్తిమీర : కొద్దిగా, నిమ్మరసం : స్పూన్, నూనె : వేయించడానికి.
తయారు చేయు విధానం
మైదాలో కరిగించిన డాల్డా , చిటికెడు ఉప్పు వేసి కలిపి నీళ్లతో చపాతీ పిండిలా తడిపి మూతపెట్టి ఉంచుకోవాలి. బజ్జీ మిరపకాయలను నిలువుగా గాటు పెట్టి లోపలి గింజలు తీసేయాలి. మరుగుతున్న నీళ్లలో వేసి రెండు నిమిషాలు ఉంచి తీసేయాలి. వీటిని పూర్తిగా ఆరనివ్వాలి. ఒక ప్యాన్‌లో చెంచాడు నూనె వేడి చేసి సన్నగా తరిగిన క్యారట్ , బీన్స్ తురుము వేసి పచ్చి వాసన పోయేవరకు వేపాలి. ఇందులో పనీర్ తురుము, ఉప్పు, అజినొమొటొ, మిరియాలపొడి వేసి మరి కొద్దిసేపు వేయించి కొద్దిగా కొత్తిమిర కలిపి దింపేయాలి. పూర్తిగా చల్లారాక నిమ్మరసం కలపాలి. పచ్చిమిర్చీలలో ఈ మిశ్రమాన్ని నింపి గట్టిగా వత్తి పెట్టుకొవాలి. మైదా పిండిని మర్ధనా చేసి మృదువుగా అయ్యాక చిన్న ఉండలు చేసుకోవాలి. ఈ ఉండను పలుచటి చపాతీలా వత్తుకుని చాకుతో సన్నటి పట్టీలలా కట్ చేసుకోవాలి. ఈ పట్టీని పనీర్ మిశ్రమమ పెట్టిన మిర్చీకి రెండు వైపులా అందంగా చుట్టి ఊడిపోకుండా మిర్చీకేసి మెల్లిగా వత్తాలి. అన్నీ తయారయ్యాక వేడి నూనే వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకుని స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ, ఉల్లిపాయ, టమాటాలతో లేదా టమాటా సాస్‌తో సర్వ్ చేయాలి. ఈ మిర్చీలను కట్ చేసి పెరుగు వగైరా వేసి చాట్ లా కూడా సర్వ్ చేయొచ్చు..