పదేళ్ల కిత్రం లలితమ్మ రోజుకూలి. పొద్దునే కొడవలి పట్టుకుని పొలానికి వెళితేగాని పొట్టగడిచేది కాదు. సొంతంగా పొలం ఉన్నా...పెట్టుబడి పెట్టి పండించే స్తోమతలేక లలితమ్మ, ఆమె భర్త వ్యవసాయ పనులు చేసుకుని బతుకు బండినీడ్చారు. నాటి రోజుకూలి లలితమ్మే ఇప్పుడు ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్లకు పాఠాలు చెప్పింది. మూడు నెలల క్రితం ఢిల్లీలోని లాల్‌బహుదూర్ శాస్త్రి నేషనల్ ఎకాడమి ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వేదికగా లలితమ్మ పాఠాలు విన్న ట్రైనీ ఐఏఎస్‌లు హాలు దద్దరిల్లేలా చప్పట్లు కొట్టారు. ‘పుస్తకాల్లో అక్షరాలు కాదు...లలితమ్మలాంటి సాక్ష్యాలు’ కావాలంటూ శిక్షణలో ఉన్న కలెక్టర్లు సభాముఖంగా తెలియజేశారు. అవును, అధిక దిగుబడిని వచ్చే వ్యవసాయ పద్ధతుల్ని ల్యాబ్‌లో కాదు లైవ్‌గానే చేసి చూపించాలి. లలితమ్మ అదే చేసింది. సుస్థిర వ్యవసాయం పేరుతో అంతరించిపోతున్న పాత పంటల్ని సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పండించి అధిక లాభాలు గడిస్తున్న లలితమ్మ తోటి రైతులందరికీ ఆదర్శంగా నిలబడడం వెనకున్న విశేషాలే ఈ వారం ప్రజాంశం.
‘‘హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మీదిమోటార్ల (విమానం) తీస్కపోయిండ్రు. అక్కడ మసూర్కి పోవాలన్నరు. చూస్తే ఏప్రిల్ నెల...ఈడ ఎండలు మండుతుంటే... ఆడ మస్తు చలి. సెట్టర్లు కట్టుకుని పోయినం. గదేదో... చదువుకునే కాలేజి లెక్కుంది. పెద్ద హాలునిండ నల్లసూట్లు ఏసుకుని మస్తు జనమున్నరు. ఈడికెల్లి నాతోని ఇంకో నలుగురు ఆడోళ్లు వచ్చిండ్రు. లోపలికి పోంగనే రాండ్రి అనుకుంటూ మా చేతులు వట్టుకుని తీస్కపోయిండ్రు. ముందుగాల మమ్మల్ని తీస్కపోయిన రాయుడుసారు ఇంగ్లీష్‌ల మాట్లాడిండు. ఆ తర్వాత నన్ను మాట్లాడమన్నరు. నేను తెలుగుల చెబుతుంటే...గతే ముచ్చట ఆ సారు ఇంగ్లీష్‌ల చెప్పిండు’’ అని ఎంతో ఆనందంగా చెప్పింది లలితమ్మ. మెదక్‌జిల్లా జహిరాబాద్ మండలం రాయ్‌పల్లి గ్రామానికి చెందిన లలితమ్మ తన జీవితంలో మోటర్‌సైకిల్ కూడా ఎక్కుతాననుకోలేదు, ఏకంగా విమానంలో వెళ్లి ట్రైనీ ఐఏఎస్‌లకు క్లాస్‌లిచ్చింది.
సుస్థిర వ్యవసాయం
‘‘గిప్పుడు తినే తిండిల బలంలేదు అంటున్నరు. అయినా తింటున్నరు. ఏం జేస్తరు. మందులేసి మందుల్ని పండించుకుంటున్నం. గదంత ఎందుకు పంట పండించేటోడే కరువైండు. ఇంక మందుల పంటలు, మంచి పంటల సంగతెక్కడిది. ఎవరైనా... పొలముంది కదా అని పంట పెడితే పెట్టిన సొమ్ము కూడా వస్తలేదు. పదేళ్లక్రితం నాది గూడ ఇదే కథ. అప్పుడు... ఇందిర క్రాంతి పథకం కింద సుస్థిర వ్యవసాయ పద్ధతుల గురించి కొందరు సార్లు వచ్చి మాకు శిక్షణ ఇచ్చిండ్రు. మా చుట్టుపక్కల రైతులంతా మంచిగ విని ఊకుండ్రు. నాకు మాత్రం నచ్చి మా చేన్ల చాన ప్రయోగాలు చేసిన. ఇంకెవరో వచ్చి పాత పంటలకు ఇప్పుడు మస్తు గిరాకి ఉందని చెబితే వాటి గురించి ఆలోచన జేసిన’’ అంటూ తన తొలి అడుగుల గురించి పూసగుచ్చినట్టు వివరించింది లలితమ్మ. కొర్రలు, సామలు, తైదలు, పచ్చసజ్జలు, నల్లనువ్వులు వంటి పాత పంటల్ని పండించి పట్టణాలకు ఎగుమతి చేయడం సుస్థిర వ్యవసాయంలో లలితమ్మ ప్రత్యేకత.
ఎరువుల రహస్యం...
వ్యవసాయం పేరు చెప్పగానే రైతులకు రసాయన ఎరువుల ధరలు గుర్తుకొస్తాయి. ఏళ్ల అనుభవం ఉన్న రైతులు కూడా వ్యవసాయం పేరు చెప్పేటప్పటికి చేతులెత్తేసే పరిస్థితుల్లో లలితమ్మ అద్భుతమైన లాభాలు గడిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆమె సొంతంగా తయారుచేసుకుంటున్న సేంద్రీయ ఎరువులే. వాటి వెనకున్న రహస్యం కనుక్కోడానికే సెర్ప్(సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ)వారు ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లి కలెక్టర్ల ముందు కూర్చుబెట్టారు. ‘‘ఢిల్లీల కలెక్టర్లకు నా వ్యవసాయ పద్ధతుల గురించి చెప్పినంక ఒకాయన లేచి నేను తయారుచేసే ఘనజీవామృతం ఎరువు గురించి అడిగిండు. ఎట్లచేయాలో కూడా చెప్పమన్నడు. అన్నీ వివరంగా చెప్పినంక అందరూ లేచి నిలవడి తప్పట్లు కొట్టిండ్రు. వాళ్లనట్ల జూసేసరికి వంద ఎకరాలల్ల పంట ఊడ్చినంత సంతోషమొచ్చింది’’ అని ఎంతో గర్వంగా చెప్పిన లలితమ్మ కళ్లలో ఆకలి తీర్చే రైతన్నతో పాటు, తెలిసిన విద్యను పదిమందికి పంచిపెట్టే గురువు కూడా కనిపించాడు. ఘనజీవామృతం అంటే...పొలానికి వాడే సేంద్రీయ ఎరువు. ‘‘పది కిలోల పెండల రెండు కిలోల పప్పుల పొడి, రెండు కిలోల బెల్లం, ఒక కిలో పుట్టమట్టి, మూడు లీటర్ల ఆవు మూత్రం బోసి బాగ కలిపి ఎండవెట్టాలి. పది దినాల తర్వాత అది చాయిపత్త పొడిలా అయితది.. దాన్నిపొలంల యిత్తులు పెట్టినపుడు, కలుపుతీసినపుడు సల్లితే మొక్కలు దొడ్డుగ వెరుగుతయి. గీ సంగతే ఢిల్లీల కలెక్టర్లతో చెప్పిన. వాళ్లు పుస్తకంల రాసుకున్నరు’’ అని తన ఎరువుల తయారీ గురించి చెప్పింది లలితమ్మ.
అన్నీ తానై....
సుస్థిర వ్యవసాయం అంటే ఎరువుల్ని, విత్తనాల్ని రైతులే తయారుచేసుకోవాలి. ఓపికుంటే అమ్మకాలు కూడా రైతులే చేసుకుంటే పెట్టుబడిలేని వ్యాపారంలా సాగుతుంది. లలితమ్మ విజయం వెనకున్న కారణాలు ఇవే. తనకోసం మాత్రమే కాదు ఆ చుట్ట్టుపక్కల యాభై మంది రైతులకు సేంద్రీయ విత్తనాలను, ఎరువుల్ని అమ్ముతుంది కూడా. ప్రస్తుతం ఆమె పదమూడు రకాల సేంద్రీయ పంటల్ని పండిస్తోంది. అమ్మకం పని కూడా తనదే. దళారీల ప్రసక్తే రానివ్వదు. ‘‘పొలముంది కదా అని ఒకటే రకం పంట ఏసుకుంటే బొమ్మ బొరుసులెక్క ఉంటది. అట్లగాకుండా నాలుగైదు రకాల పంటలేసుకుంటే అమ్ముకోడానికి బాగుంటుంది. ఒకదాన్ల నష్టమొచ్చినా ఇంకోదాన్ల లాభమొస్తది. మన దగ్గర రైతులు ఎక్కువ తలకాయి నొప్పిలేకుండా పంట పండాలంటరు. వ్యవసాయంలా ఎంత ఓర్పు ఉంటే గంత లాభముంటది. పంట సరిగ రాకుంటే దేవుడా....అంట కూసుంటరు. మొక్క లేవకుంటే ఎంబడే పీకేసి కూరగాయలు పెట్టుకుని మార్కెట్‌కి ఏస్కుంటే కాలం కలిసొస్తది, సొమ్ములొస్తయి’’ లలితమ్మ ఆలోచనతో కాదు...అనుభవంతో చెప్పిన మాటలివి. ఐదేళ్లపాటు పాతపంటలపై రకరకాల ప్రయోగాలు చేసి, ఆ తర్వాత ఐదేళ్లలో సేంద్రీయ పంటల్లో ఎవ్వరూ ఊహించని విజయాలు సాధించింది. అందుకుగానూ మూడేళ్లక్రితం ప్రభుత్వంవారు ఉత్తమరైతు అవార్డు కూడా ఇచ్చారు.
తోటి రైతులకు...
కొర్రలు తింటే స్థూలకాయం తగ్గుతుంది. సజ్జలు మంచి న్యూట్రిషన్, తైదలు శక్తినిస్తాయి. మరివన్నీ ఎక్కడ దొరుకుతాయి? అక్కడక్కడ తప్ప ఎక్కడబడితే అక్కడ అందుబాటులో లేవు. ఈ విషయాన్ని గ్రహించిన లలితమ్మ లాభాలరైతుగా పేరు తెచ్చుకుంది. ఆమె విత్తనాలకు, ఎరువులకు, ఆహార ధాన్యాలకు విపరీతమైన గిరాకి ఉంది. అలాగని లలితమ్మ తన వ్యవసాయాన్ని పదుల ఎకరాలకు విస్తరింపచేయలేదు. తనకున్న నాలుగెకరాల్లోనే ప్రయోగాలైనా, పంటలైనా. తన వ్యవసాయ పనులతో పాటు తన గ్రామంలో ఉన్న రైతులకు, చుట్టుపక్కల సేంద్రీయ పద్ధతుల్లో పంటలు వేసే రైతులకు లలితమ్మ ఉచితంగా శిక్షణ ఇస్తోంది. ఏ రైతుకొచ్చిన ఇబ్బంది అయినా, సందేహమైనా తీర్చేవరకూ లలితమ్మకు నిద్ర పట్టదు. మొక్క పెట్టే దగ్గర నుంచి మార్కెట్ కెళ్లేవరకూ ఆ చుట్టుపక్కల రైతులకు లలితమ్మ అండగా నిలబడుతుంది. గురువులు పాఠాలు మాత్రమే చెబుతారు. లలితమ్మ పాఠాలు చెపుతూనే ప్రాక్టికల్స్ చేసి చూపిస్తోంది. వాటిలో పొరపాటు జరక్కుండా కాపాడుతుంది కూడా. అందుకే ఈమె టీచింగ్‌కి కాబోయే కలెక్టర్లుసైతం లేచి నిలబడి చప్పట్లు కొట్టారు.
మొక్క పెట్టే దగ్గర నుంచి మార్కెట్‌కెళ్లేవరకూ ఆ చుట్టుపక్కల రైతులకు లలితమ్మ అండగా నిలబడుతుంది. గురువులు పాఠాలు మాత్రమే చెబుతారు. లలితమ్మ పాఠాలు చెపుతూనే ప్రాక్టికల్స్ చేసి చూపిస్తోంది.
మూలం : సాక్షి దినపత్రిక