‘ఎవరో ఒకరూ... ఎపుడో అపుడూ.. నడవరా ముందుకు... అటో ఇటో ఎటోవైపు..’ -ఈ పాట చాలాసార్లు మనం వినే వుంటాం. ఎవరో? ఎప్పుడో? అనేది మాత్రం ప్రశ్నార్థకమే! అయితే- ‘ఆమె’ని కలిశాక ఆ పాట అక్షర సత్యం అనిపించింది. అనాథలను ఆదుకోవడమే కాదు, ఎంతోమంది మానసిక వి కలాంగులకు ఆశ్రయం ఇస్తూ వారి యోగ క్షేమాలను కనిపెడుతూ వారికి ఆమె జీవన మాధుర్యం చవి చూపుతోంది. సొంత తల్లిదండ్రులను ఇంట్లో ఉంచుకొని రెండు పూటలు భోజనం పెట్టలేకపోతున్న ఈ రోజుల్లో అనాథ శవాలకి అంత్యక్రియలు చేస్తూ, మృతుల ఆత్మకు శాంతిని చేకూరుస్తున్న ఆమె నిజంగానే ధన్యురాలు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటేనే మనం సంకోచిస్తాం. అక్కడ అనాథ శవాలుంటాయని, వాటిని చూసేందుకే మనం జంకుతుంటాం. అనాథలు కూడా సాటి మనుషులే అనే ఆలోచనను మన దరికి రానివ్వం. అయతే, అనాథ శవాలకు అంత్య్రకియలు చేయటం అనేది మాటలకందని మహోపకారం.
ఆమె పేరు శ్రీదేవి. హైదరాబాద్ శివారులోని దుండిగల్‌లో ‘పల్లవి ఆనంద వృద్ధాప్య మానసిక వికలాంగుల ఆశ్రమం’ వ్యవస్థాపకురాలిగా స్థానికులకు ఆమె చిరపరిచితురాలు. 2005లో ఆమె మొదలుపెట్టిన ఈ యజ్ఞం నిరాటంకంగా సాగుతోంది. మదర్ థెరెసాను ఆదర్శంగా తీసుకుని ఆమె దాదాపు ముప్ఫైమంది అనాథ వృద్ధులను, బుద్ధిమాంద్యులను కన్నబిడ్డల్లా సాకుతోంది. హృదయాన్ని కదిలించే ఒక వాస్తవ సంఘటన ఆమె జీవిత గమనానే్న మార్చేసింది.
ఒక రోజు శ్రీదేవి, ఆమె భర్త రవికిరణ్ రోడ్డుపై వెళుతుండగా దారిలో చెత్త కుప్ప పక్కన రయ్‌మంటూ ఓ విలాసవంతమైన కారు ఆగింది. అందులోంచి ఓ ఆహార పొట్లం విసిరేసి, అంతే స్పీడులో వారు వెళ్లిపోయారు. ఆ ఆహార పొట్లం అక్కడ చెత్తకుప్ప పక్కన కూర్చున్న ఓ అనాథ కోసం అని రవికిరణ్ దంపతులకు అర్థమయింది. పక్కనే ఉన్న షాపులో వారు ఆరా తీయగా, ఆ అనాథ వ్యక్తి- కారులో వెళ్లిన వారికి బంధువేనని, బుద్ధిమాంద్యం ఉన్నందున రోడ్డుపై వదిలేశారని చెప్పడంతో భార్యాభర్తలిద్దరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇలా రోడ్డుపై బుద్ధిమాంద్యులని చూసినప్పుడల్లా తమ హృదయం ద్రవించేదని, ఇలాంటి వారి కోసం ఏదైనా చేయాలనే తపన తన ఆశయాన్ని బలపరిచిందని శ్రీదేవి చెప్పుకొచ్చారు.
మానసిక వైకల్యం ఉన్నవారిని సమాజం ఆదరించకపోగా, వారిని కించపరచటం, దూరంగా ఉంచటం, వారి వైకల్యాన్ని అపహాస్యం చేయడం వంటివి మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటివారిని రక్షించుకోవడం కూడా కష్టమే. ముఖ్యంగా ఆడవారికి సరైన ఆశ్రయం కల్పించడం. కుటుంబ సభ్యుల మాదిరిగా ఆదరిస్తూ వారికి పని నేర్పించి, స్వశక్తి సంపన్నులుగా తీర్చిదిద్దడం వంటి పనులకు శ్రీదేవి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందరిలాగే తమ పని తాము చేసుకుంటూ కొందరు పొలం పనులలో సాయంగా మెలుగుతున్నారు. ఆశ్రమంలో వారు తెలియక చేసే పనులు తమకు ఇబ్బంది కలిగించినా భరిస్తూ, కనీస సదుపాయాలు కల్పిస్తున్నారు. తమ ఆర్థిక స్థోమత మేరకు అనాథల ఆకలి బాధల్ని తీరుస్తున్నారు. ఇంకా మంచి భోజనం, బట్టలు, ఇతర సౌకర్యాలు అందించాలని, ఇందుకు దాతలు అండగా నిలవాలని శ్రీదేవి అంటున్నారు.
పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లలకు చదువుకున్నా, స్వశక్తితో జీవించడానికి చేతివృత్తులు అవసరం అని భావించి, టైలరింగ్, కుట్లు, అల్లికలు వంటివి నేర్పిస్తున్నారు. ఇంటిపని, వంటపనిలో వారి సాయం తీసుకుంటూ ఆశ్రమానికి చేదోడుగా ఉండేలా శిక్షణ ఇస్తున్నారు. వీరిలో కొందరు కాయగూరలు, ఉల్లి, అల్లం వంటివి పండిస్తున్నారు. పాడి పశువులను పెంచుతూ తమ జీవనోపాధికి అవసరమైన ధనం సంపాదిస్తున్నారు. మానసిక వికలాంగులకి, వృద్ధులకి మంచి వైద్యం అందించే బాధ్యత అనాథాశ్రమానిదే. ప్రతి నెలలో వైద్యుల వద్దకు తీసుకుపోయ ఆరోగ్య పరీక్షలు చేయించడం, సమయానికి భోజనంతోపాటు మందులు ఇవ్వడం వంటి పనులను శ్రీదేవి, రవికిరణ్ స్వయంగా చూసుకుంటారు. ఆశ్రమంతో పాటు తమ కుటుంబ వ్యవహారాలను చూసుకోవడం నిజంగా కత్తిమీద సాములాంటిదే.
తమ ఆశ్రమం హైదరాబాద్ నగరానికి దూరంగా దుండిగల్‌లో ఉండడంతో పరిపూర్ణంగా సేవలు చేయలేకపోతున్నామని శ్రీదేవి ఆవేదన చెందుతున్నారు. ఆశ్రమం అం దుబాటులో లేనందున సేవాభావం ఉన్నవారు కూడా తొందరగా ముందుకు రాలేకపోతున్నారని, నగరానికి చేరువలో ఎవరైనా ఉచితంగా వసతి సౌకర్యం కల్పిస్తే, మరింతమంది అనాథలను ఆదుకుంటామని శ్రీదేవి చెబుతున్నారు. ఎవరికైనా చిన్న సాయం చేయాలంటే అనేక కోణాల్లో మనం ఆలోచిస్తూ కాలం వెళ్లబుచ్చుతాం. అనాథలను, మానసిక వికలాంగులను ఇలా అక్కున చేర్చుకుని, వారి మంచి చెడులను పట్టించుకుంటూ, భాషరాని వారితో సైగలతోనే సంభాషిస్తూ నెట్టుకురావడం అంటే మాటలు కాదు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఉ న్నతమైన ఆశయ సాధనకు- అప్పు చేసి మరీ ఆశ్రమాన్ని నిలబెట్టుకోవడం.. నిజంగా ఒక మహత్తర కార్యక్రమం.
ఆశ్రమ నిర్వహణతోనే శ్రీదేవి సేవలు ఆగిపోలేదు. ఆమెకున్న సైకాలజీ డిగ్రీ కూడా ఎంతోమందికి ఉపయోగపడుతోంది. దుండిగల్ పోలీసుస్టేషన్‌లో ఎన్నో గృహహింస కేసులని ఉచితంగా పరిశీలిస్తూ అవసరమైన వారందరికీ కౌనె్సలింగ్ ఇస్తూ, దంపతుల మధ్య వివాదాలను ఆమె పరిష్కరిస్తున్నారు. విడాకుల దాకా రాకుండా సర్ది చెప్పి భార్యాభర్తలను ఇళ్లకు పంపిస్తారు. తన ఆశయానికి స్థానిక పోలీసులు కూడా ఉదారంగా సహకరిస్తూ ప్రోత్సహిస్తున్నారని ఆమె చెప్పారు. సేవ చేయాలనే సంకల్పం ఉంటే అందుకు ఎన్నో మార్గాలున్నాయని ఆమెను చూస్తే ఇట్టే అర్థం అవుతుంది. శ్రమతో కూడుకున్న ఇలాంటి పనులు చేసేందుకు చాలామంది వెనకడుగు వేస్తుంటారు. మనో నిబ్బరం తోడుంటే ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కొని నిలబడొచ్చని ఆమె నిరూపిస్తున్నారు. ఈమె చేపడుతున్న సేవా కార్య్రకమాల గురించి మరిన్ని వివరాల కోసం www.apallavi.org వెభ్‌సైట్‌లో సంప్రదించవచ్చు.