భర్తతో కలిసి సాధారణ జీవితాన్ని అనుభవిస్తూనే కనీస వసతులు లేని లేబొరేటరీలో ప్రయోగాలు చేయడం ఆమె ఉన్నతికి బాటలు వేసింది. ప్రభుత్వ సహాయం కూడా ఉండేది కాదు. ఒకవైపు యూనివర్శిటీలో ఎక్కువ పనిగంటలు బోధనలో గడుపుతూనే, పలు ప్రయోగాలు చేస్తుండేవారు. ప్రభువు ఇచ్చిన జీవితం కూడా ఇంతే స్వల్పమైనదని క్యూరీ లేతవయసులోనే గ్రహించింది. ఆ జీవితం మానవాళి ప్రయోజనాలకు తోడ్పడేదిగా లేకపోతే మనమెంత కాలం బతికినా అది వృధానే అని క్యూరీ భావన. అందుకే బాల్యం నుంచే కష్టపడేతత్వాన్ని అలవర్చుకుంది. నిరంతరం ఓ అన్వేషణ ఆమెలో రగిలే జ్వాలగా ప్రజ్వరిల్లుతుండేది. కొత్తగా వచ్చిన ఏ వస్తువునైనా ఆమె నిశితంగా గమనించేది. ఇందులో భాగంగానే ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త 'బెక్వెరెల్' 1896లో 'ప్రతిదీప్తి మీద ప్రయోగాలు చేస్తూ కొన్ని ఖనిజాలు రేడియోధార్మికతను కలుగచేస్తాయని' అప్రయత్నంగా కనుగొన్నాడు. ఈ ప్రయోగాలు మేరీ దంపతులను విపరీతంగా ఆకర్షించింది. ఆమె తన భర్తతో కలిసి ప్రయోగాలు చేసి 'పోలోనియం' అనే కొత్త రేడియో ధార్మిక మూలకాన్ని ఆవిష్కరించింది. మాతృదేశమైన 'పోలెండ్' మీద ప్రేమతో 'పోలోనియం' అని పేరు పెట్టింది.
లేతవయసులోనే శాస్త్రీయ భావాలు
పోలెండ్‌లోని వార్సా పట్టణంలో నవంబరు 7,1867లో ఒక ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించారు మేరీక్యూరీ. ఆమె అసలు పేరు 'మేరీ స్లోడోల్ స్కా'. స్థానిక పాఠశాలలోనే చదువుకుంటూ తండ్రి ద్వారా శాస్త్రీయ భావనలను పొందగలిగింది. విప్లవ భావాలుగల విద్యార్థి సంఘంలో చేరి పోలెండ్‌ను ఆక్రమించిన రష్యాకి వ్యతిరేకంగా ఉద్యమాలలో పాల్గొనడం వలన ఆమెను బహిష్కరించింది అప్పటి ప్రభుత్వం. ఆమె ప్యారిస్ చేరుకొని అక్కడి ప్రఖ్యాత 'సోబర్న్ యూనివర్సిటీలో గణితం, భౌతిక శాస్త్రాలందు పట్టా పొందారు. అక్కడే సొంతంగా చిన్నచిన్న ప్రయోగాలు చేయడం ఆరంభించారు. కాని ప్రయోగాలకు ఆమెకున్న వసతి సరిపోలేదు.
వివాహంతో ప్రయోగాలకు పదును
1894లో ఆమెకు పియరీ క్యూరీ అనే ఫిజిక్స్ ప్రొఫెసర్‌తో పరిచయం ఏర్పడింది. ఆయనకు సొంత ప్రయోగశాల వుండేది. ఇద్దరూ కలిసి పనిచేయడం, ఒకే విధమైన భావాలు కలిగి వుండడం వలన వారి సాన్నిహిత్యం ప్రేమ నుంచి 1895 వివాహానికి దారితీసింది. అప్పటి నుండి ఆమె 'మేరీ క్యూరీ'గా పిలవబడింది. పియరిక్యూరీ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందటం వలన, ఆయన స్థానంలో మేరీ క్యూరీని ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా నియమించింది సోబర్న్ యూనివర్సిటీ. దీంతో ఆమె భర్తతో కలిసి ఎన్నో ప్రయోగాలు చేయడం ఆరంభించారు.
రేడియోధార్మికతను కనిపెట్టడం
పరమాణు సంఖ్య 83 కన్నా ఎక్కువగా గల కొన్ని పరమాణువుల కేంద్రకాలు అస్థిరత్వం వల్ల వికిరణాలను ఉద్గారం చేస్తూ, బాహ్య బలాల అవసరాలు లేకుండానే స్వచ్ఛందంగా స్వయం విఘటనం చెందే దృగ్విషయాన్ని సహజ రేడియోధార్మికత అంటారు. ఉదాహరణకు యురేనియం, ఆక్టియం, ధోరియం, రేడియం, పోలోనియం. ఆవేశపూరిత ఈ వికిరణాలు, విపరీతమైన వేగంతో, గతిజశక్తితో, వాయువులను అయనీకరణం చేస్తూ దళసరి వస్తువులు, మానవ శరీరం గుండా కూడా దూసుకుని పోగలవు. శరీర కణాలను నాశనం చేయగలవు. ఈ లక్షణాన్ని బట్టి క్యూరీ దంపతులు కేన్సర్ కణాలను నాశనం చేయడానికి రేడియోధార్మికతను ఉపయోగించే విధానం కనిపెట్టారు. 1898వ సంవత్సరంలో 'ధోరియం కూడా రేడియోధార్మిక లక్షణాలను ప్రదర్శిస్తుందని మేరీ దంపతులు కనుగొన్నారు. సాధారణంగా యురేనియం అనేది అందరికి తెలిసిన రేడియో ధార్మిక పదార్థం. దీనిని 'పిచ్‌బ్లెండ్ అను ఖనిజం నుండి వెలికి తీస్తారు.
నోబెల్ బహుమతి తెచ్చిన ప్రయోగం
పిచ్‌బ్లెండ్ నందు యురేనియం ఒక్కటే కాకుండా ధార్మిక మూలకాలుండవచ్చని మేరీ దంపతులు ఊహించారు. 1898 నవంబరులో ఒకరోజు ప్రయోగశాలలో ఒక పరీక్ష నాళికలో కొంత పిచ్‌బ్లెండ్ వదిలిపెట్టి మర్నాడు వచ్చి చూశారు. పరీక్ష నాళికలో ఒక మూలనుంచి నీలికాంతి రావడం గమనించిన క్యూరీ ఆనందంగా భర్తకు అది చూపించింది. ఆ విధంగా రేడియం కనిపెట్టబడింది. ఫలితంగా 1903లో భౌతిక శాస్త్రంలో బెక్వరల్‌తో పాటు వారిద్దరికి నోబెల్ బహుమతి వచ్చింది. ఒక మహిళ నోబెల్ బహుమతి అందుకోవడం అదే ప్రప్రధమం. క్యూరీ ఒకరోజు భర్తతో యూరప్ మ్యాప్ చూస్తూ ఉండగా 'బొహోమియా' అనే చిన్న దేశంలో యురేనియం పుష్కలంగా దొరుకుతుందని గమనించింది. ఆ ప్రభుత్వ సహకారం పొంది 'పిచ్‌బ్లెండ్' ఖనిజాన్ని సంపాదించి పరిశోధ నలు చేసింది. చిల్లులు పడిన ఒక చిన్నరేకుల షెడ్డే వీరికి నివాసం, పరిశోధనశాలలు. వీరు ఎంత కష్టపడ్డారంటే కొన్ని టన్నుల 'పిచ్‌బ్లెండ్' నుండి 100 మి.గ్రాల 'రేడియం'ను వేరు చేయగలిగారు. ఇది యురేనియం కన్నా శక్తివంతమయినది. రేడియం తెల్లగా చాలా బరువుగా వుంటుంది. దీని వెల బంగారం కన్నా కొన్ని వేలరెట్లు అధికంగా వుంటుంది. ఇది ప్రపంచంలో అతి తక్కువగా లభ్యమవుతుంది. కాని ఇది శరీరానికి చాలా ప్రమాదకరం. దీనినుండి తయారు చేసిన ఐసోటోపులు రేడియం 622 కేన్సర్‌ను నయం చేస్తుంది. ఇంకా వైద్యరంగంలో దీని ప్రయోజనాలు చాలా ఎక్కువ. సరియైన జాగ్రత్తలు తీసుకోకపోతే రక్తాన్ని నిర్వీర్యం చేసి ఇది మరణానికి దారి తీస్తుంది.
భర్త మరణంతో కృంగిపోలేదు
1906వ సంవత్సరంలో దురదృష్టవశాత్తు ఒక యాక్సిడెంట్‌లో ఆమె భర్త మరణించాడు. మేడమ్ క్యూరీ పరిశోధనలు మొదలుపెట్టిన నాటి నుండి ఆమెకు తోడుండి ముందుకు నడిపించిన మార్గదర్శకుడు, ఆమె సాధించిన విజయాలలో సహచరి ఎల్లవేళలా నేనున్నాను అంటూ ధైర్యం చెప్పిన భర్త మరణంతో ఆమె హతాశురాలయింది. అయినా ధైర్యాన్ని పోగుచేసుకుని ముందుకు సాగించి. ఆమె భర్త స్థానంలో ఆమెను ప్రొఫెసర్‌గా నియమించింది 'సాబర్న్ యూనివర్శిటి. ఒక మహిళ ప్రొఫెసర్ కాగలడం చరిత్రలో అదే ప్రధమం అపూర్వం. ఆమె ప్యారిస్ యూనివర్శిటీలో 1914లో ఏర్పడిన 'రేడియం లేబోరేటరీకి డైరెక్టర్‌గా నియమింపబడింది. తను పుట్టిన వార్సా పట్టణంలో రేడియం పరిశోధనలకై ఒక లేబోరేటరీ నిర్మించాలనుకుంది క్యూరీ. అది కాని చాలా ఖరీదైన విషయం. వెన్ను తట్టే భర్త లేడు అయినా ప్రయత్నాలు ఆపలేదు. క్యూరీ అమెరికాలోని ఆమె సన్నిహితులు, ఇతర శాస్త్రవేత్తలు, పూర్వ విద్యార్థులు కలిసి 50వేల డాలర్లను ప్రోగుచేసి అప్పటి అమెరికా అధ్యక్షుడు 'హూవర్ చేతుల మీదుగా ఆమెకు అందజేశారు. అది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన రోజు. మహిళల ప్రాథమిక స్థాయి విద్యాభ్యాసం శాతం 20కు మించని, ఎన్నో నిబంధనలుండే ఆ రోజులలో ఆమె సాధించిన విజయం ఎంతో స్ఫూర్తిదాయకం.
పత్రికలు, రచనలు
ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరూ ఆమెను గౌరవించేవారు. ఆమె రచనలు అనేక పత్రికలలో, సైన్స్ జర్నల్స్‌లో ప్రచురించబడ్డాయి. ప్రపంచంలోని పత్రికలన్నీ ఆమె గురించి తమ పత్రికలలో రాయడానికి పోటీలు పడేవారు. ఆమె 1904లో 'రేడియోధార్మిక పదార్థాలపై పరిశోధన' అనే పుస్తకం. 'ఐసోటోపులు', ఐసోటోపిక్ పదార్థాలు 'రేడియోధార్మికత' ద్వారా చికిత్స అనే పుస్తకాన్ని 1910లో రచించారు.
ఆదర్శమైన తల్లి
శాస్త్ర పరిశోధనలలో ఆమె ఎంత తలమునకలుగా ఉన్ననూ తన పిల్లలను జాతి రత్నాలుగా తీర్చిదిద్దగలిగింది మేడమ్ క్యూరీ. ఇద్దరు కూతుళ్లలో పెద్ద కూతురైన ఐరిన్ క్యూరీ, మొదటి ప్రపంచయుద్ధకాలంలో తల్లికి రేడియో గ్రాఫర్‌గా, నర్స్‌గా పనిచేసింది. ఆమె ప్యారిస్ యూనివర్శిటీ నుండి సైన్స్‌లో డాక్టరేట్ సాధించగలిగింది. ఆమె భర్త ఫ్రెడరిక్ జోలియట్‌తో కలిసి 'పోలోనియం' నుండి వెలువడే ఆల్ఫాకణాల మీద పరిశోధన చేసింది. కృత్రిమ రేడియో ధార్మికత మీద న్యూక్లియర్ ఫిషన్ మీద ఆమె పరిశోధనలకు 1935లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. 1948వ సంవత్సరంలో ఫ్రాన్స్‌కు మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్‌ను నిర్మించిపెట్టింది. ఆ విధంగా ఆదరించిన దేశం రుణాన్ని తీర్చుకుంది. తన తల్లికి నిజమైన వారసురాలిగా నిరూపించింది. యుద్ధభూమిలో గాయపడిన వారిమీద పరిశోధనలు సాగించిన వారే మేడమ్ క్యూరీ, ఐరిన్‌క్యూరీ. రెండవ కూతురైన 'ఈవ్ అమెరికా'కు చెందిన 'లెబేస్సీ అనే సోషల్ వర్కర్'ను పెళ్లి చేసుకుంది. ఇద్దరూ సామాజిక సమస్యలపై పోరాడి మంచిపేరు తెచ్చుకున్నారు. లెబేస్సీ ఐక్యరాజ్యసమితిలోని యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్‌కు డైరెక్టర్‌గా అద్భుత సేవలు అందజేసినందులకు 1965లో అతనికి నోబెల్‌శాంతి బహుమతి లభించింది. ఈవ్ తన తల్లి జీవిత కథను రచించింది. అది అనేక భాషలలో తర్జుమా అయి రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది. ఈ విధంగా తన పిల్లలను ఉన్నత స్థానంలో నిలబెట్టింది మేడమ్ క్యూరీ.
అవార్డులు
క్యూరీ చేసిన అసమాన పరిశోధనలకు తగిన గుర్తింపు లభించింది. 1903లో ఫిజిక్స్ విభాగంలో నోబెల్ అవార్డు వరించింది. ఇదే సంవత్సరంలో డేవ్ మెడల్, 1904లో మెట్టూస్సీ మెడల్, 1911లో కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి రెండవసారి వరించింది. మేరీక్యూరీ సైన్స్‌లో చేసిన అసమాన సేవలకు ఫ్రాన్స్ ప్రభుత్వం ఆమె పేరుతో పోస్టేజ్ స్టాంపులను 1921లో విడుదల చేసింది.
మరణంతో సహవాసం
రేడియోధార్మిక పదార్థాలతో ప్రమాదం అని తెలిసి కూడా మేడమ్ క్యూరీ తన పరిశోధనలలో రేడియోధార్మిక పదార్థాలతో అతి సమీపంగా ప్రయోగాలు చేయడం వలన ఆమెలోని తెల్లరక్తకణాలు దెబ్బతిని ఆమెను బ్లడ్ కేన్సర్ వచ్చింది. ప్రమాదమని తెలిసి కూడ కేన్సర్ బారి నుండి ప్రపంచాన్ని రక్షించాలని తన మరణశాసనాన్ని తనే రచించుకున్న మేడమ్ క్యూరీ మరణించినప్పటికీ ఆమె ప్రయోగాలకు, ఆమె అందించిన స్ఫూర్తికి మరణం లేదు. మేడమ్ క్యూరీ జూలై 4, 1934న మరణించారు.
మూలం : వార్త దినపత్రిక