‘‘హైదరాబాద్ ఓల్డ్‌సిటీలోనే పుట్టి పెరిగాను. చిన్నతనంలోనే నాన్న చనిపోయాడు. అమ్మే కష్టపడి పెంచింది. నాకు ఒక అన్నయ్య, ఒక అక్క. చిన్నప్పటినుంచి యాక్టివిటీస్ అన్నీ అమ్మాయిలాగే ఉండేవి. అక్కకు కొత్త బట్టలు తెస్తే అవే వేసుకునేవాడిని. అందరూ అమ్మాయి అనుకునేవారు. చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ మిగిలిన అబ్బాయిలు క్యూట్‌గా ఉన్నాడని బుగ్గలు గిల్లేవారు. ముద్దుపెట్టుకోవడం లాంటివి చేసేవారు. రాను రాను నేను కొంచెం డిఫంట్ అని అర్థమయిపోయింది. స్కూల్‌కు వెళ్లాలంటే బాగా భయమయ్యేది. దాంతో ఇంట్లోనే చదవడం, రాయడం నేర్పించింది అక్క. నాకు జుట్టు చాలా పెద్దగా ఉండేది. అందుకే ఇంటి దగ్గర మ్యూజికల్ నైట్స్, వినాయక చవితిలాంటి పండుగలకు నేను అమ్మాయిలా రెడీ అయి బాగా డాన్సులు వేసేది. దాంతో మా బస్తీలో అందరూ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అని నెగిటివ్‌గా చూడకుండా... చిన్నప్పటినుంచే ఆర్టిస్ట్‌గా, ఓ డాన్సర్‌గా చూడటం మొదలుపెట్టారు. అంతేకాదు నన్ను ప్రేమగా కూడా చూసుకునేవారు. అది నాకు ప్లస్ అయ్యింది.
డాన్స్ అంటే ఇష్టం...
నాకు డాన్స్ అంటే ఇష్టం. ప్రత్యేకంగా నేర్చుకోకపోయినా టీవీలో వస్తుంటే చూసి అలాగే వేసేది. సంగీతం వినపడితే చాలు కాలు నిలవకపోయేది. నా పదేళ్లప్పటినుంచే బాలభవన్‌లో ఏవైనా కార్యక్షికమాలు జరిగితే వెళ్లి పాల్గొనేది. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ ఏవైనా జరిగితే నా డాన్స్ కచ్చితంగా ఉండాల్సిందే. అప్పటికీ బయటి ప్రపంచం తెలియదు. అయితే నేనే ఇట్లున్ననా, మిగిలినవాళ్లు కూడా ఇట్లానే ఉన్నరా? అన్న అనుమానం వచ్చేది! బయటికెళ్లాలంటే భయమేసేది మొదట్లో. ఒంట్లో వణుకుపు నేను మిగిలినవారికంటే భిన్నంగా ఎందుకున్నాననేది చిన్నతనంలో తెలియదు. ఇప్పుడంటే నామీద నాకు ఆత్మవిశ్వాసం వచ్చింది. కానీ టీనేజ్‌లో ఉన్నప్పుడు ఇంటి దగ్గర కానీ, చుట్టాలింట్లోకానీ ఫంక్షన్స్ అయితే నేను బయటికొస్తే.. ‘ఈమె ఎవరు? వీళ్ల అబ్బాయా? ఇట్లా ఉన్నాడేంటి?’ అంటూ అదోరకంగా ముఖాలు పెట్టేవాళ్లు. అప్పటిదాకా నన్ను ఏ రకంగానూ ఇబ్బంది పెట్టని అమ్మ ముఖంలోనూ కొంచెం రంగులు మారేవి. ఆమె ఏనాడూ నన్ను డైరెక్ట్‌గా ఏం అనకపోయినా... ముఖంలో భావాలు తెలిసేవి. అప్పుడు బాధయ్యేది. అప్పుడనిపించేది.. ‘పుడితే అమ్మాయిలాగా పుట్టాలి. లేదా అబ్బాయిలాగా పుట్టాలి. కానీ నేనేంది ఇట్లా?’ అని! కానీ ఇప్పుడనిపిస్తుంది... అమ్మాయినో, అబ్బాయినో కానంతమావూతాన నాకొచ్చిన నష్టమేంటి? అని!
కుటుంబ ప్రోత్సాహం కొంతమందికే...
నాన్న లేకపోయినా అమ్మ చాలా బాగా చూసుకునేది. అందుకే అమ్మంటే చాలా ఇష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎక్కడికెళ్లయినా డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ నాకు అమ్మను వదిలి ఉండదు. అందుకే మాలాంటి వాళ్లకోసం హవేలీ ఉన్నా... అక్కడ ఉండకుండా అమ్మతోనే ఉంటున్నాను. అక్కకు, అన్నయ్యకు పెళ్లిళ్లు ఎప్పుడో అయిపోయాయి. అన్నయ్యకు ముగ్గురు పిల్లలు. అక్కకు నలుగురు పిల్లలు. అన్నా వదిన, అక్కా, బావ అందరూ నన్ను బాగా చూసుకుంటారు. అన్న వాళ్ల పిల్లలయితే మా దగ్గరే ఎక్కువగా ఉంటారు. నాకు ఫ్యామిలీతో ఉండే అవకాశం ఉంది. కానీ ఫ్యామిలీ ప్రోత్సాహం కొంతమందికే ఉంటుంది. అందరికీ ఉండదు. డబ్బు ఉన్నవాళ్లు పిల్లలను ఏమీ అనరు. హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ కల్చర్ ఉన్న దగ్గర పెద్దగా పట్టించుకోరు. కానీ చిన్న టౌన్స్, గ్రామాల్లో పరిస్థితి అలా ఉండదు. పిల్లలను వదిలేస్తారు. అట్లా వదిలేసినవాళ్లు ఉండటానికి ప్రత్యేకమైన సెంటర్స్ ఏం లేవు. ఇల్లు కిరాయికి కూడా ఇవ్వరు. తెలిసిన వాళ్లు ఉండని ప్లేస్‌లకి, కొంచెం లోక్లాస్ (మాస్) ఏరియాల్లోకి వెళ్లి ఉండాల్సి వస్తుంది. ఒక వేళ కిరాయికి ఇల్లు దొరికినా రెంట్ కట్టడానికి డబ్బుపూక్కడినుంచి వస్తాయి. చేయడానికి పని ఉండదు. అందుకే ఎక్కువగా డాన్స్ ప్రోగ్రామ్స్‌కి వెళ్తుంటారు. అక్కడా కొంతమంది ఎక్కువ డబ్బు ఇస్తారు. ఇంకొంతమంది అసలే ఇవ్వరు. ఆ డబ్బు తీసుకొచ్చి హవేలీలో ఉన్న అందరం సమానంగా పంచుకుంటాం.
కొన్నాళ్లయ్యాక...
నా డాన్స్‌ల వల్ల నాకు థర్డ్ జెండర్స్ హక్కుల కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు మిత్రుడు, పహచాన్, సురక్ష, దర్పణ్‌లతో పరిచయం ఏర్పడింది. ఇప్పుడు మిత్రుడు లేదు. సురక్ష ఎయిడ్స్ మీద ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం పనిచేస్తున్నది. 15 ఏళ్లుగా ఆ సంస్థ పనుల్లో పాల్గొంటున్నా. అప్పుడప్పుడు ఆ సంస్థ కార్యకలాపాల్లో పాలు పంచుకోవడం, మిగిలిన టైమ్‌లో డాన్స్‌లు. ఇలాగే ఉండేది జీవితం. అయితే డాన్స్ చేయడం, వచ్చిన డబ్బుతో కాలం గడపడం ఇదేనా జీవితం అనిపించింది కొంత కాలానికి! ఏదైనా జాబ్, పని ఉంటే దాంట్లో మన స్కిల్స్ చూపించుకోవాలనే తపన ఉండేది. కానీ డాన్స్ తప్ప మాకు వేరే లోకం లేదు. కాబట్టి అందం మీద ఎక్కువ దృష్టి పెట్టేది. అలా అందరిలోకి అందంగా కనిపించాలని ఆరాటపడేది. ఆ ఆరాటంతోనే మేల్కొలుపు లాంటి రన్స్, ఫ్యాషన్ పరేడ్‌లు నిర్వహించడం. దేశవ్యాప్తంగా ఉన్న థర్డ్ జెండర్స్‌తో సమ్మేళన్స్ చేస్తుంటారు ఏటా! అలా హైదరాబాద్‌లో జరిగిన ప్రతి ఫ్యాషన్ షో, పరేడ్‌లో నేను ముందు వరుసలో ఉండేదాన్ని. అనేక బహుమతులు కూడా వచ్చాయి. తరువాత హిజ్రాల సమస్యలపై అనేకమార్లు న్యూస్ ఛానల్స్‌లో చర్చా వేదికల్లో కూడా పాల్గొన్నాను.
ఆ గుర్తింపే....
నన్ను ఛానల్‌లో ఉద్యోగం వైపు నడిపించింది. సంవత్సరం కిందటే నన్ను కలిశారు వీ సిక్స్ ఛానల్ వాళ్లు. ఉద్యోగావకాశం ఇస్తాం. మీరు ఇక్కడే ఉంటారా? అని అడిగారు. నిజానికి హిజ్రాలు అనగానే ఒక్క చోట ఉండరు. స్థిరత్వం ఉండదు. దేశమంతటా తిరుగుతుంటారు అనే ఓ అపోహ ఉంటుంది. అందుకే అలా అడిగి ఉంటారేమో! కానీ నేను ఇక్కడే హైదరాబాద్, ఓల్డ్‌సిటీలోనే ఉంటానని చెప్పాను. తరువాత రీసెంట్‌గా నన్ను అడిగారు ‘ఓ క్రైమ్ బులిటెన్ యాంకరింగ్ చేస్తావా?’ అని! అసలు మమ్మల్ని చూస్తేనే దూరంగా జరిగిపోయే మనుషులున్న చోట, రోజువారి పని ఇవ్వడానికే ఇబ్బంది పడే చోట... పిలిచి ఉద్యోగం ఇస్తుంటే కాదంటానా? ఏదయితేనేం... నాకు గుర్తింపునిచ్చే పని కావాలి అని ఓకే చెప్పాను. మొదట రెండు నెలలు ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. కానీ అంతకంటే ముందే నేర్చేసుకున్నా. ఆఫీస్‌కొచ్చిన మొదట్లో అందరూ వచ్చి వింతగా చూసేవారు. ఎవ్వరూ మాట్లాడేవాళ్లు కాదు. భయంగా ఉండేది. అందుకే రాకుండా రెండ్రోజులకోసారి డుమ్మాలు కొట్టేదాన్ని. తరువాత తరువాత అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. మంచి వాతావరణం. ఇంటి తరువాత ఇల్లులా మారింది నాకు ఆఫీస్. ఈ ఆత్మవిశ్వాసానికి కారణం... మా సీఈవో అంకం రవి, మా ప్రోగ్రాం హెడ్ దామోదర్, నా సహోద్యోగులే.
అవకాశాలేవి?
హిజ్రాలు అనగానే ఓ నెగెటివ్ ఫీలింగ్ ఉంది అందరిలో. రోడ్డుమీద అందరి దగ్గరా బలవంతంగా డబ్బులు గుంజుకుంటారని, జబర్దస్తీ చేస్తారని. నిజంగా థర్డ్ జెండర్స్ అలా మీదపడి డబ్బులు లాక్కోరు. ఆత్మగౌరవంతో బతకాలని కోరుకుంటారు. సమాజంలో మేమూ మనుషులమే! అయినా మాకో ఐడెంటిటీ లేదు. ఏదైనా అప్లికేషన్ ఫామ్‌లో ఆడ, మగ ఉంటుంది. మరి అదర్స్ అన్న ఇంకో ఆప్షన్ ఉండదు. ఓ రేషన్ కార్డు ఉండదు. ఉపాధి అసలే దొరకదు. ఇలాంటి చోట మాకు ఉపాధి కావాలంటున్నాం. మాలో అనేక స్కిల్స్ ఉన్నవాళ్లున్నారు. మేకప్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్స్, ఫ్యాషన్ డిజైనర్స్ ఇలా... సున్నితమైన కళల్లో అందెవేసిన చేయి ఉన్నవాళ్లున్నారు. కానీ మమ్మల్ని మేం ప్రూవ్ చేసుకునే అవకాశం ఎక్కడిది? ఇలా ఆత్మగౌరవంతో బతకడానికి అవకాశం కల్పించండని కోరుతున్నా’’ అంటూ ముగించింది లక్కీ!
టాప్ రేటింగ్‌లో...
తమిళ ఛానల్ ‘విజయ్ టీవీ’ రోజ్ అనే థర్డ్ జెండర్ ‘యువర్స్ ట్రూలీ రోజ్’ అనే టాక్ షోను నిర్వహిస్తున్నది. థర్డ్ జెండర్‌వాయిస్‌ను ఓ ఛానల్‌లో వినిపించడం తెలుగు మీడియాలో ప్రప్రథమం. ఆ ధైర్యం చేసింది వీ సిక్స్ ఛానల్. అయితే వాళ్ల శ్రమ వృథా పోలేదు. ఆ ఛానల్‌లో తీన్మార్ తరువాత టాప్ రేటింగ్ ఉన్న ప్రోగ్రాం లక్కీ చేస్తున్న అరణ్యం (క్రైమ్ బులిటెన్) మాత్రమే. అరణ్యంలో లక్కీని చూసిన తరువాత ఆ ఛానల్‌ను అభినందించిన వాళ్లు అనేకం. లక్కీలో తమను తాము ఐడెంటిఫై చేసుకున్న ఎందరో హిజ్రాలకు ఇప్పుడామె స్ఫూర్తి. అందుకే ఖరగ్‌పూర్ ఐఐటీకి చెందిన ‘అర్ధనారీశ్వర’ అనే స్వచ్ఛంద సంస్థవాళ్లు లక్కీని బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకునే ప్రతిపాదనలో ఉన్నారు.
మూలం : నమస్తే తెలంగాణ దినపత్రిక