మేరా సుందర్ సప్‌నా బీత్ గయా
మై ప్రేమ్ మే సబ్ కుచ్ హార్‌గయీ బేదర్డ్ జమానా జీత్‌గయా
మేరా సుందర్ సప్‌నా బీత్ గయా
( నా అందమైన కల చెదిరిపోయింది
ప్రేమలో నా సమస్తాన్నీ ఓడిపోయాను
దయలేని లోకం జయించింది)
ప్రేమ ఎంతో అద్భుతమైనది. అందమైన ది. అంతటి అపురూపమైన ప్రేమలో ఎవరు మాత్రం పడకుండా ఉంటారు? ప్రేమలో పడిపోవడం సహజమే కానీ, ప్రేమను నిలబెట్టుకోవడం మాత్రం అందరి వల్లా కాదు. ప్రేమలో పడటానికి ఆ ప్రేమికులు ఇద్దరే చాలు. ప్రేమను నిలబెట్టుకునే క్రమంలో కొన్నిసార్లు ఇతరుల జోక్యం కూడా ఉంటుంది. నిజానికి ప్రేమ ఫలించడానికి తోడ్పడే వాళ్లకన్నా, ప్రేమను భగ్నం చే సేవాళ్లే లోకంలో ఎక్కువ . అందుకే ఎన్నోసార్లు ప్రేమికులు ఓడిపోతారు. ఒక్కోసారి ఆ ఇద్దరి మధ్యే ఏవో వైరుధ్యాలు మొదలై కూడా అనుబంధం బీటలు బారవచ్చు. పైగా, ఎంతసేపూ లోకం తమను అర్థం చేసుకోవడం లేదని ప్రేమికులు వాపోతారే కానీ, చాలా వరకు లోకాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యరు. అందుకే అనేక సార్లు ప్రేమికులు చిక్కుల్లో పడతారు.
క్యూ కాలీ బదరియా ఛాయీ హై
క్యూ కలీ కలీ ముస్కాయీ హై
మేరీ ప్రేమ్ కహానీ ఖత్మ్ హుయీ
మేరే జీవన్ కా సంగీత్ గయా / మేరా సుందర్ సప్‌నా /
( ఈ నల్లనల్లని మేఘాలెందుకో ఆవ హించాయి
ప్రతి మొగ్గా ఎందుకో మందహాసం చేస్తోంది.
నా ప్రేమ కథ మాత్రం ముగిసిపోయింది
నా జీవన సంగీతం ఎటో వెళ్లిపోయింది)
ప్రేమికులు ఎలా ఉన్నా, ఏమైపోయినా దాని ప్రభావం ప్రకృతి మీద ఏమీ ఉండదు. ఎవరి కోసమో ప్రకృతి తన దశ దిశల్ని మార్చుకోదు. కాలాలూ, రుతువులూ నిర్ధిష్ట వేళల్లో మారుతూనే ఉంటాయి. రవిచంద్రులు వచ్చి వెళుతూనే ఉంటారు నక్షత్రాలు మొలుస్తూనే ఉంటాయి. ఆకాశం వ ర్షిస్తూనే ఉంటుంది. మొక్కలు మొలుస్తూనే ఉంటాయి. మొగ్గలు వికసిస్తూనే ఉంటాయి. ప్రపంచంలో ఎవరి కోసం ఏది ఆగిందని? కాకపోతే ప్రకృతి గమనం సహజంగా, సజావుగా సాగిపోతున్నంత మాత్రాన మానవ హృదయాల్లో కల్లోలాలు పుట్టకుండా పోతాయా? సంఘర్షణలు తలెత్తకుండా ఉంటాయా? ఒక్కోసారి ఎన్ని ప్రయత్నాలు చేసినా, జీవితం కలతల పాలుకాకుండాపోదు. ప్రేమ కథే అయితే మాత్రం ఏమిటి? ఒక్కోసారి అది అర్థంతరంగా ముగిసిపోవచ్చు. రాగరంజితం అవుతుందనుకున్న జీవితం శోకాలతో హోరెత్తిపోవచ్చు.
ఓ...ఛోడ్ కే జానే వాలే కా
దిల్ తోడ్ కే జానే వాలా ఆ
ఆంఖే అసువన్ మే డూబ్‌గయీ
హస్‌నే కా జమానా బీత్ గయా / మేరా సుందర్ సప్‌నా /
(వదిలేసి వెళ్లిపోతున్నవాడా
మనసు విరిచేసి పోతున్న వాడా ఇటురా
నా కళ్లు కన్నీళ్లలో మునిగిపోయాయి
హాయిగా నవ్వుకునే కాలం అంతమైపోయింది. / నా అందమైన కల/)
ఊరకే వదిలేసిపోతే సరే కానీ, పోతూ పోతూ హృదయాన్ని విరిచేసి పోతున్నాడు కదా! ఆ స్థితిలో ఇంకేమవుతుంది? అప్పటిదాకా వెన్నెలను కురిపించిన కళ్లే కన్నీటిలో మునిగిపోతాయి. హాయిగా నవ్వుకునే క్షణాలు శాశ్వతంగా అంతరించిపోతాయి. నిజానికి ఎన్నేళ్ల తపన అది. ప్రేమ ఇసుక తిన్నెల మీద హాయిగా విహరించాలని ఎంత కాలంగా కంటున్న కల ? తన ప్రేమమూర్తిని వే యి కళ్లతో చూసుకోవాలన్న ఎంత ఆరాట మది? కానీ, ఏమైపోయింది? జీవితం జీవితమంతా తనను వె న్నంటి , తోడుగా, నీడగా ఉంటాడనుకున్నవాడు చివరికి ఇలా తనను వదిలేసి వెళ్లిపోతున్నాడు. ఊరికే పోకుండా మనసును తునాతునకలుగా విరిచేసి వెళ్లిపోతున్నాడు. ఆ స్థితిలో ఏ ప్రేమికుల జీవితంలోనైనా జరిగేదేమిటి? జీవితం కన్నీటి పర్యంతం అయిపోతుంది. ఆనందంగా సాగిపోతాయనుకున్న క్షణాలు విషాదంగా ముగిసిపోతాయి.
హర్ రాత్ మేరీ దివాలీ థీ
మై పియా కీ హోనేవాలీ థీ
ఇస్ జీవన్ కో అబ్ ఆగ్ లగే....ఆగ్ లగే
ముఝే ఛోడ్‌కే జీవన్ మీత్ గయా / మేరా సుందర్ సప్‌నా /
( ప్రతి రే యీ నాకో దీపావలిలా ఉండేది.
నేను నా ప్రియతముని సొంతమైపోయే దాన్నే కానీ,
ఈ జీవితానికి ఇప్పుడు నిప్పంటుకోనీ.... నిప్పంటుకోనీ
నా జీవననేస్తమే నన్ను వదిలేసిపోయాడు / నా అందమైన కల /)
ప్రేమ మహొద్వేగంగా సాగిపోతున్న వేళల్లో హృదయంలో కోటి దీపాలు వెలుగుతున్నట్లే అనిపిస్తుంది. ఆ దీపాల వెలుగులో తన ప్రియతముడు తనలో కలిపేసుకున్నట్లే అనిపిస్తుంది. అతని జీవిత సామ్రాజ్యంలో తనో అర్థభాగమైపోయినట్లే అనిపిస్తుంది. కానీ, అంతలోనే ఎంతో మార్పు. జీవితమంతా తనతోనే ఉంటాడనుకున్న అతనే తనకు శాశ్వతంగా దూరమైపోతున్నాడు. ఆ స్థితిలో జీవితం ఉండి మాత్రం ఏం చేస్తుంది? కాలిపోనీ అనిపిస్తుంది. ప్రేమే ప్రపంచం అనుకుని జీవిస్తున్న వారికి ప్రేమ దూరమైతే ప్రపంచం దూరమైనట్లే కదా! అలా తమ ప్రపంచమే కోల్పోయిన వారి హృదయ ఘోష ఎలా ఉంటుందో ఎవరో చెప్పాల్సిన పనేముంది? ఎవరికి వాళ్లు అవలీలగా ఊహించుకోవచ్చు. కాకపోతే ప్రేమికులు తమదైన ఊహాలోకానికే పరిమితమై పోకుండా వాస్తవిక ప్రపంచాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే బహుషా ఈ విషాదాలకు అంత తావుండ దేమో!