రాష్ట్రంలో ప్రతి గ్రామం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తుంటే గుంటూరులోని కోపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కారుమంచి మాణిక్యమ్మ మాత్రం సంతకాలు సేకరించే ఆలోచనలో ఉన్నారు. మళ్లీ సర్పంచ్‌గా పోటీ చేయదలిస్తే ఓటు వెయ్యమని ఇంటింటికీ తిరిగేందుకు వ్యూహరచనలో మునిగితేలాల్సిన ఆమె... ఆ పని చేయకుండా ఇప్పుడు సంతకాలు ఎందుకు సేకరిస్తున్నారంటే... పరిస్థితులలో ఏమైనా మార్పులు వచ్చి, తనకు బదులు కొత్తగా ఎవరైనా సర్పంచ్ వస్తేగనక... ఊళ్లో మద్యంషాపుకి అనుమతి ఇస్తారేమో... అలా జరగడానికి వీల్లేదని’ ముందుగానే జిల్లా కలెక్టర్‌కి విజ్ఞప్తి చేయడంకోసం!
కోపల్లి....ఆదర్శ గ్రామంగా అవార్డు గెలుచుకున్న ఊరు. శుచికీ, శుభ్రతకు ‘నిర్మల్ భారత్ అభియోగ్ అవార్డ్’ కూడా సొంతం చేసుకున్న గ్రామం. అన్నిటికన్నా ఊళ్లో మహిళలంతా మనశ్శాంతిగా జీవించే ఊరది. ఇన్ని గెలుచుకున్నది దేనివల్ల... అంటే ‘మా ఊళ్లో మద్యం అందుబాటులో లేకపోవడం వల్లే’ అని గర్వంగా చెబుతారు మాణిక్యమ్మ. స్వయంగా మాణిక్యమ్మే చొరవచూపి మద్యం మహమ్మారిని ఊరవతలి వరకూ తరిమి తరిమి కొట్టారు. గ్రామాల్లో... మద్యంషాపు పెట్టాలనే ఆలోచనకి, అనుమతికి, ఆచరణకి... నిమిషాలు సరిపోతాయి. అదే కనక మద్యం షాపుని మూయించేయాలంటే అందుకు కొన్ని ఏళ్ల సమయం పడుతుంది. కోపల్లిలో కూడా అదే జరిగింది. 1997 నుంచి 2004 వరకూ అంటే... ఏడేళ్లపాటు కోపల్లి మహిళలంతా చేసిన పోరాట ఫలితంగాఎన్నికలముందు నాయకులు మద్యంషాపుకి మూతవేయించారు. వీళ్లు ఇంత చేసినా, ఆ తర్వాత కొత్తగా వచ్చిన సర్పంచ్ వారి ఉద్యమానికి మద్దతు ఇవ్వకపోయి ఉంటే ఇన్నేళ్ల వారి పోరాటమంతా గంగలో కలిసిపోయేది. అయితే అదృష్టవశాత్తూ ఆ వచ్చిన సర్పంచ్ మహిళ కావడం, ఆమె అప్పటివరకూ మద్యానికి వ్యతిరేకంగా పోరాడిన నాయకురాలు మాణిక్యమ్మ కావడం కోపల్లి గ్రామం చేసుకున్న సుకృతమనే చెప్పుకోవచ్చు.
మహిళలంతా కలిసి...
‘‘పదిహేనేళ్లకిందట మా ఊరి సంగతి ఎలా ఉండేదంటే... పొద్దునే లేవగానే టీ, కాఫీలు తాగినట్టు మా ఊర్లో కొందరు సాయంత్రం అయిందంటే కాసిన్ని మందునీళ్లు నోట్లో పోసుకోకుండా ఇంటికొచ్చేవాళ్లు కాదు. ఇంట్లో భార్యాబిడ్డలతో గొడవపడడం కాకుండా ఎన్నికల సమయంలో పార్టీల పేరుచెప్పుకుని తాగి గొడవపడేవారు. అలాంటి గొడవల్లో ఒకతనికి కన్ను పోయింది. ఒకతనికి కాలు విరిగిపోయింది. ఇవన్నీ చూసి చూసి విసిగిపోయిన మహిళలంతా ఊళ్లో మద్యం షాపు లేకపోతే ఈ బాధలుండవు కదా అనే ఆలోచనకు వచ్చారు. ఇదే విషయాన్ని ఇంట్లో మగాళ్లతో అంటే కొందరు హేళనగా నవ్వితే, మమ్మల్ని తాగొద్దని చెప్పడానికి మీరెవరంటూ కయ్యిమన్నారు ఇంకొందరు. అప్పటివరకూ కోపల్లి మహిళలకు మద్యంషాపు మూయించేయాలనే ఆశ మాత్రమే ఉండేది. ఎప్పుడయితే మా ఇళ్లలో వ్యతిరేకత ఎదురయిందో అప్పటినుంచి అది ఆశయంగా మారింది’’ అని ఉద్యమం తొలినాళ్లలోని అనుభవాల్ని వివరించారు మాణిక్యమ్మ.
ఎవరి ప్రయత్నాలు వారివి...
ఉద్యమం అంటే... నినాదాలు పలుకుతూ రోడ్డెక్కే మామూలు పద్ధతిని ఎంచుకోలేదు మాణిక్యమ్మ. మద్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలంతా ఒకపక్క తమ ఇళ్లలోని మగవారికి నెమ్మదిగా సర్దిచెప్పుకుంటూనే మరో పక్క అధికారులకు తమ గోడుని వెళ్ళబోసుకునేవారు.‘‘మొత్తం యాభైమంది మహిళలు నాతోపాటు నడిచారు. ముందు కలెక్టర్ని కలిసి మద్యం వల్ల మా ఊరికి జరుగుతున్న నష్టం గురించి చెప్పాం. తర్వాత ఎమ్మెల్యేని కలిశాం. మా ప్రయత్నాలు మేం చేస్తుంటే...మద్యంషాపు యజమాని తన పలుకుబడిని బట్టి తన ప్రయత్నాలు తాను చేసుకునేవాడు. ఆ పరిస్థితుల్లో ఏడేళ్లపాటు మా ఊరి మగాళ్లను, నాయకుల్ని ఒప్పించి మద్యంషాపు తీయించేశాం. ఆ పై ఏడాది ఎన్నికల్లో బీసీ మహిళా రిజర్వేషన్‌కింద నేను సర్పంచ్‌గా పోటీచేసి అత్యధిక మెజారిటీతో గెలిచాను. ఇక అక్కడి నుంచి నా పాట్లు మొదలయ్యాయి’’ అంటూ అప్పటివరకూ ఎంతో హుషారుగా మాట్లాడిన మాణిక్యమ్మ స్వరం నెమ్మదించింది.
ప్రలోభాలకు లొంగలేదు...
అప్పటివరకూ మాణిక్యమ్మ పొదుపు సంఘాల ఈవోగా మాత్రమే పనిచేశారు... ఆమె సర్పంచ్ అవగానే కొందరు రాజకీయ నాయకులు వచ్చి ‘‘మాణిక్యమ్మా....ఇప్పుడు నువ్వు ఒక ఊరికి సర్పంచ్‌వి. నువ్వు ఏం సంపాదించాలన్నా...ఈ ఐదేళ్లలోనే. ఊళ్లో బెల్టు షాపుకి అనుమతిచ్చావనుకో...నీకే కాదు ఊరివాళ్లకు కూడా ఎంతోకొంత సొమ్ము ఇస్తారు. ఆశయాలు..ఆదర్శాలు అంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక్క రూపాయి కూడా నీ చేతిలో ఉండదు...ఇక నీ ఇష్టం’ అంటూ తనకు చేసిన హితబోధను ఈ చెవిన విని ఆ చెవిన వదిలేశారు ఈ మహిళాసర్పంచ్. ‘‘మద్యం తాగేవాడి కాళ్లు పట్టుకుని, పోసేవాడి కాళ్లు పట్టుకుని....ఊరికి ఏ నాయకుడొచ్చినా మద్యం వద్దంటూ గొంతు చించుకుని అరిచి మరీ ఆ షాపు మూయించాం. ఇప్పుడు నాకు సర్పంచ్ పదవి వచ్చింది కదా అని కాసులకు ఆశపడడానికి మించిన అన్యాయం మరొకటి ఉండదనుకున్నాను. అంతేకాదు కోపల్లిని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దాలనుకున్నాను. పచ్చని పంటపొలాల మధ్య మా ఊరి ప్రజలంతా సుఖ సంతోషాలతో బతకాలనుకున్నాను. మద్యంషాపు మూయించి కోపల్లిని ఆదర్శంగా చూపించాను. ఇక మిగిలిన సంక్షేమ పనులన్నీ చిత్తశుద్ధితో చేస్తే కోపల్లికి తిరుగులేదనుకున్నాను’’ అని ఆనాడు తన ఊరికి తాను చేయదలచిన పనుల గురించి వివరిస్తున్నప్పుడు మాణిక్యమ్మ మాటల్లో ఉత్సాహం వినిపించింది.
రాష్ట్రపతి అవార్డు...
ఊళ్లో మరుగుదొడ్ల నిర్మాణం, రోడ్లు, మంచినీటి సౌకర్యం, పక్కా ఇళ్లు... ఒక సర్పంచ్‌గా ఊరి అభివృద్ధికి ఏమేమి చేయాలో అన్నీ చేశారు మాణిక్యమ్మ. మండలస్థాయి సమావేశాల్లో జెడ్‌పిటిసి అధికారి మాణిక్యమ్మ అభివృద్ధి పనులకు తోటి సర్పంచ్‌లతో చప్పట్లు కొట్టించేవారు. గట్టిగా కొట్టిన ఆ చప్పట్లన్నీ మద్యం షాపుకి అనుమతినివ్వనందుకే అంటారు మాణిక్యమ్మ.
‘‘మా ఊళ్లో జరిగిన అభివృద్ధి పనులని చూసి 2011 అక్టోబర్ 25న రాష్ట్రపతి అవార్డు ఇచ్చారు. దాంతోపాటు 5 లక్షల గ్రాంట్ కూడా ఇచ్చారు. ఆ డబ్బుతో ఎస్టీకాలనీల్లో రోడ్లు వేయించాను. నిజానికి గ్రామాల్లో మహిళా సర్పంచ్ అనగానే అంతా ఆమె భర్తే చక్కబెడతాడనే భావన ఉంటుంది. నా విషయంలో మాత్రం అది జరగలేదు. నా భర్త పేరు ప్రకాశ్. పూలు అమ్ముతారు. అదే మా జీవనాధారం. నేను సర్పంచ్ అయ్యాక...ఆయన చెప్పిందొక్కటే....‘ఈ పదవి నూరేళ్లుండేది కాదు, ఉన్న ఐదేళ్ల సమయంలోనే ఊరిని ఎంత అభివృద్ధి చేయాలనుకుంటున్నావో అంత చెయ్యి. ఈ ఐదేళ్లలో ప్రతి నిమిషం చాలా విలువైంది’ అని. నాకూ అలాగే అనిపించేది. అలా అనుకునే కోపల్లిని పండగ ఇల్లులా అలంకరించుకున్నాను. నాకు తోడుగా మా ఊరి మహిళలు చాలా సాయపడ్డారు. మా ఊళ్లోని పరిశుభ్రతను చూడ్డానికి 2012 జనవరిలో ఢిల్లీనుంచి ఒక బృందం వచ్చింది. ఊరంతా తిరిగి ప్రతిష్టాత్మక ‘నిర్మల్ భారత్ అభియోగ్ అవార్డు’కి ఎంపిక చేశారు’’ అని వివరించారు.
భవిష్యత్తుపై బెంగ....
కోపల్లి ప్రగతి చూసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ముక్కున వేలేసుకున్నారు. ఏం లాభం...ఏ ఊరు మారాలన్నా ముందు మద్యానికి దూరమవ్వాలి. పక్కనే ఉన్న అంగలకుదురు గ్రామస్తులు మాణిక్యమ్మను కలిసి మా ఊళ్లో కూడా మద్యంషాపు మూయించమని అడిగితే ఈ మధ్యనే కొందరు మహిళల్ని వెంటబెట్టుకుని వెళ్లారు. ‘‘మా ఊళ్లో మద్యంషాపువాడు బయటికి పోడానికే ఏడేళ్లు పట్టింది. ఇక బయటి ఊరివాడు మా మాటెలా వింటాడు. ‘నీకేం సంబంధం...’అంటూ బయటికి పొమ్మన్నాడు. ఇప్పటివరకూ అంతా బాగానే ఉంది. అయితే రాబోయే ఎన్నికల్లో ఒకవేళ వేరే ఎవరైనా సర్పంచ్‌గా గెలిస్తే మా ఊరి మద్యంషాపుకి ఎక్కడ అనుమతి ఇస్తారోనని అనుమానం. అందుకే ముందుగా మేం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆలోచించుకుంటున్నాం’’ అని చెప్పిన మాణిక్యమ్మ మనసులోని ఆవేదను అర్థం చేసుకోవాల్సింది తోటి మహిళలే కాదు... ఊళ్లోని మగవాళ్లు కూడా. ఆ మాటకొస్తే ప్రజల్ని పాలించే ప్రతి ఒక్క నాయకుడూ ఆత్మవిమర్శ చేసుకోవాలి.
మండలస్థాయి సమావేశాల్లో జెడ్‌పిటిసి అధికారి ఈ మహిళా సర్పంచ్ తన ఊరికి చేసిన అభివృద్ధి పనులకు తోటి సర్పంచ్‌లతో చప్పట్లు కొట్టించేవారు. గట్టిగా కొట్టిన చప్పట్లన్నీ మద్యం షాపుకి అనుమతి ఇవ్వనందుకే అంటారు మాణిక్యమ్మ.
మూలం : సాక్షి దినపత్రిక