'' నేను హైదరాబాద్‌లో సైన్స్ సబ్జెక్ట్‌తో12వ తరగతి చదువుతున్నాను. స్కూల్లో చదువుతున్న రోజుల నుండి కూడా మొదటి ర్యాంకు విద్యార్థిని కాకపోయినా చేసే ప్రతి పనీ సంపూర్ణంగా చేయాలని అనుకుంటాను. ఎప్పుడూ చురుగ్గా ఉంటాను. పరీక్షలు మన జ్ఞాపకశక్తిని పరీక్షించేవే కానీ మన విజ్ఞానాన్ని కాదు అని నేను పూర్తిగా నమ్ముతాను. అలాగని చదువును నిర్లక్ష్యం చేయను. పదో తరగతిలో మంచి మార్కులతో పాస్ అయ్యాను. కళ పట్ల నా ఆసక్తి నా ఏడు సంవత్సరాల వయసు నుండే మొదలైంది. మా అమ్మకు కూడా డ్రాయింగ్‌లో నైపుణ్యం ఉండటంతో ఆమె నా తొలి గురువు. నాకు స్కూల్లో సైన్స్ సబ్జెక్ట్ అంటే తగని పిచ్చి. సైన్స్‌లో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉండేదాన్ని. నా స్నేహితుడు దుర్గేష్. అతనికీ సైన్స్, ఆర్ట్స్ అంటే ఆసక్తి. ఇద్దరం ఒకళ్ళ సందేహాలు ఒకళ్ళు తీర్చుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇద్దరం ఆర్టిస్టులమే. 2012 లో గోకరాజు రంగరాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఎమ్.డి. మా కాలేజీకి వచ్చారు. ఆమె పోట్రెయిట్ గీయమని మా స్కూల్ వాళ్ళు నన్ను అడిగారు. అది నాకు వచ్చిన పనే అవడంతో వెంటనే చక్కని చిత్రం గీసి ఇచ్చాను. దానికి ఆమె ఎంత సంతోషించారో తెలుసా..? 'నాకు ఇంత ప్రత్యేకత ఇచ్చినందుకు థ్యాంక్స్ హరితా! ఇది నా జీవితంలోనే అపురూమైన బహుమతి' అన్నారు. ఆమె ప్రశంస నాకు చాలా సంతోషాన్ని కలుగజేసింది'' అని వివరించారు హర్షిత.
''ఈ విద్యావ్యవస్థ మీదే నాకు వ్యతిరేక భావం ఉంది. నేనెప్పుడూ ప్రశ్నించుకునేదాన్ని, 'ఎందుకు నేనింత కష్టపడుతున్నాను? దీనివలన నేను సాధించేది ఏంటి?' అని. ఈ చదువులు విద్యార్థులకు ఎలా ఆలోచించాలో చెప్పవు. ఏం ఆలోచించాలో చెప్తాయి. ఎక్కువ చదువుకోవడం అంటే ఎక్కువ సంపాదనకు మాత్రమే అన్నది నా అభిప్రాయం. ఈ చదువుల బారి నుండి బయటపడాలంటే ఏం చేయాలో ఆలోచించాను. నాకు వచ్చిందల్లా ఆర్టే. ఆరంభంలో కొత్తగానే అనిపించినా నేను దానిలో మరింత పట్టుదలగా సాధించి, నా స్థాయిని పెంచుకుంటూ పోయాను'' అని హర్షిత వివరించారు.
''ఆర్టిస్టుని అవుదామనుకున్నానని నా ఆసక్తిని గురించి చెప్తే, ఎక్కువ సంపాదన ఉండదని అందరూ నిరుత్సాహ పరిచారు. నేను పెద్దగా సంపాదించ లేకపోవచ్చుకానీ, చేసే పనిలో నాకు చెప్పలేనంత సంతృప్తి దొరుకుతుంది. ఇప్పుడు నేను ఒక వ్యక్తి ఫొటో చూస్తూ బొమ్మ గీసేయగలను. నన్ను ఇంత ప్రోత్సహించిన గొప్పతనం మా జువాలజీ లెక్చరర్ గాయత్రీ మేడమ్‌దే. ఆమె ప్రోద్బలంతోనే 2013 మార్చిలో 'కమీషన్డ్ ఫర్ పోట్రెయిట్స్' మొదలుపెట్టాను. దీని ద్వారా నేను ఆదాయం సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నాను. మనకు ప్రియమైన వారిని ఎంతగానో ప్రేమిస్తాం. వారికి ఎన్నో బహుమతులు కూడా ఇస్తూంటాం. కానీ అవి కొన్నాళ్ళకు పాడైపోతాయి. అదే పోట్రెయిట్ వేయించి, ఇస్తే అది వారికి అమూల్యమైన బహుమతి అవుతుంది. కేవలం వ్యక్తుల బొమ్మలే కాదు, వారికి సంబంధించిన తీపి గుర్తులను, పెంపుడు జంతువులు కూడా చిత్రించి ఇస్తూంటాను. పోట్రెయిట్స్ వేయడమేకాక నేను అంతకుముందు వేసిన స్కెచ్‌ల ప్రింట్‌లను కూడా అవసరమైన వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. ఖరీదు తక్కువే. కమీషన్‌తో పాటు నేను వేసిన సాధారణ చిత్రాలను ఫేస్‌బుక్ ఆక్షన్ ద్వారా కూడా కొనుక్కుంటూ ఉంటారు. ఇంట్లో నుండే పనిచేస్తాను. నాకంటూ ప్రత్యేక ఆఫీస్ ఏమీలేదు. నా వ్యాపార లావాదేవీలన్నీ ఫేస్‌బుక్ నుండే చేస్తాను'' అని ముగించారు. హర్షిత.