ఉద్యోగం కాదనుకుని.
నాన్న టీచర్‌గా రిటైరయ్యారు. నా చదువంతా వరంగల్‌లోనే సాగింది. చిన్నప్పటినుంచీ నాకు ఏ బాదరబందీలేదు.. భయమూలేదు. మా బంధువుల మాటల్లో చెప్పాలంటే- మగరాయుడిలా పెరిగాను. సేవాకార్యక్రమాలంటే చాలా ఇష్టం. రుద్రమ టీచరు చాలాసార్లు చెప్పేది. ‘అమ్మానాన్న ఇచ్చే పాకెట్ మనీతో ఇప్పుడు చేసేది సేవకాదు.. మీకు వీలైతే రేపు జీవితంలో నిలబడ్డాక, అభాగ్యుల కోసం పనిచేయండి’ అని! ఆమె చెప్పిన మాటలు మనసులో బాగా నాటుకుపోయాయి. బీఎస్సీ న్యూట్రిషన్ చేశాను. ఢిల్లీ ఎన్‌సీసీలో ఉద్యోగమొచ్చింది. న్యూట్రిషనిస్ట్‌గా చేరాను. శిక్షణ తీసుకుంటూనే ఎస్‌ఓఎస్-చిల్డ్రన్స్‌విలేజెస్ ఆర్గనైజేషన్‌లో భాగస్వామినయ్యాను. పూర్తి ఇష్టంతో స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. న్యూట్రిషనిస్ట్‌గా సేవలందించేదాన్ని. అక్కడ ఉన్నప్పుడే నా ఆలోచనలు సామాజిక బాధ్యతను గుర్తుచేశాయి. ఉద్యోగం కాదు.. ఇలాంటి పిల్లల కోసం ఏదైనా చేయాలనిపించింది. శిక్షణాకాలం పూర్తికాకముందే మానేస్తున్నానని చెప్పి వెనక్కివచ్చేశాను. హైదరాబాద్‌లో కొంతమంది ఫ్రెండ్స్‌ను కలిసి చర్చించాను. చివరికి నావంతుగా ఇద్దరు అనాథపిల్లల పూర్తి బాధ్యత తీసుకుంటాను అని నిర్ణయించుకున్నాను. కొంతమంది వ్యతిరేకించారు. ‘నీకింకా పెళ్లికాలేదు. చిన్నపిల్లవి. ఇలాంటి నిర్ణయాలేంటి..?’ అని కోప్పడ్డారు కూడా. కానీ, ఒక నిర్ణయం తీసుకున్నాక స్థిరంగా నిలబడడమే నాకు తెలుసు. మిత్రుల సాయంతో ఇద్దరు అనాథ చిన్నారులను చేరదీశాను. అందులో ఒకరు హెచ్‌ఐవీ పాజిటివ్. అనాథలనగానే అమ్మ కూడా వారిని చేరదీసింది. కుటుంబసభ్యుల్లాగానే చూసుకుంది. కానీ హెచ్‌ఐవీ పాజిటివ్ అని తెలియగానే ఇంట్లోనుంచి పంపించేసింది. అప్పుడు మొదలైంది అసలు సంఘర్షణ. అదీ ఇంట్లో నుంచే.
జీవితాన్ని కుదిపేసిన శంకర్ మరణం..
ప్రపంచమంతా ‘నో’ అన్నా.. పోరాడేదాన్ని. కానీ కుటుంబసభ్యుల నుంచే వ్యతిరేకత వస్తే.. నిజంగా నీరుగారిపోయాను. నిటారుగా నిలబడ్డ నన్ను నిస్సత్తువ ఆవహించింది. ఆ పిల్లల్ని ఏం చేయాలో అర్థంకాలేదు. హాస్టళ్లలో, వాళ్ల దూరపు బంధువుల దగ్గర ఉంచేందుకు ప్రయత్నించాను. వాళ్లకు రెగ్యులర్‌గా న్యూట్రిషన్ కిట్స్ అందించేదాన్ని. హెచ్‌ఐవీ పాజిటివ్ పిల్లలకు సాయం చేయడంకాదు నిరంతర సంరక్షణ అవసరం. అదే లోపించింది. న్యూట్రిషన్ దొరికేదేమోకానీ భరోసా, బాధ్యత కొరవడింది. ఆరునెలల్లోనే శంకర్ అనే పిల్లాడు చనిపోయాడు. నా జీవితాన్ని కుదిపేసిన సంఘటన అది. నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇలాంటి పిల్లలకు ఎవరు ఆసరా? అది నేనే ఎందుకు కాకూడదు అనిపించింది. అన్నింటినీ మించి ఆశయం కోసం ధైర్యంగా నిలబడడమా? అమ్మానాన్న కోసం అన్నింటిని వదిలివేయడమా? అన్న ప్రశ్నలు ఎదురైనప్పుడు ఆశయం వైపే నిలబడేలా చేసిన సంఘటన అది.
హృదయాల్ని గాయపరిచే ఘటనపూన్నో..
2007లో కొందరు మిత్రుల సాయంతో కొందరు హెచ్‌ఐవీ బాధితపిల్లల్ని చేరదీసి ‘న్యూలైఫ్ హెల్పింగ్ సొసైటీ’ని ప్రారంభించాను. అలా ఐదుగురు చిన్నారులతో ప్రారంభమైన సొసైటీలో ఇప్పుడు 30మంది పిల్లలున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి రకరకాల మార్గాలనుంచి పిల్లలు ఈ చెట్టు నీడకు చేరారు. ఓసారి ఓ ఫోన్ వచ్చింది. ‘మేడమ్ మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో ఓ పాప ఉంది. మీకు అప్పగించాలనుకుంటున్నాం’ అని ఓ వ్యక్తి చెప్పాడు. నేను రైల్లో మంచిర్యాల వెళ్లాను. రైలుదిగగానే మళ్లీ నాకు ఫోన్‌చేశాడు. ఎర్రవూడెస్‌లో ఉందని, తీసుకెళ్లమని చెప్పాడు. ఆ పాప కోసం రైల్వేస్టేషన్ అంతా గాలించాను. చివరకు ఓ బెంచీపైన కనీసం ఒంటిపై డ్రెస్‌కూడా లేకుండా సగం చిరిగిపోయిన చిన్న ఫ్రాక్‌తో ఆరేళ్లపాప కనిపించింది. వెంటనే నా చున్నీ ఆమె చుట్టూ కప్పి, నా వెంట తీసుకువచ్చాను. తర్వాత ఆ పాప అనేక విషయాలు చెప్పింది. ఆకలేస్తే అన్నం పెట్టే వాళ్ళు కాదట. కనీసం అడుక్కుంటానంటే ప్లేటు కూడా ఇవ్వలేదంట. అమ్మానాన్న ఉన్నంతవరకు పర్వాలేదుకానీ, వారు పోయాక, హెచ్‌ఐవీ పాజిటివ్ పిల్లల్ని సొంత కుటుంబసభ్యులే ఎంత హీనంగా చూస్తారో దీన్నిబట్టి తెలుస్తోంది.
నాన్న మాట్లాడలేదు..
నేను, నా మార్గమిది అని స్పష్టంచేయడం నాన్నకు నచ్చలేదు. మూడేళ్లు నాతో మాట్లాడలేదు. ఇక బంధువులైతే దాదాపు బహిష్కరించినంత పనిచేశారు. ఏ ఫంక్షన్‌కూ పిలిచేవారు కాదు. హెచ్‌ఐవీ పాజిటివ్ పిల్లలతో ఉంటున్నందున నాకు ఆ వ్యాధి ఉండొచ్చునన్నది వారి భయానికి కారణం. దానికితోడు నాకు చాలారోజులవరకు పెళ్లికాకపోవడం కూడా వాళ్లలో అనుమానాల్ని మరింత పెంచింది. మనం ఇన్ని విషయాలు మాట్లాడుకుంటాం. హెచ్‌ఐవీ మీద విస్తృత ప్రచారాన్ని చేస్తాం. డిసెంబర్ 1న రెడ్‌రిబ్బన్లతో ఊరేగింపులు చేస్తాం.. ప్రాథమిక స్థాయి నుంచే పాఠాలు చదువుకుంటాం. అయినా ఎవరో అర్భకుడు చెప్పిందే నమ్మేస్తాం. నా పెళ్లిచూపులు ప్రతీసారి నన్ను తీవ్ర నిరాశకు.. అంతకుమించి యువత గొర్రెదాటు మనస్తత్వంపై ఏహ్యభావానికి గురిచేసేవి. ‘30మంది అనాథపిల్లలు ఉన్నారు.. పెళ్లయినా వారిని వదిలేయదు..’ అని తెలియగానే సగం సంబంధాలు వచ్చేవి కావు. ఒకరో ఇద్దరో వచ్చినా, ఇంటికివచ్చాక నేను నిజం చెప్పాల్సి వచ్చేది. ‘ఆ్ఫన్స్ అంటున్నారు కదా, పిల్లల కోసం ఆయాను పెడదాం. మీరు ఉద్యోగం చేయండి.. నేనూ చేస్తా..’ అని కొందరు మాట్లాడేవాళ్లు. ‘వాళ్లంతా ఎవరనుకున్నారు? హెచ్‌ఐవీ పాజిటివ్ పిల్లలు. నేను పూర్తి కేర్ తీసుకోవాల్సిందే..’ అని చెప్పగానే పరారయ్యేవాళ్లు. తర్వాత ఎప్పుడైనా రోడ్డుమీద ఎదురైనా ముఖం తిప్పుకుని వెళ్లిపోయేవాళ్లు.
ఒక దశలో చనిపోవాలనుకున్నా..
ఏ ఆసరా లేకుండా 30మంది పిల్లల్ని మూడేళ్లు నేనే చూసుకున్నాను. ఎక్కడా ఇంత బియ్యంకూడా దొరకని స్థితి. ఉద్యోగం చేయాలనుకున్నా, పిల్లలతో సాధ్యంకాని పరిస్థితి. ఇక్కడున్నవాళ్లలో ఏడేళ్లలోపు పిల్లలే ఎక్కువమంది. ప్రతీరోజూ ఏదో ఒక కారణంగా ఎంజీఎం ఆస్పవూతికి వెళ్లాల్సి వచ్చేది. అప్పటికి చిన్నారి శిరీషను కాపాడుకోలేకపోయాను. నిరంతరం వారి విషయంలో కేర్ తీసుకుంటూ ఉండాల్సి రావడంతో ఉద్యోగం సాధ్యపడలేదు. వారికోసం నా నగలన్నీ అమ్మేశాను. వెంటాడుతున్న ఆర్థికసమస్యలు. నాఅన్నవాళ్ల ఆసరా కొరవడడం, పైగా అర్థంలేనివూపచారాలు.. ఒకదశలో చచ్చిపోవాలనిపించింది. పెద్దపిల్లల్ని పిలిచి చెప్పాను. మిమ్మల్ని ఏదైనా హాస్టల్లో చేర్పిస్తారా.. నాదగ్గరుంటే ఆకలితో చచ్చిపోతారు అని నచ్చజెప్పేందుకు ప్రయత్నించా. ‘మీతోనే మేముంటాం అక్కా.. మీరేం పెడితే అదే తింటాం..ఎక్కడికీ వెళ్లం’ అన్నారు. ఆ మాటలు విన్నాక వాళ్ల కోసమైనా నేను బతకాలనిపించింది. సరదాగా, జల్సాగా ఉండే నన్ను పూర్తిగా ప్రభావితం చేసిన మూడేళ్లు అవి.
జాగ కోసం రాత్రంతా తిరిగాం..
30మంది అనాథ పిల్లలుంటారనగానే ఎవరూ ఇల్లు ఇచ్చేవారు కాదు. చివరికి ఎలాగోలా కన్విన్స్ చేయాల్సి వచ్చేది. వారికి తర్వాత ఎలాగో తెలిసేది పాజిటివ్ పిల్లలని. దాంతో ఉన్నపళంగా ఖాళీ చేయించేవారు. ఓసారి శంభునిపేటలో మేముంటున్న ఇంటి ఓనరుకు విషయం తెలిసింది. రాత్రికిరాత్రే ఖాళీ చేయమన్నాడు. ఏంచేయాలో తోచలేదు. సామానంతా తెలిసినవాళ్ల ఇళ్లలో పెట్టి.. ఆ రాత్రి ఎక్కడుండాలో అర్థంకాలేదు. కొంతడబ్బు ఉంటే అప్పటికప్పుడు 30మంది పిల్లలు, నేను ఓ లాడ్జిలో ఉండిపోయాం. మరుసటిరోజు కీర్తినగర్‌లో ఇల్లుచూసుకుని అక్కడికి వెళ్లిపోయాం.
ఎంబీబీఎస్ చదివీ చెయ్యిపట్టుకోలేదు..
ఓ పిల్లాడికి స్కూల్లో గాయమైంది. ఇనుపగేట్లో చెయ్యి ఇరుక్కుని తీవ్రంగా రక్తంకారుతోంది. అలా గాయాలైనప్పుడు ఏం చేయాలో ఇక్కడ ప్రతీ పిల్లాడికీ నేర్పించాను. ఉపాధ్యాయులు సాయం కోసం వచ్చినా, ఆ బాబు వద్దన్నాడు. తాను చూసుకుంటానని నాకు ఫోన్‌చేయమన్నాడు. నేను వెంటనే ఎంజీఎంకు తీసుకు డాక్టర్ ట్రీట్‌మెంట్ చేస్తుండగానే, బాబు హెచ్‌ఐవీ పాజిటివ్ అని చెప్పాను. చేతులకు గ్లోవ్స్ ఉన్నా, ఆ డాక్టర్ బాబు చేయిని ముట్టుకోలేదు. వెంటనే గ్లోవ్స్ తీసేసి, చెయ్యి కడిగేసుకున్నాడు. మిగతాదంతా నా చేతులతోనే చేయించాడు. ఎంబీబీఎస్ చదివిన డాక్టర్‌కీ హెచ్‌ఐవీ బాధితులను ఎలా చూడాలో తెలియకపోతే ఇక సగటు మనిషి నుంచి ఇంకేం ఆశిస్తాం?
సహాయంగా ఎందరో మహానుభావులు
రానురానూ నా పనిని నాన్న అర్థంచేసుకున్నాడు. వాళ్లు ఇప్పుడీ చిన్నారులను సొంత మనవళ్లలాగే చూసుకుంటున్నారు. సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళ్దామని పిల్లలు మారాం చేస్తుంటారు. మొన్న వేసవి సెలవుల్లో ముగ్గురు పిల్లలు భూపాలపల్లిలోని నాన్న వాళ్లింట్లో ఉండివచ్చారు. ఈ పిల్లల్ని ఆయా ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యంతో మాట్లాడి స్కూళ్లు, కళాశాలల్లో రాయితీపై చేర్చాను. ఇక కేర్‌ఫార్మసీ డాక్టర్ సుధీర్ లేకపోతే ‘న్యూలైఫ్’ అర్ధంతరంగా ఆగిపోయేదే. అన్నివేళలా ఆయన అండగా నిలబడ్డారు. కృష్ణవేణి, మంజుల తదితరులూ సొసైటీని ఇప్పుడు తమ చేతుల్తో నడుపుతున్నారు. ఇద్దరి ఆలోచనలు ఒక్కటే కావడంతో ఎన్జీవోస్‌కాలనీలో అనాధాశ్రమం నడుపుతున్న ఒద్దిరాజు చంద్రవూపకాశ్, నేను ఆరునెలల క్రితం వివాహం చేసుకున్నాం. ఆయనకూడా జీవితాన్ని పూర్తిగా ఆ చిన్నారులకే అంకితంచేసిన వ్యక్తి. నా ఆలోచనలతో కాని పని నా పెళ్లితో అయ్యింది. అది బంధువుల నోళ్లు మూతపడడం.’
మూలం : నమస్తే తెలంగాణ దినపత్రిక