అభివృద్దిచెందిన అనేక రంగాల్లో చలనచిత్ర పరిశ్రమ అతి పెద్ద ఏకైక రంగంగా నిలిచింది. అయితే తెరమీద కనిపించే వారే ఈ రంగంలో సాధారణంగా ప్రజల దృష్టిపథంలో ఉంటారు. కానీ, ఇందుకు కారణమైన తెరవెనుక ప్రజ్ఞావంతులు చాలా వరకూ ఎవరికీ తెలియరు. కానీ ఏ సినిమా సూపర్ హిట్టయినా కేవలం నటీనటులవల్లనే అనుకునే భ్రమలు ఇంకా ప్రేక్షకలోకాన్ని విడిచిపెట్టలేదు. ఒక సినిమా రూపొందాలంటే దాని వెనుక ఎన్ని రంగాల నిపుణులు శ్రమిస్తారో ఒక్కసారి ఆలోచిస్తే చిత్ర విజయ సారథులు ఎవరు? అన్న విషయం తేటతెల్లమవుతుంది.
ఈ విధంగా ప్రజ్ఞాపాఠవాలతో అందరి మన్ననలు పొందిన వారిలో ఒకరు ‘అనుపమ చోప్రా’. ఈమె ఒక రచయిత్రి, జర్నలిస్ట్, సినీ విమర్శకురాలు. ఈమె ఎన్నో భారతీయ చలన చిత్రాల మీద ఎన్నో గ్రంధాలు రాసింది. సమీక్షకురాలిగా ఎన్‌డిటీవీకి, ఇండియా టుడేకి తన వ్యాసాలు అందిస్తోంది. అలాగే హిందుస్తాన్ టైమ్స్ పత్రికకి కూడా సినిమా విమర్శకురాలిగా ఉంటోంది.
చిన్ననాటి ముచ్చట్లు
అనుపమ చోప్రా కలకత్తాలోని ఒక బెంగాలీ కుటుంబంలో జన్మించింది. తండ్రి యూనియన్ కారె్బైడ్‌లో ఉద్యోగి. తల్లి కామ్నా చంద్ర సినీ రచయిత్రిగా ఎన్నో చిత్రాలకి డైలాగులు రాసింది. ప్రేమ్‌రోగ్, చాందినీ చిత్రాలకి మాటల రచయిత అనుపమ తల్లి కామ్నా చంద్రే. అనుపమ అసలు పేరు కూడా అనుపమ చంద్ర. వివాహానంతరం అనుపమ చోప్రాగా మారింది. అనుపమ బాల్యం అంతా ముంబాయిలోనే సాగింది. యుక్త వయసులో చాలా సంవత్సరాలు హాంగ్‌కాంగ్‌లో ఉంది. 1987లో ముంబాయ్‌లోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో బి.ఎ లిటరేచర్ పూర్తిచేసింది. తన టీచర్ సలహా అనుసరించి జర్నలిస్ట్‌గా స్థిరపడాలని నిర్ణయించుకుని నార్త్ వెస్ట్రన్ కళాశాలలో మెడిల్ స్కూల్ ఆఫ్ జర్నలిజంలో ఎం.ఏ పూర్తిచేయడమే కాకుండా హర్రింగ్‌టన్ అవార్డని సాధించింది. మొదట్లో అనుపమ సినిమాకోసం పనిచేయడడం ఎవరూ ఇష్టపడలేదు. అయినా పట్టుదలతో ఆ రంగంలో విజయాలు సాధించి అందరి మన్ననలు అందుకుంది.
కృషి, పట్టుదల
అనుపమ చోప్రా ఎన్నో విలువైన పుస్తకాలు రచించింది. ఈమె మొట్టమొదటి రచన ‘షోలే’. ఇది ఎంతటి సంచలనాన్ని కలిగించిందో వేరే చెప్పనవసరం లేదు. 2000 సంవత్సరంలో ఈమె రాసిన ది మేకింగ్ ఆఫ్ క్లాసిక్ అనే గ్రంధానికి 2001లో నేషనల్ ఫిల్మ్ అవార్డ్ లభించింది. తరువాత 2002లో ఈమె రచించిన ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ పుస్తకాన్ని బ్రిటీష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా ప్రచురించబడింది. ఇది ఆమె అధునిక రచనా సంపుటాల్లో ఒకటి. ఇది ఎంతో గర్వకారణంగా చెప్పవచ్చు. అలాగే ఈమె రచించిన ‘కింగ్ ఆఫ్ బాలీవుడ్’ షారూక్ ఖాన్ అండ్ ది సెడెక్టివ్ వరల్డ్ ఆఫ్ ఇండియా’ అనే మరో పుస్తకం గురించి న్యూయార్క్ టైమ్స్ మాగజైన్‌లో ఎడిటర్స్ చాయిస్ శీర్షిక కింద సమీక్ష ప్రచురితమయ్యింది. అనుపమ కృషికి ఇదో కలికితురాయిగా అభివర్ణించవచ్చు.
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని అగాధాల నేపథ్యంలో రాసిన సంకలనం ‘ఇవవై దశాబ్ధాల హిందీ సినిమా’ అనే పేరుతో పెంగ్విన్ ఇండియా వారు ప్రచురించారు. ఈ గ్రంథానికి మంచి ఆదరణ, ప్రశంసలు అందుకుంది అనుపమ. ఈమె మరో గ్రంధం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. ఈ పుస్తకానికి ముందు మాట షారూక్ ఖాన్ రాయడం మరింత ఉత్సాహాన్ని నింపింది. ఇలా అనుపమ రచనలు కేవలం పుస్తక రూపాల్లోనే కాకుండా ‘ఇండియా టుడే’, ‘న్యూయార్క్ టైమ్స్’ , ‘ది లాస్ ఏంజిల్స్ టైమ్స్’, వంటి ప్రతిష్ఠాత్మకమైన అనేక పత్రికలో ప్రచురితమయ్యాయి. అవుతున్నాయి కూడా. అలాగే స్టార్ వరల్డ్ చానెల్‌లో ప్రతివారం ‘ది ఫ్రంట్ రో’ అనే చిత్ర సమీక్షా కార్యక్రమాన్ని అనుపమ నిర్వహిస్తోంది. నిర్విరామ కృషితో అంచలంచెలుగా విజయ సోపానాలు అధిరోహిస్తున్న అనుపమ చోప్రా మరింత మందికి ఆదర్శవంతంగా నిలుస్తుందని కోరుకుందాం.