ప్రశ్నించే స్వభావమే లేకపోతే, మనకు ప్రపంచం ఏం తెలుస్తుంది? సమాధానం చెప్పే వాళ్ల మాట ఎలా ఉన్నా తెలిసీ తెలియని వయసులో ప్రశ్నించడమే పెద్ద సాహసం. నిజానికి అరకొర ప్రశ్నలతో అప్పుడు అభాసుపాలయ్యే ప్రమాదమే ఎక్కువ. నేను 6వ తరగతి చదువుతున్న రోజుల్లో లక్ష్మీనరసింహారావు అనే టీచర్ ఉండేవారు. ఒక రోజు మాకు జాగ్రఫీ చెబుతూ, ఇనుముకూ బంగారానికీ ఉన్న తేడా ఏమిటో వివరిస్తున్నారు. అప్పట్లో నాలో బంగారం పట్ల ఉన్న మక్కువ వల్లో మరేదైనా కారణం వల్లో నా మనసులో ఒక ప్రశ్న అంకురించింది. ఏ మాత్రం సంకోచించకుండా "అందరూ అతి మామూలుగా చూసే ఇనుమునేమో చవకగా అమ్ముతారు. అందరికీ చాలా ఇష్టమైన బంగారాన్నేమో ఎక్కువ ధరకు అమ్ముతారు. ఎందుకు సార్?'' అన్నాను.
ఆ ప్రశ్న విని అర్థంలేని ప్రశ్న అని కొట్టిపారేయకుండా ఎంతో సావధానంగా.... "ఏదైతే ప్రకృతిలో చాలా తక్కువగా లభిస్తుందో, ఏది లేకపోయినా జీవితం గడుస్తుందో దానికి ఎంత ఖరీదు పెడితే మాత్రం ఏముంది? బంగారం లేని కారణంగా ఎవరి ప్రాణాలూ పోవు కదా! కానీ, ఇల్లు కట్టుకోవాలంటే అందరికీ ఇనుము కావాలి. దానికే ఎక్కువ ధర పెడితే నీ లాంటి నా లాంటి వాళ్లకు ఇళ్లు ఉండవు కదా! అందుక ని, ప్రకృతిలో ఎక్కువగా లభించే ఇనుము తక్కువ ధరకు లభిస్తుంది'' అన్నారు. నా ప్రశ్న ఎలా ఉన్నా మా టీచర్ చెప్పిన సమాధానంతో నా మనసు నిండిపోయింది. నేను ఆ ప్రశ్న వేయడం వల్లే కదా ఆ నిజం తె లిసిందని ఎంతో సంతోషం కలిగింది. అప్పటి నుంచే నాలో ప్రశ్నించే స్వభావం మరింత బలపడుతూ వచ్చింది. ఒక దశలో ప్రశ్నించడం గొప్ప హక్కు అన్న భావన నాలో స్థిరపడుతూ వ చ్చింది. అదే సమయంలో ఎదుటి వారు వేసే ప్రశ్నలు అన్ని సార్లూ అంత స్పష్టంగా, సహేతుకంగా ఉండకపోవచ్చని అయినా ఆ ప్రశ్న వేయడంలోని ఉద్దేశాన్ని అర్థం చేసుకుని సమాధానం చెప్పే సంస్కారం ఉండాలని ఆ తర్వాత నాకు అనిపించింది.
పంచుకునే వేదిక కావాలి
మా పెదనాన్న పెద్ద డాక్టరు. బాగా సంపన్నుడు. ఆయన కూతురు పిహెచ్.డి చేసింది. సంపన్నుడైన ఒక డాక్టర్‌తో ఆమె పెళ్లి జరిగింది. ఆమె ఎంతో అందంగా ఆరోగ్యంగా ఉండేది. అన్నీ సవ్యంగా సాగిపోతున్నాయని అయిన వాళ్లంతా అనుకుంటున్న సమయంలో ఒకరోజు ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆ రోజుల్లో మా కుటుంబాల్లో అదో పెద్ద విషాదం. ఆమె ఎందుకలా ఆత్మహత్యకు పాల్పడిందన్న విషయం చాలాకాలం దాకా ఎవరికీ తెలియదు. తన సమస్యేమిటో ఎవరితోనైనా మనసు విప్పి చెబితే కదా తెలిసేది? బహుశా మనసు విప్పి చెప్పే అవకాశమే ఆమెకు రాలేదేమో అనిపించింది. ఆలోచిస్తూపోతే అలాంటి వారికి ధైర్యం చెప్పి ఏదో ఒక స్థాయిలో ఒక పరిష్కారమార్గాన్ని చూపే వేదిక అంటూ లేకపోవడమే ఇందుకు కారణమేమోనని అనిపించింది. ఆ ఆలోచనతోనే నేచర్ క్యూర్ డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తూనే నల్లగొండలో 'సబల' అన్న పేరుతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం. అది కేవలం ఒక చర్చావే దిక మాత్రమే. ' మనసుల్ని కలబోసుకుందాం రండి' అన్నది మా సంస్థ తరపున మేమిచ్చిన నినాదం. అలాంటి వేదిక కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారేమో అన్నట్లు ప్రతి ఆదివారం రోజున ఏర్పాటు చేసే ఆ మీటింగ్‌లకు యుక్త వయసు అమ్మాయిల నుంచి ఎనబై ఏళ్ల వృద్ధురాళ్ల దాకా చాలామంది వచ్చేవారు. ప్రతివారం 80 మంది దాకా వచ్చి రెండు మూడు గంటల పాటు కూర్చునే వాళ్లు. మనసు విప్పి చెప్పుకోవడానికి అదొక అరుదైన అవకాశం అనిపించిందేమో! వెంటనే ఏదో పరిష్కారం దొరుకుతుందని అనుకోకపోయినా, పరిష్కారం దిశగా పయనించడానికి ఇది ఎంతో కొంత దోహదం చేస్తుందనే ఆశ మాత్రం అక్కడికి వచ్చిన మహిళల్లో నేను స్పష్టంగా చూశాను.
కొన్నింటికి ముగింపు ఉండదు
2003లో నేను రెడ్‌క్రాస్ వారి నేచర్ క్యూర్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న రోజుల్లో 'ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్' అనే సంఘాన్ని స్థాపించాం. అప్పటికే కొంత పర్యావరణం గురించి కొంత అవగాహన ఉంది. ఆ సమయంలోనే యురేనియం మైనింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్లు పబ్లిక్ హియరింగ్ పెడుతున్నామంటూ ఇచ్చిన ఒక నోటిఫికేషన్ హిందూ పత్రికలో వచ్చింది. నాగార్జునసాగర్ పక్కన 1200 ఎకరాల విస్తీర్ణంలో యురేనియం మైనింగ్ చేయబోతున్నామని, దానికి ప్రజలు తమ అభిప్రాయాలు, ఆక్షేపణలు ఏమైనా ఉంటే చెప్పవచ్చన్నది ఆ నోటిఫికేషన్ సారాంశం. ఈ నోటిఫికేషన్ రావడానికి వారం రోజుల ముందు జార్ఖండ్‌లో జరుగుతున్న యురేనియం మైనింగ్ విషయాన్ని చిత్రించిన 'బుద్ధా వీపింగ్ జాదూగూడ' అనే డాక్యుమెంటరీ సినిమాను మా ఫోరం తరపున ప్రదర్శించాం.
మైనింగ్ జరుగుతున్న ప్రదేశాల్లోని ప్రజలు అత్యధిక సంఖ్యలో కేన్సర్, క్షయ, సిలికోసిస్, తీవ్రమైన చర్మవ్యా«ధుల బారిన పడటం, పుట్టిన పిల్లలు పలు రకాల అంగవైకల్యాలతో ఉండడం, అకాల వృద్ధాప్యం రావడం వంటి అంశాలు ఆ సినిమాలో ప్రస్తావనకు వస్తాయి. ఆ డాక్యుమెంటరీని 'బుద్దుడు రోదిస్త్తున్నాడు' అన్న పేరుతో తెలుగులోకి అనువదించాం కూడా. యురేనియం ప్రాజెక్టు ప్రభావం నాగార్జునసాగర్ మీద పడితే కృష్ణానది నీటి మీదే ఆధారపడిన సగం ఆంధ్రప్రదేశ్ ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటుంది. వ్యవసాయపరంగా గానీ, తాగునీటిపరంగా గానీ చాలా నష్టపోతామని, హైద్రాబాద్‌కు తాగు నీరు అక్కడనుంచే వస్తుంది కాబట్టి అర్జంటుగా ఏమైనా చేయాలనుకున్నాం. ఏం చేయాలో స్పష్టంగా తెలియకపోయినా 30 రోజుల్లోనే పబ్లిక్ హియరింగ్ జరిగిపోతుందన్న ఆందోళన ఎక్కువైపోయింది. ఒకసారి పబ్లిక్ హియరింగ్ జరిగిపోతే వాళ్లకు ఫైనల్ పర్మిషన్ లభిస్తుంది. అందుకే దాన్ని నిరోధించే ప్రయత్నం చేయాలనుకున్నాం. వెంటనే దానికి సంబంధించిన అధ్యయనమంతా చేశాం. ప్రజలంతా ఆ ప్రాజెక్టును పెద్దఎత్తున వ్యతిరే కించేలా చేశాం. ఈ రోజు దాకా ఆ ప్రాజెక్టు రాలేదు కానీ, మునుముందు రాదన్న గ్యారెంటీ ఏదీ లేదు. అందుకే అటువంటి వాటిని నిరోధించే పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉండాలన్న వాస్తవం తెలిసొచ్చింది. కొన్ని పోరాటాలకు ముగింపు ఉండదనే సత్యం ఒకటి బోధపడింది.
ప్రకృతికి దూరమైతే....
రెడ్‌క్రాస్ వారి నేచర్ క్యూర్ హాస్పిటల్‌కు ఒకరోజు 40 ఏళ్ల ఒక మహిళ వీల్ చెయిర్‌లో మావద్దకు వచ్చింది. ఆమె గృహిణి. భర్త ఇంజనీరు. ఎముకలు మెత్తబడి వంగిపోయే ఆస్టియో మలేషియా అనే వ్యాధి కారణంగా అంతకు ముందు ఒక కార్పొరేట్ హాస్పిటల్‌లో చేరిందట. అక్కడ ఏ ఫలితమూ కనిపించకపోవడంతో ఇక్కడికి వచ్చింది. ఈ వ్యాధికి కాల్షియం లోపాలు కారణమన్నది వాస్తవమే అయినా ఆమె విషయంలో అందుకు దారి తీసిన ఒక విచిత్రమైన కారణం బయటపడింది. ఆమె భర్త మైనింగ్ ఇంజనీరు. వాళ్లు ఉండే కాలనీ పక్కనే గనులు ఉన్నాయి. మైనింగ్ వర్క్ షిప్ట్‌ల వారీగా 24 గంటలూ జరుగుతూ ఉంటుంది. దాంతో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ట్రక్కులు నిరంతరం వాళ్ల ఇంటి పక్క నుంచే వెళుతుంటాయి. వాటి తాలూకు శబ్దాలు, వాటితో వచ్చే ప్రకంపనలు ఆమెలో ఒక భయాన్ని నింపాయి. అందుకే దాదాపు ఆరేళ్లు ఆమె ఇంట్లోంచి బయటికే రాలేదు. పగలూ రాత్రి తలుపేసుకుని ఆరేళ్లూ ఇంట్లోనే ఉండిపోవడం వల్ల ఆమెకు ఈ జబ్బు వచ్చింది. ఇక్కడికి రావడానికి ముందు వైద్యం ఇచ్చిన కార్పొరేట్ హాస్పిటల్ వారు ఈ జబ్బు ఎప్పటికీ నయం కాదనే చెప్పారట. ఆ భావనను మనసులోంచి తీసివేయమని ధైర్యం చెప్పి చికిత్స ప్రారంభించాం. అరిటాకుల మీద పడుకోబెట్టి ఎండలో ఉంచే 'ఆతప స్నానం, నూనె రాసి సన్‌బాత్ ఇవ్వడం, మట్టి పూతలతో షెడ్‌లో కూర్చోపెట్టడం వంటి చికిత్సలతో కేవలం నెలరోజుల్లోనే ఆమె పరిస్థితి ఎంతో మెరుగుపడింది. ఆ తరువాత మరో రెండు వారాలకు ఆమె షటిల్ కూడా ఆడే స్థితికి చేరుకుంది. ఆమెకు మేమేమీ మందులు ఇవ్వలే దు. ఆమెను ప్రకృతికి చేరువగా తీసుకువెళ్లాం అంతే. ఆమె ప్రకృతి చికిత్సకు రాకపోయి ఉంటే బతికినంత కాలం మంచాన పడి ఉండడం తప్ప మరొకటి చేయగలిగేది కాదు. ప్రకృతి సహజంగా జీవించడమే మహావైద్యం అని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి?