విజయవాడకు చెందిన యాన్ ఫణి బాడ్, విజయ దంపతులు గత 27 ఏళ్లుగా ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలోని శాన్‌హొజేలో నివాసం ఉంటున్నారు. వీరి కూతురే మోనికా బాడ్.
చిన్న నాటి నుంచే...
చిన్నతనం నుంచే మోనికలో సేవాదృక్పథం ఉండేది. కష్టాల్లో ఉన్నవారికి సాయం అందించాలనే తపన ఆమెలో కనిపించేది.
‘‘మోనిక రెండేళ్ల వయస్సులో ఇండియాకు వచ్చాం. చెన్నై రైల్వేస్టేషన్‌లో తనకు బిస్కెట్లు ఇస్తే తీసుకువెళ్లి ప్లాట్‌ఫామ్‌పై బిక్షం ఎత్తుకుంటున్న చిన్నారులకు ఇచ్చింది, ‘‘వారు ఆకలి అంటున్నారు అందుకే ఇచ్చా..’’ అంటూ మమ్మల్ని ఆశ్చర్యపరిచింది’’ అని మోనిక తల్లి విజయ బాడ్ చెప్పారు.
దత్తత తీసుకుంది...
మోనిక విద్యనభ్యసిస్తున్న వ్యాలీ క్రిస్టియన్ హైస్కూల్‌లో నిబంధనల ప్రకారం ప్రతి విద్యార్థ్ధీ సేవాకార్యక్రమాల్లో పాల్గొనాలి. ఈ నిబంధన ఆమె లోని సామాజిక సేవాకార్యకర్తకు మరింత ప్రోత్సాహం లభించేలా చేసింది. దీంతో పాఠశాల పరిసరాలు, నగరంలోని పలుప్రాంతాల్లో సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ‘వరల్డ్ విజన్’ సంస్థ చిన్నారులకు సాయం అందించేందుకు పాఠశాలలో ఓ కార్యక్రమం నిర్వహించినప్పుడు ఏడేళ్ల కోబితా దాస్‌ను దత్తత తీసుకుంది మోనిక. కోబితా దాస్ ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో చదువుకుంటోంది. దాస్ చదువుకు అవసరమైన ఖర్చును మోనికానే భరిస్తోంది. ఇందుకు ప్రతినెలా 30 డాలర్లు కోబితాకు పంపుతోంది.
ఉపకార వేతనంతో సేవ...
సామాజిక సేవాకార్యక్రమాలకు తల్లిదండ్రుల వద్ద నుంచి తీసుకున్న డబ్బును కాకుండా, తనకు లభించిన ఉపకార వేతనాలనే వెచ్చిస్తుంది మోనిక. పాఠ్యాంశాల్లో ప్రతిభ చూపటం ద్వారా లభించిన ఉపకార వేతనాలను సేవాకార్యక్రమాలకు వినియోగిస్తుంది. మోనిక, ఆమె తల్లిదండ్రులు విజయ, ఫణి బాడ్‌లు విజయవాడ వచ్చిపోయే క్రమంలో నగరంలో నడుపుతున్న చైల్డ్ ఎయిడ్ ఫౌండేషన్ గురించి తెలుసుకున్నారు. ఇక్కడ ఆవాసం పొందుతున్న విద్యార్థులకు ఏటా వేసవి సెలవుల్లో నృత్యం మొదలు రకరకాల క్రీడలు నేర్పటంతో పాటుగా, వారికి అవసరమైన దుస్తులను అందించేవారు. ఇందుకోసం మోనిక తన పాఠశాలలోని మిత్రుల సాయంతో దుస్తులు, క్రీడాసామగ్రి, మందులు సేకరించి చిన్నారులకు అందిస్తోంది. మోనికా చేపట్టే ప్రతి సామాజిక సేవా కార్యక్రమంలోనూ ఆమె తల్లిదండ్రులు కూడా భాగస్వాములవుతూ కుమార్తెకు సహకరిస్తున్నారు.
నూతన క్రియేషన్స్‌తో...
తాను చేపట్టిన సామాజిక సేవాకార్యక్రమాలను విస్తరించే పనిలో భాగంగా గత ఏడాది సొంతంగా ‘నూతన క్రియేషన్స్’ను ప్రారంభించింది మోనిక. నేటితరం అభిరుచులకు అనుగుణంగా ఉన్న ఫ్యాన్సీ నగలను ప్రదర్శించి, వాటి విక్రయాలద్వారా వచ్చిన డబ్బుతో సేవాకార్యక్రమాలను విస్తరింపచేయాలనే ఆలోచనతో మోనిక ఈ వ్యాపారసంస్థను స్థ్ధాపించింది.
నానో టెక్నాలజీ క్లబ్‌తో...
నానో టెక్నాలజీ క్లబ్ మెంబర్ అయిన మోనిక అంతర్జాతీయ స్పేస్ టీమ్‌లో సభ్యురాలు కూడా. అతి తక్కువ ప్రదేశంలో వ్యాయామం చేసేందుకు ఉపకరించే కంప్రెషన్ కూలింగ్ టెక్నాలజీని కనుగొనేందుకు సాగే పరిశోధనా బృందంలో కూడా ఆమె ఉంది. చదువు, పరిశోధనలతో పాటుగా బాస్కెట్ బాల్ కెప్టెన్‌గా క్రీడల్లోనూ రాణిస్తోంది మోనిక.
ఆంకాలజిస్ట్ కావాలని...
విదేశంలో ఉన్నా స్వదేశం పట్ల ఉన్న ఆపేక్షతో అక్కడా, ఇక్కడా సేవా కార్యక్రమాలను చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మోనిక ఆంకాలజిస్ట్ కావాలనేది తన లక్ష్యమని చెబుతోంది.
‘‘క్యాన్సర్‌ను ముందుగా గుర్తించి, దానిని నిరోధించకపోవటంతో అనేక ప్రాణాలు పోతున్నాయి. దీనివల్ల కుటుంబాలు వేదనకు గురవుతున్నాయి. ఈ సమస్య నుంచి మనిషిని కాపాడాలి. క్యాన్సర్‌ను నిరోధించటంతో పాటుగా, గ్రామీణపేదలకు మెరుగైన వైద్యం అందించాలనేది నా ఆకాంక్ష’’ అంటోంది మోనిక.