తల్లి పేరు సామ్రాజ్యం. అమ్మ నాన్నలకు విజయలక్ష్మితో సహా ముగ్గరు సంతానం.విజమలక్ష్మి పెద్ద అమ్మాయి. ఒక చెల్లి, తమ్ముడు వున్నారు. చెల్లి పేరు శిరీష, తమ్ముని పేరు మదన్ కుమార్. కుటుంబ సభ్యులు చాలా ప్రేమగా చూసుకునేవారంటారు ఆమె. అయితే అచారాలు, మర్యాదలు అనే కట్టు దిట్టమైన వాతవరణంలో విజయలక్ష్మి నాన్నగారు పెరగడం వల్ల చాలా పద్ధతిగా పెంచారు. చెల్లి, తమ్ముడు చదువుల్లో చురుగ్గా వుండడం వల్ల, వారిని చదువుల్లో ఎంకరేజ్ చేశారు. తన విషయంలో మాత్రం ఆమెను ఒక గొప్ప కూచిపూడి డాన్సర్‌గా చూడాలని తపన పడేవారట. అందువలన తన అయిదవయేటనే కూచిపూడి నేర్పించడం మొదలెట్టారు. నాన్నగారికి వృత్తి రీత్యా ఎక్కువ బదిలీలుండేవి. ఏ వూరికెళ్ళినా, మొదట ఏ స్కూల్లో కూచిపూడి నేర్పుతారు, లేదా ఎక్కడ కూచిపూడి నేర్పుతారు అని తెలుసుకొని, అందుకనుగుణంగా స్కూల్లో చేర్పించడం లేదా ఇళ్ళు తీసుకోవడం చేసేవారు.
విజయలక్ష్మి డ్యాన్సు పోటీల కెళ్ళినప్పుడల్లా తల్లి ఆమెకు తోడుగా వచ్చేది. తండ్రి ఎపుడూ ఆమెను ప్రోత్సహించేందుకు ఒక మాటంటూవుండేవారట... గెలుపోటమల ప్రభావం పట్టించుకోకుండా చేసే పనిని చిత్తశుద్ధితో చేయడమే విజయానికి ముఖ్యమని.... తండ్రి రిటైర్డు అయిన తరువాత, కొంతమంది బంధువులు వచ్చి, ఆశలు చూపి నాన్నగారి సేవింగ్సు, మొత్తం వారి వ్యాపారాలలో చేయించారు. అయితే నమ్మిన బంధువులే నష్టాలు వచ్చాయిని చెప్పడం వలన మొత్తం డబ్బులు కోల్పోయి, జీవనోపాధి కొరకు తిరిగి జాబు చేయవలసి వచ్చింది. విజయలి మొదటిసారి సింగపూరులో డాన్సు ప్రోగ్రాం కెళ్ళి వచ్చినపుడు నాన్నగారు చాలా సంతోషించారు. తన కోరిక తీరినట్లుగా భావించారు. తరువాత దుబాయిలో ప్రోగ్రాం చేసి వచ్చిన కొద్ది రోజులకే దూరమయ్యారు. తాను డాన్సు నేర్చుకోవడం మొదలు పెట్టినప్పటి నుండి బంధువులందరూ నీకిష్టమై డాన్సు నేర్చుకొంటున్నావా, లేదా మీ నాన్నగారి వల్ల నేర్చుకొంటున్నావా అని యక్ష ప్రశ్నలతో విసింగించేవారు.
కొందరు చులకనగా చూసేవారు. అలా విమర్శించినవారే... దేశ విదేశాలలో తాను చేసిన ప్రొగ్రామ్స్ గురించి తెలుసుకొని ఇప్పుడు గౌరవిస్తున్నారంటారామె. తన తండ్రి కోసం ఏదో చేయ్యాలనే తపన నిరంతరం మదిలో తొలిచేది. చివరికి అది ఒక సంస్థగా వెలిసింది. ఈ సంస్థ కేవలం వినోదాత్మకమైన నృత్య ప్రదర్శనలే కాక, నేటి సమాజిక సమస్యలు గురించి తెలుపుతూ, మనోవికాసానికి తోడ్పడే ప్రయోగాత్మక ప్రదర్శనలేన్నో ఈ సంస్థ ద్వారా చేస్తున్నాం. వీటిలో సమైక్య భారతి, తెలుగు ప్రశస్తి, భారతీయ మరియు ఫ్రాన్స్ సంస్కృతుల మేళవింపుగా చేసి మెలెంజె డాన్సు ప్రదర్శనలు చాలా ముఖ్యమైనవి. తెలుగు భాషకు ప్రాచీన వైభవం లభించిన సందర్భంగా, తెలుగు ప్రశస్తి గురించి తెలుపుతూ, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం తరపున, భారత దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో ప్రదర్శనలివ్వడం తన కెంతో గర్వకారణం అంటారామె. అంతేకాదు...ఈ ప్రోగ్రాములు తన తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో చేయడం వల్ల తనకు మరింత ఆనందం అంటారు విజయలక్ష్మి.
మూలం : సూర్య దినపత్రిక