telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

సోనాగచికి కొత్త ఆశాదీపం... ఇషిక!

10/31/2013

0 Comments

 
Picture
                     భవిష్యత్తును తీర్చిదిద్దుకొనే వయసు ఆమెది. సరదా సరదాగా గడిపేయాల్సిన రోజులవి. సరదాకు మాత్రమే కాదు సామాజికస్పృహకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది ఇషిక.  సోనాగచికి వెళ్లి అక్కడి పిల్లలతో గడపనిదే ఇషికాకు వారం గడవదు. అక్కడికి వెళ్లి పిల్లలకు చదువు చెబుతూ అక్షరాస్యులుగా చేయడానికి, ప్రపంచం గురించి అవగాహన కలిగించడానికి ప్రయత్నిస్తోంది...
 
                 పాప్‌స్టార్స్ విడుదల చేసే కొత్త ఆల్బమ్స్ కోసం వెయిట్ చేయడం ఆమె హాబీ. కొత్తగా అప్‌గ్రేడ్ అయ్యే ఐఫోన్ అప్లికేషన్స్ ఇన్‌స్టాల్ చేసుకొంటూ వాటిలో మునిగితేలడం అంటే కూడా ఇష్టం. రిహన్నా, బ్యాక్‌స్ట్రీట్ బాయ్స్ ఆల్బమ్స్ ఆమె ఐప్యాడ్‌లో ఉంటాయి.. లెవిస్, రీబక్‌లు ఆమె వార్డ్‌రోబ్‌లో ఉంటాయి. టామ్‌క్రూజ్, రణ్‌బీర్ కపూర్‌లు ఆమె హార్ట్ రోబ్‌లో ఉంటారు. ఖరీదైన అలవాట్లు, ఖరీదైన అభిరుచులు ఆమెవి.  ఇంత ‘ఖరీదైన’ నేపథ్యం నుంచి వచ్చిన 17 యేళ్ల అమ్మాయి వీకెండ్ ఎలా గడుపుతుంది? అనే ప్రశ్నకు అందరూ ఒకేరకమైన సమాధానాన్ని ఊహించుకొంటారు. లాంగ్‌డ్రైవ్స్‌తోనూ, ఫ్రెండ్స్‌తో పార్టీలలో మునిగి తేలే అవకాశం ఉంటుందని అంచనా వేస్తారు. అయితే ఎవరీ ఊహాగానాలకూ అందని రీతిలో, తన లైఫ్ స్టైల్‌కు ఏ మాత్రం సంబంధం లేని రీతిలో సంస్కర్త హృదయంతో వారాంతాలను గడుపుతోంది ఇషికా సీల్!
 
                     కోల్‌కతాలోని రెడ్ లైట్ ఏరియా పేరు సోనాగచి. అత్యంత దుర్భర పరిస్థితుల్లో అక్కడ తమ తల్లుల మధ్య బతుకుతున్న చిన్నపిల్లలను చేరదీస్తూ వారికి చదువు చెబుతోంది ఇషిక. తల్లులను ఎడ్యుకేట్ చేసి  పిల్లలను స్కూళ్లలో చేర్పిస్తోంది. దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఈ పనిని పవిత్రకార్యంలా భావిస్తుంది ఇషిక. తాను చూసిన, చూస్తున్న ప్రపంచంలో మార్పు తీసుకురావాలని ప్రయత్నించడం ఒక ఎత్తు అయితే, తనకు పరిచయమే లేని  ప్రపంచంలో మార్పు కోసం ప్రయత్నించడం మరో ఎత్తు.
 
     ఒక మంచి పనికి శ్రీకారం చుట్టడానికి సామాజిక పరిస్థితులతో పాటు కొందరు వ్యక్తులు కూడా కారణం అవుతుంటారు.

                   ఇషికకు స్ఫూర్తి ఆమె తల్లి మధుమిత. నిర క్షరాస్యతను నిర్మూలించడానికి పోరాడుతున్న మధుమిత తన ప్రయత్నంలో  కూతురు కూడా భాగస్వామినవుతాను అంటే కాదనలేకపోయింది. దుర్భరమైన పరిస్థితుల మధ్య బతికే సెక్స్‌వర్కర్ల పిల్లలకు చదువుచెబుతానని, సంస్కరిస్తాను అంటే కూతురును నిరాశ పరచలేదు. ‘మంచి ఆలోచన’ అంటూ అభినందించింది కూడా.

                     ‘చారిటీ బిగిన్స్ అట్ హోమ్’ అన్న వాక్యాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతూ సామాజికసేవ వైపు ప్రయాణం సాగిస్తున్న కూతురికి ఎలాంటి అడ్డంకులూ కల్పించలేదు మధుమిత. ప్లస్ టూ చదువుతున్న ఇషిక చదువులో కూడా  రాణి స్తోంది. కుటుంబ నేపథ్యంతో వచ్చిన  ఫ్రెండ్స్, ఎంజాయ్ మెంట్‌ను పక్కనపెట్టి.. పిల్లల ప్రపంచంలోకి వస్తోంది.

                       ఈ విషయం గురించి ఇషికను అడిగితే ‘‘నేను అన్ని సౌకర్యాల మధ్య బతుకుతున్నాను. గొప్ప కాలేజీలో చదువుతున్నాను. సుఖసంతోషాలకు ఎలాంటి లోటు లేదు. అయితే ఇలాంటి అదృష్టం చాలా మంది పిల్లలకు లేదు. చిన్న చాక్లెట్ ముక్క ఇచ్చినా ఆ పిల్లల  కళ్లలో ఎంతో ఆనందం కనిపిస్తుంది. అలాంటి ఆనందం వారికి శాశ్వతం కావాలి. అందుకోసమే నా ప్రయత్నం. చదువు విషయంలో, సౌకర్యాల విషయంలో వారి సమస్యలు ఏమిటో నాకు అవగాహన ఉంది. వాటిని పరిష్కరించడానికి నేను నా పరిధిలో తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను.

                     ఈ ప్రయత్నంలో నా తల్లిదండ్రులు నాకు పూర్తిగా సహకరిస్తున్నారు. ఇక ఫ్రెండ్స్‌ని, పార్టీలని మిస్సవుతున్నాననే ఫీలింగ్ లేదు. నాకు చిన్న పిల్లలతో గడపడమే సంతృప్తినిస్తోంది..’’ అని అంటుంది. యుక్త వయసులోనే ఇంత పరిణతి చూపుతున్న ఇషికకు ‘నేషనల్ కమ్యూనిటీ సర్వీస్’ అవార్డు వచ్చింది. పలు అంతర్జాతీయ పత్రికలు కూడా ఇషిక సేవా దృక్పథం గురించి ప్రముఖంగా ప్రచురించాయి.

0 Comments

మనసుకు నచ్చిందే చదువు

10/30/2013

0 Comments

 
Picture
                     ఇరుకైన విద్యావిధానంలో మూసపోసిన చదువులు, ర్యాంకుల పరుగులు, ఇవేనా పరిధులు అని ప్రశ్నించుకుని అతి పిన్న వయసులోనే, ఆసక్తి, నైపుణ్యాన్ని సృజనతో ముడిపెట్టి విజయపథంలో సాగుతోన్న యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ హర్షిత వెన్నెల. ఆ విజయప్రస్థానం ఆమె మాటల్లోనే...

             '' నేను హైదరాబాద్‌లో సైన్స్‌ సబ్జెక్ట్‌తో12వ తరగతి చదువుతున్నాను. స్కూల్లో చదువుతున్న రోజుల నుండి కూడా మొదటి ర్యాంకు విద్యార్థిని కాకపోయినా చేసే ప్రతి పనీ సంపూర్ణంగా చేయాలని అనుకుంటాను. ఎప్పుడూ చురుగ్గా ఉంటాను. పరీక్షలు మన జ్ఞాపకశక్తిని పరీక్షించేవే కానీ మన విజ్ఞానాన్ని కాదు అని నేను పూర్తిగా నమ్ముతాను. అలాగని చదువును నిర్లక్ష్యం చేయను. పదో తరగతిలో మంచి మార్కులతో పాస్‌ అయ్యాను. కళ పట్ల నా ఆసక్తి నా ఏడు సంవత్సరాల వయసు నుండే మొదలైంది. మా అమ్మకు కూడా డ్రాయింగ్‌లో నైపుణ్యం ఉండటంతో ఆమె నా తొలి గురువు. నాకు స్కూల్లో సైన్స్‌ సబ్జెక్ట్‌ అంటే తగని పిచ్చి. సైన్స్‌లో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉండేదాన్ని. నా స్నేహితుడు దుర్గేష్‌. అతనికీ సైన్స్‌, ఆర్ట్స్‌ అంటే ఆసక్తి. ఇద్దరం ఒకళ్ళ సందేహాలు ఒకళ్ళు తీర్చుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇద్దరం ఆర్టిస్టులమే. 2012 లో గోకరాజు రంగరాజు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ ఎమ్‌.డి. మా కాలేజీకి వచ్చారు. ఆమె పోట్రెయిట్‌ గీయమని మా స్కూల్‌ వాళ్ళు నన్ను అడిగారు. అది నాకు వచ్చిన పనే అవడంతో వెంటనే చక్కని చిత్రం గీసి ఇచ్చాను. దానికి ఆమె ఎంత సంతోషించారో తెలుసా..? 'నాకు ఇంత ప్రత్యేకత ఇచ్చినందుకు థ్యాంక్స్‌ హరితా! ఇది నా జీవితంలోనే అపురూమైన బహుమతి' అన్నారు. ఆమె ప్రశంస నాకు చాలా సంతోషాన్ని కలుగజేసింది'' అని వివరించారు హర్షిత.

                  ''ఈ విద్యావ్యవస్థ మీదే నాకు వ్యతిరేక భావం ఉంది. నేనెప్పుడూ ప్రశ్నించుకునేదాన్ని, 'ఎందుకు నేనింత కష్టపడుతున్నాను? దీనివలన నేను సాధించేది ఏంటి?' అని. ఈ చదువులు విద్యార్థులకు ఎలా ఆలోచించాలో చెప్పవు. ఏం ఆలోచించాలో చెప్తాయి. ఎక్కువ చదువుకోవడం అంటే ఎక్కువ సంపాదనకు మాత్రమే అన్నది నా అభిప్రాయం. ఈ చదువుల బారి నుండి బయటపడాలంటే ఏం చేయాలో ఆలోచించాను. నాకు వచ్చిందల్లా ఆర్టే. ఆరంభంలో కొత్తగానే అనిపించినా నేను దానిలో మరింత పట్టుదలగా సాధించి, నా స్థాయిని పెంచుకుంటూ పోయాను'' అని హర్షిత వివరించారు.

''ఆర్టిస్టుని అవుదామనుకున్నానని నా ఆసక్తిని గురించి చెప్తే, ఎక్కువ సంపాదన ఉండదని అందరూ నిరుత్సాహ పరిచారు. నేను పెద్దగా సంపాదించ లేకపోవచ్చుకానీ, చేసే పనిలో నాకు చెప్పలేనంత సంతృప్తి దొరుకుతుంది. ఇప్పుడు నేను ఒక వ్యక్తి ఫొటో చూస్తూ బొమ్మ గీసేయగలను. నన్ను ఇంత ప్రోత్సహించిన గొప్పతనం మా జువాలజీ లెక్చరర్‌ గాయత్రీ మేడమ్‌దే. ఆమె ప్రోద్బలంతోనే 2013 మార్చిలో 'కమీషన్డ్‌ ఫర్‌ పోట్రెయిట్స్‌' మొదలుపెట్టాను. దీని ద్వారా నేను ఆదాయం సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నాను. మనకు ప్రియమైన వారిని ఎంతగానో ప్రేమిస్తాం. వారికి ఎన్నో బహుమతులు కూడా ఇస్తూంటాం. కానీ అవి కొన్నాళ్ళకు పాడైపోతాయి. అదే పోట్రెయిట్‌ వేయించి, ఇస్తే అది వారికి అమూల్యమైన బహుమతి అవుతుంది. కేవలం వ్యక్తుల బొమ్మలే కాదు, వారికి సంబంధించిన తీపి గుర్తులను, పెంపుడు జంతువులు కూడా చిత్రించి ఇస్తూంటాను. పోట్రెయిట్స్‌ వేయడమేకాక నేను అంతకుముందు వేసిన స్కెచ్‌ల ప్రింట్‌లను కూడా అవసరమైన వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. ఖరీదు తక్కువే. కమీషన్‌తో పాటు నేను వేసిన సాధారణ చిత్రాలను ఫేస్‌బుక్‌ ఆక్షన్‌ ద్వారా కూడా కొనుక్కుంటూ ఉంటారు. ఇంట్లో నుండే పనిచేస్తాను. నాకంటూ ప్రత్యేక ఆఫీస్‌ ఏమీలేదు. నా వ్యాపార లావాదేవీలన్నీ ఫేస్‌బుక్‌ నుండే చేస్తాను'' అని ముగించారు. హర్షిత.

0 Comments

వేల మందికి కొత్త జీవితం!

10/26/2013

0 Comments

 
Picture
                  నిరాశ్రయ మహిళలూ... ముఖ్యంగా పడుపు వృత్తి నుంచి బయటకొచ్చే మహిళల జీవితం దుర్భరం కాదు... వాళ్లూ తలుచుకుంటే ఏదయినా చేయగలరని నిరూపించాలనుకున్నారామె. అందుకే రకరకాల వస్తువుల మరమ్మతులో శిక్షణ అందించి వారికి ఉపాధి కల్పిస్తున్నారు హైదరాబాద్‌కి చెందిన విజయభవాని. ఆమె ఏం చెబుతున్నారంటే...

                    ఆదుకునే వాళ్లు లేక, బతకడానికి ఏ దారీ దొరక్క కొందరూ... ఎవరో చేసిన మోసం వల్ల ఇంకొందరూ... ఇలా ఎందరో మహిళలు వ్యభిచార కూపాల్లోకి చేరుతున్నారు. దిక్కుతోచని స్థితిలో అక్కడ ఉండిపోతున్నారు. కానీ ఏళ్లు గడిచేకొద్దీ వాళ్ల జీవితాలు దుర్భరంగా తయారవుతాయి. వాళ్లు పడే బాధలు తెలిసి వాళ్లను ఆదుకోవాలనుకున్నా. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను సూచించాలనుకున్నా. అయితే నా దృష్టిలో మహిళలకు ఉపాధి అంటే కుట్టుపని ఒక్కటే కాదు. ఎందుకంటే ఒక వీధిలో ఇద్దరుముగ్గురు టైలర్లు ఉంటే... ఎవరికీ ఆదాయం సరిగా రాదు. అందుకే బాగా ఆలోచించి, ఇతర స్వచ్ఛంద సంస్థలతో చర్చించి, అలాంటి మహిళలకు కుక్కర్లూ, మిక్సీలూ, మొబైల్‌ ఫోన్ల రిపేరింగ్‌, బేకరీ పదార్థాల తయారీలో శిక్షణ ఇప్పించేందుకు సిద్ధమయ్యా. ఏడాదిన్నరగా మేం నిర్వహిస్తున్న కార్యక్రమాల వల్ల మన రాష్ట్రంలోని శ్రీకాకుళం, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో సుమారు మూడు వేల మంది మహిళలు తమ కాళ్లపై తాము నిలబడే స్థితికి చేరుకున్నారు.

                      పదో తరగతి చదువుతున్నప్పుడే స్కూలు తరఫున కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నా. కాలేజీలో చేరాక వాటిని కొనసాగించా. ఆ సమయంలోనే ఇంటాబయటా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అవగాహన కలిగింది. అది మహిళల మానసిక స్థితిగతులపై అధ్యయనం చేసే దిశగా నన్ను నడిపించింది. విమెన్‌ మెంటల్‌ హెల్త్‌లో పీహెచ్‌డీ చేశాక దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్లాన్‌ ఇండియాలో ప్రోగ్రామ్‌ మేనేజర్‌గా చేరా. దాని తరఫున పని చేస్తున్నప్పుడే అమ్మాయిల అక్రమ రవాణా, వారు వ్యభిచార గృహాల్లో పడుతున్న బాధల గురించి తెలిసి, చలించిపోయా. వారిని ఆదుకుని, ఆసరా ఇవ్వాలనుకున్నా. నా ఆలోచనలకు ప్లాన్‌ ఇండియా మద్దతూ లభించడంతో ఉత్సాహంగా ముందుకు కదిలా.

                       మొదట వ్యభిచార గృహాల్లోని మహిళల్ని కలిసి ప్రత్యామ్నాయ ఉపాధి ఆలోచనల గురించి చెప్పా. ఒక్కరూ నమ్మలేదు. 'ఏదో ఇలా బతికేస్తున్నాం... ఇప్పుడు బయటికొచ్చి ఏం చేస్తాం' అన్నారు. ఇప్పుడంటే జీవితం సాఫీగా సాగిపోతోంది. వయసు పైబడ్డాక, హెచ్‌ఐవీ లాంటివి వస్తే మీ పరిస్థితి ఏంటనేది ఎప్పుడయినా ఆలోచించారా అని ఎదురు ప్రశ్నించా. వాళ్ల దగ్గర సమాధానం లేదు. ఉత్సాహంగా ముందుకొచ్చిన కొందరు మహిళల్ని ఓ బృందంగా ఏర్పాటుచేసి కొన్ని అంశాల్లో శిక్షణ ఇచ్చాం. సొంతంగా వ్యాపారం ప్రారంభించేలా రుణ సదుపాయం లభించేలా చూశాం. వారి జీవితంలో వచ్చిన మార్పు చూశాక మరికొందరు ముందుకొచ్చారు. అలా మహిళల్ని బృందాలుగా ఏర్పరచి, వారి ఆసక్తిని బట్టి కుక్కర్లూ, మిక్సీలూ, మొబైల్‌ ఫోన్ల మరమ్మతులో శిక్షణ ఇచ్చాం. ఒక్కొక్కరికి కనీసం రెండు అంశాల్లో శిక్షణ ఇచ్చాం. దానివల్ల వారి ఆదాయం పెరుగుతుందనే మా ఆలోచన.పల్లెటూళ్లలో కూడా కేకులు కొనుక్కునే వాళ్ల సంఖ్య పెరిగింది. అందుకే ఈ మహిళల్లో కొందరికి వాటిల్లోనూ శిక్షణ ఇచ్చాం.

                       అయితే అందరికీ అన్నీ కాకుండా మహిళల వయసూ, చేయగల సామర్థ్యం, ఆసక్తి ఉన్న వాళ్లకు మాత్రమే నేర్పిస్తున్నాం. ఇవన్నీ సక్రమంగా నిర్వర్తించడానికి జనశిక్షణ సంస్థ, ప్రాంగణం లాంటి సంస్థల సాయం తీసుకుంటున్నాం. నిధుల కోసం యాక్సిస్‌ బ్యాంక్‌ ఫౌండేషన్‌ సహకరిస్తోంది. అన్నివేళలా మేమే రుణ సదుపాయం కల్పించాలని కాకుండా వ్యాపారం ప్రారంభించిన మహిళలకు బ్యాంకు ఖాతాలు ఏర్పాటు చేశాం. అందులో కొద్దికొద్దిగా పొదుపు చేసుకుంటూ.. అవసరమైనప్పుడు దాన్నుంచే రుణం తీసుకునేలా ప్రోత్సహిస్తున్నాం. ప్రస్తుతం యాబై మంది సభ్యులతో కలిసి ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నా. ఈ ఏడాది మరిన్ని జిల్లాలకు విస్తరించాలన్నదే మా ఆలోచన.

0 Comments

అందమైన సెల్ కవర్లు ఫేస్ బుక్ లో అమ్మేస్తా!

10/25/2013

0 Comments

 
Picture
ఉద్యోగం కోసం చదువూ,
బతికేందుకు జీతం...
అన్న తరహాలో ఆలోచనలు చేయడంలో కొత్తేముంది! విభిన్నంగా అడుగులేస్తేనే గుర్తింపు. దాంతోపాటూ ఆనందం, ఆదాయం. హైదరాబాద్‌కి చెందిన హన్సిక ఇలాగే ఆలోచించింది... నిత్య జీవితంలో ఓ భాగంగా మారిపోయిన సెల్‌ఫోన్లకు అందమైన కవర్లూ, అలరించే యాక్సెసరీలను తయారుచేస్తూ ఫేస్‌బుక్‌లో అమ్ముతోంది.ను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కళాశాల నుంచి బీకాం కంప్యూటర్స్‌ పూర్తిచేశా. సైకాలజీలో డిప్లొమా చేశా. ప్రైవేటు సంస్థలో ఉద్యోగం వచ్చింది. రోజూ ఆరేడు గంటలు పని చేసి, నెలకి ఇంత అని జీతం తీసుకోవడానికి ఇష్టపడలేదు. సొంతంగా ఏదయినా చేయాలనీ, దాని ద్వారా ఆదాయం సంపాదించాలనీ అనుకున్నా. కానీ అది ఏంటనేది కొన్ని రోజుల వరకూ అర్థం కాలేదు. అంతా 'ఖాళీగా ఉండి టైం వేస్టు చేస్తున్నావు...' అన్నారు. పట్టించుకోలేదు.

                  ఏదేమైనా ఇష్టమైన పనే చేయాలనుకున్నా. అలాగే ఆలోచిస్తూ, ఒకసారి అక్కలతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా ఆకట్టుకునే సెల్‌ఫోన్‌ కవర్లు తయారుచేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. అదే వారితో అంటే... 'ఇప్పుడు కాలేజీ అమ్మాయిలూ, అబ్బాయిలూ స్మార్ట్‌ఫోన్లు బాగా కొంటున్నారు. బోలెడు ఖరీదు పెట్టి కొనే ఆ ఫోన్‌కి రక్షణగా, దుమ్ము పడకుండా, చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండేలా అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు... నీది మంచి ఐడియానే, మొదలుపెట్టు' అన్నారు. ఉత్సాహంగా వాటిని తయారు చేయడానికి సిద్ధమయ్యా. ఏం చేయాలి... ఎలా తయారుచేయాలి... అన్న దానిపై నెల రోజుల పాటు అధ్యయనం చేశా. ఆకట్టుకునే రంగులూ, ట్రెండీగా ఉండే డిజైన్లనే అమ్మాయిలు ఇష్టపడతారని తెలుసుకుని, దానికి తగినట్లుగా వస్తువుల్ని ఎంచుకున్నా. డ్రెసింగ్‌ ప్లాస్టిక్‌, క్రోషియో, లేస్‌, ముత్యాలూ, పూసలూ, క్రిస్టల్స్‌ లాంటి వాటితో సెల్‌ కవర్లను తయారుచేశా. నేను చదివిన కాలేజీ ఫ్రెండ్సే చాలామంది 'బాగున్నాయి' అంటూ కొనేశారు. కొంతమంది తమ స్నేహితురాళ్లకి కానుకలుగా ఇచ్చారు.

                             రెండు మూడు నెలలకోసారి కవర్లు మార్చే, ఈనాటి అమ్మాయిల తీరుకి అనుగుణంగా పోల్కాడాట్లూ, ఫ్రాగీఫేస్‌, గులాబీలూ, కుకీలూ, సీతాకోక చిలుక వంటి రకరకాల డిజైన్లలో కవర్లను రూపొందించాను. ఫ్రెండ్‌షిప్‌ డే, ప్రేమికుల రోజు వంటి సందర్భాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్‌ చేసినవి హాట్‌కేక్‌ల్లా అమ్ముడుపోయాయి. ఉద్యోగం చేస్తే ఎంత ఆదాయం వచ్చేదో ఇంచుమించు ప్రతినెలా అంత మొత్తం సంపాదించే స్థాయికి చేరుకున్నాను. అయితే ఈ ఆదరణ నిలకడగా ఉండాలంటే ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్‌ని గమనించాలి. పార్టీలకు తళుక్కున మెరిసేవీ... దుస్తులకు మ్యాచ్‌ అయ్యేలాంటివీ అమ్మాయిలు ఎంచుకోవడాన్ని గమనించాక... నేనూ అలాంటివి డిజైన్‌ చేశా. ఇయర్‌ఫోన్‌ జాక్‌కి కూడా యాక్సెసరీలు జతచేశా.

                            ప్రస్తుతం నేను ఇంకీపింకీ డాట్‌ఇన్‌ పేరుతో కేవలం ఫేస్‌బుక్‌ ద్వారానే వీటిని విక్రయిస్తున్నా. తరచూ నా వద్ద కొనే క్లయింట్లు రెండు వందలకు పైగానే ఉన్నారు. ఎప్పటికప్పుడు కొత్త స్టాక్‌ని అప్‌డేట్‌ చేస్తున్నా. ఈ యాక్సెసరీలు పదిహేనేళ్ల అమ్మాయి నుంచి అరవై ఏళ్ల మహిళల అభిరుచులకు తగినట్లుగా ఉంటాయి. డిజైనర్‌ కవర్లు కాబట్టి కాస్త ఖరీదైనవే ఉంటాయి. నాలుగొందల నుంచి తొమ్మిది వందల దాకా ఉన్నాయి. యాక్సెసరీలు అయితే తక్కువ ధరలో ఉంటాయి. మరికొన్ని కొత్త యాక్సెసరీలు తయారుచేస్తూ... నా ఆలోచనను ఇంకా విస్తరించాలనేదే నా ప్రయత్నం..'.

Picture
0 Comments

నవీన వనితకు స్ఫూర్తి ప్రదాత.. శారదా దేవి

10/24/2013

0 Comments

 
Picture
                        నూట యాభై సంవత్సరాల పైమాట.. అపుడు వివాహ సమయానికి వధువు వయస్సు అయిదేళ్ళు, వరుడి వయస్సు ఇరవై మూ డేళ్ళు. కన్యాదాత మూడు వందల రూపాయల కన్యాశుల్కం స్వీకరించి, ముక్కుపచ్చలారని తన కూతుర్ని ఆమెకన్నా పద్దెనిమిదేళ్ళు పెద్దయిన వాడికిచ్చి పెళ్లి చేశాడు. అమ్మాయికి ఊహ తెలిశాక తండ్రిపై ఎంత కోపం రావాలి? భర్తపై ఎంత నిరాదరణ కలగాలి? కానీ, రామకృష్ణ పరమహంస అర్ధాంగి శారదాదేవిలో ఈ రెండూ లేవు. పుట్టింటి వారిని కష్టకాలంలో ఆమె ఆదుకుంటూనే ఉంది. భర్తను అమితంగా ప్రేమిస్తూనే ఉంది.

                    రామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక సాధనలో శారదేదేవి పాలుపంచుకోవడం, ఆయనకు తోడ్పడడం గురించి అందరికీ తెలిసిందే. కాపురానికి వచ్చిన కొత్తలో రామకృష్ణుడు ఆమెను ‘‘నన్ను మాయలోనికి లాగడం నీ అభిమతమా?’’ అని అడిగితే ‘‘అదేమిటి? పారమార్థిక మార్గంలో మీకు తోడ్పడడానికే వచ్చాను’’ అన్న శారదాదేవి వ్యక్తిత్వం గురించి ఆధునిక స్ర్తిలు తెలుసుకోవడం అభిలషణీయం.

                ఆడా, మగా ఎవరైనా పిల్లలు సమానమేననీ, తల్లిదండ్రులు ఇద్దర్నీ సమంగా పెంచి విద్యాబుద్ధులు చెప్పిస్తే సమంగా ఆదుకుంటారనీ నేడు అంతా అంటున్నారు. సమంగా పెంచనంత మాత్రాన ఆడపిల్లలు తల్లిదండ్రులను ఆదుకోరాదా? సమంగా పెంచి, సమంగా ఆస్తి పంచినా, ‘‘అందుకు మావారు ఒప్పుకోరు’’ అంటూ బాధ్యతలను స్వీకరించని అమ్మాయిలు లేరా?

                       శారదాదేవి భర్త వద్దకు కాపురానికొచ్చిన ఆరు నెలలకే ఆమె తండ్రి మరణించాడు. నలుగురు కొడుకులతో కూడిన కుటుంబ బాధ్యతను ఆమె తల్లి శ్యామసుందరీ దేవి వహించాల్సి వచ్చింది. పొలంపై ఆదాయం పేరుకు మాత్రమే. ఇరుగు పొరుగు ఇళ్ళలో వడ్లు దంచి, ఆ ఆదాయంతో ఇల్లు గడిపే పరిస్థితి. ఈ కష్టకాలంలో తల్లికి తోడుగా ఉండడానికి పుట్టింటికి వెళ్లి కాయకష్టమైన వడ్లు దంపే పనిని చాలమటుకు చేస్తూ తల్లికి విశ్రాంతి కల్గించిన శారదాదేవి నేటి కూతుళ్ళందరికీ ఆదర్శం కాదా?
అయిదేళ్లకే వివాహమైన ఆ పల్లెటూరు పిల్లకు చదువుకునే అవకాశం లేనే లేదు. భర్త వద్దకు దక్షిణేశ్వరం వచ్చాక రామకృష్ణుల అన్న కూతురు బడికి వెళ్లి చదువుకోవడం చూసిన ఆమె- ఆ చిన్న పిల్లవద్దనే చదువుకోవడం ప్రారంభించింది. అణా పెట్టి కొనుక్కున్న పుస్తకాన్ని రామకృష్ణుల మేనత్త మనవడు హృదయుడు ఆమె చేతిలోనుంచి లాగేసుకున్నాడు. ‘‘స్ర్తిల కు చదువేమిటి? స్ర్తిలు రాయడం, చదవడం తగదు. ఈ రీతిలో నవలలూ, నాటకాలూ చదవడానికి సిద్ధపడుతున్నావా?’’ అని అన్నాడు. హృదయుడి మాటల్ని పట్టించుకోకుండా రామకృష్ణుల అన్న కూతురు బడికి వెళ్లి చదువుకునేది. ఇంటికి వచ్చి ఆ పాఠాలు శారదాదేవికి నేర్పేది. ఆ తరువాత గంగా స్నానానికి దక్షిణేశ్వరాలయానికి వచ్చే ఒక బాలిక దగ్గర శారదాదేవి చదువు సాగించింది. దేవాలయం తోటనుంచి వచ్చే కూరగాయలను ఆమెకు గురుదక్షిణగా ఇచ్చేది. అంతగా శ్రమపడి చదువుకుందుకు నేడెందరు సిద్ధంగా ఉన్నారు?


                                  కాలానికీ, సంఘానికీ ఎదురీదుతూ చదువుకోవడం వల్లనేమో శారదాదేవికి రాయడం మాత్రం రాలేదు. అయినా అక్షరాస్యత వేరు, విద్య వేరు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత నానాజాతి సమితి లేదా లీగ్ ఆఫ్ నేషన్స్‌ని స్థాపించారు. దాని గురించీ, దాని అధ్యక్షుడైన విల్సన్ గురించీ, ప్రపంచ శాంతి స్థాపన గురించీ ఒక శిష్యుడామెకు గొప్పగా చెప్పసాగాడు. ఆమె ‘‘నాయనా.. విల్సన్ మాటలు నాలుక చివరనుంచి వచ్చినవే కానీ మనస్ఫూర్తిగా చెప్పినవి కావు’’ అంది. ఎంత చక్కటి విశే్లషణ! లీగ్ ఆఫ్ నేషన్స్ నుంచి ముందుగా వైదొలగిన దేశాలలో అమెరికా ఉంది. రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా మారణహోమం గురించి తెలియనివారెవ్వరు? కానీ, శారదాదేవిలా ముందే చెప్పగలిగినవారెందరు? బ్రిటీషు ప్రభుత్వం తెస్తున్న అభివృద్ధి గురించి పొగిడిన వారిని- ఆమె పెరిగిపోతున్న పేదరికం గురించి ప్రశ్నించింది. విషయ విశే్లషణే అసలైన విద్య కదా!

                        విద్యా విషయంలో, సాంఘిక సమాచారంలో ఎంత స్వతంత్రమైన ఆలోచనలున్నా ఆమె జీవన విధానం పాతకాలం పద్ధతిలోనే ఉండేది. ఉదయమే ఎవరూ లేవకముందే గంగాస్నానం చేసినా జుట్టుని ఎండలో ఆరపెట్టుకునేది మాత్రం- మధ్యాహ్నం ఆలయం ఖాళీ అయ్యాకనే. ఆమె పరుల కంటపడేది కాదు. రామకృష్ణుల వద్దకైనా మేలిముసుగుతోనే వెళ్ళేది. ఆలయంలో చాలామందికి ఆమె ఉన్నదని మాత్రమే తెలుసు. కుట్టిన దుస్తులు కానీ, పాదరక్షలు కానీ ఆమె ధరించి ఎరుగదు. సంపూర్ణమైన సంప్రదాయ జీవనం ఆమెది.

                    ఘోషాలోనే జీవించినా తనను ఎవరో వచ్చి రక్షించాలని ఎదురుచూస్తూ కూచునే తత్వం కాదు ఆమెది. ధైర్యస్థైర్యాలూ, సమయస్ఫూర్తీ ఆమె సొత్తు. పుట్టిన ఊరు జయరాంబాటి నుంచి దక్షిణేశ్వరానికి కేవలం అరవై మైళ్ళు. నేడైతే బస్సులోనో, కారులోనో రెండు, మూడు గంటలలో వెళ్లిపోవచ్చు. అప్పట్లో రెండు రోజుల కాలినడక ప్రయాణం. అందునా పదిమైళ్ళు నరబలలు ఇచ్చే బందిపోట్లుండే అడవి. ఓ సారి తోటి ప్రయాణీకులతో వేగంగా నడవలేని శారదాదేవి వెనుకబడింది. ఇద్దరు బందిపోట్లు అడ్డం పడ్డారు. మనసులో ఎంత భయంగా ఉన్నా పైకి ధైర్యంగా ‘‘నాన్నా.. నాతోడివారంతా వదిలేసి వెళ్లారు. దక్షిణేశ్వరంలో ఉన్న నీ అల్లుడి దగ్గరకు వెడుతున్నాను. నువ్వు సాయంగా వస్తే ఆయనెంతో సంతోషిస్తారు’’ అంది. దొంగల్లో రెండో వ్యక్తిని మొదటివాడి భార్యగా గుర్తించి, ‘‘అమ్మా.. నేను నీ కూతురు శారదని. నువ్వూ నాన్నా వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమయ్యేదాన్నో’’ అంది. ఆ మెత్తని మాటలకు కరిగిపోయిన వారిద్దరూ ఆమెను ఆదరించి పక్క గ్రామం దాకా తోడు వెళ్ళారు. ఆ తరువాత కొంతకాలానికి మిఠాయిలతో ఆమెను చూడ్డానికి దక్షిణేశ్వరం కూడా వెళ్లి రామకృష్ణుల గౌరవ సత్కారాలు పొందారు.

                               ప్రతి సారీ సామం పనిచెయ్యదు. భర్త మరణకాలానికి శారదాదేవి ముప్ఫై ఏళ్ళ నిండు యవ్వనంలో వుంది. పల్లెటూళ్ళో అత్తవారింట ఒంటరిగా ఉన్న సమయంలో ఒకడు ఉన్మత్తతతోనో, కామోన్మత్తతతోనో ఆమె వెంటపడ్డాడు. అలసిపోయేదాకా గాదె చుట్టూ పరిగెత్తిన తరువాత ఆమె అతణ్ణి లాగి కింద పడేసి గుండెలమీద మోకాలు పెట్టి చెంపలు వాయగొట్టింది. స్ర్తి తనను తానే రక్షించుకోవాలనడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ దొరకదు.

                              స్ర్తికి వివాహమే సర్వస్వం కాదన్నది శారదాదేవి నమ్మకం. ఒక భక్తురాలు తనకు అయిదుగురు కూతుళ్ళనీ, వివాహం చెయ్యడం కష్టంగా ఉందనీ వా పోయింది. శారదాదేవి ఒక్కక్షణం వౌనం వహించి, ‘‘వివాహానికి ఎందుకంత తాపత్రయం? తగిన వరులు లభించకపోతే సోదరి నివేదిత నడిపే పాఠశాలకు పంపవచ్చు కదా? వారక్కడ చదువుకుని తాము సుఖపడి పరహితార్థం పాటుపడతారు’’ అని చెప్పింది. వివాహం వైపు దృష్టి మరల్చని వారికి బలవంతంగా వివాహం చెయ్యడం దారుణహింస అని చెప్పేది. స్ర్తిలు గుడ్డిగా పురుషులను అనుకరించకుండా తమ ప్రతిభను ప్రకాశింపచెయ్యాలన్నది ఆమె ఆకాంక్ష.

                              విశిష్టమైన శారదాదేవి వ్యక్తిత్వాన్ని గురించి సోదరి నివేదిత ‘‘ఆమె ప్రాచీన యుగానికి భరతవాక్యమా? లేక ఆధునిక యగానికి నాందియా?’’ అని ఆశ్చర్యపోయింది. ప్రాచీన యుగ నాటకానికి తెరదించుతూ ఆనాటి ఉత్తమ లక్షణాలు ఎల్లకాలం నిలవాలని శారదాదేవి ఆశించింది. ఆధునిక యుగ నాటకానికి నాంది పలుకుతూ నేటి మంచిని ఆహ్వానించింది. కొత్త పాతల మేలు కలయిక అయిన శారదాదేవిని ఆదర్శంగా తీసుకుంటే ‘పాత రోత, కొత్త వింత’ అనీ అన్పించదు. ‘‘గతకాలము మేలు వచ్చు కాలముకంటెన్’’ అనీ తోచదు.

0 Comments

ప్రశ్నిస్తేనే ప్రపంచం తెలిసేది...

10/20/2013

0 Comments

 
Picture
                మందులు, సర్జరీలు మాత్రమే మనిషిని బతికిస్తాయనే వైద్య విధానాలు ఒక వైపున ఉంటే, అవేవీ లే కుండానే ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రకృతి వైద్య విధానాలు మరో పక్కనున్నాయి. వాటి పట్ల ఏర్పడిన అపారమైన మక్కువతో ప్రకృతి వైద్యాన్ని చేపట్టిన వారు డాక్టర్ కె. సత్యలక్ష్మి. అయితే శారీరక రుగ్మతలకే పరిమితమైపోకుండా, సామాజిక రుగ్మతల పట్ల కూడా ఆమె అంతే సమానంగా స్పందిస్తారు. హైదరాబాద్‌లోని వేమన యోగా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు డైరెక్టర్‌గా ఉన్న సత్యలక్ష్మికి ఇటు వైద్య వృత్తిలోనూ, అటు సామాజిక కార్యక్రమాల్లోనూ గత పాతికేళ్లలో ఎదురైన కొన్ని సంఘటనలే ఈ  'అనుభవం'.

ప్రశ్నించే స్వభావమే లేకపోతే, మనకు ప్రపంచం ఏం తెలుస్తుంది? సమాధానం చెప్పే వాళ్ల మాట ఎలా ఉన్నా తెలిసీ తెలియని వయసులో ప్రశ్నించడమే పెద్ద సాహసం. నిజానికి అరకొర ప్రశ్నలతో అప్పుడు అభాసుపాలయ్యే ప్రమాదమే ఎక్కువ. నేను 6వ తరగతి చదువుతున్న రోజుల్లో లక్ష్మీనరసింహారావు అనే టీచర్ ఉండేవారు. ఒక రోజు మాకు జాగ్రఫీ చెబుతూ, ఇనుముకూ బంగారానికీ ఉన్న తేడా ఏమిటో వివరిస్తున్నారు. అప్పట్లో నాలో బంగారం పట్ల ఉన్న మక్కువ వల్లో మరేదైనా కారణం వల్లో నా మనసులో ఒక ప్రశ్న అంకురించింది. ఏ మాత్రం సంకోచించకుండా "అందరూ అతి మామూలుగా చూసే ఇనుమునేమో చవకగా అమ్ముతారు. అందరికీ చాలా ఇష్టమైన బంగారాన్నేమో ఎక్కువ ధరకు అమ్ముతారు. ఎందుకు సార్?'' అన్నాను.

                      ఆ ప్రశ్న విని అర్థంలేని ప్రశ్న అని కొట్టిపారేయకుండా ఎంతో సావధానంగా.... "ఏదైతే ప్రకృతిలో చాలా తక్కువగా లభిస్తుందో, ఏది లేకపోయినా జీవితం గడుస్తుందో దానికి ఎంత ఖరీదు పెడితే మాత్రం ఏముంది? బంగారం లేని కారణంగా ఎవరి ప్రాణాలూ పోవు కదా! కానీ, ఇల్లు కట్టుకోవాలంటే అందరికీ ఇనుము కావాలి. దానికే ఎక్కువ ధర పెడితే నీ లాంటి నా లాంటి వాళ్లకు ఇళ్లు ఉండవు కదా! అందుక ని, ప్రకృతిలో ఎక్కువగా లభించే ఇనుము తక్కువ ధరకు లభిస్తుంది'' అన్నారు. నా ప్రశ్న ఎలా ఉన్నా మా టీచర్ చెప్పిన సమాధానంతో నా మనసు నిండిపోయింది. నేను ఆ ప్రశ్న వేయడం వల్లే కదా ఆ నిజం తె లిసిందని ఎంతో సంతోషం కలిగింది. అప్పటి నుంచే నాలో ప్రశ్నించే స్వభావం మరింత బలపడుతూ వచ్చింది. ఒక దశలో ప్రశ్నించడం గొప్ప హక్కు అన్న భావన నాలో స్థిరపడుతూ వ చ్చింది. అదే సమయంలో ఎదుటి వారు వేసే ప్రశ్నలు అన్ని సార్లూ అంత స్పష్టంగా, సహేతుకంగా ఉండకపోవచ్చని అయినా ఆ ప్రశ్న వేయడంలోని ఉద్దేశాన్ని అర్థం చేసుకుని సమాధానం చెప్పే సంస్కారం ఉండాలని ఆ తర్వాత నాకు అనిపించింది.

పంచుకునే వేదిక కావాలి

                           మా పెదనాన్న పెద్ద డాక్టరు. బాగా సంపన్నుడు. ఆయన కూతురు పిహెచ్.డి చేసింది. సంపన్నుడైన ఒక డాక్టర్‌తో ఆమె పెళ్లి జరిగింది. ఆమె ఎంతో అందంగా ఆరోగ్యంగా ఉండేది. అన్నీ సవ్యంగా సాగిపోతున్నాయని అయిన వాళ్లంతా అనుకుంటున్న సమయంలో ఒకరోజు ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆ రోజుల్లో మా కుటుంబాల్లో అదో పెద్ద విషాదం. ఆమె ఎందుకలా ఆత్మహత్యకు పాల్పడిందన్న విషయం చాలాకాలం దాకా ఎవరికీ తెలియదు. తన సమస్యేమిటో ఎవరితోనైనా మనసు విప్పి చెబితే కదా తెలిసేది? బహుశా మనసు విప్పి చెప్పే అవకాశమే ఆమెకు రాలేదేమో అనిపించింది. ఆలోచిస్తూపోతే అలాంటి వారికి ధైర్యం చెప్పి ఏదో ఒక స్థాయిలో ఒక పరిష్కారమార్గాన్ని చూపే వేదిక అంటూ లేకపోవడమే ఇందుకు కారణమేమోనని అనిపించింది. ఆ ఆలోచనతోనే నేచర్ క్యూర్ డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తూనే నల్లగొండలో 'సబల' అన్న పేరుతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం. అది కేవలం ఒక చర్చావే దిక మాత్రమే. ' మనసుల్ని కలబోసుకుందాం రండి' అన్నది మా సంస్థ తరపున మేమిచ్చిన నినాదం. అలాంటి వేదిక కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారేమో అన్నట్లు ప్రతి ఆదివారం రోజున ఏర్పాటు చేసే ఆ మీటింగ్‌లకు యుక్త వయసు అమ్మాయిల నుంచి ఎనబై ఏళ్ల వృద్ధురాళ్ల దాకా చాలామంది వచ్చేవారు. ప్రతివారం 80 మంది దాకా వచ్చి రెండు మూడు గంటల పాటు కూర్చునే వాళ్లు. మనసు విప్పి చెప్పుకోవడానికి అదొక అరుదైన అవకాశం అనిపించిందేమో! వెంటనే ఏదో పరిష్కారం దొరుకుతుందని అనుకోకపోయినా, పరిష్కారం దిశగా పయనించడానికి ఇది ఎంతో కొంత దోహదం చేస్తుందనే ఆశ మాత్రం అక్కడికి వచ్చిన మహిళల్లో నేను స్పష్టంగా చూశాను.

కొన్నింటికి ముగింపు ఉండదు
                                 2003లో నేను రెడ్‌క్రాస్ వారి నేచర్ క్యూర్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న రోజుల్లో 'ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్' అనే సంఘాన్ని స్థాపించాం. అప్పటికే కొంత పర్యావరణం గురించి కొంత అవగాహన ఉంది. ఆ సమయంలోనే యురేనియం మైనింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్లు పబ్లిక్ హియరింగ్ పెడుతున్నామంటూ ఇచ్చిన ఒక నోటిఫికేషన్ హిందూ పత్రికలో వచ్చింది. నాగార్జునసాగర్ పక్కన 1200 ఎకరాల విస్తీర్ణంలో యురేనియం మైనింగ్ చేయబోతున్నామని, దానికి ప్రజలు తమ అభిప్రాయాలు, ఆక్షేపణలు ఏమైనా ఉంటే చెప్పవచ్చన్నది ఆ నోటిఫికేషన్ సారాంశం. ఈ నోటిఫికేషన్ రావడానికి వారం రోజుల ముందు జార్ఖండ్‌లో జరుగుతున్న యురేనియం మైనింగ్ విషయాన్ని చిత్రించిన 'బుద్ధా వీపింగ్ జాదూగూడ' అనే డాక్యుమెంటరీ సినిమాను మా ఫోరం తరపున ప్రదర్శించాం.

                            మైనింగ్ జరుగుతున్న ప్రదేశాల్లోని ప్రజలు అత్యధిక సంఖ్యలో కేన్సర్, క్షయ, సిలికోసిస్, తీవ్రమైన చర్మవ్యా«ధుల బారిన పడటం, పుట్టిన పిల్లలు పలు రకాల అంగవైకల్యాలతో ఉండడం, అకాల వృద్ధాప్యం రావడం వంటి అంశాలు ఆ సినిమాలో ప్రస్తావనకు వస్తాయి. ఆ డాక్యుమెంటరీని 'బుద్దుడు రోదిస్త్తున్నాడు' అన్న పేరుతో తెలుగులోకి అనువదించాం కూడా. యురేనియం ప్రాజెక్టు ప్రభావం నాగార్జునసాగర్ మీద పడితే కృష్ణానది నీటి మీదే ఆధారపడిన సగం ఆంధ్రప్రదేశ్ ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటుంది. వ్యవసాయపరంగా గానీ, తాగునీటిపరంగా గానీ చాలా నష్టపోతామని, హైద్రాబాద్‌కు తాగు నీరు అక్కడనుంచే వస్తుంది కాబట్టి అర్జంటుగా ఏమైనా చేయాలనుకున్నాం. ఏం చేయాలో స్పష్టంగా తెలియకపోయినా 30 రోజుల్లోనే పబ్లిక్ హియరింగ్ జరిగిపోతుందన్న ఆందోళన ఎక్కువైపోయింది. ఒకసారి పబ్లిక్ హియరింగ్ జరిగిపోతే వాళ్లకు ఫైనల్ పర్మిషన్ లభిస్తుంది. అందుకే దాన్ని నిరోధించే ప్రయత్నం చేయాలనుకున్నాం. వెంటనే దానికి సంబంధించిన అధ్యయనమంతా చేశాం. ప్రజలంతా ఆ ప్రాజెక్టును పెద్దఎత్తున వ్యతిరే కించేలా చేశాం. ఈ రోజు దాకా ఆ ప్రాజెక్టు రాలేదు కానీ, మునుముందు రాదన్న గ్యారెంటీ ఏదీ లేదు. అందుకే అటువంటి వాటిని నిరోధించే పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉండాలన్న వాస్తవం తెలిసొచ్చింది. కొన్ని పోరాటాలకు ముగింపు ఉండదనే సత్యం ఒకటి బోధపడింది.

ప్రకృతికి దూరమైతే....

                          రెడ్‌క్రాస్ వారి నేచర్ క్యూర్ హాస్పిటల్‌కు ఒకరోజు 40 ఏళ్ల ఒక మహిళ వీల్ చెయిర్‌లో మావద్దకు వచ్చింది. ఆమె గృహిణి. భర్త ఇంజనీరు. ఎముకలు మెత్తబడి వంగిపోయే ఆస్టియో మలేషియా అనే వ్యాధి కారణంగా అంతకు ముందు ఒక కార్పొరేట్ హాస్పిటల్‌లో చేరిందట. అక్కడ ఏ ఫలితమూ కనిపించకపోవడంతో ఇక్కడికి వచ్చింది. ఈ వ్యాధికి కాల్షియం లోపాలు కారణమన్నది వాస్తవమే అయినా ఆమె విషయంలో అందుకు దారి తీసిన ఒక విచిత్రమైన కారణం బయటపడింది. ఆమె భర్త మైనింగ్ ఇంజనీరు. వాళ్లు ఉండే కాలనీ పక్కనే గనులు ఉన్నాయి. మైనింగ్ వర్క్ షిప్ట్‌ల వారీగా 24 గంటలూ జరుగుతూ ఉంటుంది. దాంతో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ట్రక్కులు నిరంతరం వాళ్ల ఇంటి పక్క నుంచే వెళుతుంటాయి. వాటి తాలూకు శబ్దాలు, వాటితో వచ్చే ప్రకంపనలు ఆమెలో ఒక భయాన్ని నింపాయి. అందుకే దాదాపు ఆరేళ్లు ఆమె ఇంట్లోంచి బయటికే రాలేదు. పగలూ రాత్రి తలుపేసుకుని ఆరేళ్లూ ఇంట్లోనే ఉండిపోవడం వల్ల ఆమెకు ఈ జబ్బు వచ్చింది. ఇక్కడికి రావడానికి ముందు వైద్యం ఇచ్చిన కార్పొరేట్ హాస్పిటల్ వారు ఈ జబ్బు ఎప్పటికీ నయం కాదనే చెప్పారట. ఆ భావనను మనసులోంచి తీసివేయమని ధైర్యం చెప్పి చికిత్స ప్రారంభించాం. అరిటాకుల మీద పడుకోబెట్టి ఎండలో ఉంచే 'ఆతప స్నానం, నూనె రాసి సన్‌బాత్ ఇవ్వడం, మట్టి పూతలతో షెడ్‌లో కూర్చోపెట్టడం వంటి చికిత్సలతో కేవలం నెలరోజుల్లోనే ఆమె పరిస్థితి ఎంతో మెరుగుపడింది. ఆ తరువాత మరో రెండు వారాలకు ఆమె షటిల్ కూడా ఆడే స్థితికి చేరుకుంది. ఆమెకు మేమేమీ మందులు ఇవ్వలే దు. ఆమెను ప్రకృతికి చేరువగా తీసుకువెళ్లాం అంతే. ఆమె ప్రకృతి చికిత్సకు రాకపోయి ఉంటే బతికినంత కాలం మంచాన పడి ఉండడం తప్ప మరొకటి చేయగలిగేది కాదు. ప్రకృతి సహజంగా జీవించడమే మహావైద్యం అని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి?

0 Comments

మహిళా సాధికారతే లక్ష్యంగా మన్ దేశీ

10/19/2013

0 Comments

 
Picture
మహిళలు నేడు రాణించని రంగమంటూ లేదు.తాము ఎంచుకున్న రంగంలో విజయపథంలో పయనిస్తున్నారు. గ్రామీణ ప్రాంత మహిళలు సైతం తామేమీ తీసిపోమన్న రీతిలో చిన్న తరహా పరిశ్రమలను నెలకొల్పి ఆ రంగంలో తమ పనితనానికి పదును పెడుతున్నారు. మహారాష్టల్రోని సతారా జిల్లాకు చెందిన మహిళలు అదే కోవకు చెందుతారు. తమ కాళ్లమీద తాము నిలబడడంతో పాటు తోటి మహిళలకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో ఆ మహిళలు ఏకంగా మన్‌దేశి మహిళా సహకార బ్యాంక్‌ పేరుతో ఒక మహిళ సహకార బ్యాంక్‌ను స్థాపించారు. దాని ద్వారా బిజినెస్‌స్కూల్‌ను ప్రారంభించారు. హెచ్‌ఎస్‌బిసి బ్యాంక్‌ సహకారంతో మన్‌దేశి ఉద్యోగిని పేరుతో ప్రారంభమైన ఈ స్కూల్‌ మహిళలను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

సతారా జిల్లాలోని మస్వాద్‌ అనే గ్రామంలో సంస్థ ప్రధాన కేంద్రం ఉంది. మహారాష్టల్రో ని సతారా, సోలాపూర్‌, సంగ్లీ, రాయ్‌గడ్‌, రత్నగిరి, పూణే, కోలాపూర్‌ జిల్లాలలో బ్యాంక్‌ సేవలందిస్తుంది. ఆయా ప్రాంతాల్లో మొత్తం ఆరు బ్రాంచీలు ఈ బ్యాంక్‌కు ఉన్నాయి. కేవ లం బిజినెస్‌ స్కూల్‌నే కాకుండా తోటి మహిళలకోసం ‘మన్‌దేశి మహిళా సహకారి బ్యాంక్‌’ ను నిర్వహిస్తున్నారు. మహిళలే సమర్ధంగా చిన్న పరిశ్రమలను నిర్వహించుకొనేలా మనమే ఒక బిజినెస్‌ స్కూల్‌ పెట్టుకొంటే...! అన్న ఆలోచనతో హెచ్‌ఎస్‌బిసి బ్యాంక్‌ అందించిన సహ కారంతో ‘మన్‌దేశి ఉద్యోగిని’ అనే బిజినెస్‌ స్కూల్‌ ప్రారంభించారు. స్కూల్‌ నిర్వహణకు గాను బ్యాంక్‌ ఏడు లక్షల రూపాయల నిధులను సమకూర్చింది. హ్యాండ్‌బ్యాగ్‌ల తయారీ, వడాపావ్‌ వెండింగ్‌, మేలు గొర్రెల పెంపకం వంటి చిన్న తరహా పరిశ్రమలను సమర్ధవం తంగా ఎలా నిర్విహంచాలో, తయారు చేసిన వస్తువులను ఎలా మార్కెట్‌ చెయ్యాలో ఈ స్కూల్‌లో శిక్షణనిస్తారు.

మహిళసాధికారతే లక్ష్యంగా...
‘‘జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న పట్టుదల ఉన్న స్ర్తీలు, ఆర్ధిక స్ధోమత లేక పై చదువులు చదువుకోలేని యువతులెందరో గ్రామీణ ప్రాంతాలలో ఉన్నారు. పొట్టకూటికోసం వ్యవసా య కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ర్టలోని గ్రామీణ ప్రాంతాల బాలికలు సాధారణంగా సెకండరీ స్థాయి స్కూలు చదువుతోనే ఆపేస్తారు. సతారా జిల్లాలోని చాలా మంది బాలికలు స్థోమతలేక... ఇంకా ఇతరత్రా కారణాల వల్ల పై చదువుకొనసాగించలేక సెకండరీ విద్యతోనే సరిపెట్టుకోవలసి వస్తోంది. సరైన విద్యార్హతలు లేక పోవడం వల్ల వీరికి ఉద్యోగాలు రావు. దీనితో నిరుద్యోగులుగా లేదా వ్యవసాయ కూలీలుగా మారుతున్నారు. వొకేషనల్‌ శిక్షణ లేకపోవడంతో వీరికి సూక్ష్మ రుణాలు అందే అవకాశం కూడా లేదు. అటువంటి మహిళలకు ఏదో ఒకటి చేయాలన్న తపన నన్ను నిలకడగా ఉండనివ్వలేదు.

ఎన్నో మార్గాలను అన్వేషించాను. చివరకు బిజినెస్‌ స్కూల్‌ను స్థాపించాను. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు అవసరమైన వొకేషనల్‌ శిక్షణతో పాటు ఆర్థిక సాయం అందించడమే ఈ స్కూల్‌ లక్ష్యం. మహిళలను ఆర్థిక పురో భివృద్ధి దిశగా పయనింపజేయడమే మా సంస్థ ఉద్ధే శం, మహిళలు శక్తిహీను లుగా కాకుండా ఆర్థికస్థితిమంతులుకావాలి.’’అని మన్‌దేశి సహకార బ్యాంక్‌ చైర్‌పర్సన్‌ చేతనా గాలా సిన్హా అంటున్నారు. ‘‘బిజినెస్‌ స్కూ ల్‌లో మొత్తం18 కోర్సులున్నాయి వీటి వ్యవధీ వారంరోజుల నుండి మూడు నెలల వరకు ఉంటుంది. ఈ కోర్సు లు సాంకేతిక నైపుణ్యం, మార్కెటింగ్‌, ఆర్థికరంగంలోని మెళకువలతో పాటు మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొం
దడానికి దోహదపడతాయి.

చదువుకుని రోజుకూలీలుగా పనిచేసుకుంటున్న యువతులు,చదువుకోకపోయినా సమర్ధవంతంగా కుటుంబభాద్యతలు నిర్వహిస్తూ ఆపై ఏదోఒకటి చేయాలని తపన పడుతున్న మహిళలెందరో. వారికి చేయూతనిచ్చి మంచి జీవితాన్ని అందించాలన్న ఉద్దేశ్యంతో రెండు గ్రూపులుగా విభజించి స్కూల్‌లో శిక్షణ ఇస్తున్నాము. నిరక్షరాస్యులయిన మహిళలకు గొర్రెలపెంపకం, ద్రాక్షతోటల పెంపకం, పాల నాణ్యతను ఎలా మెరుగు పరచాలి... తదితర అంశాల మీద శిక్షణ ఇస్తున్నారు. యువతులకు హాండ్‌బ్యాగుల తయారీ, హాస్పిటల్‌ను పరిశుభ్రంగా ఉంచడంపై శిక్షణ ఇస్తున్నాము. సాధారణంగా మన్‌దేశి బ్యాంక్‌ ద్వారా మహిళలకు రుణాలు అందజేస్తారు.

వృత్తివిద్య కళాశాల...
అప్పుడప్పుడు చిన్నస్థాయి పరిశ్రమలను నిర్వహించడంలో ఎదురయ్యే సమస్యల గురించి కొంత మంది మహిళలు మా వద్దకు వచ్చేవారు. ఓరోజు కూరగాయల వ్యాపారి అరుణ గైక్వాడ్‌ తన సమస్యకు పరిష్కారం సూచించమంటూ వచ్చింది. ఆ సంఘటన మమ్మల్ని ఆలోచనలో పడేసింది. ఇలా అరుణలా ఏదో చేయాలన్న ఆలోచన వున్నా అందుకు కావాల్సి న తెలివితేటలు లేకపోవడం వల్ల ఎంతోమంది మహిళలు బాధ పడుతున్నారు. వారిని ఆ సమస్యల నుంచి విముక్తుల్ని చేయాలన్న ఆలోచనే బిజినెస్‌ స్కూల్‌ స్థాపనకు నాంది’’. ఇటువంటి తరహా బిజినెస్‌ స్కూల్‌ దేశంలో ఎక్కడా లేకపోవడం వలన స్కూలు ఏర్పాటు కొంచెం కష్టమే అయింది. బ్యాంకే స్వంతంగా ఒక మోడల్‌ను రూపొందించింది. ఇక కోర్సు లను డిజైన్‌ చేయడం కూడా ఒక సవాల్‌. విద్యార్థులు ఎవరి మార్కెటింగ్‌ తామే చేసుకోవ డానికి అవసరమైన శిక్షణ ఇస్తున్నారు.

కోర్సు మెటీరియల్‌ మొత్తం ప్రాక్టికల్‌గా, ఎక్కువగా వీడియో ప్రోగ్రాములతో విద్యార్థులకు అర్ధమయ్యేలా, ఆసక్తికరంగా బోధిస్తున్నారు. రాష్ర్టం లో లెక్కలేనన్ని వొకేషనల్‌ కాలేజీలు ఉన్నాయి. కానీ వాటికీ, మా బిజినెస్‌ స్కూల్‌కు చాలా తేడా ఉంది. వొకేషనల్‌ కాలేజీలు వృత్తివిద్యా శిక్షణ మాత్రమే ఇస్తాయి. కానీ ఇక్కడ శిక్షణతో పాటు వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించి, విజయవంతమైన వ్యాపారులు అయ్యేందుకు కావాల్సిన ప్రోత్సాహం లభిస్తుంది. ‘‘మా దగ్గర శిక్షణ పొందిన యువతులు ఇంగ్లీషు కూడా నేర్చుకుంటున్నారు. కుటుంబ ఆర్థిక వ్యవహారాల్ని చక్కపెట్టడంలో సఫలీకృతులవుతున్నారు. 30 రూపాయలు సంపాదించే రోజుకూలీ నుండి నేడు రోజుకు రూ. 120 సంపాదించే వ్యాపారులుగా ఎదిగారు. ఇది మా కృషికి నిదర్శనం. మొదట మహిళా సహకార బ్యాంక్‌... తర్వాత గ్రామీణ మహిళల కోసం బిజినెస్‌ స్కూల్‌...ఆ తర్వాత...? ‘‘బిజినెస్‌ స్కూల్‌ ఆన్‌ వీల్స్‌’’. స్కూల్‌కి వచ్చి శిక్షణ పొందలేని మహిళల దగ్గరకే ‘మన్‌దేశి ఉద్యోగిని’ తీసుకెళ్లాలన్న ఆలోచనతో బిజినెస్‌ స్కూల్‌ ఆన్‌ వీల్స్‌ మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నాము. దీని గురించి పటిష్టమైన ప్రణాళిక రూపొందించాల్సి వుంది.’’ అని చేతన తెలిపారు.

బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌
మన్‌దేశి బ్యాంక్‌ ఆర్గనైజేషన్‌కు ప్రత్యేక బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ ఉంది. చేతనా విజయ్‌ సిన్హా ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తుండగా, వైస్‌ ఛైర్మన్‌ మంజుశా రాజ్‌కుమార్‌ సూర్యవన్సితో పాటు మరో 15మంది మహిళలు డైరెక్టర్లుగా ఉన్నారు. దీనితో పాటు స్వయం సహాయక బృందానికి ప్రత్యేక కమిటీ ఉంది. ఇంకా చేతనా గలా సిన్హా వ్యవస్థాపకురాలుగా ఉన్న ఈ సంస్థలో రేఖాకులకర్ణి (చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి), వనితా షిండె( చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి), సుష్మా షిండే(చీఫ్‌ ఫైనాన్సియల్‌ అధికారి)లుగా వ్యవహరిస్తున్నారు.

అవార్డులు
2006లో ఎబిఎన్‌ అమ్రోబ్యాంక్‌, ప్లానెట్‌ ఫైనాన్స్‌ ఇండి యా నుంచి మైక్రోఫైనాన్స్‌ ప్రాసెస్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు.
2005లో ఇంటర్నేషనల్‌ అశోకా చేంజ్‌మేకర్స్‌ అవార్డు.
ఫైనలిస్ట్‌ స్కావాబ్‌ ఫౌండెషన్‌ అవార్డు-2007
అశోక ఇన్నొవేటర్స్‌ ఫర్‌ ది పబ్లిక్‌ అవార్డు
హార్వార్డ్‌ యూనివర్సిటీ బ్రిడ్జ్‌ బిల్డర్‌ అవార్డు-2003
ఏల్‌ యూనివర్సిటీ వరల్డ్‌ ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌ 2002-2003
ఫస్ట్‌ గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ బ్రేవెరి అమోదిని అవార్డు-2009
రాణీ లక్ష్మీబాయి పురస్కార్‌-2009
శ్రీమతి సుశీలాదేవి దేశ్‌ముఖ్‌ స్మృతి మహిళా పురస్కార్‌-2007
మైక్రోఫైనాన్స్‌ ప్రాసెస్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు-2005.
వీటితో పాటు పలు అవార్డులు ఈ సంస్థ అందుకుంది.


0 Comments

ఆమె ప్రతిభకు అమెరికా ప్రోత్సాహం

10/18/2013

0 Comments

 
Picture
నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన పూనమ్‌ అమెరికాలోని యూనివర్శిటీలో ఉచితంగా చదువుకొనే అవకాశం దక్కించుకుంది. అదెలాగో చదవండి.నమ్‌ పుట్టి పెరిగింది హర్యానాలోని కైతా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో. ఆమె తండ్రి సురేష్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పూనమ్‌ డిగ్రీ వరకూ ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుకుంది. ఎప్పుడూ క్లాస్‌ ఫస్ట తనే! తండ్రికి కష్టం కలిగించకుండా... సాయంత్రం ట్యూషన్లు చెప్పుకొని వచ్చిన డబ్బులతో పుస్తకాలు కొనుక్కొనేది. తమ్ముడూ, చెల్లికి కావల్సిన అవసరాలూ తనే చూసేది. పూనమ్‌ వాళ్ల గ్రామంలో ఆడపిల్లలను బయటకు పంపడం చాలా తక్కువ. కాలేజీ చదువంటే తల్లిదండ్రులు ముందుకొచ్చేవారు కాదు. అలాంటిది పూనమ్‌ ఇంట్లో వాళ్లని బలవంతంగా ఒప్పించి.. తనతోపాటు చెల్లికూడా చదువుకొనేలా ప్రోత్సహించింది. ట్యూషన్లు చెబుతూనే డిగ్రీ వరకూ చదివిన పూనమ్‌ ఎమ్మెసీకి ప్రవేశ పరీక్ష రాస్తే పంజాబ్‌ యూనివర్సిటీలో సీటు వచ్చింది. ఇల్లు వదిలిపెట్టి వచ్చి యూనివర్సిటీలో చదువుకుంటానంటే చాలామంది పూనమ్‌ కుటుంబసభ్యుల్ని విమర్శించారు. అయినా వాళ్లు లెక్క చేయకుండా యూనివర్సిటీకి పంపారు. కష్టపడి చదివి 99 శాతం మార్కులతో పీజీ పూర్తి చేసింది. పీహెచ్‌డీ కోసం అమెరికాలోని కరోలినా యూనివర్శిటికీ ప్రవేశ పరీక్ష రాసింది. అందులో మంచి ర్యాంకు సాధించింది. ర్యాంకు తెచ్చుకున్నందుకే కాదు, ఆమె ఎంత కష్టపడి పైకి వచ్చిందో తెలుసుకొని అభినందిస్తూ... యూనివర్సిటీ పూనమ్‌కు యాభై వేల డాలర్లు అంటే ముప్ఫై లక్షల ఉపకార వేతనంతోపాటు పీహెచ్‌డీ పూర్తయ్యే వరకూ ఖర్చులు భరించడానికి ముందుకొచ్చింది. ప్రస్తుతం ఆమె అమెరికా వెళ్లడానికి సిద్ధమవుతోంది. వీసా కోసం దరఖాస్తు చేస్తుంటే ఈ విషయం బయటకు వచ్చింది. అది తెలిసి... ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేందర్‌ హుడా పూనమ్‌ని ప్రత్యేకంగా కలిసి అభినందించడమే కాదు తన తమ్ముడూ, చెల్లీ చదువుకోవడానికి ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చారు.

0 Comments

ఆ మూడేళ్లూ కంటినిండా నిద్రలేదు..

10/17/2013

0 Comments

 
Picture
                         పద్దెనిమిదేళ్ల క్రితం చదివిన చదువును మళ్లీ మొదలుపెట్టి... దాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకోవడమే కష్టం. ఇక, వ్యాపార విజయం సాధించడమంటే మరీ కష్టం. ఆ సవాల్‌నే స్వీకరించారు హైదరాబాద్‌కి చెందిన సుర్జీత్‌ కౌర్‌. రెడ్డీల్యాబ్స్‌, అరబిందో, సీసీఎంబీ వంటి సంస్థలను తన క్లయింట్లుగా మార్చుకునే స్థాయికి చేరుకున్నారు. 'మైక్రోబయాలజీ సేవలు కొన్ని పరిశ్రమలకే కాదు... రైతులు సహా అనేక రంగాల్లోని వారికి ఉపయోగపడతాయి' అంటూ ఆ విశేషాలనూ, అడ్డంకులను దాటి ఎదిగిన తీరునీ చెబుతున్నారు సుర్జీత్‌.

            ఏ నమూనా అయినా తెచ్చివ్వండి. దాన్ని పరిశోధించి అందులో ఎలాంటి సూక్ష్మక్రిములు, ఏ మోతాదులో ఉన్నాయో చెబుతాం. ఏవి హానికారకం... ఏవి ఉపయోగకరం... ఫ్యాటీ యాసిడ్ల శాతం ఎంత ఉందీ... వంటి వివరాలను తెలియజేస్తాం. మేం అందించే ఈ మైక్రోబయల్‌ అనాలసిస్‌ వ్యవసాయ, ఆరోగ్య, డిఫెన్స్‌... వంటి రంగాలకు ఎంతో అవసరం. అందుకే పిరమల్‌ లైఫ్‌ సైన్సెస్‌, భారత్‌ బయోటెక్‌, ఎన్‌ఐఎన్‌, డిఫెన్స్‌ రీసెర్చి లాబొరేటరీ వంటి ప్రముఖ సంస్థలు ఇప్పుడు మా క్లయింట్ల జాబితాలో చేరాయి. ఫలసాయం పెంచుతాయి... మైక్రో బయాలజీ టెక్నాలజీ కొన్ని పరిశ్రమలకే ఉపయోగపడుతుంది చాలామంది అనుకుంటారు. అది నిజం కాదు. రైతులకూ, పాల కేంద్రాల వాళ్లకీ, ఆహార పదార్థాల తయారీ రంగంలో ఉన్న వాళ్లకీ... ఇలా పలు రంగాల్లోని వారికిది మేలు చేస్తుంది.

                              ఉదాహరణకు రైతులనే తీసుకుందాం. మేం పొలంలోని మట్టిని తీసుకుని సాయిల్‌ ఎనాలిసిస్‌ చేస్తాం. దాన్లో ఏయే జీవాలూ, ఎన్ని రకాలుగా ఉన్నాయో తెలియజేస్తాం. ఆ మట్టిలో ఎలాంటి పంటలు వేస్తే బాగా పండుతాయో, ఎలాంటి ఎరువులు వాడాలో చెబుతాం. మట్టిలో లోపించిన జింక్‌, మాంగనీస్‌ వంటి వాటిని ఏ మోతాదులో పెంచాలో వివరిస్తాం. ఆహార రంగంలో ఉన్నవాళ్లు కొన్ని పదార్థాలు తయారుచేసినప్పుడు అవి పాడవుతాయి. ఎందుకు పాడయ్యిందీ, కలిగే హానీ, అలా జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి... ఇలా ప్రతి చిన్న అంశాన్నీ పరిశీలించి చెబుతాం. ఫార్మా కంపెనీల విషయానికొస్తే... ఒక ఉత్పత్తి తయారయ్యాక ఏదైనా సమస్య ఎదురైతే, మాకు కంటామినేటెడ్‌ శాంపిల్‌ని పంపిస్తారు. ఎక్కడ లోపం ఎదురయ్యింది... దానికి వాతావరణం కారణమా... వివిధ పదార్థాలు సమపాళ్లలో కలపలేదా వంటి విషయాలను మేం విశ్లేషించి నివేదిక ఇస్తాం. దానివల్ల శాస్త్రవేత్తలు మళ్లీ ఆ పొరపాట్లు జరగకుండా జాగ్రత్తపడతారు.

                      నాకు తెలిసిన విద్య ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంటే, ఇప్పుడు ఆనందంగా ఉంది కానీ ఇదంతా సాధించడానికి చాలా ఏళ్లే పట్టింది.

నేనే కీలకమయ్యా...
                                   చిన్నప్పట్నుంచీ నా కల డాక్టర్‌ కావడం. కానీ ఎంబీబీఎస్‌లో సీటు రాక పారా మెడికల్‌ కోర్సు చేశా. తరవాత మైక్రో బయాలజీ చదివా. అప్పట్నుంచీ ల్యాబ్‌ పెట్టాలన్నది నా కల. కానీ పెళ్లవడంతో నేను పుట్టి పెరిగిన మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కి వచ్చేశా. మా వారికి కంప్యూటర్లకు సంబంధించిన వస్తువులను విక్రయించే సంస్థ ఉంది. ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే, నేను ఆయనకు వ్యాపారంలో సహకరించేదాన్ని. ఏడేళ్ల క్రితం రకరకాల కారణాల వల్ల వాటి విక్రయం బాగా తగ్గింది. అప్పుడే మైక్రోబయాలజీకి సంబంధించిన టెక్నాలజీని విక్రయిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కలిగింది. కానీ మొదట్లో నేనంత సీరియస్‌గా తీసుకోలేదు. మా వారు మాత్రం 'ఈ సాంకేతికతను అందించడం వల్ల సమాజానికీ, మనకీ మేలు జరుగుతుంది' అంటూ ప్రోత్సహించారు. దాంతో మైక్రోబయాలజీకి సంబంధించిన సాంకేతిక సేవలను అందించడం, పరిశోధనలు చేయడం దిశగా ఆలోచించడం మొదలుపెట్టాను.

ప్రముఖ సంస్థల్ని మెప్పించి...
                             అప్పటికి నేను మైక్రోబయాలజీ చదివి పద్దెనిమిదేళ్లయింది. దాన్ని మళ్లీ ఆచరణలో పెట్టడమంటే మాటలా! మళ్లీ పుస్తకాలు తీసి పగలూరాత్రీ కష్టపడి చదివా. కొత్తగా వచ్చి చేరిన అంశాలను అధ్యయనం చేశా. అప్పట్లో మెషీన్‌ అనుకూలంగా ఉండేది కాదు. ఒక శాంపిల్‌ని పరీక్షించి వివరణ ఇవ్వడానికే చాలా సమయం పట్టేది. కొన్ని శాంపిళ్లు పరీక్షించి ఆపేస్తే, మళ్లీ పరీక్షకు సిద్ధం కావడానికీ సమయం పట్టేది. దాంతో అది నిరంతరం పనిచేసేలా చూసేందుకు అర్ధరాత్రి వరకూ పడుకోకుండా ఉండేదాన్ని. అప్పట్లో పరిశోధన సంస్థలకు మా సేవలపై అవగాహన ఉండేది కాదు. ఫార్మా సంస్థల యజమానుల్ని కలిసి వారి ప్రయోగాలకు మా పరీక్షలెలా ఉపయోగపడతాయో వివరించాను. వర్క్‌షాప్‌లు నిర్వహించాను. అలా వర్క్‌షాప్‌ పెట్టాకే జేఎన్‌టీయూ మా మొదటి క్లయింటు అయ్యింది. తరవాత క్రమంగా ఎన్‌ఐఎన్‌, సీసీఎంబీ వంటి సంస్థలూ మా సేవలను తీసుకోవడం ప్రారంభించాయి. ఇప్పుడు నెలకు యాభై నుంచి అరవై దాకా నమూనాలను పరీక్షిస్తాం. క్లయింట్ల సంఖ్య అరవైకి చేరింది. కిందటేడాది టర్నోవరు కూడా కోటి దాటింది.ఈ విజయాలు మానసికంగా ఆనందాన్నిచ్చాయి.

                          ఇంటి బాధ్యతలూ, మళ్లీ చదవాల్సి రావడం, పరిశ్రమ వ్యవహారాలతో ఒత్తిడికీ, అలసటకూ గురయ్యాను. శాంపిళ్ల వివరాలన్నీ చదివి, పరీక్షించి, అమెరికాకు పంపించేదాన్ని. అక్కడి వాళ్లతో రాత్రి సమయంలోనే మాట్లాడాల్సి వచ్చేది. దాంతో పడుకోకుండా అర్ధరాత్రి దాకా కూర్చునేదాన్ని. అలా మూడేళ్లు కష్టపడ్డా. ఫలితంగా ఆరోగ్యం దెబ్బతింది. నాకు సాయంగా ఉన్న అమ్మాయి హఠాత్తుగా ఉన్నత చదువుల పేరుతో ఉద్యోగం మానేయడంతో ఇంకా ఇబ్బందిపడ్డా. శాంపిళ్లను పరీక్షించడం, విశ్లేషణ రాయడం కూడా నేనే చూడాల్సి వచ్చింది. బిజినెస్‌ స్కూల్లో శిక్షణ...ఒకప్పుడు ఈమెయిల్‌ అంటే తెలియదు. సమాచారాన్ని ఒక ఫార్మాట్‌లో, పీడీఎఫ్‌ రూపంలో పంపడం తెలిసేది కాదు. ఐఎస్‌బీలో శిక్షణ పొందా. సదస్సుల్లో మాట్లాడటం నేర్చుకున్నా. ఇరాక్‌, కెన్యా, శ్రీలంక, జాంబియా లాంటి దేశాలకు మా సేవలను అందించే స్థాయికి చేరుకున్నా. ఇప్పుడు మేం మాలిక్యులర్‌ కిట్లూ, బయోఫెర్టిలైజర్ల్లూ, బయోపెస్టిసైడ్లనూ అమ్ముతున్నాం. మా ఆలోచనల్ని మరింత విస్తరించే ప్రయత్నంలో కూడా ఉన్నాం.

0 Comments

రొమ్ము క్యాన్సర్‌పై జనచైతన్యం

10/16/2013

0 Comments

 
Picture
                           ‘ఫ్యాషన్ డిజైనర్’గా మంచి పేరు ప్రఖ్యాతులు, సంపాదన ఉన్నప్పటికీ ఆమె సామాజిక బాధ్యతలను విస్మరించలేదు. మహిళల పాలిట మహమ్మారిలా మారిన రొమ్ము క్యాన్సర్‌పై సమాజంలో తగిన అవగాహన కల్పించాలన్న సంకల్పంతో ఆమె ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఢిల్లీకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ జస్కీరాత్ బేడీ (26) సమాజానికి తనవంతు సాయం అందించాలని చిన్నతనం నుంచే తపన చెందేది. సైకిల్‌పై ప్రయాణిస్తూ ప్రస్తుతం ఆమె హిమాచల్ ప్రదేశ్‌లో తన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తన తండ్రి ఆర్మీ ఆఫీసర్ కావడంతో సహజంగానే ఆమెకు సమాజ సేవపై ఆసక్తి పెరిగింది.

                             హిమాలయాల్లో జరిగే సాహసయాత్రను సైకిల్‌పై పూర్తి చేసేందుకు ఆమె ధైర్యంగా ముందుకు వచ్చింది. ఇదే సందర్భంలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించాలని ఆమె సంకల్పించింది. హిమాలయాల్లో బైక్, సైకిల్ రైడింగ్ అంటే ఎంతో ధైర్యం ఉండాలి. అందునా ఓ యువతి ఇలాంటి సాహసం చేయటం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని ‘హిమాలయన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అండ్ టూరిజం ప్రమోషన్ అసోసియేషన్’ అధ్యక్షుడు మోహిత్ సూద్ అంటున్నారు. ఈ అసోసియేషన్, సిమ్లా క్లబ్ సంయుక్తంగా ఈ సాహస కార్యక్రమాన్ని చేపట్టింది. హిమాలయాల్లోని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి అక్కడి మహిళలకు రొమ్ము క్యాన్సర్ గురించి బేడీ వివరిస్తోంది. దారి పొడవునా గ్రామాల్లో కరపత్రాలు పంచిపెడుతూ తన సాహస యాత్రను కొనసాగిస్తోంది.

                                శాస్ర్తియ పరిజ్ఞానం ఎంతగా విస్తరిస్తున్నా చాలామంది మహిళలకు రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన లేదని ఆమె అంటోంది. దాదాపు 70 మంది సైక్లిస్టులు ఈ యాత్రలో పాల్గొంటుండగా జస్కీరాత్ ఏకైక మహిళ కావడం విశేషం. ఇప్పటికే ప్రారంభమైన ఈ సాహస యాత్ర మషోబ్రా, కుఫ్రీ, మటియానా, నార్కోండ్, హతు, బాఘీ, కద్రాలా, టిక్కర్ మీదుగా నార్కండ్‌కు చేరింది. రొమ్ము క్యాన్సర్ సోకితే సిగ్గుతో ఆ వ్యాధిని దాచుకోవద్దని, చికిత్సతో నివారించుకునేందుకు మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని ఆమె ప్రచారం చేస్తోంది. కొంతమంది విదేశీయులు కూడా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. హిమాలయాల్లో 3,400 మీటర్ల ఎత్తు వరకూ శిఖరాగ్రంపై తన ప్రయాణం సాగుతోందని, రోజుకు 70 కిలోమీటర్ల మేరకు సైకిల్ తొక్కినా ఎలాంటి అలసట లేదని బేడీ చెబుతోంది.

0 Comments
<<Previous

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013

    Categories

    All
    ఏ అమ్మాయీ అమ్ముడవకూడదన్నదే నా లక్ష్యం
    ఆ మూడేళ్లూ కంటినిండా నిద్రలేదు..
    ఏ ఆడబిడ్డనూ ఇటువైపు రానివ్వను
    ఆటో కుమారి
    వేల మందికి కొత్త జీవితం!
    ఈమె పత్రికే ఓ రికార్డు
    పాత చిత్రాల పోస్టర్లతో ...కొత్త డిజైన్లు
    ఆమె ప్రతిభకు అమెరికా ప్రోత్సాహం
    ఇదొక 'అత్యవసర' సేవ!
    ఖేల్ రత్న కుంజరినీ దేవి
    రజనీ బాలలు
    తొలి మహిళా మంత్రి
    జీవన రాగమే మూగబోయింది
    నవీన వనితకు స్ఫూర్తి ప్రదాత.. శారదా దేవి
    కలలు డిజైన్ చేసుకున్న అమ్మాయి
    ఒంటి కాలితో గెలిచింది!
    వందల మందిని కాపాడింది...
    అడవి తల్లికి ఆడబిడ్డల పహరా
    ఐరాస మెచ్చిన అమ్మాయిలు
    పంటల పాఠాలమ్మ
    వసతి గృహాల్లో 'మనో పాఠాలు'
    సహాజ చిత్రాలతో కొత్త అందాలు
    సాయం చేసేందుకు పత్రిక పెట్టింది!
    జీవన సందేశానికి ఒక్క కుంచె చాలు!
    ధ్యాస
    తరుణీ .. ధిల్లానా !
    నిన్న ఆటో డ్రైవర్.. నేడు లాయర్..!
    అంధుల కోసం పత్రిక
    నృత్య వైభవం
    బుకర్ బరిలో జుంపా
    పాతిక లక్షల నష్టం పాఠాలు నేర్పింది!
    లక్కీ ఛాన్స్
    ఈమెను చూస్తే లోకమే చిన్నబోతుంది
    నెలలు నిండని జ్ఞాపకాలు
    తిండి మారితేనే తరాలు బాగుపడతాయి
    మహిళా సమస్యలపై పోరాటం
    చీకటి జీవితాలకు కొత్త వెలుగు...
    మహిళా సాధికారతే లక్ష్యంగా మన్ దేశీ
    ఖైదీల జీవితాల్లో కాంతిరేఖ
    పక్షి ప్రేమికురాలు
    మహిళా పారిశ్రామికవేత్తలకు స్పూర్తి
    పరుగుల షైనీ
    అందమైన సెల్ కవర్లు ఫేస్ బుక్ లో అమ్మేస్తా!
    అవయవాల పంటకు అక్షర సేద్యం
    అశ్వనీ మలాలా!
    కావ్యా టీచర్...మా బడికి రండి
    విరామం తర్వాత విజేతలయ్యేలా!
    మనసుకు నచ్చిందే చదువు
    సాగులో ఆందెవేసిన చేయి కూతురే కొడుకయింది
    అద్భుత ప్రతిభాశాలి వి.యస్. రమాదేవి
    రొమ్ము క్యాన్సర్‌పై జనచైతన్యం
    సేవలోనూ రాణే
    అనుపమాన కృషి
    కారుణ్య బంధం
    రేసింగ్ బైక్ పై నవతరం అమ్మాయి
    అందులకు అండగా..
    నైనానంద ప్రతిభ
    అక్షరమే అతివకు అండ..
    ప్రపంచం మరువలేని మేడమ్‌ క్యూరీ
    ఉపాధితో వెన్నుదన్ను
    ఆకాశమంత ఆత్మవిశ్వాసంతో ముందడుగు
    సమస్యలను మించి పరుగు
    పరదేశంలో చదువు మనదేశంలో సేవ
    పడిలేచిన కెరటం..!
    రుక్మిణి త్యాగం
    తండ్రిని మించిన తనయ
    రుబ్బుడు చదువులు మనకొద్దు :సుచిస్మిత
    పద్మశ్రీ వారియర్‌
    ఆదివాసుల ఆత్మఘోషకు తొలి కదలిక
    వీరీవీరీ గుమ్మడిపండ్లు
    తెలుగందం... మెరిసింది
    ఆణిముత్యం
    ఎగిరిపోతే ఎంత బాగుందో!
    రికార్డుల రాణి ఎలెనా
    అమ్మలగన్న అమ్మ నరసమ్మ!
    సోనాగచికి కొత్త ఆశాదీపం... ఇషిక!
    వ్యాపారమే జీవితం
    విజయోత్సవ నృత్యం
    ఆత్మరక్షణ పాఠాలతో అండ
    సమాజాన్ని కుంచెతో తట్టిలేపిన ధీర
    హైదరాబాద్ సంస్కృతి అంటే ప్రాణం
    స్వాతంత్య ఉద్యమంలో...మహిళామణులు
    ఆఫ్రికాలో అన్నపూర్ణ...
    పాకిస్తాన్ లో తొలి మహిళా ఫైటర్ పైలట్
    మనోనేత్రమే ఆమె జీవిత నేస్తం
    పాకిస్తాన్ సాహాస బాలిక .. మలాలా
    అంతర్జాతీయ కీర్తి కిరీటం
    మృత్యువునే పరిహసించిన సాహస బాలిక
    తెల్లమ్మాయి 'చెత్తశుద్ధి'
    కెమెరాఉమెన్ మల్లీశ్వరితో…
    ఆత్మవిశ్వాసం
    స్వధార్‌హోమ్ వంచితులకు ఆసరా
    ప్రశ్నిస్తేనే ప్రపంచం తెలిసేది...
    కాల్పనికకథలతో ఓలలాడించిన కలం
    1f435d7218
    24050e4082
    245c28fe88
    261cdb5043
    2818b63e80
    28389ca502
    2b0e1c1639
    2fa703fa92
    అంచెలంచెలుగా ఎదిగిన మహిళ: పాక్ విదేశాంగమij
    ఎన్నారై భర్తతో గెంటివేయబడ్డ కోమల్ ప్రవీణ
    హార్వార్డ్ లో భారతీయ తొలి మహిళా ప్రొఫెసరĺ
    31c13c6389
    3554a3419a
    35656ad80d
    55a74999b9
    5780c63669
    57c51a6293
    581f19c0c8
    596314788a
    5b25932644
    601df7f45e
    6038f96c83
    60bb50a07e
    6ac90962a4
    6acc2723b8
    6eceeac0ef
    72a7da41c2
    88cfd59ee5
    994726a014
    A2999c254a
    A31cb50ffd
    A90748427f
    Aaf6b495b5
    B68abb9e8a
    B72ae5d725
    C08f40206b
    E88f0055d9
    F3fc20019d
    F85bffc883
    F9ded65a21
    Fbb115455d
    Fcf7a2fc59
    Freedom Fighter Laxmi Sehgalpng5013f7c557

    RSS Feed


Powered by Create your own unique website with customizable templates.