
"డయల్ కాశ్మీర్ అప్లికేషన్ కాశ్మీర్ వాళ్లకే కాకుండా కాశ్మీర్‌కి వచ్చే పర్యాటకులకి కూడా ఉపయోగపడుతుంది. కాశ్మీర్ ప్రజల అవసరానికి ఉపయోగపడే ఒక పనిచేయగలగడం నాకెంతో సంతోషంగా ఉంది''అని చెప్పింది ఆయేషా.
'డయల్ కాశ్మీర్ అప్లికేషన్' సమాచారాన్ని అందివ్వడమే కాకుండా 500కి పైగా ఫోను నెంబర్లను అందిస్తుంది. వివిధ ప్రభుత్వ విభాగాల, అధికారుల, ప్రజావసరాలకు సంబంధించిన నెంబర్లన్నీ ఉంటాయి ఇందులో. ఈ అప్లికేషన్‌కు వ్యాపారానికి సంబంధించిన సమాచారాన్ని, గూగుల్ మ్యాప్స్‌ను కూడా జత చేయాలనుకుంటోందామె. "పర్యాటకులకి గూగుల్ మ్యాప్స్ చాలా ముఖ్యం. అందుకని అప్లికేషన్‌లో వాటిని కూడా చేర్చాలి. వీటి ద్వారా పర్యాటకులు తాము సందర్శించాలనుకున్న ప్రదేశాల మధ్య గల దూరాలను తెలుసుకుని టూర్‌ని బాగా ప్లాన్ చేసుకోగలుగుతారు'' అంటోందామె.
ఆయేషా తయారుచేసిన ఈ అప్లికేషన్ గురించి మీడియాలో బాగా ప్రాచుర్యం లభించడంతో బెంగళూరులోని ఒక సాఫ్ట్‌వేర్ సంస్థ ఆమెకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగావకాశం కూడా ఇచ్చింది. దీన్ని వినియోగిస్తున్న వాళ్లు 'డయల్ కాశ్మీర్'కు గొప్ప కితాబులిస్తున్నారు. ముఖ్యంగా అటుఇటు వెతుక్కోకుండా సమయాన్ని ఆదా చేసుకుంటున్నాం అంటున్నారు వాళ్లు "ఇది లేకముందు ప్రభుత్వాధికారుల చిరునామాలు, ఫోన్ నంబర్లు తెలుసుకోవడం కోసం పలు వెబ్‌సైట్లు వెతకాల్సి వచ్చేది. దాంతో ఎంతో సమయం వృథా అయ్యేది. ఇప్పుడీ అప్లికేషన్ వేసుకున్న తరువాత ఆ ఇబ్బంది నుండి తప్పించుకున్నాం'' అని శ్రీనగర్‌లో స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న షఫత్ అహ్మద్ చెప్పారు. ఐదువేలమంది పైగా ఈ అప్లికేషన్‌ను ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్నారు.
ఇంత మంచి అప్లికేషన్ డెవలప్ చేసిందంటే ఆమె పెద్ద చదువులే చదివి ఉండాలనుకుంటాం. కాని 'శ్రీనగర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్'లో కంప్యూటర్ సైన్సులో గ్రాడ్యుయేషన్‌ను పోయిన ఏడాదే పూర్తిచేసింది ఆయేషా. ఆ తరువాత ఒక నెల రోజుల పాటు ఆండ్రాయిడ్ అప్లికేషన్ డిజైనింగ్ కోర్సు చేసిందంతే. "నాకు అప్లికేషన్ డెవలప్ చేయడమంటే చాలా ఆసక్తి. ఈ అప్లికేషన్ పూర్తి చేయడానికి రోజకి ఎనిమిది గంటలు పనిచేశాను'' అందామె. ఈమె తండ్రి అటవీశాఖాధికారిగా పనిచేసి రిటైరయ్యారు. ఆయన మాట్లాడుతూ "ఏ విషయాన్ని అయినా చాలా త్వరగా ఆకళింపు చేసుకుంటుంది ఆయేషా. ఎంతో నిబద్ధతతో పనిచేస్తుంది. డయల్ కాశ్మీర్ అప్లికేషన్ తయారీలో తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు బాగా శ్రమించింది. చివరికి సాధించింది. నా కూతుర్ని చూస్తే నాకెంతో గర్వంగా ఉంది'' అన్నారు.
మూలం : ఆంధ్రజ్యోతి