మనుషూలలో తేడాలు ఉన్నా...
మన మనసులలో మాత్రం ఉండకూడదు...
ఆత్మవిశ్వాసంతో అవిటితనాన్ని కూడా ఆమడదూరం పరిగెత్తించగల సత్తా ఉన్న నేటి తరానికి ప్రతినిధి ఆమె.
ఆమె నవ్వితే గలగల...
పాడితే జరజర...
ఎవరెన్ని కామెంట్లు వెనుకనుంచి చేసినా...
ముందునుంచి నవ్వినా...
తేలిగ్గా తీసుకుంటుంది...
నిండా రెండడుగులు కూడా పెరగని దేహంతో కనిపించినా...
ఆత్మవిశ్వాసం, పట్టుదలలలో నేటి యువతులకు ఈమె ఏ మాత్రం తీసిపోదు. అందంగా పాలరాతి శిల్పంలా ఎప్పుడూ నవ్వుతూ...తుళ్లుతూ కనిపించే జ్యోతి అంజె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ...
ప్రపంచంలోనే అత్యంత పొట్టి అమ్మాయిగా రికార్డును సాధించిన జ్యోతి పూర్తి పేరు జ్యోతి అంజె. నాగపూర్‌లో తన తల్లిదండ్రులతో ఉంటోంది. ఆమె ఎత్తు 1.11 అడుగులు అంటే సుమారు62.8 సెం.మీ. బరువు కేవలం 5 కిలోలు. వయసు 18 సంవత్సరాలు. ప్రస్తుతం 10వ తరగతి పూర్తి చేసుకొని కాలేజి విద్య అభ్యసించడానికి సిద్ధం అవుతోంది.
అన్నీ ప్రత్యేకతలే...
18 సంవత్సరాల జ్యోతి ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకోబోయేదాకా అన్నీ ఆశ్చర్యం గొలిపేవిధంగా ఉంటాయి. ఆమె ఉపయోగించే బ్రష్ చిన్నపిల్లలకోసం ప్రత్యేకంగా వాడేది. వేసుకునే డ్రెస్ అంటే ప్రత్యేకంగా కుట్టించాల్సిందే మరి. ఆ సైజ్ ఎక్కడా రెడీమేడ్‌లో దొరకదు. ఇక షూస్, మెడలో వేసుకునే గొలుసులు ఇవన్నీ కూడా ఆమె కోసం ప్రత్యేకంగా తయారుచేయించినవే.జ్యోతి చదువుల రాణి కూడా. స్కూల్ యాజమాన్యం ఈ బుల్లి జ్యోతి కోసం ప్రత్యేకంగా తయారుచేయించిన కుర్చీ, బెంచీలో కూర్చోవడానికి సదుపాయం కల్పించారు.. క్లాసులో అంతా జ్యోతి కన్నా పొడవైన వాళ్లే. అయినా వాళ్లంతా జ్యోతిని విపరీతంగా ప్రేమిస్తారు. జ్యోతి ఒక్కరోజు స్కూలుకు రాలేదంటే వాళ్లంతా ఆమెకోసం వాకబుచేస్తారు. ఆమెకు ఏమయిందోనని ఆందోళనపడతారు.
భగవంతునికి కృతజ్ఞతలు...
చిన్నగా ఉన్నాననే ఫీలింగ్ తనకు ఏనాడూ ఉండదని...తన మనసులో అసలు ఎప్పుడూ అటువంటి ఆలోచనే రానివ్వనని అంటుంది జ్యోతి. ఆ భగవంతుడు నాకు అన్ని అవయవాలు ఇచ్చాడు. చదువుకునే తెలివితేటలు ఇచ్చాడు. ఇంత అందమైన మొహాన్ని ఇచ్చాడు. మానసిక ధైర్యాన్ని కూడా ఇచ్చాడు. సమాజంలో ఇంతమందిలో నన్ను ప్రత్యేకంగా గుర్తుంచుకునేలా చేసినందుకు నేనే ఆ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నన్ను చూడటానికి ఎందరో వస్తుంటారు. కొందరు దీవిస్తుం టారు. మరికొందరు నన్ను వాళ్ల తెగ దేవతగా కొలిచివెళుతుంటారు. అదే కాస్త ఇబ్బంది అనిపిస్తూంటుంది. కాలక్షేపానికి ఇంట్లో చాలా ఉన్నాయి. అప్పుడప్పుడు పక్కింటి ఆంటీ వాళ్ల రెండు సంవత్సరాల పిల్లవాడిని నాకు అప్పజెప్పి ఆంటీ బజారుకు వెళ్లివస్తుంది. విచిత్రం ఏమిటంటే ఆ కుర్రాడే నాకన్నా పొడుగ్గా ఉంటాడు అని నవ్వుమోముతో చెబుతుంది జ్యోతి.
తల్లిదండ్రులు ఏమంటున్నారంటే...
ఆమె పుట్టడం అందరిలానే పుట్టింది. మామూలుగానే పెరిగింది. ఐదు సంవత్సరాలు వచ్చే దాకా తెలియలేదు. ఐదవ సంవత్సరం తర్వాత ఆమె ఎదుగుదలలో మార్పు గ్రహించి వైద్యులను సంప్రదించాము. ఆమెకు ఎకండ్రోప్లాసియా అని వైద్యులు ధ్రువీకరించారు. ఇకపై ఆమె ఎంతమాత్రం ఎదగ దు. మానసికంగా ఆమె ఎదిగినా...శారీరకంగా జీవితకాలం ఆమె ఇలానే ఉంటుందని వైద్యులు చెప్పారు. అయినా ఒక కన్న తల్లిగా జ్యోతి అంటే ప్రాణం. ఆమెను అందంగా ఓ చిన్నసైజ్ బొమ్మలా ముస్తాబు చేయడంలో తల్లి పాత్రే ఎక్కువ. ఇప్పటికీ ఇంటికి రాగానే జ్యోతికి దిష్టితీయడం అలవాటు అంటుం ది 45 సంవత్సరాల రంజన అంజె (జ్యోతి తల్లి).
అల్లరి పిల్ల...
ఇంటిదగ్గర ఉన్నంత సేపూ జ్యోతి అల్లరి అంతా ఇంతా కాదు. చెవులకు వాక్‌మాన్ పెట్టుకుని సంగీతాన్ని ఆస్వాదిస్తుంది. హిందీ పాటలంటే జ్యోతికి ప్రాణం. ఇంట్లో జ్యోతి భోజనం చేసే పద్ధతి కూడా తమాషాగా ఉంటుంది. బుల్లి కంచంలో...బుల్లి చెంచాతో ఆమె తింటుంటే చూడముచ్చటగా ఉంటుంది. ఆ ఊరిలోనే ఇప్పుడు జ్యోతి ఓ పెద్ద సెలెబ్రిటీ అయిపోయింది. ఆమెను చూడటానికి వచ్చే సందర్శకులతో ఆ ప్రాంతం అంతా సందడి వాతావరణం నెలకొని ఉంటుంది.
ఆశయం...
చిన్ని జ్యోతికి కూడా పెద్ద ఆశయమే ఉంది. ఏనాటికైనా బాలీవుడ్ చిత్రాలలో నటించాలని తెరపై తనని తాను చూసుకోవాలని...అవకాశం వస్తే అమెరికా...లండన్ పట్టణాలను సందర్శించాలని...అక్కడ ఏమైనా ప్రదర్శనలు సైతం ఇవ్వాలని జ్యోతి ఆశయం. అందుకే జ్యోతి ఇప్పుడు డాన్స్ కూడా నేర్చేసుకుంటోంది. ప్రస్తుతం ఆమెకు ఒక కన్నడ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. తొందరలోనే కెమారాలో రాక్ చేయనుంది.
గిఫ్ట్ ఆఫ్ గిన్నిస్ బుక్..
ఇటీవలే జ్యోతి తన 18వ జన్మదిన వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు అధికారులు ఆమెకు ఏకంగా ఒక రికార్డునే బహుమతిగా ఇచ్చా రు. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డుసృష్టించిన జ్యోతి హైట్ 62.2 సెంటీమీటర్లు. ఇంతకు ముం దు ఈ రికార్డు అమెరికాకు చెందిన జొర్డాన్ పేరిట ఉంది.
అందరిలానే...
నేటి యువతకున్న కోరికలు, సరదాలు జ్యోతిలోనూ ఉన్నాయి. అందరిలానే తాను కూడా నలుగురిలో ఆడుతూ పాడుతూ సరదాగా గడపాలని ఉంటాయంటుంది. ఒక్కోసారి మేటి ఫ్యాషన్ మోడల్‌లా తయారవుతుంది. ఒక్కోసారి ప్రత్యేకంగా కుట్టించుకున్న జీన్స్, టీషర్ట్‌లు వేసుకుంటుంది. విశేషం ఏమిటంటే జ్యోతి అందమైన మొహానికి ఏ డ్రెస్ వేసుకున్నా ఆ డ్రెస్‌కే ఒక కళ వస్తుంది. ఇంట్లో హోమ్ థియేటర్, డివిడి ప్లేయర్ పెట్టుకుని సరదాగా సినిమాలు చూస్తుంది. ఏం కావాలంటే అది చేసిపెట్టే తల్లిదండ్రులు ఉంటే తనకు లేనిది ఏముంటుందని జ్యోతి గర్వంగా చెబుతుంది.
మూలం : తెలుగు విశేష్