బతికేందుకు జీతం...
అన్న తరహాలో ఆలోచనలు చేయడంలో కొత్తేముంది! విభిన్నంగా అడుగులేస్తేనే గుర్తింపు. దాంతోపాటూ ఆనందం, ఆదాయం. హైదరాబాద్‌కి చెందిన హన్సిక ఇలాగే ఆలోచించింది... నిత్య జీవితంలో ఓ భాగంగా మారిపోయిన సెల్‌ఫోన్లకు అందమైన కవర్లూ, అలరించే యాక్సెసరీలను తయారుచేస్తూ ఫేస్‌బుక్‌లో అమ్ముతోంది.ను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల నుంచి బీకాం కంప్యూటర్స్ పూర్తిచేశా. సైకాలజీలో డిప్లొమా చేశా. ప్రైవేటు సంస్థలో ఉద్యోగం వచ్చింది. రోజూ ఆరేడు గంటలు పని చేసి, నెలకి ఇంత అని జీతం తీసుకోవడానికి ఇష్టపడలేదు. సొంతంగా ఏదయినా చేయాలనీ, దాని ద్వారా ఆదాయం సంపాదించాలనీ అనుకున్నా. కానీ అది ఏంటనేది కొన్ని రోజుల వరకూ అర్థం కాలేదు. అంతా 'ఖాళీగా ఉండి టైం వేస్టు చేస్తున్నావు...' అన్నారు. పట్టించుకోలేదు.
ఏదేమైనా ఇష్టమైన పనే చేయాలనుకున్నా. అలాగే ఆలోచిస్తూ, ఒకసారి అక్కలతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా ఆకట్టుకునే సెల్‌ఫోన్ కవర్లు తయారుచేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. అదే వారితో అంటే... 'ఇప్పుడు కాలేజీ అమ్మాయిలూ, అబ్బాయిలూ స్మార్ట్‌ఫోన్లు బాగా కొంటున్నారు. బోలెడు ఖరీదు పెట్టి కొనే ఆ ఫోన్‌కి రక్షణగా, దుమ్ము పడకుండా, చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండేలా అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు... నీది మంచి ఐడియానే, మొదలుపెట్టు' అన్నారు. ఉత్సాహంగా వాటిని తయారు చేయడానికి సిద్ధమయ్యా. ఏం చేయాలి... ఎలా తయారుచేయాలి... అన్న దానిపై నెల రోజుల పాటు అధ్యయనం చేశా. ఆకట్టుకునే రంగులూ, ట్రెండీగా ఉండే డిజైన్లనే అమ్మాయిలు ఇష్టపడతారని తెలుసుకుని, దానికి తగినట్లుగా వస్తువుల్ని ఎంచుకున్నా. డ్రెసింగ్ ప్లాస్టిక్, క్రోషియో, లేస్, ముత్యాలూ, పూసలూ, క్రిస్టల్స్ లాంటి వాటితో సెల్ కవర్లను తయారుచేశా. నేను చదివిన కాలేజీ ఫ్రెండ్సే చాలామంది 'బాగున్నాయి' అంటూ కొనేశారు. కొంతమంది తమ స్నేహితురాళ్లకి కానుకలుగా ఇచ్చారు.
రెండు మూడు నెలలకోసారి కవర్లు మార్చే, ఈనాటి అమ్మాయిల తీరుకి అనుగుణంగా పోల్కాడాట్లూ, ఫ్రాగీఫేస్, గులాబీలూ, కుకీలూ, సీతాకోక చిలుక వంటి రకరకాల డిజైన్లలో కవర్లను రూపొందించాను. ఫ్రెండ్‌షిప్ డే, ప్రేమికుల రోజు వంటి సందర్భాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినవి హాట్‌కేక్‌ల్లా అమ్ముడుపోయాయి. ఉద్యోగం చేస్తే ఎంత ఆదాయం వచ్చేదో ఇంచుమించు ప్రతినెలా అంత మొత్తం సంపాదించే స్థాయికి చేరుకున్నాను. అయితే ఈ ఆదరణ నిలకడగా ఉండాలంటే ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్‌ని గమనించాలి. పార్టీలకు తళుక్కున మెరిసేవీ... దుస్తులకు మ్యాచ్ అయ్యేలాంటివీ అమ్మాయిలు ఎంచుకోవడాన్ని గమనించాక... నేనూ అలాంటివి డిజైన్ చేశా. ఇయర్‌ఫోన్ జాక్‌కి కూడా యాక్సెసరీలు జతచేశా.
ప్రస్తుతం నేను ఇంకీపింకీ డాట్‌ఇన్ పేరుతో కేవలం ఫేస్‌బుక్ ద్వారానే వీటిని విక్రయిస్తున్నా. తరచూ నా వద్ద కొనే క్లయింట్లు రెండు వందలకు పైగానే ఉన్నారు. ఎప్పటికప్పుడు కొత్త స్టాక్‌ని అప్‌డేట్ చేస్తున్నా. ఈ యాక్సెసరీలు పదిహేనేళ్ల అమ్మాయి నుంచి అరవై ఏళ్ల మహిళల అభిరుచులకు తగినట్లుగా ఉంటాయి. డిజైనర్ కవర్లు కాబట్టి కాస్త ఖరీదైనవే ఉంటాయి. నాలుగొందల నుంచి తొమ్మిది వందల దాకా ఉన్నాయి. యాక్సెసరీలు అయితే తక్కువ ధరలో ఉంటాయి. మరికొన్ని కొత్త యాక్సెసరీలు తయారుచేస్తూ... నా ఆలోచనను ఇంకా విస్తరించాలనేదే నా ప్రయత్నం..'.