మగవాళ్లు కూడా...
ఎగ్జిబిషన్లో పాల్గొనడానికి రెండేళ్ల క్రితం లండన్ వెళ్లాను. నాతోపాటు మరో నలుగురు మహిళలు వచ్చారు. మేమంతా ఎగ్జిబిషన్కి లంబాడా డ్రస్సులు వేసుకుని వెళ్లాం. మేం తయారుచేసిన బ్లౌజ్పీసులు, పౌచ్లు, హ్యాండ్బ్యాగులు.. స్టాల్స్లో పెట్టి కూర్చునుండేవాళ్లం. కొందరైతే మా గాజుల్ని, జడలకు పెట్టుకునే జుంఖాలను చూసి, వీటిని కూడా అమ్ముతారా అనేవారు... మగవాళ్లు కూడా..! అని ఈ రంగంలోకి అడుగుపెట్టిన తొలిరోజులను గుర్తుచేసుకున్నారు లక్ష్మి.
ఆమె పుణ్యమే...
నేను అంగన్వాడీలో పిల్లలకు అన్నం తినిపిస్తుంటే ఒకసారొచ్చిండు. బట్సార్ అని ఫుడ్ ఇన్స్పెక్షన్ ఆఫీసరు. నేను అప్పట్లో మా లంబాడా డ్రస్సే వేసుకునేదాన్ని. ఒకరోజు ఆ సారు నా దగ్గరికొచ్చి ‘ఈ డ్రస్సు ఎవరు కుట్టారు?’ అని అడిగారు. నేనే కుట్టుకున్నానని చెబితే నమ్మలేదు. మా ఇండ్లల్లో పెండ్లి సమయానికి ఈ డ్రస్సు కుట్టడం రావాలి. లేదంటే అది పెద్ద తప్పు... అనేసరికి మారుమాట్లాడకుండా వెళ్లిపోయాడు.
మూడు రోజుల తర్వాత సత్యవతి అని ఒక మేడమ్ని తీసుకుని వచ్చాడు. ఆమె తండాలోని తోటి మహిళలందరినీ తీసుకురమ్మంది. మేము వేసుకునే డ్రస్సుల మాదిరి వర్కు చేసి పట్టణాల్లో అమ్మితే బోలెడు డబ్బులొస్తాయని చెప్పింది ఆమె. మర్నాడు... కొత్తరకం కుట్లు నేర్పే టీచర్ అని జెప్పి ఇంకొకామెను తీసుకొచ్చింది.
ఆమె మూడునెలలపాటు రకరకాల కుట్లు, అల్లికలు నేర్పింది. మేం వాడే పూసలు, గవ్వలు, రాళ్లు, అద్దాలనే అన్నింటికీ వాడింది. అవి ఎక్కడ అమ్మాలో కూడా చెప్పింది. ఆ తర్వాత విజయలక్ష్మి మేడమ్ అని మాకు చాలా అండగా నిలబడ్డారు...’’ అంటూ వివరించింది లక్ష్మి.
విదేశాల్లో అమ్మకాలు...
మొదట్లో వీరు తయారుచేసిన వస్త్రాలు హైదరాబాద్, ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లోని ఎగ్జిబిషన్లలో అమ్మారు. లక్ష్మి కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇరాన్ వెళ్లింది. తర్వాత లండన్ వెళ్లింది. ప్రస్తుతం తండాలో తోటిమహిళలతో రకరకాల కుట్లు, అల్లికలు చేయిస్తోంది. ఎగ్జిబిషన్లో అమ్మడానికి సరిపడా మెటీరియల్ రెడీ అయ్యాక దేశం నలుమూలల నుంచి వచ్చిన ఆహ్వానాలలో తనకు ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్లడానికి ఏర్పాటు చేసుకుంటోంది.
‘సత్యవతి’ అంటూ లక్ష్మి మనకు పరిచయం చేసిన వ్యక్తి ఎవరో కాదు అక్కినేని నాగేశ్వరరావు పెద్దకూతురు. తండాల్లో ఉన్న మహిళల జీవనోపాధిని అభివృద్ధి చేయడానికి అప్పట్లో ఆమె కృషి చేశారు. అందులో భాగంగానే ఎల్లమ్మతండాలోని మహిళలను డిజైనర్వేర్ రంగంలోకి దించారు.
మూలం : సాక్షి దినపత్రిక