కేరళలోని పాలక్కాడ్ ఆడపడుచు జయశ్రీ. చెన్నైలో జాబ్ చేసుకుంటున్న జయశ్రీకి వికలాంగులను ఈ సమాజం చూస్తున్న కోణం నచ్చలేదు. తనకు సరిగా వినపడకపోవడం వల్ల తనలాంటి వారు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా సులువుగా అర్థమయ్యాయి. అందుకే ఆ కోణాన్ని సమూలంగా మార్చివేయాలను కున్నారు.అంతే, ఉద్యోగం పక్కనపెట్టి వారికోసం నిలబడ్డారు. ఇంగ్లిష్ సాహిత్యంలో పీహెచ్‌డీ చేసిన జయశ్రీకి ప్రపంచమంతటా పరిస్థితి ఎలా ఉందో, మనదేశంలో అలా లేదన్న సంగతి అర్థమైంది. ముందు తానేం చేయగలదో తెలుసుకుంటే, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించొచ్చు. అందుకే ముందుగా ‘ఎబిలిటీ’ ఫౌండేషన్ నెలకొల్పారు. డిఫరెంట్లీ ఏబుల్డ్‌కు ఎలాంటి సాయం కావాలన్నా చేయడానికి ‘ఎబిలిటీ’ సిద్ధంగా ఉంటుంది. ఆ సంస్థ తరఫున తమలాంటి వారి శక్తి సామర్థ్యాలు ఏంటో ప్రపంచానికి తెలియజేయాలనుకుంది. ఆ మార్గంలో పుట్టుకొచ్చిందే ‘ఎబిలిటీ’ పత్రిక. సమాజం వికలాంగులు అనుకుంటున్నవారు ఎంత సమర్థులో, వారు సాధిస్తున్న విజయాలేంటో కళ్లకు కట్టే పత్రిక ఇది. వారు అవకాశాలిస్తే ఎదిగేవారే కాదు, అవకాశాలు సృష్టించుకునేవారు, సృష్టించేవారని నిత్యం చాటే పత్రిక ఎబిలిటీ. ‘అయినా ఈరోజుల్లో శారీరక శ్రమకు చోటెక్కడుంది? ఉన్నదంతా మేధో శ్రమే. అందులో మేము ఎవరికీ తీసిపోం, పనిచేసేది శరీరం కాదు, ఆలోచనే!’ అంటారు జయశ్రీ.
‘మాకు తెలుసు మేము సమర్థులమని, మీరూ తెలుసుకోండి’ అని ఆమె తన చేతలతో నిరూపించారు.
మూలం : తెలుగు విశేష్