"అమ్మా.. నరసమ్మా! ఈ లోకం నీకు చేతులెత్తి మొక్కినా నీ రుణం తీర్చుకోలేనిది. పురుడు పోసుకోవడానికే నోచుకోని నిరుపేదల తల్లులకు నువ్వు పెద్దదిక్కు. నువ్వే కనుక లేకపోతే పదిహేనువందల మంది పిల్లలు ఈ భూమ్మీదికి వచ్చేవారా? ఎంతమంది తల్లులు కాన్పుల్లోనే కన్నుమూసేవారో మధ్యతరగతి గర్భిణులే ప్రసూతి ఖర్చుల్ని భరించలేకపోతున్న ఈ రోజుల్లో చిల్లిగవ్వ తీసుకోకుండా పసిగుడ్లకు ప్రాణం పోస్తున్నావంటే.. నువు నరసమ్మవు కావు. అమ్మలుగన్న అమ్మవు..'' సరిగ్గా ఇలాంటి ఉత్తరాలు, ప్రశంసలు, అవార్డులు రివార్డుల వంటివి నరసమ్మను ముంచెత్తుతున్నాయి. మారుమూల పల్లెల్లోని పదిహేనువందల మంది నిరుపేద గర్భిణులకు కాన్పులు చేసినందుకుగాను.. రెండ్రోజుల కిందటే నరసమ్మకు కేంద్రప్రభుత్వం జీవనసాఫల్యపురస్కారం ప్రకటించింది.
ఆంధ్ర- కర్ణాటక సరిహద్దుల్లోని పావగడ తాలూకా క్రిష్ణాపుర వాసి నరసమ్మ. చుట్టుపక్కల ఊళ్లలోని ప్రజలందరికీ ఆమె తలలో నాలుక. అర్థరాత్రి అపరాత్రి అనేం లేదు. ఇంటికొచ్చి "అమ్మా.. నరసమ్మా! నొప్పులొస్తున్నాయి తల్లీ! నువ్వు రాకపోతే తల్లీబిడ్డా దక్కేలా లేరు'' అని చెబితే చాలు. గుడ్డ సంచి చేతికి తగిలించుకుని "పదండి పదండి'' అంటూ ఏ ఊరు, ఎంత దూరం, ఎలా వెళదాం అన్న ప్రశ్నలేవీ అడక్కుండా రయ్యిమని పోవాల్సిన చోటికి వెళ్లిపోతుంది నరసమ్మ. అదేం మహత్యమో కానీ, ఆమె చెయ్యిపడితే చాలు. అప్పటివరకు నొప్పులతో అల్లాడిపోతున్న గర్భిణుల కళ్లల్లో ఆశలు చిగురిస్తాయి. "నాకిప్పుడు తొంభై అయిదేళ్లు. ఇప్పటి వరకు పదిహేనువందల మంది ఆడవాళ్లకు కాన్పులు చేశాను. ఈ సంతృప్తితో నేను ఎప్పుడు పోయినా ఫర్వాలేదు. ఇంతవరకు నా చేతిలో ఒక్క బిడ్డకానీ, తల్లికానీ చనిపోలేదు. మంత్రసాని విద్యను మా అమ్మమ్మ మరిగమ్మ దగ్గర నేర్చుకున్నాను. అప్పట్లో ఆవిడకు ఎంతో పేరుండేది. ఆమె ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లేదాన్ని. కాన్పులు చేయడంలో ఆమె నేర్పరితనం, గుండె ధైర్యం నన్ను విస్తుగొలిపేవి. అమ్మమ్మ చేతి నైపుణ్యాన్ని చూసి కొన్ని రహస్యాలు నేర్చుకున్నాను. అంతకంటే నాకు ఎలాంటి తెలివితేటలు లేవు'' అంటుంది నరసమ్మ. ఆమెకు పన్నెండేళ్లప్పుడే అంజినప్పతో పెళ్లయింది. వారికి పన్నెండు మంది పిల్లలు.
తను చేసే ప్రతి కాన్పుకు ఒక కథ చెబుతుందీ పెద్దమ్మ. "తొలికాన్పును అనుకోకుండా చేశాను. కనుముక్క అనే ఊరికి కూలిపనికి వెళ్లానప్పుడు. మాతోపాటే కూలిపనికి వచ్చిన ఒక గర్భిణికి అకస్మాత్తుగా నొప్పులు వచ్చాయి. మగవాళ్లు విశ్వప్రయత్నం చేస్తున్నారు. నేనది చూడలేక రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఒకవైపు చేతులు వణుకుతున్నాయి. మరోవైపు ఆ గర్భిణి ఆర్తనాదాలతో తల్లడిల్లిపోతోంది. నాకు తెలిసిన లఘువుతో కాన్పు చేశాను. తల్లీబిడ్డా క్షేమంగా బయటపడ్డారప్పుడు. ఆ రోజు మగబిడ్డ పుట్టాడు'' అని గుర్తు చేసుకుందామె. ఈ రోజుల్లో ఎంత చిన్న ఆస్పత్రి అయినా సరే, కాన్పు చేయాలంటే ఇరవై నుంచి యాభైవేల రూపాయలు తీసుకోవడం సహజం. కానీ నరసమ్మ నయాపైసా అడగదు. కాన్పు అయ్యాక దయతలిచి అంతో ఇంతో చేతిలో పెడితే మాత్రం కాదనదు. నరసమ్మ ఒక్క కర్ణాటకలోనే కాదు. ఆంధ్రప్రదేశ్‌లోనూ పదుల సంఖ్యలో కాన్పులు చేసింది. వచ్చే నెల ఒకటో తేదీన 'ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్స్' సందర్భంగా.. న్యూఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో రూ.2.25 లక్షల నగదు పురస్కారం అందుకోనుంది నరసమ్మ.