వెనక్కి తిరిగైనా చూడకుండా...
‘చాలు దేవుడా’ అని పారిపోతారు.
జయమ్మ మాత్రం అలా చేయలేదు.
నరకం నుంచి బయట పడగానే...
నరకద్వారం దగ్గరే నిలబడిపోయారు!!
లోపలున్న వాళ్లందర్నీ బైటికి రప్పిస్తూ...
కూపంలో పడబోతున్నవాళ్లని ఆపేస్తూ...
పదేళ్లకు పైగా అక్కడే ‘డ్యూటీ’ చేస్తున్నారు!
ఎందుకంత ప్రమాదకరమైన బాధ్యతను
తన భుజాలపై మోస్తున్నారు?
ఈ ప్రశ్నకు ఆవిడ సమాధానం ఒక్కటే:
‘నరకం ఎలా ఉంటుందో నాకు తెలుసు.
తెలిసీ నా అక్కచెల్లెళ్లను, ఆడబిడ్డల్ని ,ఆ బిడ్డల బిడ్డల్ని ఎలా వదిలి వెళ్లగలను?’ అని!
ఇంతకీ జయమ్మ చూసిన నరకం ఏమిటి?
జయమ్మ గురించి చాలామందికి తెలుసు. ‘మహిళా సమాఖ్య మండలి జయమ్మ’ చేస్తున్న సేవ గురించి బోలెడు వార్తాకథనాలొచ్చాయి. వ్యభిచార కూపంలో మగ్గుతున్న మహిళల సంక్షేమం గురించి ఆమె చేయని ప్రయత్నం లేదు. కొందరికి విముక్తి కల్పించారు. కొందరికి ఉపాధి కల్పించారు. ఇప్పుడు కొత్తగా.. పడుపు వృత్తిలో ఉన్నవారికి పుట్టిన పిల్లలకు ఆశ్రయం కూడా ఇస్తున్నారు. ఇంకొంచెం ముందుకెళ్లి ఆ వృత్తినొదిలి రోడ్డున పడ్డ ముసలివాళ్లకి వృద్ధాశ్రమం కూడా కట్టిస్తానంటున్నారు. తన జీవితమంతా... పడుపువృత్తి మహిళల సంక్షేమానికే అంకితమంటోన్న జయమ్మ అంతరంగంలోకి వెళితే గుండె బద్దలయ్యే విషయాలు బయటపడతాయి. ‘పుస్తె కట్టినవాడే పడుపువృత్తిలోకి దింపితే... రోజుకెన్నిసార్లు సచ్చిబతకొచ్చో తెలుసు నాకు... నరకం నుండి బయటపడడం అందరూ చేసే పని. నేను దాని గుమ్మం దగ్గర నిలబడి అందులోకి దూకేవారిని చేతులడ్డుపెట్టి కాపాడే ప్రయత్నం చేస్తున్నాను’’ అంటున్న జయమ్మ ఆవేదనకు అక్షరరూపం ఇది.
‘‘నల్గొండ జిల్లా నకిరేకల్ మా ఊరు. అమ్మానాన్న చిన్నప్పుడే చనిపోవడం వల్ల అమ్మమ్మా తాతయ్యల దగ్గరే పెరిగాను. నేను పదోతరగతి చదువుతుండగా మా మేనమామ నాకు పెళ్లిసంబంధాలు చూడ్డం మొదలుపెట్టాడు. ఏవో తిప్పలు పడి ఇద్దరక్కలకు ముడిపెట్టి పంపించారు. నా వరకూ వచ్చేసరికి కట్నం ఇవ్వలేక రెండోపెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. మా ఇంటి పక్కన ఒక ఇంజినీరు దగ్గర పనిచేసే సాగర్‌తో నాకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మా ఇద్దరి విషయం ఇంట్లో తెలిసి గొడవ చేశారు. దాంతో మేమిద్దరం ఎవరికీ చెప్పకుండా పారిపోయి యాదగిరి గుట్టలో పెళ్లిచేసుకున్నాం. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చి ఉప్పల్‌లో స్థిరపడ్డాం. పెళ్లి తర్వాత అతనికీ, నాకు పుట్టింటివాళ్లతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. రెండేళ్లపాటు బాగానే చూసుకున్నాడు. పాప పుట్టాక....తన అసలు రూపం బయటపడింది.
పాప కోసం...
రెండు నెలలపాటు ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉన్నాడు. ఇంట్లోకి సరుకులు కూడా తేలేదు. ‘ఇలాగైతే ఎలా... మనం బతకడమెలా?’ అని నిలదీస్తే... ‘పట్టణంలో గొప్పగా బతకాలంటే నువ్వు వ్యభిచారం చేయాలి’ అన్నాడు. కట్టుకున్నవాడు అలా మాట్లాడితే ఏం చేయాలో అర్థం కాలేదు. నమ్మినవాడి చెయ్యి పట్టుకుని మోసపోయినందుకు బోరున ఏడ్చాను. నావాళ్లకు చెప్పుకుందామంటే వారిని కాదనుకుని వచ్చాను, పోనీ ఉన్నచోటే ఏదైనా పని చేసుకుని బతుకుదామంటే ఒంటరిగా బతికే ధైర్యం లేదు. కొన్నిరోజులపాటు అతనితో పోట్లాడి బతికాను... ఆ తర్వాత బిడ్డను బతకనివ్వనంటూ బెదిరించాడు. దాంతో చేసేదిలేక అతను చెప్పినట్టు విన్నాను. రెండేళ్లపాటు నన్ను ఇంట్లో బంధించి నాతో వ్యభిచారం చేయించాడు. ఆ తర్వాత సికింద్రాబాద్ దగ్గరున్న వ్యభిచారగృహాలకు తనే స్వయంగా తీసుకెళ్లేవాడు. అక్కడ సాగర్‌లాంటివారు చాలామంది కనిపించారు! ప్రేమ పేరుతో ఊరొదిలిన ఆడవాళ్లు కూడా కనిపించారు. ఉద్యోగం పేరుతో నమ్మివచ్చిన అభాగ్యులు కూడా ఉన్నారు. వాళ్లందరి మధ్యలో ఆరేళ్లు గడిచిపోయాయి.
నాలాంటి వారి కోసం...
నేను వెళ్లిన వ్యభిచార గృహాల దగ్గర కనిపించిన ప్రతి ఒక్క మహిళ వెనకా ఓ విషాదగాథ వినిపించేది. ఆ కూపం నుంచి బయటపడడం కోసం వెయ్యికళ్లతో ఎదురుచూసే నాలాంటి మహిళలెందరో... ఆ సమయంలో వచ్చింది హెచ్‌ఐవి నివారణ కార్యక్రమం. అప్పుడు నాకు కొన్ని స్వచ్ఛంద సంస్థలతో పరిచయం ఏర్పడింది. వ్యభిచార గృహాలకు వెళ్లి హెచ్‌ఐవి పట్ల అవగాహన పెంచే కార్యకర్తగా పనిచేస్తే నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు. నా భర్త అంగీకరించకపోగా, ‘మూడు వేల రూపాయలా...’ అంటూ ఎగతాళి చేశాడు. బిడ్డను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు దిగితే... పోలీసులకు చెబుతానని ఎదురుతిరిగాను. అలా నా భర్తను ఎదిరించి ఆ పనిలో చేరాను. కొన్నాళ్లు అలా పనిచేశాక 1999లో నాలాంటి తొమ్మిది మంది మహిళలతో ‘మహిళా సమాఖ్య మండలి’ ని స్థాపించాను. బలవంతంగా ఈ వృత్తిలో కొనసాగుతున్న 1500 మంది మహిళల్ని ఆ సంస్థ ద్వారా రక్షించాను. ట్రాఫికింగ్ ద్వారా వచ్చిన అమ్మాయిల్ని గుర్తించి వారివారి ఇళ్లకు పంపించాను. తిరిగి ఇంటికి వెళ్లలేమన్నవారికి ఉపాధిమార్గాలు చూపించాను. ప్రస్తుతం మా సంస్థలో మూడువేలమంది సభ్యులుగా ఉన్నారు. ఇందులో 600మంది హెచ్‌ఐవి నివారణ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు.
తండ్రిని వద్దనుకుంది...
తల్లిదండ్రులు లేని బిడ్డ పడే కష్టాలు నాకు తెలుసు. ఆ పరిస్థితి నా కూతురికి రాకూడదనే ఉద్దేశ్యంతో నా భర్త ఎన్ని బాధలు పెట్టినా అతడి నుంచి విడిపోలేదు. కొన్నాళ్లు భయపడ్డాను... ఇంకొన్నాళ్లు భరించాను... బతకడం నేర్చుకున్నాక ఎదిరించాను. తండ్రి ప్రవర్తన నచ్చక కొన్ని నా కూతురు ఒకరోజు నాతో ‘నాకు నాన్నొద్దమ్మా...’ అని చెప్పింది. కోపంలో అందనుకున్నాను. కాని చాలా సీరియస్‌గా చెప్పింది. ఏ బిడ్డకోసం నేను నా బాధల్ని దిగమింగుకుని... అతనితో కలిసి ఉంటున్నానో, ఆ బిడ్డే అతన్ని వద్దనుకుంది. అప్పటివరకూ నా పంటికింద దాచుకున్న దుఃఖం, కోపం ఒక్కసారిగా బయటకొచ్చాయి. బిడ్డపట్ల, నా పట్ల అతని ప్రవర్తన బాగోలేదని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. అక్కడితో అతనికి, మాకు సంబంధాలు తెగిపోయాయి. అప్పటినుంచి ఇంకొంచెం ఎక్కువ సమయం మా సంస్థకోసం పనిచేయగలుగుతున్నాను.
రెండో తరం కూడా...
పదేళ్లక్రితం తల్లితో కనిపించిన ఏడేళల పసిపిల్ల ఇప్పుడు తల్లి నడిచిన దారిలోనే నడుస్తోంది. తమ కడుపున పుట్టిన పిల్లల్ని మంచి మార్గంలో పెంచే తల్లులు ఈ వృత్తిలో చాలా అరుదుగా ఉంటారు. చాలావరకూ వారసులుగానే భావిస్తుంటారు. ఏడాది కిందట వీరిపై నా దృష్టి పడింది. తల్లులందరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పిల్లల్ని నాకప్పగించమని అడిగాను. కొందరు వెంటనే తీసుకొచ్చి నా దగ్గర వదిలిపెట్టారు. ఇంకొందరిని ఒప్పించి తీసుకొచ్చాను. అలా 35మంది ఆడపిల్లలకు నా ఇంట్లో ఆశ్రయం కల్పించాను. వీరిలో మూడేళ్ల వయసు పిల్లల నుంచి పన్నెండేళ్ల వరకూ ఉన్నారు. అందరినీ స్కూల్లో చేర్పించాను. తల్లులు అప్పుడప్పుడు వచ్చి తమ పిల్లల్ని చూసి వెళుతుంటారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... ఓ ఏడుగురు పిల్లల తల్లులు రావడం మానేశారు. అంటే వాళ్లు పిల్లల్ని వదిలేసుకున్నారన్నమాట. ఇలాంటి పిల్లలు ఇంకా చాలామంది ఉన్నారు. నా స్థోమతని దృష్టిలో పెట్టుకుని సంఖ్యను పెంచుకోవడం లేదు.
వృద్ధుల కోసం...
ఈ వృత్తిలో వయసుమళ్లినవారు అనాథలతో సమానం. రకరకాల జబ్బులతో వీధినపడి అడుక్కోవడం లేదంటే ప్రాణాలు వదలడం తప్ప గత్యంతరం లేదు వీరికి. ఇలాంటివారి కోసం ప్రభుత్వం తరపు నుంచి కాని, స్వచ్ఛంద సంస్థల నుంచి ఎలాంటి సాయం ఉండదు. ఉన్నా... ఉపయోగించుకునే పరిస్థితి ఉండదు. ఈ వృత్తిలో చాలామంది ముసలివాళ్లు దయనీయ పరిస్థితుల్లో ప్రాణాలు విడుస్తున్నవారే. వారికోసం ప్రత్యేకంగా ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది నాకు. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాను’’ అని ముగించారు జయమ్మ.
మూలం : సాక్షి దినపత్రిక