ఆడపిల్లలు రోడ్డు మీద బైక్ నడుపుతూ వెళితే తల ఆశ్చర్యంగా తిప్పనివాళ్ళు ఉంటారా? బైక్‌లు నడపాలంటే కండల్లో బలం ఉండాలి. సున్నితంగా ఉండే ఆడపిల్లలు బైక్ నడపలేరనేది ఒక రకంగా మనలో రంగరించుకుపోయిన అభిప్రాయం. స్కూటీ గురించి నటి ప్రియాంకా చోప్రా ప్రకటన చూస్తుంటాం - 'కేవలం అబ్బాయిలకేనా మనకూ ఉంది ఫన్!' అంటూ! శీతల్ కూడా ఇదే మాట అంటుంది కానీ స్కూటీ గురించి కాదు, బైక్ నడపడం గురించి. 'ఎవరు చెప్పారు బైక్‌లు కేవలం అబ్బాయిల కోసమని. బైక్ స్పోర్ట్ మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకు కూడా' అని ఆమె అంటుంది.
మోటార్ సైకిల్ నడపడం అంటే సహనాన్ని, నైపుణ్యాన్ని సమతుల్యం చేసుకుంటూ ఒత్తిడిని నియంత్రణ చేసుకోవలసి వస్తుంది. హైవే మీద బైక్ నడుపుతున్నపుడు ఒక్కోసారి ఏ సమస్యా ఉండదు కానీ కొన్నిసార్లు చాలా విసుగ్గా తట్టుకోలేనట్టుగా జీవితం మీద విరక్తిగా ఇక ఆపేద్దామా అని కూడా అనిపించిన సందర్భాలుంటాయి. అందుకే బైక్ నడపడం లేక రేస్‌లో పాల్గొనడం అందరి వల్లా కాని పని అంటారు. కానీ ఆ అనుభవాలన్నిటి నుండి నేర్చుకుని తనను తాను మలచుకోవడమే జీవితం. ఆ విధంగా మలచుకుని చూపిన శీతల్ తన అనుభవాల సారం గురించి చెప్పిన మాట ఇది.
మూడు సంవత్సరాల క్రితం ఇటానగర్‌లో జరిగిన రైడర్స్ మీట్‌లో దేశం మొత్తం నుండి బైౖక్ రైడింగ్‌లో పాల్గొన్న 150 మంది రైడర్స్‌లో ఆమె ఒక్కరే మహిళ. 2010 నుండి పరిస్థితి మారింది అంటుంది శీతల్. మహిళా రైడర్స్ సంఖ్య పెరిగింది. బైకింగ్ కమ్యూనిటీలు పెరిగాయి. స్త్రీ పురుష భేదం చూపకుండా మహిళలకు ఎంతో సహకారాన్ని కూడా అందిస్తున్నాయి.
శీతల్ ప్రథమంగా హైదరాబాద్‌లోని హైవే నవాబ్ క్లబ్‌లో చేరింది. తరువాత 2012లో వోల్ఫ్ క్లబ్‌లో చేరి శిక్షణ పొందింది. కమ్యూనిటీతో పాటు అందులోని స్నేహితులు అందించిన తోడ్పాటు, మార్గదర్శకత్వం, రక్షణ బైక్ నడపడంలో ఆనందాన్ని పొందేలా చేస్తున్నాయని ఆమె అభిప్రాయం. ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఈవెంట్ మేనేజర్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు నిర్వహిస్తూనే తన అభిరుచిని కూడా పట్టుదలతో ఆస్వాదిస్తోంది. ఇది ఎంతమందికి సాధ్యం. అది కూడా కష్టనష్టాలను, ప్రతికూల పరిస్థితులనూ ఎదుర్కొంటూ! అయితే, ఆడపిల్లలు తలచుకుంటే ఏమైనా సాధించగలిగే సామర్థ్యం, ఓర్పు, నేర్పు వారి సొంతమని నిరూపిస్తోంది శీతల్.
అలా జరిగిపోయిందంతే...
రాయల్ ఎన్‌ఫీల్డ్ బండి మీద కూర్చుని, చిరునవ్వుతో అలవోకగా ఇంజన్ రైజ్ చేసే శీతల్‌ను చూస్తే ఆశ్చర్యం కలగడంతో పాటు ముచ్చట వేయక మానదు. బైక్ నడపాలన్న కోరిక శీతల్‌కు చిన్నతనం నుండే ఏర్పడింది. మోటార్ సైకిల్ నడపడంపై తండ్రికున్న వ్యామోహమే ఆమెకు ప్రేరణ. బండి నడపడంపై ఆమెకున్న ఇష్టాన్ని చూసి తండ్రి ప్రోత్సాహంతో లామ్‌డేటా, వెస్పా వంటి వాహనాలను పెరుగుతున్న వయస్సులోనే నడిపింది. ప్రతి ఆదివారం తండ్రి బైక్‌ను శుభ్రం చేసుకుంటుంటే ఆసక్తిగా గమనిస్తూ ఉండేది. బైక్‌లోని భాగాలన్నిటిపై అవగాహన పెంచుకుంది. 'బైక్‌లపై ప్రేమ రక్తంలో ఉంది. అందుకే అలా జరిగిపోయిందం'టుంది శీతల్. 2000వ సంవత్సరంలో చనిపోయిన తండ్రిని గుర్తు చేసుకుంటూ... బాల్యంలోని ప్రతి అనుభూతీ తనకు ఎంతో ప్రియమైనదని ఆమె అంటుంది.
ఇది స్వేఛ్చానుభూతి!
'బైకింగ్ నాకు స్వాతంత్య్రం, స్వేచ్ఛల అనుభూతి నిస్తుంది. బైక్ నడపడానికి రోడ్డే నాకు స్ఫూర్తి. బైక్ నడుపుతున్నప్పుడు ఏర్పడే అనుభూతే బైక్ సవారీ వదిలి పెట్టనివ్వకుండా చేస్తోంది. బైక్‌పై సవారీ చేస్తూ విభిన్న ప్రదేశాలు తిరగడం నిజంగా జీవితంలో చాలా ఇష్టమైన విషయం' అని ఆమె చెబుతుంది. బైక్ రైడింగ్‌లోని ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తుంది శీతల్. బైక్ రైడింగ్ చేసే క్రమంలో ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ విభిన్న సంస్కృ తులు కలిగిన ఎంతో మందిని కలవడం జరుగుతుం టుంది. అరుణాచల్‌లోని కొండల మీద బైక్ నడిపిన అనుభవం ఆమెకు చాలా ప్రత్యేక అనుభూతిని మిగి ల్చింది. ఉద్విగభరితంగా, మనస్సు పులకరింప చేసేదిగా ఉన్న ఆ రైడ్ ఎంతో సంతోషాన్ని మిగిల్చింది అంటుంది. అందమైన కొండలు, ప్రేమను కనబరచే అక్కడి మనుష్యుల తీరు, అంతటి చలిని కూడా లెక్క చేయకుండా స్నేహితులతో కలసి చేసిన ఆ సరదా ప్రయాణం ఒక మరపురాని అనుభూతి. ఈ క్రమంలో వారితో పంచుకునే అనుభవాల నుండి చాలా నేర్చుకున్నానంటుంది. ''ప్రతి రోడ్ ట్రిప్ కొత్త విషయాలను నేర్చుకోవడానికి తోడ్పడే ప్రయాణం. ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే సాధనం. ప్రతి రైడ్ ఒక కొత్త అనుభవం. నన్ను నేను తెలుసుకోవడానికి అవెంతో ఉపకరిం చాయి'' అనడంలో శీతల్ బుద్ధికుశలత, ఆత్మవిశ్వాసం తొణికిసలాడతాయి.
''మోటార్ సైకిల్ సవారీ నన్ను నేను తెలుసుకోవడానికి దోహదపడింది. నేను చేసినవి కేవలం ప్రయాణాలు కావు. ఎన్నో అనుభూతుల, అనుభవాల మాలికలు ప్రతి ప్రయాణంలో పరిసరాల నుండి, కలసిన మనుష్యుల నుండి పాఠాలు నేర్చుకుంటూనే ఉన్నాను'' అంటుంది శీతల్.
అంతా అమ్మ ప్రోత్సాహమే!
సాధారణంగా ఏ ఆడపిల్ల అయినా ఎంచుకోవడానికి భయ పడే రంగాన్ని ఎంచుకున్నప్పుడు ఆ ఆడపిల్లలే కాదు వాళ్ళ తల్లి తండ్రులకు కూడా సమాజం నుండి సవాళ్ళు తప్పవు. అలాగే శీతల్ తల్లికి కూడా 'నీకు కానీ పిచ్చి పట్టిందా! ఎందుకు ఇటువంటి పనులు చేయనిస్తున్నావు' అని కొన్ని వందల మంది అన్నారు. కానీ ఆమె ఆ మాటలను పట్టించుకోలేదు. అడుగడుగునా కూతురికి ప్రోత్సాహాన్నిచ్చింది. ఆమె తన కూతురిని దృఢంగా, స్వతంత్రంగా పెంచాలనుకుంది. అలానే పెంచింది. ''నేను కూడా ఆమె అంచనాలను అందుకుంటూ పెరిగాను. ఆమె ఆశ మేరకు జీవితంలో సాధించాను. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మా అమ్మే కారణం. ఆమే నా బలం'' అంటుంది శీతల్.