పదహారో ఏడు వచ్చిందో లేదో అమ్మానాన్నలు పెళ్లి చేసేశారు. అత్తవారి వూళ్లో అడుగుపెట్టింది జమున. తన గ్రామాన్ని మించిన పచ్చదనం అక్కడ. అడవి కూడా పక్కనే. ఆనందం పట్టలేకపోయింది. రోజూ అడవిలోకి వెళ్లడం ఎండిన కర్రలు వంటకి ఏరి తెచ్చుకోవడం... ఇదే పని.ఒకరోజు ఎప్పటిలాగే కర్రలు ఏరుకోవడానికి వెళ్లింది. కొందరు అక్రమంగా గొడ్డళ్లతో చెట్లను నరికేస్తున్నారు. చాలా బాధపడుతూ వెనక్కి వచ్చింది. ఆ ఒక్కరోజుతో చెట్లను కొట్టడం అవలేదు. కొన్ని రోజుల పాటు కొనసాగింది. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు, వాళ్లని అడిగే ధైర్యం చేయలేదు. ఇదే విషయం గ్రామంలోని ఆడవాళ్లతో మాట్లాడింది. చెట్లని కాపాడుకోవాల్సిన అవసరం మనకెంతో ఉందని వివరించింది.
గ్రామంలోని సుమారు పాతిక మంది మహిళలు జమునకు తోడుగా వచ్చారు. చెట్లు కొడుతున్న వాళ్లని వెంటనే అడ్డుకోవాలని వాళ్లంతా వూళ్లో ఉన్న మగవాళ్లని అడిగారు. ఎవరూ ముందుకు రాలేదు. చివరికి జమున నాయకత్వంలో మహిళలే అడవిని కాపాడుకునేందుకు నడుం బిగించారు. తమ బృందానికి 'వన సురక్షా సమితి' అని పేరు పెట్టుకున్నారు. చెట్లు కొట్టే వారిని అడ్డుకుని, గ్రామం వదిలి వెళ్లేలా చేశారు. అక్కడితో ఆగకుండా... గ్రామంలోని గడపగడపకీ తిరిగి చెట్లని కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ ప్రచారం చేశారు. 'ఒక్కసారి చెట్లు లేని ప్రపంచాన్ని వూహించుకోండి. ఎంత భయంకరంగా ఉంటుందో. అసలు మనం బతకగలమా...' అంటూ అర్థమయ్యేట్టు చెప్పారు. చెట్లనే కాదు అడవిలో ఉన్న జంతువులను కాపాడుకోవడమూ తమ బాధ్యతగా భావించారు. వాటిని వేటాడి చంపొద్దని గ్రామంలో ప్రచారం చేశారు.
జమున ధైర్యానికి చైతన్యం పొందిన కొందరు మగవాళ్లు కూడా ఆమె బృందంలో చేరారు. ఇప్పుడు ఆ బృందంలో 70 మంది ఉన్నారు. చెట్లు కొట్టే ముఠాలను అడ్డుకోవడమే వీరి ప్రధాన లక్ష్యం. ఉత్త చేతులతో వెళితే వాళ్లు చాలాసార్లు వీరిపై దాడి చేశారు. అందుకే వీళ్లు కూడా ఆయుధాలు సమకూర్చుకున్నారు. కర్ర లాఠీలూ, విషం పూసిన బాణాలూ, కర్రలూ సిద్ధం చేసుకున్నారు. మగవాళ్లు రాత్రిపూట కాపలా కాస్తే, ఆడవాళ్లు ఉదయం కాపలా ఉంటారు. చాలాసార్లు చెట్లుకొట్టి అమ్ముకునే దుండగుల చేతుల్లో వీళ్లు దెబ్బలు తిన్నారు. అయినా సరే, అడవి సంరక్షణని వదిలిపెట్టలేదు. జమున ప్రారంభించిన వన సురక్షా సమితి గురించి అటవీశాఖ అధికారులకి తెలిసింది. వారు వీరి కృషిని దగ్గర నుంచి చూశారు. వెంటనే వీరుండే ముతురుఖాంని 'ఆదర్శ గ్రామంగా' ఎంపిక చేశారు.
దాంతో ఎలాంటి వసతులు లేని ఆ గ్రామం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడక్కడ సీసీ రోడ్లు పడ్డాయి. అంతవరకూ ఒక్క విద్యుత్తు స్తంభంలేని గ్రామంలో, ప్రతి ఇంటికీ కరెంట్ కనెక్షన్ వచ్చేసింది. మంచినీళ్ల కరవుతో బాధపడే మహిళల కష్టాలు తీరాయి. కొళాయిలు ఏర్పాటయ్యాయి. చెట్ల సంరక్షణతో ఒక్కటవడం అనేది గ్రామాభివృద్ధికి బాటలు పరిచింది. జమున తన సొంత స్థలంలో స్కూలుని కట్టించి గిరిజనుల పిల్లలకి చదువు చెప్పించడం మొదలుపెట్టింది. తన జీవితాన్ని పూర్తిగా గిరిజన పిల్లల చదువుకోసం, గ్రామం అభివృద్ధి కోసం అంకితం చేసింది జమున.