అప్పుడు ఆ అమ్మాయి కళ్లలో చూసిన ఆనందమే... శౌర్యను అలాంటి వాళ్ల సాయానికి పూర్తి స్థాయిలో పనిచేసేలా చేసింది. 'డిగ్రీ చదువుకుంది. మంచి ఉద్యోగం తెచ్చుకుని మమ్మల్ని బాగా చూసుకుంటుంది' అని ఇంట్లో వాళ్లు ఆమె పైన ఆశలు పెట్టుకున్నారు. అక్రమ రవాణాకు గురయ్యే అమ్మాయిల్ని ఆదుకోవాలన్న ఆమె ఆలోచన విని ఆశ్చర్యపోయారు. వద్దన్నారు. కానీ వింటేగా! బ్యాంకు నుంచి అప్పు తీసుకుని పాల కేంద్రం మొదలుపెట్టింది. తాను రక్షించిన అమ్మాయిలకు, అందులో ఉపాధినిచ్చింది. కానీ తనుంటోన్న డార్జిలింగ్‌లో అమ్మాయిలను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించ డం చాలా సాధారణం. దాంతో సాయం చేయమంటూ తన వద్దకి చాలామంది వచ్చేవారు. పూర్తి స్థాయిలో వాటిపైనే దృష్టి పెట్టడంతో వ్యాపారం కుంటుపడింది. అప్పులు పెరిగి, తనపై అరెస్టు వారెంటు కూడా జారీ అయింది. అయినా శౌర్య తగ్గలేదు. ఆ ధైర్యానికి అన్నీ కలిసొచ్చాయి. ఆర్థిక సాయం అందిస్తామంటూ ఓ సంస్థ ముందుకు రావడంతో... అమ్మాయిలను రక్షించే పనిలో పూర్తిగా నిమగ్నమైంది.
ఎక్కడెక్కడో ఉన్న అమ్మాయిలను వెతుక్కుంటూ తనే స్వయంగా వెళ్లేది. అవమానాలు పడేది. చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపులకైతే లెక్కేలేదు. ధైర్యంగా వాటన్నింటినీ దాటుకుంటూ ఇప్పటివరకూ ఎనిమిది వందల మందికి పైగా అమ్మాయిలను అక్రమ రవాణా బారి నుంచి తప్పించింది. వాళ్లకు చదువూ, ఉపాధి మార్గం చూపించింది. ఆమె సాహసాలకు గుర్తింపుగా 'గాడ్ ఫ్రే ఫిలిప్స్' సాహస అవార్డుతో పాటూ, ఫిక్కీ జాతీయ స్థాయి పురస్కారమూ లభించింది.