
అరవై ఐదేళ్లుగా... ఆ బిడ్డ జ్ఞాపకాలను మోస్తూనే ఉంది!!
మనసు నిలువనప్పుడు బొగ్గుబావి దగ్గరికెళ్లి చూస్తూనే ఉంది.
నెలల బిడ్డను అడవికి వదిలి, ఉద్యమ ప్రమాణాన్ని నెరవేర్చేందుకు
తుపాకీని భుజం మార్చుకున్న క్షణాలవి. నేటికీ తడియారని అమ్మ కళ్లవి!
‘‘ఎర్ర గోపయ్య అనే కామ్రేడ్ ఎదురై ఒక కోయవ్యక్తి గురించి చెప్పాడు. అతను గార్ల జాగీరు (ఇప్పుడు వరంగల్ జిల్లాలోని డోర్నకల్ ప్రాంతం) గుట్ట సమీపంలో ఉన్న బొగ్గుబావి దగ్గర ఉన్నాడని తెలిసి వెళ్లాను. ఆ కోయ అతనికి ముగ్గురూ ఆడపిల్లలే, మగపిల్లాడి కోసం ఎదురుచూస్తున్నాడట. నా బిడ్డని చూడగానే ఎంతో సంతోషంగా తీసుకున్నాడు. నేను మాత్రం కంటికీ, మింటికీ ఏకధారగా ఏడ్చాను’’
‘‘ఆ సమయంలోనే నా భర్త నాతో అన్న మాట కూడా చెప్పాలి. ‘అతనికి నీ బిడ్డని ఇచ్చేటపుడు నువ్వెంత ఏడ్చావో... ఇప్పుడు నీ బిడ్డని తిరిగి ఇవ్వడానికి అతను కూడా అంతే ఏడుస్తాడు కదా’ అని. నిజమే ఎంతో ఇష్టంగా నా బిడ్డను నా దగ్గరనుంచి తీసుకున్నాడు’’
ఓ మనిషి ఒంట్లో ఎంత నీరుంటుంది? ఏ వైద్యుడినడిగినా చెబుతాడు. ఓ మహిళ కంట్లో కన్నీరెంతుంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం ఏ వైద్యుడూ చెప్పలేడు. బిడ్డను దూరం చేసుకున్న మహిళ మాత్రమే వీటికి సమాధానం చెప్పగలదు. ‘‘ఆరు నెలల బిడ్డను చేతిలో పెట్టుకుని ఎవరు తీసుకుంటారా... అని రెండు కిలోమీటర్లు అడవిబాటలో నడిచాను. మగబిడ్డ కోసం ఎదురుచూస్తున్న ఓ కోయదంపతులు కంటబడగానే వారిచేతిలో బిడ్డను పెట్టాను. ఆ తర్వాత అమ్మపాల కోసం ఏడ్చే ఆ పసిబిడ్డ కంటే బిగ్గరగా ఏడుస్తూ వెనుదిరిగాను. వెక్కి వెక్కి ఏడ్చాను. చేతులతో తలబాదుకుంటూ ఏడ్చాను. ఆ బిడ్డను వదులుకుని ఇప్పటికి 65 ఏళ్లవుతోంది. ఆ రోజు నా కన్నీటి చెమ్మ ఇప్పటికీ నా ఒంటిపై తడిగానే ఉంది’’ తెలంగాణ సాయుధపోరాటంలో దళసభ్యురాలిగా పనిచేసిన చెన్నబోయిన కమలమ్మ మనసు లోతుల్లో గూడుకట్టుకుపోయిన జ్ఞాపకం ఇది.
తెలంగాణ సాయుధపోరాటంలో పురుషులతో సమానంగా పోరాడిన మహిళల గురించి వినే ఉంటారు. కమలమ్మ రజాకార్లపై కత్తిదూయడంతో పాటు తన కన్నపేగును కూడా కోసేసుకుంది. కమలమ్మకు ఊహ తెలిసేనాటికే తన అన్నలు మందాటి వెంకటయ్య, నారాయణ స్వాతంత్య్ర పోరాటంలో ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా పాల్గొన్నారు. కమలమ్మకు ఎనిమిదేళ్లకే చెన్నబోయిన ముకుందం అలియాస్ అప్పన్నతో పెళ్లయిపోయింది. ఇద్దరూ ఆడుతూ పాడుతూ పెరిగి ఉద్యమంలోకి అడుగుపెట్టారు. పదిహేనేళ్ల వయసుకే ఒక బిడ్డకు తల్లయిన కమలమ్మ రెండేళ్ల పిల్లాడిని ఆడపడచుకి అప్పగించి భర్తతోపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.
దళ సభ్యురాలిగా తుపాకీపట్టడం, గుర్రపుస్వారీ చేయడం వంటి వాటిలో చాలా చురుగ్గా ఉండేది. ‘‘నేనొక్కదాన్నే కాదు చాలామంది మహిళలు ఈ పోరాటంలో పాల్గొన్నారు. నా ఆచూకి చెప్పమని పద్నాలుగేళ్ల మా చెల్లి (మోహినమ్మ)ని జైల్లో పెట్టారు. వయసుతో పనిలేకుండా ప్రతి మహిళా ఉద్యమం కోసం ముందుకొచ్చి నిలబడేది. నేను రెండోసారి నెలతప్పాక ఇంటికి వెళదామనుకున్నాను. కాని అప్పటికి ఉద్యమం చాలా వేడిగా ఉంది. ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేయడానికి రజాకార్లు కోటి కన్నులతో వెతుకుతున్నారు. దాంతో చేసేది లేక దళంలోనే కొనసాగాను’’ ఉద్యమంలో మహిళ పోరాటానికి కమలమ్మలాంటివారెందరో ఉన్నా ఆమె చేసిన త్యాగానికి ప్రతి ఒక్క మహిళా సలామ్ చెప్పకమానదు.
పురిటినొప్పుల వేళ...
అప్పట్లో రజాకార్ల ఆకృత్యాల గురించి చాలా కథలు ఉన్నాయి. గర్భిణిగా ఉన్న కమలమ్మను జనజీవనంలోకి పంపిస్తే రజాకార్లకు దొరికిపోతుందేమోనని వెంటనే పెట్టుకున్నారు. ‘‘మా దళ నాయకుడు మద్దికాయల ఓంకార్. ఉపనాయకుడు నా భర్త అప్పన్న. వీరి అడుగుజాడల్లోనే పోరాటాన్ని సాగించేవాళ్లం. నేను తొమ్మిదినెలల గర్భంతో ఉన్నప్పుడు గుండాల దగ్గర వెంకటాపురం అడవిలో ఉన్నాం. నాకు నొప్పులు వస్తున్నాయని తెలియగానే మా వాళ్లు వెళ్లి ఒక గిరిజన మహిళను తీసుకొచ్చినా దగ్గరుంచారు. బిడ్డ పుట్టాక నేను బయటికి వద్దామనుకున్నాను కాని ఉద్యమానికి అది చాలా ముప్పు తెస్తుందని తెలిసి ఊరుకున్నాను.
కోయ అతని చేతిలో...
ఒకరోజు ఓంకార్ నన్ను...‘కమలక్కా...నీకు బిడ్డ కావాలా...ఉద్యమం కావాలా’ అని అడిగారు. నాకు నోట మాట లేదు. ‘రజాకార్లు మన ఆచూకీ కోసం అడవిలోకి మనుషుల్ని పంపారు. బిడ్డ ఏడుపు వల్ల మన జాడ వారికి తెలిసే ప్రమాదం ఉంది. నిజంగా అలానే జరిగితే మనల్ని నమ్ముకున్న వేలాదిమందికి అన్యాయం జరుగుతుంది’ అని ఆయన చెబుతుండగానే నాకు కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘ఇక్కడే ఎవరైనా గిరిజనులకు పెంచుకుంటానంటే వారికి నీ బిడ్డను ఇచ్చేయ్’ అని సలహా ఇచ్చారు. నా భర్త అప్పన్న కూడా ఓంకార్ మాటల్ని సమర్థించారు.
ఏం చేస్తాను... ఆ సమయంలో ఉద్యమానికి నా అమ్మతనం అడ్డమయింది. దళనాయకుడి ఆజ్ఞమేరకు అడవిలో ఉన్న గిరిజనులందరికీ నా బిడ్డను చూపించి పెంచుకోమంటే వద్దన్నారు. జాంపండులా మెరిసిపోతూ ఉన్న నా బిడ్డ వారిలో కలవడని వద్దన్నారు. ఇంతలో ఎర్ర గోపయ్య అనే కామ్రేడ్ ఒక కోయ అతని గురించి చెప్పాడు. అతనికి నా పిల్లాడిని ఇచ్చేశాను’’ కమలమ్మ కళ్లు నీళ్లతో నిండిపోయాయి. ఆ క్షణంలో ఆరునెలల బిడ్డను తలచుకుంటూ పచ్చిబాలింతగా మారిపోయింది.
ఆరుగురు సంతానంలో...
‘‘పోరాటంలో భాగంగా ఎక్కడెక్కడికో తిరిగాం. కొన్నాళ్లు జనాల్లో, కొన్నాళ్లు అజ్ఞాతంలో అవిశ్రాంతంగా పోరాటం... అలా కొన్నేళ్లకు రజాకార్ల పీడ విరగడైయింది. మేమంతా జనంలో కలిసి మామూలు జీవితాలు సాగించాం. మా ఆడపడుచు దగ్గరున్న పెద్దబ్బాయిని తీసుకుని వరంగల్‌లో స్థిరపడ్డాం. ఆ తర్వాత నాకు మరో ముగ్గురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. భార్యాభర్తలమిద్దరం కష్టపడి పిల్లలందరినీ చదివించాం. పెద్దబ్బాయి సత్యనారాయణ మున్సిపల్ కౌన్సెలర్‌గా పనిచేశాడు. మూడోవాడు విజయకుమార్ పియుసి చదివాడు, నాలుగోవాడు రవీందర్ ఆరోజుల్లో డిగ్రీ పూర్తిచేశాడు.
ఐదు మా అమ్మాయి పద్మావతి పీజీ చేసి బ్యాంకులో పనిచేస్తోంది. ఆఖరివాడు సుధాకర్ ఎమ్‌ఏ ఎంఫిల్ చేసి మాస్కోలో రష్యన్ లిటరేచర్‌పై ఒక కోర్సు చేసి అక్కడినుంచి జర్మనీ వెళ్లాడు. మా రెండోవాడు ఎక్కడున్నాడో... ఎలా ఉన్నాడో...’’ మళ్లీ కమలమ్మ స్వరంలో నీరు ప్రవహించింది. ‘‘ఇంతమందిని కని... అంతవాళ్లను చేశాను. వాడు కూడా నా దగ్గరే ఉంటే ఏమయ్యుండేవాడో... వాడిని వదిలాక చాలాసార్లు గార్లగుంట బొగ్గుబావి దగ్గరికి వెళ్లి వెతికాను. అతని ఆచూకీ దొరకలేదు. అయితేనేం... నాకన్న గొప్పగా పెంచగలడా? అని నా మనసు నన్ను వేధిస్తోంది’’ అని చెప్పుకొచ్చింది కమలమ్మ.
తెలంగాణ సాయుధపోరాటంలో కమలమ్మ ఎదుర్కొన్న సవాళ్లను దృష్టిలో పెట్టుకుని నోబుల్‌ప్రైజ్ ఎంపికకు కూడా ఈమె వివరాలు పంపారు. ప్రస్తుతం కమలమ్మ వయసు 83 సంవత్సరాలు. తన బిడ్డలకంటే ఆరోగ్యంగా, హుషారుగా ఉన్న ఈమె దగ్గర కూర్చుంటే బోలెడు విషయాలు, ఎన్నో విశేషాలు తెలుసుకోవచ్చు. ఈ కన్నతల్లి కళ్లు వెతికే ఆ బిడ్డ ఇప్పటికైనా ఆమె కంటబడితే ఎంతబాగుండునో కదా!