ఖమ్మం జిల్లా వేలేరుపాడు మండలం మేడేపల్లి గ్రామానికి చెందిన నిరుపేద గిరిజనురాలి జీవనరేఖ ఇది. ఆమె పేరు పొలమంచి సింగమ్మ. తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. భర్త చేయి పట్టుకొని వెళ్ళే అదృష్టం లేదు. అయినా అన్నిపనులూ చలాకీగా చేసుకుంటుంది. ఊళ్ళో కొందరి ఇళ్లలో అంట్లు తోమి నెలకు మూడువందలు సంపాదిస్తోంది. ప్రభుత్వం అందించే ఐదువందలు పెన్షన్‌గా అందుతోంది. ఈ ఎనిమిదివందలతో నెలరోజులపాటు జీవనం సాగిస్తోంది. పూటగడవని రోజు పస్తులుంటుంది. ఎవరి సహాయం లేకుండానే స్వయంగా కూరగాయలు కోస్తుంది.
అన్నం వండుకుం టుంది. చేరువలోని కుళాయి నుండి మంచినీళ్ళు తెచ్చుకుంటుంది. తన ఇంటిని తానే శుభ్రం చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. కాళ్ళ స్పర్శతో దారులను గుర్తుపెట్టుకొని నడుస్తుంది. ఒకసారి మాట వింటే చాలు ‘‘ఏం బాగున్నావా!’’ అంటూ పేర్లతో పలకరిస్తుంది. కళ్ళు లేని లోటుతప్ప ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు.ఊళ్ళో ఏ ఇంటికైనా సులువుగా వెళ్ళిపోతుంది సింగమ్మ. బయటి ఊరికి ఎప్పుడూ వెళ్ళలేదు. ‘‘నాకు ఏ ఊర్లు తెలియదయ్యా. నా ఊరుదాటి వెళ్ళలేనయ్యా...’’ అని చెబుతుంది.
ఒంటరి పయనమే...
ఆది నుండి సింగమ్మది ఒంటరి జీవన ప్రయాణమే. మేడేపల్లి గ్రామానికి చెందిన పొలమంచి రాజులు బుల్లెమ్మలకు మొత్తం ఐదుగురు సంతానం వెంకమ్మ, పాపమ్మ, రామమ్మ, కన్నమ్మ, సింగమ్మలు. మగసంతానం లేదు. అందరిలో సింగమ్మ చిన్నది. తోబుట్టువులు నలుగురికి వివాహాలు అయిపోయాయి.
తల్లిదండ్రులు ఉన్నంతకాలం సింగమ్మను కంటికిరెప్పలా చూసుకున్నారు. ఆమెకు 12 ఏళ్ల వయసప్పుడు తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమెకు కష్టాలు ప్రారంభమయ్యాయి. కొంతకాలం గ్రామంలో రోజుకో ఇంటివాళ్ళు అన్నం పెడితే తిని, పొట్ట నింపుకునేది. తన వాటాకు రావలసిన ఎకరం పొలం ఆమెకు దక్కలేదు. పొలానికి వచ్చే కౌలు కూడా అందలేదు. ఓ గ్రామస్థురాలు దయతో ఇచ్చిన పూరిగుడిసే ఆమెకు నిలువనీడ అయింది. ఆ గుడిసెలో ఒంటరిగా జీవిస్తోంది. సింగమ్మ జీవితం చూస్తే... మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న మహానుభావుడి మాటలు గుర్తుకు వస్తాయి.
నాకెవ్వర్ లేరయ్య...!
నా అనే వాల్లు ఎవరూ లేరయ్య... దేవుడే దిక్కు. నావాళ్లందరూ ‘వెల్లిపో గుడ్డిదానా అంటారయ. నా వాటా భూమి లాగేసుకుంటిరయ్య’ అని కళ్ళ నీళ్ళు తెచ్చుకుంది సింగమ్మ.
అన్ని అవయవాలూ ఉన్నవారు సైతం ఏ పనీ సరిగా చేసుకోని ఈ రోజుల్లో సింగమ్మను చూసి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. అయినవారు అన్యాయం చేసినా, దేవుడు చిన్నచూపు చూసినా ఆమెలోని ఆత్మవిశ్వాసం ఏ మాత్రం సడలలేదు. తన పని తాను చేసుకోవడమే కాకుండా, ఇతరులకూ సహాయపడుతోంది. తిండి కోసం ఎవ్వరి మీదా ఆధారపడకుండా, తన జీవనానికి కావలసిన ధనం తానే సంపాదించుకుంటోంది. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది.