అసలు ఏమీ అనుకోకుండానూ ఉండలేం.
తను స్పెషల్. మనిషి మేల్, మనసు ఫిమేల్.
అంతకన్నా స్పెషల్ ఏంటో తెలుసా?
మళ్లీ ఇలాగే పుట్టాలని రేవతి కోరుకోవడం!
తన జీవితంతో తనే ఫైట్ చేసి...
తన జీవితంతో తనే ఇన్‌సై్పర్ అయ్యి...
తనలాంటి వాళ్లకు ‘గ్రేట్ హ్యూమన్స్’గా గుర్తింపు తెస్తున్న రేవతి.
ఈ సమాజం ఆడవారికి గౌరవమిస్తుంది, మగవారికి గౌరవమిస్తుంది, కానీ పుట్టుకతోనే ఈ రెండువర్గాల లక్షణాలను కలబోసుకున్న వారిని మాత్రం చీదరించుకుంటుంది. అవమానపరుస్తుంది. అందుకే ప్రపంచంలో ఎవరైనా సరే మరోజన్మంటూ ఉంటే హిజ్రాగా మాత్రం పుట్టకూడదనుకుంటారు. అయితే సమాజం నుండి ఎన్నో తిరస్కారాలను ఎదుర్కొన్న ఓ హిజ్రా మాత్రం తనకు మరో జన్మంటూ ఉంటే హిజ్రాగానే పుడతానంటున్నారు! ఛీ కొట్టిన వారితోనే ఇప్పుడు శభాష్ అనిపించుకుంటున్నారు. తన జీవితగాథను రచించి, ప్రఖ్యాత పెంగ్విన్ పబ్లికేషన్స్‌నే తన ఇంటి ముందుకు రప్పించుకున్నారు. అంతేకాదు పుస్తకంగా వచ్చిన ఆమె జీవితగాథ ‘నాటకం’గా కూడా మారి ఇప్పటికే యాభై ప్రదర్శనలను పూర్తి చేసుకుంది. ఆ నిజజీవిత కథానాయికే... తమిళనాడుకు చెందిన రేవతి అలియాస్ దొరైస్వామి.
సమాధానాల కోసం వెదికిన ‘దొరైస్వామి’
తమిళనాడులోని సేలమ్ జిల్లా నమక్కల్ తాలూకా పుట్టెహళ్లిలో ఓ సంప్రదాయ రైతు కుటుంబంలో ముగ్గురు అన్నలు, ఒక అక్క తర్వాత దొరైస్వామి పుట్టారు. కుటుంబంలో చిన్నవాడు కావడంతో దొరైస్వామిని అందరూ ముద్దుగా చూసుకునేవారు. తల్లిదండ్రులు ఒక్కొక్కసారి దొరైస్వామికి అతని అక్కబట్టలు తొడిగి పూలజడ వేసి ముస్తాబు చేసేవారు. కాలంతోపాటు దొరైస్వామి కూడా పెరిగి పెద్దవాడయ్యాడు. అయినా దొరైస్వామి నడక, నడత, ఆహార్యం అంతా అమ్మాయినే పోలి ఉండేది. ఇది గమనించిన తల్లిదండ్రులు మొదట దొరైస్వామిని మందలించారు. వినకపోయేసరికి తిట్టారు, కొట్టారు, బయటకు వెళ్లకుండా గదిలోపెట్టి తాళం వేశారు. మొదట అమ్మాయిగా అలంకరించి మురిసిపోయిన వారే ఇప్పుడు అబ్బాయిలా ఉండమని ఎందుకు బలవంత పెడుతున్నారు? తన మనసు ఎందుకు అబ్బాయిని కోరుకుంటోంది? ఇది తన తప్పా? తల్లిదండ్రుల తప్పా? తనలో అబ్బాయిని కోరుకునే లక్షణాన్ని పుట్టించిన దేవుడిదా? ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు వెదుకుతూ ఇంటి నుంచి ఢిల్లీ వెళ్లిపోయాడు దొరైస్వామి. అక్కడ ఓ గురువు చెంత చేరి నాలుగైదు నెలలు గడిపాడు. ఎలాగో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఢిల్లీ చేరుకొని అక్కడి నుంచి దొరైస్వామిని బలవంతంగా ఇంటికి తీసుకువచ్చారు. గుండు కొట్టించి గదిలో పెట్టి తాళం వేశారు. బలవంతంగా మనసును మార్చలేరుగా? అందుకే దొరైస్వామి తిరిగి ఇంటి నుంచి పారిపోయి ముంబై చేరుకున్నాడు.
సమాధానాలు దొరికి రేవతిగా మారి...
ముంబైలో తనలాగే ఆలోచించే వర్గంలో ఒకరిగా జీవితాన్ని ప్రారంభించాడు దొరైస్వామి. తనను తాను మార్చుకోవడానికి తన శరీరాన్నే పెట్టుబడిగా పెట్టి డబ్బు సంపాదించాడు. ఆ డబ్బుతో శస్త్రచికిత్స చేయించుకుని రేవతిగా మారిపోయాడు దొరైస్వామి. రెండేళ్లు ముంబైలోనే గడిపిన తర్వాత కన్నవారిని చూడాలనే ఆశతో ఇంటికి వచ్చిన రేవతిని తల్లిదండ్రులతోపాటు తోడబుట్టిన వారు కూడా చేరదీయలేకపోయారు. దీంతో రేవతి మళ్లీ బెంగళూరు చేరుకుంది. జీవనం కోసం పగలు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద భిక్షాటన చేస్తూ, రాత్రి సమయాన్ని కొందరి పడకవాంఛలకు వెచ్చించేది. ఎన్నోసార్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. ఈ క్రమంలో జరిగిన ఒక సంఘటన రేవతి దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది. ఓ రోజు రాత్రి బెంగళూరు కబ్బన్ పార్కు పోలీసులు రేవతిని స్టేషన్‌కు తీసుకెళ్లారు.
స్టేషన్‌లో ఆమెను వివస్త్రను చేసి తోటిఖైదీలతో పాటు పోలీసులూ పైశాచికానందం పొందారు. దీంతో ఆమె మనసు పూర్తిగా మారిపోయింది. ‘జీవితం అంటే ఇంతేనా... నేను హిజ్రాను అయినంత మాత్రాన ఈ శరీరం మరొకరి కోరిక తీర్చడానికేనా? నా వల్ల ఎటువంటి ప్రయోజనం జరగదా?’ అంటూ రేవతి పరిపరివిధాలుగా ఆలోచించింది. దీంతో అంతవరకూ చేస్తున్న వత్తిని మానేసి సమాజం నుంచి దూరంగా ఉన్న (ఉంటున్న) అనాథలు, వేశ్యలు, ముఖ్యంగా హిజ్రాల సంక్షేమం కోసం కషి చేస్తున్న ‘సంగం’ సంస్థలో ఫీల్డ్ ఆఫీసర్‌గా చేరి కొత్త జీవితం మొదలుపెట్టింది రేవతి.
ముంగిటవాలిన ‘పెంగ్విన్’
హిజ్రాల సంక్షేమం కోసం రేవతి రాత్రి, పగలు తేడా లేకుండా కష్టపడి పనిచేసేవారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని హిజ్రాలను సంప్రదించి వారి బాధలను తెలుసుకుని తమిళంలో ఉనర్వుమ్-ఉరువమ్ (మనసు-దేహం) అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం వివరాలు తెహల్కా మాగజీన్‌లో చూసిన ప్రపంచ ప్రసిద్ధ ప్రచురణ సంస్థ పెంగ్విన్ పబ్లికేషన్ ప్రతినిధులు రేవతిని వెతుక్కుంటూ వచ్చారు. ఉనర్వుమ్-ఉరువమ్‌ను తాము ఆంగ్లంలో ప్రచురిస్తామని చెప్పారు. అయితే రేవతి దీనిని సున్నితంగా తిరస్కరించింది. తాను తన జీవితచరిత్రను రచిస్తున్నానని, అందులో మరిన్ని కఠిన వాస్తవాలు ఉన్నాయని రేవతి చెప్పింది. వెంటనే ఆ పుస్తకాన్ని తమ సంస్థనుంచే ప్రచురిస్తామని చెప్పి అడ్వాన్స్ ముందుగానే ఇచ్చేశారు.
ఈ విధంగా పుస్తకం ప్రచురితం కాకుండానే ఓ అనామక రచయితకు అడ్వాన్స్ చెల్లించడం చాలా అరుదు. ఇక తన క(వ్య)థను పూసగుచ్చినట్లు చెబుతూ తమిళంలో ‘వెళ్లెమోళి’ పుస్తకాన్ని రేవతి రచించింది. దీనిని వి.గీత ఇంగ్లీషులోకి ‘ఏ ట్రూత్ అబౌట్ మి’ పేరుతో 2009న తర్జుమా చేశారు. మొదటి ప్రచురణలోనే 5000 ప్రతులు అమ్ముడుపోయాయి. 2010లో జైపూర్‌లో జరిగిన అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో రేవతి పుస్తకంపై ప్రత్యేకంగా గంటపాటు చర్చాగోష్టిని నిర్వహించారు. అక్కడివారి ప్రశంసలను ఇప్పటికీ మరచిపోలేనని రేవతి చెమర్చిన కళ్లతో చెప్పారు. ఈ పుస్తకాన్ని కన్నడలో ‘బదుకు బయలు’గా డి.సరస్వతి 2011లో తర్జుమా చేశారు. భాష ఏదైనా రేవతి కథ జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంది. తర్వాత తర్వాత కుటుంబ సభ్యులు కూడా రేవతిని దగ్గరకు చేర్చుకోవడం మొదలుపెట్టారు.
రంగస్థలం పైకి రేవతి
సంగం సంస్థలో ఫీల్డ్ ఆఫీసర్‌గా జీవితాన్ని ప్రారంభించిన రేవతి ఎంతోమంది వేశ్యలు, హిజ్రాలు కొత్త జీవితం ప్రారంభించడానికి సహకారం అందించారు. ఇందుకోసం ప్రభుత్వంతో పోరాడారు. కార్పొరేట్‌ల సహకారం తీసుకున్నారు. దీంతో చాలామందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరికాయి. అనతికాలంలోనే రేవతి సంగం సంస్థకు డెరైక్టర్ స్థాయికి ఎదిగారు. వద్ధులైన తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత రేవతి పైనే పడింది. దీంతో ఏడాది క్రితం సంగం సంస్థ నుంచి బయటకు వచ్చి, వారికి చేదోడు వాదోడుగా ఉన్నారు. పుస్తక ప్రచురణ ద్వారా వచ్చిన రాయల్టీ డబ్బుతో ఒకప్పుడు తనను ఇంటి నుంచి దూరంగా నెట్టేసిన తల్లికి మూత్రపిండాల వ్యాధికి చికిత్స చేయించింది. అయితే దురదష్టవశాత్తు తల్లిని పోగొట్టుకుంది. 95 ఏళ్ల తండ్రికి ప్రస్తుతం ఊతకర్రగా నిలుస్తోంది. అంతేకాకుండా సోదరుల పిల్లలను చదివిస్తోంది. ఈ విషయాలను తెలుసుకున్న కర్ణాటకలోని శివమొగ్గా జిల్లా హెగ్గోడుకు చెందిన గణేశ్ చలించిపోయారు. స్వతహాగా నాటక రచయిత అయిన గణేశ్, రేవతి జీవిత చరిత్ర ‘బదుకు బయలు’ను అదే పేరుతో నాటకంగా మలిచి రాష్ట్రం నలుమూలలా ప్రదర్శిస్తున్నారు. ఈ నాటిక ఇటీవలే 50వ ప్రదర్శనను పూర్తి చేసుకుంది.
ఏ జన్మకైనా ఇలాగే!
మగవాడిగానో లేదా ఆడమనిషిగానో పుట్టి ఉంటే నా కుటుంబానికి మాత్రమే నేను పరిమితమై ఉండేదాన్ని. హిజ్రాగా ఉండటంతో... ఒక స్త్రీ హృదయాన్ని ప్రతిబింబిస్తూ అంగడిలో సరుకై అమ్ముడుపోయిన విధివంచితులైన ఆడవారు తిరిగి గౌరవంగా బతికేందుకు, పురుషులుగా పుట్టి స్త్రీగా మారిన హిజ్రాల సంక్షేమం కోసం నావంతు కృషి చేశాను. నా ఆత్మకథ వల్ల ఉత్తేజం పొందిన కొంతమంది హిజ్రాలు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకొందరు సొంతంగా వ్యాపారసంస్థలు నిర్వహిస్తున్నారు. ఇలా సమాజంలో మూడువర్గాల వారికి సేవ చేయడానికి అవకాశం కలగడానికి ప్రధాన కారణం నేను హిజ్రా కావడమే. అందువల్లే మరో జన్మే కాదు, అటు పైజన్మలోనూ హిజ్రాగానే పుట్టించమని దేవుడిని వేడుకుంటున్నాను.
- రేవతి
కంటతడి పెడుతున్నారు... ఉత్తేజం చెందుతున్నారు...
దాదాపు గంటన్నర నిడివిగల ‘బదుకు బయలు’ నాటకంలో మొదట హిజ్రాల కష్టాలను చూసిన ప్రేక్షకులు కంటితడి పెడుతున్నారు. అటు పై ఓ హిజ్రా... సమాజాన్ని ఎదిరించడమే కాకుండా ఆ సమాజం దష్టిలో హిజ్రాలపై ఉన్న ఓ రకమైన హీన భావాన్ని మార్చడానికి చేసిన కషిని చూసి ఉత్తేజం చెందుతున్నారు. వీరిలో హిజ్రాలతో పాటు మామూలు వారూ ఉన్నారు. ఈ నాటకం ద్వారా కంటతడి పెట్టించడమే కాకుండా కష్టాలకు ఎదురీది విజయం సాధించడం ఎలాగో చూపిస్తున్నాం. అందువల్లే రేవతి ‘బదుకు-బయలు’ నాటకం అనతికాలంలోనే ప్రేక్షకాదరణ పొంది 50 ప్రదర్శనలు పూర్తి par చేసుకుంది.
- గణేష్, నాటక రచయిత, దర్శకుడు
మూలం : సాక్షి దినపత్రిక